అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు చాలా పేదవాడు.అయితే రాజుగారు తన ప్రాణ స్నేహితుడికి తన కోటలోనే ఒక భవనం నిర్మించి అన్ని ఏర్పాట్లతో అన్నీ సమకూర్చి తన స్నేహితుడిని ఆ భవనంలో ఉంచారు.
తర్వాత కొన్ని రోజులకు రాజుగారు, తన స్నేహితుడితో కలిసి విహారానికి అడవిలోనికి వెళ్ళారు. చాలా దూరం వెళ్ళిపోయి ఇద్దరూ దారి తప్పారు. దారి వెతుక్కుంటూ అడవిలో తిరిగి తిరిగి అలసిపోయిన ఇద్దరికీ ఆకలి వేయసాగింది. అక్కడ ఒక చెట్టుకి ఏవో కాయలు ఉంటే రాజుగారు గుర్రం ఎక్కి పది కాయలు కోశారు. తన స్నేహితుడికి ఐదు కాయలు ఇచ్చి ఆయన ఐదు కాయలు తిందామనుకున్నారు.
రాజుగారు కాయలు తెంపి కిందకు దిగి వచ్చి కూర్చున్నారు. ఆయన స్నేహితుడు ఆకలి తట్టుకోలేక చాలా బాగున్నాయి అనుకుంటూ 9 కాయలు తినేశాడు. ఆ చివరి 10వ కాయను కూడా తింటాను అని రాజుగార్ని అడిగితే, నేను తింటాను నాకు చాలా ఆకలి వేస్తోంది, అయినా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి నీకు 9 కాయలు ఇచ్చాను. కానీ నేనంటే నీకు ఇష్టమే లేదు అందుకే నువ్వు నా గురించి ఆలోచించకుండా ఇది కూడా ఇచ్చేయమంటున్నావు, నేను ఇవ్వను అని రాజుగారు ఆ పండుని నోటిలో వేసుకున్నారు. ఆ పండు చాలా చేదుగా, పుల్లగా ఉంది. ఛీ! ఇంత చేదుగా ఉన్న పండుని నువ్వెలా తిన్నావు అని రాజుగారు తన స్నేహితుడిని అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు ఈ పండ్లు చాలా చేదు, ఈ చేదుని నువ్వు భరించలేవు రాజా! అందుకే నేనే తినేద్దామని అనుకున్నాను. ఇప్పుడు చెప్పు రాజా ఎవరికి ఎవరంటే ఎక్కువ ఇష్టం అని వెళ్ళిపోయాడు.