ఆమెది అన్నదమ్ముల్లా
ఆస్థుల్ని పంచుకునే వారసత్వం కాదు
అనురాగాన్ని, ఆత్మీయతను
పంచి… పెంచే మానవీయత ‘ఆమె’ది!
అమ్మానాన్నలు కూలికెళితే…
అక్కై చెల్లెల్ని ఊరడించిన తల్లితనం ఆమెది…
తమ్ముళ్ళు బడికెళ్ళడానికి తను బడి మానుకొని
చదివించిన చదువుల తల్లి ఆమె
తల్లిని కోల్పోయిన తమ్ముళ్ళకు, తండ్రిని కోల్పోయిన చెల్లెళ్ళకు
తానే తల్లీ దండ్రై పెంచిన దాతృత్వం ‘ఆమె’ది..
కన్నోళ్ళను… తోడబుట్టినోళ్ళను… ఇంటిని ఇంటిపేరును
వదిలేసుకుని మెట్టింటికెళ్ళినా తనోళ్ళను మరవని
మానవత్వం ఆమెది.
అటు మొగ పెత్తనాన్ని… ఇటు కులకట్టుబాట్లని
రెండు భుజాలపై కాడెలా మోస్తూనే
బతుకంతా పోరాడి… ఓడుతూ
పరాయి బతుకులకు ఆసరైన విరాజిత ఆమె
రాఖీలకో, బాకీలకో, అవార్డులకో
ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టని
ఆత్మగౌరవంతో బతకాలన్న అంబేద్కర్
వారసత్వాన్ని ముందు తరాలకు అందిస్తున్న
మార్గదర్శి ‘ఆమె’…!