కదలని కలాన్ని అదిలిస్తూ
కాలానికి కవిత్వం అద్దుదామనుకుంటాను.
కళ్ళముందు పరిగెత్తే వాస్తవాలను
కవితలో కుదించలేక
కుంగుతాను.
గుండెల్లో ఉబికే సునామీలను ఆపలేక
చెంపలను అభిషేకిస్తాను.
ఎవరికీ పట్టని ఘోరాలన్నీ నాకే తోస్తాయో??
పరిష్కారం తోచక కళవెలబోతాను.
గాఢంగా పెనవేసుకున్న చిక్కు ముడులలో
కాసింత తడికోసం వెర్రిగా వెతుకుతాను
కపాలం కొలిమై వేధిస్తే
సిరాతో ఇలా…
ఆర్పుతుంటాను.
మళ్ళీ…
తెల్లారి లేచింది మొదలు
అల్టాృ మోడరన్ మొఖం తొడుక్కుని చురుగ్గా
నటిస్తుంటాను…
నేనిలా ఉంటాను.