మాతృ గర్భంలో అంకురించినది ‘అమ్మాయి’ అని తెలియవస్తే
మొగ్గగానే తుంచివేస్తారేమోననే దిగులుతో నన్ను బ్రతికించమ్మా
నాకు జీవించే హక్కుంది అంటూ కనులకు కనిపించని తల్లికి విన్నవించుకున్న… ఒక ప్రాణం.
పలు కష్టాలను ఎదురొడ్డి నిలచి, ఆడపిల్లనైన తనకి జన్మనిచ్చి,
చనుబాలతో ప్రేమను, ఉగ్గుపాలతో ధైర్యాన్ని రంగరించి పోసిన
మాతృమూర్తి వెచ్చటి ఒడిలో ఒదిగి ఆదమరచి నిదురిస్తున్న … ఒక పసి కూన.
‘మగబిడ్డను కనలేకపోయావు’ అనే అత్తింటి ఆరళ్ళకు బదులివ్వక
మౌనంగా విలపిస్తున్న తల్లిని చూసి, కారణమేమో తెలియరాకున్నా
చిట్టి చేతులతో ఆమె కన్నీరు తుడిచి ‘నీకు నేనున్నాను’ అన్నట్లు ధైర్యం చెప్పిన… ఒక చిన్ని పాప
‘ఆడపిల్లకు చదువెందుకు’ అన్న ఆజ్ఞానులకు కనువిప్పు కలిగేలా
సకల విద్యలలో రాణిస్తూనే, తనకు, తోటి ఆడపిల్లలకు
పాఠశాలలో కనీస సౌకర్యాలను మౌనపోరాటం ద్వారా సాధించిన… ఒక బాలిక
కట్నకానుకలను ఆశించక అర్థాంగిగా అభిమానిస్తానని,
‘ఆడపిల్లను కన్నావేమని’ నిందించక స్వీకరిస్తానని బాస చేస్తేనే
నీతో పాణిగ్రహణమని కోరి వచ్చిన వరుడికి షరతులు పెట్టి సాహసం చూపిన… ఒక యువతి
భయమును దరిచేరనీయక, అణచివేతకు తల ఒగ్గక
స్త్రీల హక్కుల సాధన, పరిరక్షణల పట్ల అవగాహన కల్పిస్తూ
తనలాంటివారెందరినో చైతన్యపరచి మార్గదర్శిగా నిలిచిన… ఒక స్త్రీ మూర్తి
పసికూన నుండి యువతిగా దినదిన ప్రవర్థమానమవుతూ
ఆత్మవిశ్వాసమే రక్షణకవచముగా మలచుకుని,
ధైర్య సాహసాలే ఆయుధాలుగా ధరించి,
ప్రేమ అభిమానాలే ఆభరణాలై వన్నెకూర్చగా
పరిపూర్ణ స్త్రీ మూర్తిగా పరిణితి చెంది మహిళా లోకానికే
ఆదర్శప్రాయమై నిలచిన నారీమణీ నీకివే……………….. నా ‘జోహార్లు’