ఎడారిలాంటి నేటి విద్యావ్యవస్థలో ఓ ఒయాసిస్సు

కె.హేమంత
వాల్డార్ఫ్‌ ( స్కూల్‌. ఈ పేరెక్కడైనా విన్నారా? కొంతమందైనా వినే వుంటారనుకుంటాను. మీ పాప ఏ స్కూల్‌ అంటే దీక్ష  వాల్డార్ఫ్ స్కూల్‌ అనగానే అదేంటి? అంటూ మొదలై ఎన్నోసార్లు స్కూల్‌ గురించి ప్రశ్నల వర్షం కురిసేది. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ ఆర్టికల్‌ రాయటానికి పూనుకున్నాను.
వాల్డార్ఫ్ స్కూల్‌ అనేది మొట్టమొదటిసారి మొదటి ప్రపంచయుద్ధం తర్వాత తూర్పు జర్మనీలోని woldorf గ్రామంలో ప్రారంభమైంది. (రడాల్ఫ్‌ స్టైనర్‌) అనే తత్వవేత్త ఈ స్కూల్స్ కి రూపకర్త. విజ్ఞానశాస్త్రం ప్రకారం ఒక బిడ్డ శారీరక ఎదుగుదల 6 1/2 నుండి 7 సంవత్సరాల వరకు పూర్తికాదు. ముఖ్యంగా మెదడు ఎదుగుదల పూర్తిగా జరగదు. ఈ లోపలే అందులో విజ్ఞానం పేరుతో రకరకాల విషయలను చొప్పిస్తే ఎంతో విశాలంగా ఎదగవలసిన జ్ఞాపకశక్తి, ఆలో చనా సామర్ధ్యం వంటివి మధ్య లోనే ఆగిపోయే ప్రమాదం వుంది. వంద సంవత్సరాల క్రితమే ఈ విషయం గమనించిన స్టైనర్‌, పిల్లల ఎదుగుదలకు (శారీరక, మానసిక) అను గుణంగా వారిపై ఎటువంటి ఒత్తిడి లేకుండా వినోదభరి తంగా, అర్థవంతంగా, విలువ లతో కూడినదిగా సాగేలా రూపొందించినవే  వాల్డార్ఫ్ స్కూల్స్‌. కొన్నిచోట్ల వీటినే స్టైనర్‌ స్కూల్స్ అని కూడా వ్యవహరిస్తారు.
పిల్లలకు మూడున్నర సంవత్సరాల వయస్సులో k.g. మొదలవుతుంది. వాల్డార్ఫ్ బోధనా విధానం ప్రధానంగా willing  (చేతులు-శివం), feeling (హృదయం-సుందరం), thinking (తల-సత్యం) అనే మూడు ప్రక్రియలపై ఆధారపడి వుంటుంది. ప్రతి విద్యార్థి తన బాల్యదశ నుండి కౌమారం, ఆ తరువాత యవ్వనదశ వరకూ తనకున్న ఈ మూడు శక్తులను సమన్వయపరచుకొంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించగలగటమే ఈ  వాల్డార్ఫ్ విద్యావిధానం ప్రత్యేకత. ఒక రకంగా ఇది కొంచెం మన పురాతన గురుకుల విద్యావిధానానికి దగ్గరగా వుంటుంది.
నర్సరీ నుండి k.g. వరకు పిల్లలు ఎక్కువగా ఆటపాటలు, free play, drawing లోనే ఎక్కువ విషయలు నేర్చుకుంటారు. ఈ వయస్సులో పిల్లలు తమ శారీరక శక్తులను ఎక్కువగా వుపయెగించటానికి ప్రాధాన్యతనిస్తారు. ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో, అంటే చెక్క, బట్ట, దూది, లోహంతో తయరైన ఆటవస్తువులనే వుపయెగిస్తారు. k.g. లో పిల్లలు నేర్చుకునే పాటలు కూడా ఋతువుల గురించి, పండగల గురించి ఎక్కువగా ప్రకృతిలో వారు చూడగలిగిన, అనుభతి చెందగలిగిన వాటి గురించి వుంటాయి. నేలకీ, నీటికీ, భూమికీ, ఆకాశానికీ, విత్తుకీ, పండుకీ వున్న అవినాభావ సంబంధాల గురించి ముద్దుముద్దు పాటలు పాడుతూనే ఎన్నో అర్థవంత మైన విషయలు పలకా బలపం పట్టకుండానే ఆ చిన్ని బుర్రలకు అర్థమయ్యే విధంగా ప్రకృతి దర్శనం చేయిస్తారు.
పిల్లలు వారి క్లాసులో వారి కిష్టమైన రీతి గడపటాన్నే free play అంటారు. క్లాసులో ఒక పక్కగా ఆ సీజన్‌లో జరిగే పండగ గురించి కాని, లేక పోతే ఆ నెలలో చెప్పుకున్న కథల గురించి కాని, బట్టలు, బొమ్మలతో అలంకరించిన ఒక కార్నర్‌ వుంటుంది. ఇది కాకుండా వివిధ ఆటవస్తువులు (లక్కపిడతలు, ఇత్తడితో చేసిన గృహోపకరణాలు, చెక్కబొమ్మలు, గుడ్డ బొమ్మలు) వుండనే వుంటాయి. ఆటలయిపోయక పిల్లలందరూ టీచరుతో కలిసి బొమ్మలన్నీ ఎక్కడివక్కడ తప్పకుండా సర్దాల్సిందే. కొంతమంది పిల్లలు దీనికి ఇష్టపడరు. అప్పుడు టీచరు అది గమనించకుండానే కథ చెపుతూ, మధ్యలో పాటలు పాడుతూ వుంటే వారికి తెలియకుండానే కొన్నాళ్ళకి వచ్చి సర్దటం మొదలుపెడతారు. అల్లికలు, drawing , వంటి రకరకాల crafts కూడా రోజూ ఏదో ఒకటి చెయ్యటం వల్ల పిల్లలు విసుగుచెందకుండా ఉత్సాహంగా వుండగలుగుతారు. k.g. పిల్లలందరికీ బాగా ఇష్టమైన ప్రదేశం sand pit . ఇసుకలో కూర్చుని రకరకాల ఆటలు ఆడుతూ పిల్లలు మైమరచిపోతారు. ఈ ఇసుక గుట్టలోనే పిల్లలు కొండలు, లడ్డూలు అంటూ కథలల్లటం మొదలుపెడతారు. దీనికి మనం పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వంగాని, పిల్లల్లో ఊహాశక్తి పెరగటానికి స్కూల్లో మొదటి బీజం ఇక్కడినుంచే పడుతుంది.
పిల్లలు తమతోపాటు రోజూ ఒక పండు తీసుకెళ్ళి క్లాస్‌రూంలోని పండ్లబుట్టలో వేయలి. ఉదయం fruit break లో ఆయాలు ఆ పళ్ళన్నీ కోసిస్తే వాటిని fruit salad లా అన్నీ కలిపి తింటారు. Gardening క్లాసులున్న పిల్లలు ఈ పండ్ల తొక్కలను సేకరించి తోటలో మొక్కలకు ఎరువులా వుపయెగించటం నేర్చుకుంటారు. ఇక భోజనం విషయనికి వస్తే రోజుకొక పేరెంట్‌ క్లాసు మొత్తానికి భోజనం పంపించాలి. ఎప్పుడు ఎవరు పంపాలో ముందుగానే టీచరు లిస్టు తయరుచేసిస్తారు. ఏ క్లాస్‌రూంకి కావలసిన గిన్నెలు, ప్లేట్లు, గరిటెలు వంటివి (అన్నీ గాజువి) ఆ క్లాస్‌రూంలోనే వుంటాయి. టేబుల్‌పై ప్లేట్లు పెట్టటం నుంచి వయస్సుని బట్టి వడ్డించటం వరకూ అన్నీ పిల్లలు, క్లాస్‌ టీచరు కలిసే చేస్తారు. క్లాస్‌ టీచరు కూడా పిల్లలతో కలిసి అదే భోజనం చేస్తారు. ఇలా చేయటం వల్ల పిల్లలకి ఒకరితో ఒకరు పంచుకోవటం, అందరూ సమానమే అనే భావన చిన్నవయస్సు నుండే అలవడతాయి.
ఇక గ్రేడ్‌  స్కూల్‌ విషయానికి వస్తే, ఒకటవ తరగతి నుండి గ్రేడ్‌ స్కూల్‌గా వ్యవహరిస్తారు. K.G. నుండి మొదటిసారి class1 లో అడుగుపెట్టబోయే చిన్నారులకు మెడలో దండవేసి టీచర్లు, మిగతా గ్రేడ్‌ స్కూల్‌ పిల్లలందరూ కలిసి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతారు. ఈ మొత్తం వ్యవహారం ఆ పిల్లల మనసుల్లో తాము ప్రత్యేకం, తాము వెళ్ళబోయే చోటు మరింత ప్రత్యేకం అనిపించి స్కూలంటే ఒక రకమైన ప్రేమ కలుగజేస్తుంది.
వాల్డార్ఫ్ గ్రేడ్‌  స్కూల్‌ చాలా విభిన్నంగా వుంటుంది. మొదటి 6 సంవత్సరాలు అంటే class1 నుంచి class6 వరకూ ఒకే క్లాస్‌ టీచర్‌ వుంటారు. ఈ క్లాస్‌ టీచరే అన్ని సబ్జెక్టులు బోధిస్తారు. లాంగ్వేజస్‌కి, crafts కి వేరే టీచర్లు వుంటారు. పై క్లాసులకు వెళ్ళాక అదే క్లాస్‌ టీచర్‌ కొనసాగినా కాని అవసరానికనుగుణంగా వివిధ సబ్జెక్టు టీచర్లు కూడా వుంటారు. ఇలా ఒకే క్లాస్‌ టీచరు వుండటానికి ఒక ప్రత్యేక కారణం వుంది. పిల్లలకి ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగో  స్కూల్‌లో క్లాస్‌ టీచర్‌ (parent figure) అలా వుండాలన్నదే దీని వెనక వున్న ముఖ్య వుద్దేశం. అలా వుండడం వల్ల పిల్లల ఎదుగుదలలో చిన్నప్పటి నుంచి జరిగిన మార్పులపై క్లాస్‌ టీచరుకి మంచి అవగాహన వుండటమే కాక టీచరు పట్ల పిల్లలకి ఒక రకమైన బంధం, భద్రతాభావం ఏర్పడి ఇంట్లో తల్లిదండ్రులతో వున్నంత స్వేచ్ఛగా స్కూల్లో క్లాస్‌ టీచరుతో వుండగలుగుతారు. దీనివల్ల భయం, బెరుకు వంటివి లేకుండా పిల్లలు ఎదగటానికి అవకాశం వుంటుంది. అంతేకాకుండా ఎటువంటి సందేహాన్నైనా అడిగి తెలుసుకోవటం, దేన్నైనా ప్రశ్నించగలిగే ధైర్యం, తమ పట్ల తమకు ఆత్మవిశ్వాసం పెంచుకోగలగటం వంటివి అలవోకగా అలవడతాయి.
ఒకటవ తరగతి నుంచి మాత్రమే రాయడం, చదవడం నేర్పిస్తారు. పూర్వం గురుకులాల్లో 7 సం|| దాటాకే విద్యార్థులకు ప్రవేశం కల్పించేవారట. శారీరకంగా ఈ వయస్సులో పాలపళ్ళు వూడి శాశ్వత పళ్ళు వస్తాయి. ఇది ఎదుగుదల క్రమంలో ఆఖరున జరుగుతుంది. అప్పట్లో దీన్నే ప్రామాణికంగా తీసుకొనేవారట. ఈ అంశాన్నే school readiness అని వాల్డార్ఫ్ స్కూల్స్ లో వ్యవహరిస్తారు. అక్షరాలు నేర్పేటప్పుడు కూడా ప్రతి అక్షరానికి సంబంధించి ముందు ఒక కథ చెపుతారు. తరువాత అదే కథని బోర్డు మీద బొమ్మ వేస్తారు. పిల్లల్ని కూడా note book లో ఆ బొమ్మనే వేయమని ప్రోత్సహిస్తారు. ఆ బొమ్మలో దాగివున్న అక్షరాన్ని చివరగా హైలైట్‌ చేస్తారు. ఆ తరువాత ఆ అక్షరాన్నేమంటారో, దాన్ని ఎలా రాయలో నేర్పుతారు. ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా పిల్లల వయస్సును, వారి ఆలోచనావిధానాన్ని, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని బట్టి ప్రతి విషయన్ని వారి హృదయాలకు హత్తుకునేలా, జీవితాంతం గుర్తుండిపోయేలా విభిన్నరీతిలో చెప్పగలగడమే ఈ వాల్డార్ఫ్ విద్యావిధానంలోని విశిష్టత.
ఈ స్కూల్స్ లో waldorf curriculum ని అనుసరిస్తారు. ప్రపంచ waldorf society వారు ఈ curriculum నిర్ణయిస్తారు. దీని ప్రకారం ఏ వయస్సు/క్లాసులో ఏ అంశాల్ని బోధించవచ్చు, ఏవి బోధించకూడదు అనేవి వీరు నిర్దేశిస్తారు. వివిధ దేశాల్లో ఆయా దేశాల సంస్కృతీ సాంప్రదాయాలకు,అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను పొందుపరుచుకునే వెసులుబాటు ప్రతి వాల్డార్ఫ్ స్కూలుకి వుంటుంది. అవసరాన్ని బట్టి ప్రతి పాఠ్యాంశాన్ని మూడు లేదా నాలుగు వారాల్లో బోధిస్తారు. ఉదాహరణకు ఒక అంశం తీసుకుంటే దాన్ని టీచరు విభిన్న కోణాల్లోంచి విద్యార్థులు అవగాహన చేసుకునేలా బోధనా పద్ధతులుంటాయి.
పిల్లలు ఇలా నేర్చుకున్నదాన్ని తమకు అర్థమైన రీతిలో బొమ్మలతో సహా తమ పుస్తకాలలో రాసుకుంటారు. టీచరు దానిని పరిశీలించి తప్పులను సరిదిద్దుతారు. ఇలా ప్రతి అంశానికి కేటాయించబడిన కాలవ్యవధిని block గా వ్యవహరిస్తారు. ఇక్కడ పిల్లలు తయారుచేసుకున్న పుస్తకాలే వారికి text books. వీరికి విడిగా text books వుండవు. Home work పెద్దగా వుండదు. ఒకవేళ వున్నా కూడా క్లాసులో పిల్లలందరికీ ఒకటే home work వుండదు. పిల్లల వ్యక్తిగత సామర్ధ్యాన్ని అనుసరించి వారంతట వారు చెయ్యగలిగినవే ఇస్తారు. ఇలా చేయటంవల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. Home work తమంత తాముగా చెయ్యటానికి ఇష్టపడతారు కూడా.
పిల్లలు 6/7 తరగతులకు వచ్చేవరకు పరీక్షలు వుండవు. పరీక్షలనేవి పిల్లల జ్ఞాపకశక్తికి కొలమానాలే తప్ప వారి విజ్ఞానానికి కాదు, అని Waldorf Philosophy నమ్ముతుంది. ఓటమిని అంగీకరించగలిగే మానసిక పరిపక్వత కలిగాకే పిల్లలకి పోటీతత్వం పరిచయం చేస్తారు. అందుకే 6వ తరగతి నుండి పరీక్షలు పెట్టటం మొదలుపెడతారు. అప్పటివరకు సంవత్సరాంతంలో ప్రతి విద్యార్థికి, క్లాస్‌ టీచరు మిగతా సబ్జెక్టు టీచర్లతో కలిసి ఒక రిపోర్ట్ తయరుచేస్తారు. అందులో ఆ సంవత్సర కాలంలో ఆ విద్యార్థి ఏయే కొత్త పాఠ్యాంశాలు నేర్చుకున్నాడు, అతని బలాలు, బలహీనతలు అన్నీ విశ్లేషించి ఆ విద్యార్థి ప్రత్యేకతలు హైలైట్‌ చేస్తూ ప్రోత్సాహకరంగా రాస్తారు. హైస్కూల్‌ స్థాయికి చేరేసరికి Waldorf curriculum అనుసరిస్తనే స్కూల్‌ యజమాన్యం, ఇంకా పేరెంట్స్ అభీష్టం మేరకు SSC/CBSC/ICSC బోర్డులకు అనుసంధానం చేస్తారు.
Waldorf విద్యావిధానంలో కథలకు చాలా ప్రత్యేక స్థానం వుంది. కథలను soul food (ఆత్మజ్ఞానాన్ని పెంపొందించే ఆహారం)గా పరిగణిస్తారు. పిల్లలకు వారి వయస్సు, మానసిక స్థితికి తగ్గట్టుగా టీచరు కథ చెప్పటంతోనే ప్రతిరోజూ స్కూల్‌ ముగుస్తుంది. Nursery నుంచి 10th క్లాసు వరకూ కూడా కథలు చెప్పటం టీచరుకి తప్పనిసరి. ఎదుగుదల క్రమంలో ప్రతి సంవత్సరం పిల్లల మానసిక స్థితి, ఆలోచనా విధానంలో రకరకాల మార్పులు సంభవిస్తుంటాయి.
వీటి కనుగుణంగానే టీచరు చెప్పే కథలుంటాయి. ఉదాహరణకు 3వ తరగతి, అంటే తొమ్మిది, పది సంవత్సరాల వయస్సు పిల్లల్లో నేను వేరు, మిగిలిన ప్రపంచం వేరు అనే విధంగా వారి ఆలోచనా ధోరణి వుంటుంది. ఈ వయస్సులో పిల్లలకి రామాయణంలో రాముడి అరణ్యవాసం, పాండవుల వనవాసం వంటి కథలు నచ్చుతాయి. ఇక్కడ వీటిని కథలుగానే పరిచయం చేస్తారు తప్ప మతపరమైన గ్రంథాలుగా కాదు. ఇలాగే గ్రీకు మైథాలజీ, ఈసపు కథలు, జాతకకథలు, పంచతంత్ర కథలు, తెనాలి రామలింగ కథలు, అక్బరు బీర్బలు ఇలా ఎన్నో, ఎన్నెన్నో దేశీయ విదేశీయ కథలను పిల్లల వయస్సు, మానసిక అవసరాలను దృష్టిలో వుంచుకుని పరిచయం చేస్తారు. కంప్యూటర్లు, వీడియెగేమ్స్‌, టీవీలు, సినిమాలు రాజ్యమేలుతున్న ప్రస్తుతకాలంలో పిల్లల ఊహాశక్తిని, విజ్ఞానాన్ని, తప్పొప్పులను విశ్లేషించుకునే అవకాశాన్ని కలిగించే ఈ కథాసంపదల్ని పిల్లలకు అందించగలిగితే ఇంతకంటే మనం రేపటి తరానికి ఇవ్వగలిగే గొప్ప బహుమానం ఏముంటుంది?
Drama, Music, Painting, Drawing, Singing, Craft, Sports ఇవన్నీ కలిస్తే విద్యార్థి సంపూర్ణ అభివృద్ధికి దోహదపడతాయి. వీటిలో సంగీతానిది ఒక ప్రత్యేక స్థానం. Waldorf స్కూల్లో ఒకటవ తరగతి నుండి 4వ తరగతి వరకూ ఫ్లూటు నేర్పిస్తారు. పాటలన్నీ pentatonic sounds లో వుండటం వల్ల పిల్లల శ్వాసక్రియలో మంచి లయ/రిథం ఏర్పడుతుంది. ఇది restless గా వుండే పిల్లల్లో మానసిక శాంతి కలుగ చేస్తుంది, restlessness తగ్గుతుంది. శ్వాసకోశ ఇబ్బందులున్న పిల్లలకు breathing capacity మెరుగుపడుతుంది. 4వ తరగతి నుంచి key board, ఆ తరువాత drums, harmonium ఇలా ఏదో ఒక వాయిద్యం తప్పనిసరిగా నేర్పుతారు.
ఒకటవ తరగతి నుంచి ఒక craft (చేతిపని) కూడా తప్పనిసరిగా నేర్పుతారు. Knitting, Weaving, Farming, Carpentry, House building వంటివి వయస్సుకు తగ్గట్టుగా సంవత్సరానికొకటి చొప్పున నేర్పుతారు. ఉదాహరణకు farming నేర్పినపుడు విత్తనం నాటిన దగ్గరనుంచి పంటచేతికి వచ్చేవరకు ఒక రైతు ఎదుర్కొనే కష్టనష్టాలన్నీ స్వయంగా చేసి తెలుసుకోవడమే కాక వివిధ దశల్లో పొలాలకి వెళ్ళి పంటలను పరిశీలించటం దాకా అన్నీ చేస్తారు. వీరు పండించిన పంట (కూరగాయలు, బంగాళదుంప, బెండ, టవట) స్కూల్లో వండుతారు కూడా. ఇలా వివిధ వృత్తుల గురించి తెలుసుకోవడం వల్ల పిల్లలకు ఆయా వృత్తుల పట్ల గౌరవం ఏర్పడుతుంది. ఒక వస్తువు తయరుచేయటానికి కాని, పండించడానికి కాని, ఉత్పత్తి చేయటానికి కాని, వెనకవున్న కష్టనష్టాలను తెలుసుకోవడం వల్ల పిల్లలకు వస్తువుల పట్ల జాగ్రత్త పెరుగుతుంది. దేనినీ తొందరగా పాడు చేయడానికి ప్రయత్నించరు. ఇలా కొంతమంది పిల్లల్లో వుండే విధ్వంసకర (destructive) స్వభావాన్ని కూడా తగ్గించవచ్చు.
సంవత్సరంలోని ప్రతి పండగనీ మతాలకతీతంగా స్కూల్లో జరపటం. వాల్డార్ఫ్ స్కూల్స్ లోని మరో ప్రత్యేకత, వినాయకచవితికి గణపతి పాటలు ఎంత బాగా పాడతారో అంతే రమణీయంగా ఈద్‌ పాటలు పాడే చిన్నారులను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. మత విద్వేషాలతో కొట్టుకుపోతున్న నేటి సమాజంలో అన్ని మతాలను సమానంగా చడగలిగే విజ్ఞతని రేపటి తరం ప్రతినిధులైన పిల్లల్లో పెంపొందించటం మనందరి బాధ్యత. పుట్టినరోజు పండగ కూడా చాలా వైవిధ్యంగా చేస్తారు. కేకు తయరీకి కావలసిన పదార్థాలన్నీ ముందుగా ఇస్తే స్కూల్లోనే పిల్లలతో కలిసి కేకు తయరుచేస్తారు. క్లాస్‌లో పిల్లలంతా చుట్టూ చేరగా పుట్టినరోజు పాప తలపై చిన్న కిరీటం పెట్టి ఆ చిన్నారి మది దోచే కథ ఆ పాప గురించి చెపుతూ ఒక్కో సంవత్సరానికి దీపంలో ఒక్కో వత్తి వెలిగించి కేక్‌ కట్‌ చేస్తారు.
అన్ని తరగతుల వారికి పెయింటింగ్‌ క్లాసులు తప్పనిసరిగా వుంటాయి. కోపానికి ఎరుపు, ఉల్లాసానికి పసుపు అంటూ ఇలా మనలో కలిగే ప్రతి భావావేశాన్ని రంగులతో రంగరించి ఎలా చిత్రించవచ్చో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకే విషయన్ని ఒకే రంగులతో ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకంగా అన్వయించుకుని వేసిన చిత్రాల్ని చూస్తే వేటికవే భిన్నంగా కనబడతాయి. రంగులకు waldorf విద్యావిధానంలో చాలా ప్రాధాన్యతనిస్తారు. ఇంద్రధనుస్సు రంగులను వరుసగా ఎరుపునుంచి వయొలెట్‌ వరకు class 1 నుండి class 7 వరకు క్లాస్‌రూం గోడలకు వేస్తారు. కెజిలో పింకు రంగు గోడలుంటాయి. అంతే కాకుండా పిల్లలు దీళిశిలి లీళిళిదిరీ లో రాయడానికి crayons లేదా colour pencils వాడమని ప్రోత్సహిస్తారు. బ్లాక్‌ బోర్డు మీద టీచర్లు కూడా రంగుల చాక్‌పీసులే వాడతారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో కళాత్మకత, భావుకత పెరుగుతుంది. తమ పనిపట్ల, తమ పుస్తకాల మీద అభిమానం కలుగుతుంది. పిల్లలు స్వేచ్ఛగా వుండగలగటం వల్ల వారిలో దాగివున్న కళాత్మకత, భావుకత వివిధ రూపాల్లో బయటపడుతూ వుంటుంది.
Waldorf విద్యావిధానానికి టీచర్లు వెన్నెముక వంటివారు. టీచర్లు ఎంత నిబద్ధతతో వుంటే అంతగా ఈ విద్యావిధాన ధ్యేయం నెరవేరుతుంది. అందుకే ఎప్పటికప్పుడు టీచర్‌ ట్రైనింగ్‌ work shops జరుగుతూ వుంటాయి. పాశ్చాత్యదేశాల్లో ముఖ్యంగా జర్మనీ వంటి యూరప్‌ దేశాల్లో ఈ వాల్డార్ఫ్ స్కూల్స్ చాలా ప్రాచుర్యంలో వున్నాయి. కొన్ని యూరప్‌ దేశాల్లో వాల్డార్ఫ్ స్కూల్స్ కి ప్రభుత్వ రాయితీలు కూడా అందుతాయి. అలాంటి వాల్డార్ఫ్ స్కూల్స్ నుండి అనుభవం కలిగిన Waldorf టీచర్లు ట్రైనింగ్‌ ఇవ్వడం కోసం మనదేశానికి వస్తూ వుంటారు. సంవత్సరం పొడుగునా దేశంలో ఏదో ఒక స్కూల్లో ట్రైనింగ్‌ కార్యక్రమాలు జరుగుతూ వుంటాయి. ఒక స్కూల్లో ట్రైనింగ్‌ క్లాసులు జరుగుతుంటే మిగతా వాల్డార్ఫ్ స్కూళ్ళ టీచర్లు కూడా వాటికి హాజరవుతారు. ప్రపంచవ్యాప్తంగా వాల్డార్ఫ్ టీచర్లు వివిధ అంశాలపై తాము రపొందించిన పాటలు, నాటికలు వంటివి ఎన్నో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇవి కాకుండా ప్రతి సంవత్సరం మహారాష్ట్రలోని ఖండాలాలో ప్రతి వేసవిలో రెండు వారాలపాటు వాల్డార్ఫ్ టీచర్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. మనదేశంలో హైద్రాబాద్‌లో నాలుగు (దీక్ష, అభయ, శ్లోక, ప్రేరణ) ముంబయిలో ఒకటి (త్రిథ), మొత్తం 5 మాత్రమే వాల్డార్ఫ్ స్కూల్స్ వున్నాయి.
దీక్ష స్కూల్లో మా పాప ఒకటవ తరగతి చదువుతోంది. ఇక్కడ ప్రతి టర్మ్ కి ఒకసారి ”దృశ్య” కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో, పిల్లలు ఆ టర్మ్ లో ఏం నేర్చుకున్నారో, ఎలా నేర్చుకున్నారో, ఏ క్లాసుకి ఆ క్లాసు విడివిడిగా తల్లిదండ్రుల ముందు ప్రదర్శించి చూపిస్తారు. క్లాసులో ఎంతమంది పిల్లలుంటే అంతమంది దీంట్లో పాలుపంచుకుంటారు. ఉదాహరణకి 16 మంది పిల్లలున్న క్లాసుపిల్లలు 8 పాత్రలు గల నాటకం వేయల్సి వస్తే అదే నాటకాన్ని రెండుసార్లు 2 వేరు వేరు గ్రూపులుగా వేసి చూపిస్తారు. క్లాసులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానే కాదని చెప్పకనే చెపుతారు. లెక్కలు కూడా ఆటపాటలతో సరదాగా ఎలా నేర్చుకోవచ్చో చూస్తే ఏళ్ళ తరబడి ఎక్కాలు బట్టీ పట్టిన మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. punctuation marks పై కవిత్వం, addition, multiplication లతో నాటకం మనం ఎప్పుడైనా వూహించగలమా? ఇవి వాల్డార్ఫ్ స్కూల్లోనే సాధ్యం.

ప్రతి తల్లీ తండ్రి తమ పిల్లలను విద్వేషాలకు, హింసకు అతీతంగా ప్రేమ, మానవత్వం చిన్నతనం నుండే పెంపొందేలా పెంచగలిగితే ప్రస్తుత పరిస్థితులలో అదే పెద్ద సమాజసేవ. ఒకరికి ఒకరం అనేలా ఒకే భోజనాన్ని అందరూ పంచుకోవటం, పనికి చిన్నా, పెద్దా, ధనిక, పేద తేడా లేదంటూ అన్ని వృత్తుల పట్ల గౌరవం పెంపొందించటం, మతమేదైనా దాని సారం ఒకటే అనేలా సమానత్వాన్ని చాటగలగడం, తననే కాకుండా, తన సాటివారిని, సాటిజీవుల్ని కూడా ప్రేమించగలగటం, ఇవన్నీ రోజురోజుకీ మృగ్యం అవుతున్న నేటి సమాజంలో ఎడారిలో ఒయసిస్సులా వున్నవాల్డార్ఫ్ స్కూల్స్ మహాసాగరంలా విస్తరించాలని నా కోరిక.
ఈ ఆర్టికల్‌ కోసం సమాచారం అంతా దీక్ష  స్కూల్ వారు అందించారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి :

Diksha School

A.P. Text book Colony

Karkhana

Secunderabad

Phone: 040-65295926, 040-27819098

Email: dikshaschool@rediffmail.com

www.dikshaschool.in

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

One Response to ఎడారిలాంటి నేటి విద్యావ్యవస్థలో ఓ ఒయాసిస్సు

  1. ramnarsimha says:

    చాలా బాగుంది. ఈ వ్యాసాన్ని ప్రతి ఒక్కరు చదవాల్సిందిగా కొరుతున్నాను.
    99660_95258

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో