ఎత్తైన జైలు నాలుగ్గోడల వెనక్కి ఎప్పుడెళ్ళినా మనసు వికలం అవుతుంది. జైలు లోపల పనిచేయడం మొదలుపెట్టిన ఈ రెండేళ్ళ కాలంలో ఎంతోమంది స్త్రీలతో, నేరస్తులతో మాట్లాడాను. శిక్షలు పడిన వాళ్ళు స్థిరంగా ఏళ్ళ తరబడి
ఉండిపోతే, విచారణలో ఉండే ఖైదీలు వస్తూ పోతూ ఉంటారు. ఎన్నో రకాల నేరారోపణలతో వస్తారు. ఆయా నేరాలు
వాళ్ళు చేసారో లేదో వాళ్ళకే తెలియాలి. వ్యభిచార వృత్తిలో ఉన్నారంటూ పోలీసులు అరెస్టు చేసి జైలుకి తెచ్చే మహిళల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎముకుల పోగుల్లా కనబడే అనేకమంది వ్యభిచార నేరం కింద అరెస్టయినపుడు… వాళ్ళతో మాట్లాడుతున్నపుడు… పొట్టకూటి కోసం వ్యభిచారం చేస్తూ పోలీసులకి చిక్కి చావుదెబ్బలు తింటూ జైలుకొచ్చే ఆ స్త్రీల దౌర్భాగ్యస్థితి, వారి దగ్గరికెళ్ళే
విటుల మానసిక స్థితి చాలా గందరగోళపరుస్తుంది. చాలావరకు ఒంటరి స్త్రీలు బతకడం కోసమే వృత్తిలోకి వస్తారనీ, భర్తలు తాగి చనిపోయినవాళ్ళు, తనని వదిలేసి మరో పెళ్ళి చేసుకున్న భర్తలున్నవాళ్ళు చాలాసార్లు పూట గడవక వ్యభిచారంలోకి వస్తుంటారు. వాళ్ళతో మాట్లాడడం మొదలుపెడితే వారి భయానక, బీభత్స కథలు విని తట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళ జీవితాలనిండా ఒలికేది విషాదమే. హింసల కొలుముల్లో నిత్యం మండుతుంటారు.
ఇటీవల ఐపిసి సెక్షన్ 302 కింద జైలుకొస్తున్న మహిళల సంఖ్య బాగా పెరిగింది. 302 అంటే హత్యారోపణ. సాధారణంగా హత్యారోపణలతో జైలుకొచ్చే స్త్రీలతో మాట్లాడినపుడు అర్థమయ్యేదేమిటంటే వాళ్ళు హత్య చేసింది వాళ్ళ భర్తలనే. బయట వ్యక్తుల్ని చంపి జైలుకొచ్చే ఆడవాళ్ళు చాలా తక్కువ. భర్తల్ని చంపిన ఆరోపణలెదుర్కొంటున్న నిందిత స్త్రీలతో మాట్లాడినపుడు వారు చెప్పే వారి జీవిత గాథలు పరమ హింసాయుతంగా, బీభత్సంగా ఉంటాయి. గృహ హింస భరించలేని స్థితికి చేరినపుడు, ఆ హింస తన జీవితాన్నే కాక తన బిడ్డల జీవితాలను తాకుతున్నప్పుడు ఓ బలహీన క్షణాన జరిగిన పెనుగులాటలోనో, కొట్లాటలోనో తనను తాను రక్షించుకోవడానికి భర్తను హత్య చేస్తుంది. దానిలో ప్రణాళిక, పక్కా ప్లాన్ లాంటివేవీ ఉండవు. హఠాత్తుగా జరిగే దుర్ఘటనలే ఎక్కువ. సంవత్సరాల తరబడీ అనుభవించిన గృహ హింస ఆమెను నేరస్తురాలిని చేస్తుంది. ఏ బిడ్డల కోసమని భర్తను చంపుతుందో జైలుకొచ్చి ఆ బిడ్డలకు దూరమౌతుంది. వాళ్ళ కోసం కుములుతూ జైలులో ఉంటుంది.
నాలుగు రోజుల క్రితం జైలుకెళ్ళి కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నపుడు ఇద్దరు అక్కచెల్లెళ్ళు కలిసారు. వారు మాట్లాడుతుంటే, వారనుభవించిన హింసను వింటుంటే… అక్క చెబుతుంది… నా మగడు నా చెల్లిని ‘కరాబు’ చేసి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. నాకు ముగ్గురు పిల్లలు. దానికి ఇద్దరు పిల్లలు. రోజూ తాగొచ్చి అందరినీ కొడతాడు. ఏ పనీ చెయ్యడు. మేమిద్దరం బాసాన్ల పనిచేసి పిల్లల్ని పోషించుకుంటున్నాం. ఆ డబ్బులూ ఎత్తుకెళ్ళి తాగొచ్చి మమ్మల్నే కొడతాడు. నా చెల్లి బిడ్డను అమ్మేయడానికి ప్రయత్నించాడు. ఓ రోజున ఫుల్‌గా తాగొచ్చి పిల్లని లాక్కెళ్ళడానికి చూస్తున్నాడు. భరించడం మా వల్ల కాలేదు. చీరని మెడకి చుట్టి ఇద్దరం లాగేసాం. చచ్చాడు. అక్క చెబుతుంటే చెల్లి భోరున ఏడ్చింది. నేను లోపల ఏడుస్తూనే ఉన్నాను. ఆమె కన్నీళ్ళు కన్పిస్తున్నాయి. నా కన్నీళ్ళు లోపలే ఇంకిపోతున్నాయి. వీళ్ళిద్దరూ జైలుపాలయ్యారు. ఆరుగురు పిల్లలు అనాధలయ్యారు. వాళ్ళ ఇంటికెళ్ళి ఆ పిల్లల్ని రెయిన్‌బో హోమ్‌లో
ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు కౌన్సిలర్లు. ప్రతి ఖైదీ చెప్పే వారి జీవితం, వారనుభవించిన హింస, అది హత్యగా పరిణమించిన పరిస్థితి వినడానికి దుర్భరంగా ఉంటుంది. అనుభవించిన వారి మానసిక స్థితిని అంచనా వేయలేం. వాళ్ళని మామూలు స్థితికి తీసుకురావడం కోసం కౌన్సిలర్‌లు చాలా కృషి చేయాల్సి ఉంటుంది.
స్త్రీలపై హింసకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నవంబరు 25 నుండి డిశంబరు 10 వరకు జరిగే పదహారు రోజుల పోరాట కార్యాచరణ గురించి సంపాదకీయం రాయడానికి కూర్చుంటే నాకు జైలులో ఉన్న మహిళలే పదే పదే గుర్తుకొస్తున్నారు. ఈ పదహారు రోజుల కార్యాచరణ వారి జీవితాల్లోని హింసని ఎలా తగ్గిస్తుందా అని ఆలోచిస్తున్నాను. ప్రతిరోజూ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసే
వాళ్ళు, మహిళా పోలీస్‌స్టేషన్లకి, ఉమన్ ప్రొటెక్షన్ సెల్‌కి వచ్చి తమ హింసల జీవితాల గురించి మాట్లాడేవాళ్ళు కనీసం 20 నుంచి 30 మంది ఉంటారు. ఎన్నో రకాల హింసలను అనుభవిస్తూ ఏదో ఒక ఉపశమనం కోసం భూమికను సంప్రదించే ఈ మహిళలకు ఈ పదహారు రోజుల కార్యాచరణ గురించిన సమాచారం ముందే తెలిసి ఉంటే… చట్టాల గురించి, సహాయ సంస్థల గురించిన అవగాహన
ఉండి ఉంటే… తమ జీవితాలను మెరుగుపరచుకునేవారు కదా! ఎలా వీళ్ళందరినీ చేరాలి? హింసని ఎదిరించండి… మౌనాన్ని వీడి రిపోర్ట్ చెయ్యండి అని ఎవరు వీళ్ళందరికీ చెప్పాలి?
‘మహిళా సాధికారత’ పేరును పదే పదే ఉచ్ఛరించి దాని ప్రాధాన్యతను నేలబారు, చౌకబారు చేసేసిన ప్రభుత్వాలు అసలు మహిళా సాధికారత అంటే ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయవు. ఎందుకంటే ప్రభుత్వాల దృష్టిలో మహిళా సాధికారత అంటే సో కాల్డ్ స్వయం సహాయక సంఘాలకు పావలా వడ్డీకో, బేడ వడ్డీకో అప్పులిచ్చి గొర్రెనో, బర్రెనో కొనేసుకుని వారు ఓ అర్థరూపాయి ‘Women Empowerment’. ఆ అర్థ రూపాయి కూడా ఘనత వహించిన ప్రభుత్వ ఖజానాకే మొగుడి మద్యం ఖర్చు కింద జమ అయిపోతోందని, ఆ పావలా వడ్డీ కట్టలేక సంఘంలో చేరి అప్పు చేసిన మహిళ జీవితం అప్పుల్లో కూరుకుపోయి మరింత ఆర్థిక హింసని, గృహ హింసకి తోడు అనుభవిస్తున్నదనేది ఈనాటి భయానక వాస్తవం. దీని ముద్దు పేరే మహిళా సాధికారత.
మహిళల భద్రత కోసం, రక్షణ కోసమంటూ తెచ్చిన చట్టాలన్నీ అద్భుతమైన అక్షరాల్లో ఒదిగిపోయి కాగితాల్లోనే ఘీంకరిస్తున్నాయి. మహిళలను రక్షించడానికి తెచ్చిన చట్టాలకు, ప్రభుత్వ గణాంకాలకు ఎక్కడా పొత్తు కుదరదు. అన్ని రకాల హింసల నుంచి రక్షించడానికి అన్ని చట్టాలూ ఉన్నప్పుడు జాతీయ నేర నమోదు బ్యూరో ప్రతి సంవత్సరం విడుదల చేసే మహిళల మీద నేరాల చిట్టా కొండవీటి చాంతాడంత ఎందుకు పెరుగుతోంది? హింసా రూపాలు మారుతున్న వైనాలను ఎందుకు అధ్యయనం చేయడం లేదు? చట్టాలు, సహాయక సంస్థల ప్రచారం పెద్ద ఎత్తున ఎందుకు జరగడం లేదు. వివాహిత మీద అత్తింటి హింసను కొంతైనా అరికట్టగలిగిన 498ఏ ని పనికి రాకుండా చేసి, హింసించే మొగుళ్ళను అచ్చోసిన ఆంబోతుల్లా ఎందుకు వదిలేస్తున్నారు?
ఎందుకంటే… సమాధానం చాలా సింపుల్. మతోన్మాద మతవాద రాజకీయం వెర్రితలలు వేసి పితృస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కుటల్ల్రో భాగంగానే దీన్ని అర్థం చేసుకోవాలి. స్త్రీల మీద పెచ్చరిల్లిపోతున్న హింసల గురించి మాట్లాడకుండా వారి వస్త్రధారణ మీద, వారి కదలికల మీద, వారి మాటలమీద ఆంక్షలు విధిస్తూ, వారిని గృహాలకే పరిమితం చేయాలనుకుంటున్న కుట్రలని మనం అర్థం చేసుకోవాలి. తిప్పి కొట్టాలి.
చరిత్రలో ఉందో లేదో తెలియని ఒక పాత్ర పాతివ్రత్యం కోసం దేశమంతా ఉద్యమిస్తున్న నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే… ఈ నాటి రాజకీయానికి కావలసింది ఊహాజనిత సమస్యలే కానీ నిత్యం హింసల కొలుముల్లో కాలుతున్న స్త్రీల వాస్తవ సమస్యలు కాదు. లక్షల సంఖ్యలో మహిళలు హింసలకు బలైనా ఫర్వాలేని రాజకీయ నాయకత్వానికి కావలసింది ‘పద్మావతి’లాంటి ఊహాజనిత, ఉనికిలేని సమస్యలే. గోవును పూజిస్తాం… కోతిని పూజిస్తాం… ఆఖరికి, వరాహావతారం పేరుతో పందిని పూజిస్తాం… కానీ సమాజంలో అత్యంత ప్రముఖమైన పాత్రని పోషిస్తూ మగవాడికి కూడా… జన్మనిచ్చే తల్లిని, తన జీవితాన్ని సంసారానికి, భర్తకి అంకితం చేసే భార్యని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన ఆడపిల్లనీ అథఃపాతాళానికి తొక్కేస్తాం. గర్భంలోనే చంపేస్తాం. మత రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళని తూటాలకు బలిస్తాం. ఇదీ ఈనాటి బీభత్స, విధ్వంస నేపథ్యం.
ఇలాంటి నేపథ్యం దేశమంతా అంటుకుని కార్చిచ్చులా చెలరేగితే మొదట బుగ్గయ్యేవి స్త్రీల బ్రతుకులే. అందుకే పదహారు రోజుల పోరాట దినాలు కానీ, మార్చి ఎనిమిది ఉద్యమ స్పూర్తి కానీ, శతకోటి ప్రజాగర్జన గానీ మరింత పదునుగా, సమైక్యంగా, గట్టిగా వినిపించాల్సిన అవసరం ఈ రోజు మరింత ఎక్కువగా ఉంది. మనకు మిగిలి ఉన్నది ఒక్కటే మార్గం. ఉద్యమం… పోరాటం… మహిళలు, బాలికల అంశాలపై అలుపెరగని పోరాటమే తక్షణావశ్యకత. ఎప్పటికీ… అదే అత్యంతావశ్యకమైన కార్యాచరణ.