గర్భస్పర్శని విడిచి వచ్చాక
నా ప్రపంచం నుంచి నేను బయటపడతాను
వచ్చిన ప్రపంచానికి వీడ్కోలు పలికి
ప్రవేశించిన ప్రపంచాన్ని ప్రేమిస్తూ కూర్చుంటాను
ఎవరెవరో వచ్చీపోయే ప్రపంచమిది
జీవితాన్ని మొదలుపెట్టుకుంటూ
కొందరు అల్లుకుంటూ మరికొందరు తుంచుకుంటూ…
పూలవాసన మట్టివాసన మనిషివాసన
అనేకానేక సువాసనల ప్రపంచం
ఎవరో ఎవరికోసమో ఎందుకనో
ప్రేమతో నిర్మించుకున్న ప్రపంచమేమో
ఎందరో అనుభవించి వదిలెళ్ళిపోయారు
నేనూ అనుభవిస్తాను కొన్నాళ్ళు మరికొన్నేళ్ళు
నిస్సందేహంగా ఇది నా ఒక్కదాని కోసమైతే కాదు
ఇక్కడ నన్ను నేను పోల్చుకోవాలని చూస్తాను
కొన్ని క్షణాలు సందడి చేస్తూ పోతాయి
మరికొన్ని దేన్నీ ప్రకటించకుండానే
నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాయి
రాత్రులు ఒకటే కలల చప్పుడు
ఎవరితో సంభాషించాలో తెలియక
నిర్లిప్తంగా ఒంటరిగా నిలబడిపోయాను
వచ్చిన ప్రపంచానికే వెళ్ళాలని ఉంటుంది
ఆకాశపు అంచుల వెంట ప్రయాణించి
ఎప్పటికీ చేరుకోలేనని తెల్సి
నిస్సహాయంగా ఉన్న ప్రపంచంలోనే ప్రవహిస్తాను.
వచ్చినప్పటినుంచీ ఈ ప్రపంచం చీకటిగానే ఉంది
సుగంధాలు కరిగిపోతూ
మృదువుగా ముడుచుకుపోతున్న
బ్రతుకుపాటల హోరు విన్పిస్తూనే ఉంది
జీవితం మొదలూ చివర్లు కన్పించవు
సాయంత్రాలు కనుమరుగై రాత్రుళ్ళవుతాయి
రాత్రి కరిగి ఉదయంగా మారిపోతుంది
కానీ ఎప్పటినుంచో
ఈ ప్రపంచం చీకటిగానే ఉంది.