కొన్ని జ్ఞాపకాల్ని లాలిస్తూ కూర్చుంటాను
అనుభవించిన క్షణాలన్నీ పువ్వులై
దుఃఖ సువాసన వెదజల్లుతుంటాయి
వెలుగు చీకట్ల వరదలు కమ్ముకుని
మస్తిష్కాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి
కాలం గుర్రంమీద స్వారీ చేస్తుంటానా…
ఆసరాలేక అసహాయంగా
ఎప్పటికప్పుడు కిందపడుతూనే ఉంటాను
నమ్మకం సడలిపోతున్నప్పుడు
చేతులెత్తి ఆకాశంకేసి మొక్కి
కన్పించని దేవుడిని ప్రార్థించడం తప్ప
చిన్నప్పటినుంచీ ఏదీ నేర్వనేలేదు
బ్రతుకులో ఏదో మార్మికత దాగి ఉంది
వేకువని ఆలింగనం చేసుకునేటప్పుడు
ఆనందం ఎన్నో ముఖాలతో కన్పడుతుంది
క్షణాలు గడిచేకొద్దీ విషాదాంతమై
చుట్టూతా అల్లుకుపోతూ ఉంటుంది
రోజూ నడిచే దారులన్నీ చీలిపోయి
మారువేషంలో ఉన్న సీతాకోకచిలుకలన్నీ
ఒక్కసారి అసలు రూపాన్ని ధరించి
భయపెడ్తూ చుట్టూ తిరుగుతుంటాయి
జీవితం ఎంతో ఎత్తులో ఉంది
అందదూ, అర్థం కాదు ఇప్పటికీ
నుదుటిమీద చెక్కిన బ్రతుకు శాసనాలు
అర్థంకాని లిపిలో ఉండటం వల్ల
బ్రతకడం ఎలాగో నేర్చుకోక తప్పదనుకుంటా…
ఒక్కోసారి కలలన్నీ జాడ తెలీక కూలిపోతుంటాయి
కన్నీళ్ళు నదులై ప్రవహిస్తూ ఉంటాయి
ఇలా ఉందని అమ్మకి చెప్తే
పిచ్చిదానా ఆడదానిగా పుట్టినాక
అలాగే ఉంటుంది అందరికీ
నీకో నిజం చెప్పనా సముద్రపు అలల ఘోషలో
ఆడవాళ్ళంతా తమ దుఃఖపు హోరుని కలిపారు
ఇప్పటినుంచి కాదు… ఆడదానిగా
పేగు తెంచుకు పుట్టినప్పటినుంచీ అంది.