సమాజానికి పనికిరానివాడు – ప్రతాప రవిశంకర

హైస్కూలు వదిలారు. నరసింహమూర్తి క్లాసు రూములోంచి బయటకు వచ్చాడు. స్టాఫ్‌ రూం దగ్గర భావనారాయణ మాస్టారు నరసింహమూర్తి కోసం ఎదురుచూస్తూ నిలుచున్నాడు.

ఆయనతో కలిసి ఇంటికి వెళ్ళడానికి స్కూల్లో నుంచి బయటకు వచ్చాడు నరసింహమూర్తి. రోజూ ఇద్దరూ కలిసి ఇళ్ళకు వెళ్తారు.

కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు ఇద్దరు ఉపాధ్యాయులూ.

మెయిన్‌ రోడ్డు ఏమంత రద్దీగా లేదు. స్కూలు నుంచి బయటకు వచ్చిన పిల్లలు గబగబా వెళుతున్నారు. రోడ్డు పక్కగా ఒక బిచ్చగాడు ఉన్న ఒక్క కాలును కదిలిస్తూ ధర్మం చెయ్యమని పెద్దగా అరుస్తున్నాడు.

”ఇదంతా మోసం మాస్టారూ” అన్నాడు నరసింహమూర్తి.

”ఇందులో మోసం ఏముంది” భావనారాయణ అడిగాడు.

”మోసం కాకపోతే వాడికి అరవాల్సిన అవసరమేమున్నది? కుంటివాడు, సరే. నోరుమూసుకుని అడుక్కోవచ్చుగా”

”అది వాడి వృత్తి. అరిచి అడుక్కుంటున్నాడు. నోరుమూసుకుని కూర్చుంటే వాడికి ఎవరూ రూపాయి కూడా ఇవ్వరు” అన్నాడు భావనారాయణ.

ఇంకొంచెం దూరం వెళ్ళాక బాగా సన్నగా ఉన్న ఒకడు తారురోడ్డుని శుభ్రంగా ఊడ్చి దానిమీద రంగుల చాక్‌ పీసులతో ఏదో దేవుడి బొమ్మ గీసి దానికింద ధర్మం చెయ్యండి అని రాశాడు.

”ఇదొక వేషం” అన్నాడు నరసింహమూర్తి ఆ బొమ్మను చూసి.

”వేషం ఏముంది మాస్టారూ?” అన్నాడు భావనారాయణ.

”ఇలా రోడ్డుమీద బొమ్మగీసి అడుక్కోకపోతే ఏదో ఒక పనిచేసి బతకొచ్చు కదా. ఇలా ప్రతివాడూ ఏమంత కష్టపడకుండా వేలకు వేలు సంపాదించడానికి చూస్తున్నాడు. మనుషుల్లో సోమరితనం పెరిగిపోతోంది. ఈ లెక్కన ఈ దేశం ఎప్పటికి బాగుపడుతుంది మాస్టారూ” అన్నాడు నరసింహమూర్తి.

”మనకెందుకు మాస్టారూ. బతకడానికి ఎవడి మార్గాన్ని వాడు చూసుకుంటాడు. చదువుకున్నందుకు మనకు ఈ

ఉద్యోగాలు వచ్చాయి. వాడే చదువుకుని ఉంటే డ్రాయింగ్‌ టీచర్‌ ఉద్యోగం వచ్చి ఉండేదేమో” అన్నాడు భావనారాయణ.

”వీడికా? అడుక్కునే రాత మొహాన రాసి ఉంటే టీచర్‌ ఉద్యోగం ఎలా వస్తుంది?” అన్నాడు నరసింహమూర్తి.

నాలుగు రోడ్ల కూడలి రావడంతో భావనారాయణ తన ఇంటికి వెళ్ళాడు. నరసింహమూర్తి ఒక్కడే నడుచుకుని తన ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అతడి భార్య సులోచన అతడికి కాఫీ ఇచ్చింది.

”తింటానికి ఏమీ లేవా?” అనడిగాడు.

”నిన్న చేసిన జంతికలు వున్నాయి. ఇచ్చేదా?” అడిగింది సులోచన.

”వద్దులే. నిన్ననే అవి గట్టిగా ఉన్నాయి” అన్నాడు నరసింహమూర్తి వరండాలో కుర్చీలో కూర్చుని.

అప్పుడు సులోచన ”కోదండరామయ్యగారు ఫోన్‌ చేశారు” అని చెప్పింది.

”ఏమన్నాడు?” ఆత్రంగా అడిగాడు నరసింహమూర్తి.

”మన ముకుందప్రియ వాళ్ళకు నచ్చిందట. మనం అనుకున్న మొత్తానికి ఇంకో యాభై వేల రూపాయలను ఎక్కువగా ఇస్తే వాళ్ళు మనమ్మాయిని తప్పకుండా చేసుకుంటారని చెప్పాడు”.

నరసింహమూర్తి మొహం వికసించింది.

”అన్ని విధాలా మంచి సంబంధం. యాభై వేలు కాదు, లక్ష రూపాయలయినా ఎక్కువిస్తాను. మనమ్మాయి సుఖం, సంతోషం ముఖ్యం. తల్లిదండ్రులుగా మనం కోరుకునేది అదే కదా” అన్నాడు నరసింహమూర్తి.

”పెళ్ళి కూడా గ్రాండ్‌గా చెయ్యాలిట” అన్నది సులోచన.

అప్పుడు నరసింహమూర్తి తేలిగ్గా నవ్వి ”ఈ విషయాన్ని ఒకళ్ళు చెప్పేదేమిటి? అదిరిపోయేటట్టు చేస్తాను. ఇంతకు ముందు మన బంధువుల్లో ఎవ్వరూ చెయ్యనంత గొప్పగా చేస్తాను” అన్నాడు గర్వంగా.

సులోచన ఏదో మాట్లాడబోయింది. సరిగ్గా అప్పుడే గేటు తెరుచుకున్న చప్పుడయ్యింది. భార్యాభర్తలు ఆ వైపు చూశారు.

సన్నగా, పొడుగ్గు ఉన్నాయన లోపలకు వస్తూ కనిపించాడు. నల్లగా ఉన్నాడు. నెత్తిమీద జుట్టు చాలావరకు ఊడిపోయింది.

వస్తూనే చేతులు జోడించి నరసింహమూర్తికి నమస్కారం చేసి ”అయ్యా.. నా పేరు రాధాక్రిష్ణయ్య. మాది కృష్ణాజిల్లా తమ్మివరం. కార్యార్థినై మీ దగ్గరకు వచ్చాను” అని వాళ్ళ ఎదురుగా గోడను ఆనుకుని కింద కూర్చున్నాడు.

అప్పుడు నరసింహమూర్తి రాధాకృష్ణయ్యను కొంచెం పరిశీలనగా చూశాడు. గద్దముక్కు, లోపలకు పీక్కుపోయిన దవడలు. బాగా మాసిపోయిన పంచె కట్టుకున్నాడు. ఏ రంగో తెలీని చొక్కా తొడుక్కున్నాడు. చొక్కా జేబులో నల్లరంగు కలం. ఎడమచేతికి ఎప్పటిదో మాంధాత కాలంనాటి స్టీలు చెయిను వాచీ.

”చాలా దూరం నుంచి వచ్చారే” అన్నాడు నరసింహమూర్తి ఆయన ఎందుకు వచ్చి ఉంటాడో దాదాపుగా ఊహించి.

”దూరం ఏముందిలెండి? పక్క పక్క జిల్లాలు. మాది కృష్ణా, మీది గుంటూరు, అంతే” అని ప్రసన్నంగా నవ్వాడు.

”ఇంతకీ మీరు వచ్చిన కార్యం ఏమిటో చెప్పనేలేదు” గుర్తుచేశాడు నరసింహమూర్తి.

”చెబుతానండీ. మా తాత తండ్రులు మా గ్రామంలో కొద్దిపాటి ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు. దానిమీద వాళ్ళు అంతగా సంపాదించింది లేదు. దానికితోడు పెద్ద పెద్ద సంసారాలు. తినడానికే చాలేది కాదు. కూడబెట్టింది లేదు. విధిలేక నేను కూడా అదే వృత్తి చేపట్టాను. తినీ తినక గుట్టుగా బతుకుతున్నాం. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మగ పిల్లలు లేరు. ఇప్పుడు పెద్దాడపిల్ల పెళ్ళీడుకు వచ్చింది. సంబంధాలు చూస్తున్నాను. ఉన్నా లేకపోయినా ఆడపిల్లలకు వివాహం చెయ్యాలి కదండీ” అన్నాడు రాధాక్రిష్ణయ్య.

నరసింహమూర్తి తల ఊపాడు.

రాధాక్రిష్ణయ్య చెప్పడం కొనసాగించాడు.

”అమ్మాయి లక్షణంగా ఉంటుంది. ఏమంత చదువుకోలేదు గానీ పనీపాటలు అన్నీ వచ్చు. నాకు బాగా తెలిసిన ఒకాయన మా పక్క ఊరు చుక్కవరంలో ఉంటాడు. ఆయన ఈ మధ్య ఓ మగ పిల్లవాడి సంబంధం తీసుకువచ్చాడు. అబ్బాయి టీచరు ఉద్యోగం చేస్తున్నాడు. బాగానే ఉంటాడు. మా అమ్మాయి గుణవతి అతనికి నచ్చింది. చేసుకుంటామన్నారు. అన్ని విషయాలూ మాట్లాడుకున్నాము. కట్నం వద్దన్నారు”.

”మరింకేం వాడికిచ్చి చెయ్యండి” అన్నాడు నరసింహమూర్తి అక్కసుగా. నరసింహమూర్తి కూతురికి మూడు లక్షలు కట్నంగా ఇవ్వాలి. అదీ నరసింహమూర్తి బాధ.

”అతనికే ఇచ్చి చేస్తానండీ. ఎంత కట్నం లేకపోయినా ఆడపిల్ల పెళ్ళంటే చీరె, సారె, పెళ్ళి ఖర్చులకు ఎంతో కొంత డబ్బు కావాలి కదండీ?” అన్నాడు రాధాక్రిష్ణయ్య.

”చాలా కావాలి” అన్నాడు నరసింహమూర్తి.

”అందుకేనండీ, మీ దగ్గరకు వచ్చాను. మీలాంటి దాతలు నలుగురు నాలుగు చేతులు వేస్తే మా అమ్మాయి ఒక ఇంటిదవుతుంది. నలుగురినీ సాయం అడుగుతున్నాను. కాదనకండి” అన్నాడు ప్రాధేయపడుతూ.

ఆయనలా అనగానే నరసింహమూర్తి ఉగ్రుడయినాడు. కోపంతో మొహం జేవురించింది. దవడ కండలు బిగుసుకున్నాయి. బాగా కోపం వచ్చింది.

”ఇలా అడుక్కుని కూతురి పెళ్ళి చెయ్యకపోతేనేం? ఏ గుళ్ళోనో దండలు మార్పించు” అన్నాడు విసురుగా.

తనని సాయం అడిగాడని రాధాక్రిష్ణయ్యను గౌరవం లేకుండా మాట్లాడాడు నరసింహమూర్తి.

”అయ్యా. మీరు మాట్లాడకండి. దండల మార్పిడికి పిల్లవాడి తల్లి అంగీకరించలేదు” అన్నాడు రాధాక్రిష్ణయ్య.

”గతిలేనివాడు కొన్ని వదులుకోవాలి. డబ్బున్నవాడితో సమానంగా అన్నీ జరగాలి అనుకుంటే కుదరదు” అన్నాడు నరసింహమూర్తి.

రాధాక్రిష్ణయ్యకు అక్కడకు వచ్చినందుకు తనమీద తనకే అసహ్యం కలిగింది. అయినా మనసు చంపుకుని- ”అయ్యా. ఒక అమ్మాయి పెళ్ళి అయినా అయినట్టే. పైగా నా ఆరోగ్యం కూడా సరిగా లేదు. కనీసం ఒక ఆడపిల్ల పెళ్ళయినా చేసి పోదామని ఈ తాపత్రయం” అన్నాడు.

”ఏమయినా మీరు పొరపాటు చేశారు మాస్టారూ” అన్నాడు నరసింహమూర్తి.

”పొరపాటా?” ఆశ్చర్యపడి అడిగాడు రాధాక్రిష్ణయ్య.

”అవును పొరపాటే. ఆడపిల్ల పెళ్ళి చేసే స్థోమత లేనప్పుడు ఆడపిల్లనే కనకూడదు. పుట్టేది ఆడా, మగా తెలీదు కాబట్టి మీరు అసలు పిల్లల్నే కనకూడదు. కాబట్టి మీరు అసలు పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడివుంటే బాగుండేది. పిల్లలు లేకపోతేనేం?” అన్నాడు నరసింహమూర్తి.

”ఛీ” అన్నాడు రాధాక్రిష్ణయ్య.

నరసింహమూర్తి ఉలిక్కిపడి రాధాక్రిష్ణయ్యను చూశాడు.

”అయ్యా. మిమ్మల్ని కాదు. నా బతుకుమీద నాకే రోత పుట్టి అలా అన్నాను. మీరన్నట్టు పొరపాటు చేశాను. ఇదంతా ఊహించలేకపోయాను. ఇప్పుడు చేయగలిగింది లేదు” అన్నాడు రాధాక్రిష్ణయ్య.

”ఇక ఈ విషయం గురించి అంతగా ఆలోచించకండి. నారు పోసిన వాడే నీరు పోస్తాడని మౌనంగా ఉండండి”.

”నిజమేలెండి. మీరన్నదీ నిజమే.”

”అయినా అంత తొందరపడడం అనవసరం. ఇవాళ వయసులో ఉన్న ఆడపిల్ల బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. మీ అమ్మాయి తన దారి తనే చూసుకుంటుంది. ఈ కాలం ఆడపిల్లలు చాలా తెలివయిన వాళ్ళు” అన్నాడు నరసింహమూర్తి.

రాధాక్రిష్ణయ్యకు కోపం వచ్చింది. తను హఠాత్తుగా చనిపోతే బావుండుననుకున్నాడు.

నరసింహమూర్తి మళ్ళీ ప్రారంభించాడు.

”మీరెంత అమాయకులండీ. పక్కనే ఉన్న మనిషి గిలగిలా కొట్టుకుని ప్రాణం విడుస్తున్నా పట్టించుకోని మనుషులున్న ఈ సమాజంలో మీ అమ్మాయికి పెళ్ళయితే ఎవడిక్కావాలి? అవకపోతే ఎవడిక్కావాలి? అసలే గడ్డు రోజులు. ఎవడి బతుకు వాడు బతకడమే కష్టంగా ఉంది. మళ్ళీ మీలాంటి వాళ్ళకు సాయమంటే ఎవడు చేస్తాడూ? నా మటుకు నేను మీకు ఓ వంద రూపాయలు సాయం చెయ్యాలని అనుకున్నాననుకోండి. అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ వంద రూపాయలను ఈయనకు ఇవ్వకుండా నా దగ్గరే ఉంచుకుంటే నాలుగు రోజులు కూరగాయల ఖర్చు వెళ్ళిపోతుంది గదా అనిపిస్తుంది. అప్పుడు మీకు సాయం చెయ్యను. ఈ సమాజంలో చాలామంది ఇలాగే అనుకుంటారు. అందువల్ల ఆ కట్నం తీసుకోని మగ పిల్లాడిని మీ అమ్మాయిని ఏ గాంధర్వ వివాహమో చేసుకొమ్మని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడండి” అని సలహా ఇచ్చాడు నరసింహమూర్తి.

రాధాక్రిష్ణయ్య గుండె మండింది. అవసరంలో ఉన్న ఆడపిల్ల తండ్రిని ఎంత హీనంగా చూస్తున్నాడు? ఇతడు ఒక ఉపాధ్యాయుడా? అసలు మనిషేనా? రాధాక్రిష్ణయ్య ఇలా ఆలోచిస్తున్నప్పుడు నరసింహమూర్తి భార్య సులోచన ”నా నడుము నొప్పి తగ్గలేదు. మందులషాపుకు వెళ్ళి ఏవయినా మంచి టాబ్లెట్లు తీసుకురండి” అంది.

”సులోచనా, ఈయన వెళ్ళనీ. మెయిన్‌ రోడ్డు మీదకు వెళ్ళి టాబ్లెట్లు తీసుకువస్తాను” అన్నాడు నరసింహమూర్తి.

అప్పుడు రాధాక్రిష్ణయ్య ఏదో గుర్తుకు వచ్చినట్టు ”అయ్యా, మీకు ఆడపిల్లలున్నారా?” అనడిగాడు.

”ఇద్దరున్నారు. పెద్దమ్మాయికి పెళ్ళి కుదిరింది. మూడు లక్షల కట్నం” గొప్పగా చెప్పాడు నరసింహమూర్తి.

”మూడు లక్షలా!” ఆశ్చర్యంగా అన్నాడు రాధాక్రిష్ణయ్య.

”అవును. పెళ్ళికి ఇంకో రెండు లక్షలు ఖర్చవుతుంది”

”ఒక ఆడపిల్ల పెళ్ళికి ఐదు లక్షల ఖర్చా?”

”మరేమనుకున్నావ్‌? మా స్థాయికి తగినట్టు చెయ్యాలి గదా. అయినా డబ్బు దగ్గర లెక్క చెయ్యను” అన్నాడు నరసింహమూర్తి.

”అయినా ఇదంతా అనవసరమండీ. ఇవాళ వయసులో ఉన్న ఆడపిల్ల బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని మీరే చెప్పారు కదా! మీ అమ్మాయికి పెళ్ళి చెయ్యకుండా చూడండి. ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటుంది” అన్నాడు రాధాక్రిష్ణయ్య వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా.

ఆ మాటలకు నరసింహమూర్తి కళ్ళు ఎరుపెక్కాయి. తను ఏ ఉద్దేశంతో రాధాక్రిష్ణయ్య కూతురిని అలా అన్నాడో ఇప్పుడు ఆయన కూడా అదే ఉద్దేశంతో తనను అన్నాడు. అంటే తన కూతురు కూడా??

”గెటవుట్‌ స్కవుండ్రల్‌” పెద్దగా అరిచాడు నరసింహమూర్తి.

రాధాక్రిష్ణయ్య భయంతో నిలబడ్డాడు.

అప్పుడు నరసింహమూర్తి ఆయన మెడ పట్టుకుని రోడ్డుమీదకు నెట్టి వచ్చాడు.

”ఇంకోసారి కనిపించావంటే నీ ప్రాణం తీస్తాను”.

సులోచన భర్తను శాంతపరిచి ఇంట్లోకి తీసుకువెళ్ళింది.

రాధాక్రిష్ణయ్య అవమానభారంతో చిన్నగా నడుస్తూ అక్కడకు దగ్గర్లో ఉన్న చిన్న ఇరుకు రోడ్డులోకి వచ్చాడు. ఆ ఇరుకు రోడ్డు నేరుగా మెయిన్‌ రోడ్డులోకి కలుస్తుంది.

అప్పుడే చీకట్లు కమ్ముతున్నాయి. కార్తీకమాసం చివరి రోజులు. అక్కడ వీధిదీపం వెలుతురు లేదు. గోడవారగా పెద్ద మురిక్కాలవ ఇరుకు రోడ్డును సగం వరకు ఆక్రమించి ఉంది. ఆ వీథిలో వాళ్ళందరికీ మెయిన్‌ రోడ్డు మీదకు వెళ్ళాలంటే ఆ ఇరుకు రోడ్డే దగ్గరి దారి.

రాధాక్రిష్ణయ్య తను నడిచి వచ్చిన రోడ్డు మీదకు చూస్తున్నాడు నరసింహమూర్తి వస్తున్నాడేమోనని. అతడు భార్య నడుము నొప్పికి కావలసిన మందుల బిళ్ళల కోసం మెయిన్‌ రోడ్డుకు వెళ్ళడానికి అటువైపే రావాలి. అందుకే రాధాక్రిష్ణయ్య అక్కడున్న చిన్న చెట్టు చాటున కాచుకుని ఉన్నాడు.

ఇంతలో నరసింహమూర్తి గబగబా నడుస్తూ వచ్చాడు. మురిక్కాలువ కంపు కొడుతోంది. చెట్టుచాటున నిల్చున్న రాధాక్రిష్ణయ్య అతడికి కనిపించలేదు. జనసంచారం లేని ఆ ఇరుకు రోడ్డుమీద మురిక్కాలువలో పడకుండా జాగ్రత్తగా నడుస్తున్నాడు నరసింహమూర్తి.

అతడు రాధాక్రిష్ణయ్యను దాటి వెళ్ళిన తర్వాత చెట్టు చాటు నుండి ఇవతలికి వచ్చి పిల్లిలాగా నరసింహమూర్తి వెనక నడవడం మొదలుపెట్టాడు. అతడిలో కసి చెలరేగింది.

తోటి మనిషిని ఇంత హీనంగా చూస్తాడా? ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, తనూ ఒక కూతురికి తండ్రి అయి ఒక పెళ్ళి కావలసిన ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడతాడా? ఇటువంటి మనుషుల వల్ల సమాజానికి ఉపయోగం ఏమిటి? సమాజం వీళ్ళని ఎందుకు భరించాలి? ఇలాంటివాళ్ళు లేకపోతే ఎవరికి నష్టం? నీడనివ్వని చెట్టుకీ, ఇలాంటి మనుషులకీ తేడాలేదు.

ఇలా అనుకుని రాధాక్రిష్ణయ్య చేతులు చాపి కంపు కొడుతున్న కాలువను తిట్టుకుంటూ కాలువ అంచున జాగ్రత్తగా నడుస్తున్న నరసింహమూర్తిని శక్తికొద్దీ మురిక్కాలవలోకి నెట్టాడు. నరసింహమూర్తికి మాట కూడా రాలేదు. కాలవలో పడి ఊబిలాంటి చిక్కని బురదలో కూరుకుపోయాడు. సమాజానికి ఉపయోగపడని మనుషులు ఎక్కడ ఉన్నా ఒక్కటే అనుకుంటూ రాధాక్రిష్ణయ్య ఉత్సాహంగా మెయిన్‌ రోడ్డువైపు నడిచాడు.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.