యూనివర్శిటీ క్యాంపస్… ఎటు చూసినా పచ్చగా, ఎత్తుగా పెరిగిన చెట్లు, దారులకిరుపక్కలా సైనికుల్లా నిలిచిన రకరకాల చెట్లు. పక్షులకి పిట్టలకే కాదు విద్యార్థులకి, విద్యార్థి సంఘాల ప్రచారాలకి కూడా నీడనిస్తున్న వృక్షాలు… వాటికింద చేరిన విద్యార్థుల చర్చలు, తీర్మానాలు, సహజీవన ప్రమాణాలు, స్నేహ బాంధవ్యాలు… అన్నిటికీ సాక్షీభూతాలు ఈ వృక్షాలు.
ప్రస్తుతం రంగురంగుల పోస్టర్లు, కరపత్రాలతో ఆ వృక్షాలన్నీ కొత్త డిజైన్ల బట్టలేసుకున్నట్లున్నాయి. యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికలంటే క్యాంపసంతా పండగ వాతావరణం. ఎటు చూసినా గుంపులు గుంపులుగా చేరిన విద్యార్థుల మధ్య వేడి వాడి చర్చలు. ఎవరికి ఎందుకు ఓటెయ్యాలి, ఎందుకు మద్దతివ్వకూడదు అన్న అంశాలపై గంటల తరబడి విసుగులేని వాదనలు…
ఈ సారి ఎన్నికల్లో పోటీకి తలపడ్తున్న రెండు ప్యానల్స్ ఒకదానికొకటి తీసిపోనివి, సమాన బలాబలాలున్నవి. జీవన్ కుమార్ ప్యానల్… అన్వర్ భాయ్ ప్యానల్… ఇరువైపులా ఫ్యానల్‌లోని సభ్యులు కూడా చదువులో, ఆటపాటల్లో, సామాజిక స్పృహలో, సేవా కార్యక్రమాల్లో ఎవరికెవరూ తీసిపోని హేమాహేమీలు. రెండు ప్యానళ్ళలోను సగం మంది విద్యార్థిను లున్నారు. ఇక క్లాస్ రూములు, కారిడార్‌లు, క్యాంటీన్‌లు, హాస్టళ్ళు, కాలేజీల ఆవరణలు, లైబ్రరీ పోర్టికోలు, స్కూటర్ స్టాండ్‌లు… కాదేదీ ప్రచారానికనర్హం అన్నట్లు ఫ్యానల్స్ సభ్యులు, వారి వారి మద్దతుదార్లు… ఏ ఒక్క విద్యార్థినీ మిస్ కాకుండా వ్యక్తిగతంగా కలిసి వారి ప్యానల్‌ని గెలిపించమని కోరుతున్నారు. పగలంతా క్యాంపస్‌లో, రాత్రిళ్ళు హాస్టళ్ళలో ప్రచారాలు జరిగినా సాయంత్రాలు మాత్రం సమీక్షలు, న్యూట్రల్‌గా ఉన్న వారిని గుర్తించడం, వాళ్ళిళ్ళకెళ్ళి తమకే ఓటెయ్య మని అభ్యర్థించడం… గత పదిరోజులుగా క్యాంపస్ అంతా ఒకటే కోలాహలం. రెండు ప్యానల్స్ వారు ఎప్పుడు ఎదురుపడినా ప్రత్యర్థి వర్గంలా కాక ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, పరిహాసాలాడుకుంటూ విడిపోవడం… ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం. లెక్చరర్లకి, ప్రొఫెసర్లకి కూడా ఉత్సాహంగా ఉంది. ఎవరు ఏ రకంగా నెగ్గుతారా అని ఆసక్తిగానూ ఉంది. విద్యార్థి సంఘం ఎన్నికల రోజు విద్యార్థులు, ప్రొఫెసర్లు… అందరూ ఒకేలా క్యాంటీన్ల లోను, చెట్ల కింద, కాన్వొకేషన్ హాల్, ఆడిటోరియంల చుట్టుపక్కల… ఎవరూ క్యాంపస్ దాటి పోలేదు. ఫలితాల కోసం పడిగాపులు… ఫలితాలు ప్రకటించగానే నెగ్గని ప్యానల్ కొంత నీరసపడ్డా గెలిచిన వారిని ఆలింగనాలతో అభినందించి, తమ మద్దతుదార్లు వెంటుండి మానసిక స్థైర్యాన్నిస్తుండగా క్యాంటీన్‌లో చాయ్ తాగుతూ ఊరడింపు పొందారే కాని… ఎంత సంయమనం! ఎంతటి మెచ్యురిటీ!
”ఢాం… ఢాం… ఢాం…” గాల్లోకి తుపాకి పేల్చిన చప్పుడికి ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చిపడింది శాంత. దాదాపు 40 ఏళ్ళ క్రిందటి జ్ఞాపకాలు చెదిరిపోగా సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉన్న పురాతన రావిచెట్టు మొదట్లో కూలబడింది. పోలీసులు పేల్చిన భాష్పవాయుగోళానికి చెల్లాచెదురైన విద్యార్థులు. నాలుగు దశాబ్దాలలో ఎన్ని మార్పులు! ఇరువై ఏళ్ళ కిందట విద్యార్థి సంఘాల మధ్య ఎన్నికల సమయంలో పచ్చగడ్డేస్తే భగ్గుమనేట్లుండేది వాతావరణం. విద్యార్థుల మధ్య కక్షలు, కార్పణ్యాలు చీలికలు, విభేదాలతో దొమ్మీ కేసుల వరకు వెళ్ళిన సంఘటనలు. ఈ విభేదాలు లెక్చరర్లు, ప్రొఫెసర్లలోనూ ప్రతిఫలించేవి… వారంతా కలిసున్నట్లే కనిపించినా వర్గాలుగా చీలిక కూడా స్పష్టంగానే తెలిసేది. రాజకీయ పార్టీలకు మద్దతు వర్గాలుగా విద్యార్థులు… ప్రొఫెసర్లు కూడా విడిపోయారు.
కాని, ఇప్పుడేంటిలా? ఏం జరుగు తోంది? ఏం జరగబోతోంది? విద్యార్థుల మధ్య చీలికలే కాదు… విద్యార్థులొకపక్క, ప్రొఫెసర్లొకపక్కలా అయిపోయింది. ఎవరికీ ఒకరిపట్ల ఒకరికి గౌరవభావం కనిపించట్లేదు. విశ్వవిద్యాలయం… వీధి దొమ్మీలకు నిలయమైపోయినట్లనిపిస్తోంది. ఎక్కడా ఎవరూ ప్రశాంతంగా లేరు. ఎవర్ని పలకరించినా ఉలిక్కిపడ్తున్నారు. కుహనా రాజకీయాలు, మతోన్మాద శక్తులు, కులమత విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకొనే ఛోటా నాయకులు… అందరి కళ్ళూ యునివర్శిటీ విద్యార్థుల పైనే… గాలమేసి కూర్చున్న వేటగాళ్ళలా…
ఏ పార్టీ మానిఫెస్టోని విమర్శించినా యూనివర్శిటీలో రికార్డులు తగలబడ్తున్నాయి. రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యపు సిద్ధాంతానికి మొదటి మెట్టు. కాని ఇటువంటి వాటిపై ‘జీరో టోలరెన్స్’ పెరుగుతోంది… యువతలో కూడా! విద్యార్థులే మొదటి ఆయుధాలౌతున్నారు!! టీచర్లపై, ప్రొఫెసర్లపై తిరగబడ్తున్నారు. అలా కనిపిస్తోంది కాని నిజానికి ఇలా తిరగబడ్తున్న వారిలో విద్యార్థులు లేరనిపిస్తోంది. వారిని పావులుగా ఉపయోగించుకుంటున్న రాజకీయ గుండాలు, మతోన్మాద శక్తుల పనేనా ఇది… ఎక్కడుందీ గీత? ఎవరెటువైపున్నారు? లౌకికవాదం, ప్రజాస్వామ్యం… వీటి అర్థం మారిపోతోందా? రాజ్యాంగం సాక్షిగా ఏం జరగబోతోంది? ముంచెత్తిన ప్రశ్నలతో ప్రశ్నార్థకంగా ఎవరు జవాబు చెప్తారా అని ఎదురు చూస్తోంది శాంత…