కొండల అంచుల నుండి
స్రవిస్తున్న జలపాతాలు
హృదయాన్ని జలదరింప జేస్తున్నాయి
నిజమే! మార్పు ఒక్క క్షణంలోనే ప్రారంభం అవుతుంది
కానీ, ఆ ఒక్క క్షణాన్ని దాటవేస్తూ వెళుతున్నారు సుమా!
కొవ్వత్తులు వెలుగుదారులు వేశాయి
ఆ సందుల్లో కన్నీరు కూడా ప్రవహిస్తుంది కదా!
కేకులు మెత్తటి చాకులతో కోస్తున్నారు
ఆ ముదుసలి వేడి టీ దొరక్క వెదుకుతుంది
పండగంటే ఇతరులకు పంచేదా?
తామే చేసుకునేదా?
వేషాలు మారుస్తున్నారు, భాషను మారుస్తున్నారు
క్షణక్షణం ఊనికలు మారుస్తున్నారు
రంగుల వలయాల్లోనే జీవితం
వారికి తెల్లవారడం ఇష్టం లేదు
సంతోషం ఏమౌతుందోనని భయం
ఆలకింపునూ ఆపడం ఇష్టంలేదు
ఏదీ ప్రారంభమయ్యాక ముగియడం లేదు
రాత్రి పగలు అనేవి అబద్ధం అవుతున్నాయి
ఆ అమ్మాయి తినే ఆహారం కంటే
మైపూతలకే ఎక్కువ ఖర్చు అవుతోంది
ఆ తల్లి ఆ పిల్లల్ని బాయిలర్ కోళ్ళలా పెంచుతోంది
వారు సూర్యోదయానికి జంకుతున్నారు
ఆ అమ్మాయి ‘పది నిమిషాలకు ముందే హుషారుగా’ ఉంది
అంతలో నిస్సారమైంది ఎందుకు? అని అడిగితే
‘ఎవరో స్పందించలేదని వ్యధ చెందింది’ అని అంటున్నారు
అవును! వారు తమకోసం జీవించడంలేదు కదూ!
అందుకే వారికి కనురెప్పల్లో వెలుగు లేదు
జీవితాంతం అభ్యర్థనలతో జీవిస్తున్నారు
అభ్యర్ధించేవారంతా న్యూనతగా ఉన్నారు
వారు, మళ్ళీ మళ్ళీ వెనక్కే చూస్తున్నారు
ముందుకు చూద్దాం అనుకునేలోపు
సూర్యుడు అస్తమించాడు
ఆమె వెతికి వెతికి గుండెల్లోకి చూసుకొనే సరికి
అక్కడే శూన్యం ఉంది
అవును! జీవితం అంటే పునర్వీక్షణమే
మనస్సుకు వెలుగులూ చీకట్లుంటాయి
మన ముందు వెయ్యి స్వరాలు కేరింతలు కొట్టినా
మన అంతరంగాన్ని తాకే స్వరం కోసమే
మన ఎదురు చూపు
మనుష్యులు రూపాల మురికి కూపాల్లో
కూరుకుపోతున్నారు
మనో నైర్మల్యాన్ని చూడలేక పోతున్నారు
కొందరు స్త్రీలు అందరికీ తల్లులే
వారి ఊనికల్లోనే సౌరభాలు ఉంటాయి
కల్మషంలేని మనోగాంభీర్యం వారిది
త్యాగం వారికి ఊపిరి
చర్య వారి జీవన ప్రక్రియ
వారి రెండు హస్తాలు ఎందరిని లేవనెత్తాయో!
లేత కొబ్బరిలోని తియ్యదనం వారి మాటల్లో ఉంది
వ్యక్తిత్వానికి నిజాయితీయే ఊపిరి
వ్యక్తిత్వంలో నదీ ప్రవాహాలుంటాయి
సముద్ర తరంగాలుంటాయి
ఎత్తైన పర్వత శ్రేణులుంటాయి
పులుముకున్న రంగులకంటే
నిలువెత్తు జీవితంలోనే వెలుగులున్నాయి
ముందు అంతరంగాన్ని చూడండి!
ఎత్తైన శిల్నాన్ని దర్శించండి!
వ్యక్తిత్వ నిర్మాణ శిల్పమే జీవితానికి సోపానం