ఒడియా సాహిత్యంలో స్త్రీ వాదం -చాగంటి తులసి

 

ఒడియాలో స్త్రీ వాదాన్ని వామానాదం అంటారు. అర్థనారీశ్వరుడిలో ఎడవవైపు స్త్రీ, కుడివైపు పురుషుడు ఉంటారు. అందుచేత స్త్రీని వామా అన్నారు. ఎడమవైపు ఉన్న అవయవాలు కుడివైపు ఉన్న అవయవాల కంటే సామాన్యంగా బలహీనంగా ఉంటాయి. అందువల్ల స్త్రీ పురుషునికంటే దుర్బరురాలై, వామాగా అయి ఒడియాలో వామానాద్‌ అనే మాట చెలామణిలోకి వచ్చింది. నారీనాద్‌ అనే మాట కూడా స్త్రీ వాదానికి వాడుతున్నారు.

ప్రారంభ దినాల్లో వామవాదం అంటే పురుషులకు వ్యతిరేకంగా నినాదాలతో రాజమార్గాల్లో ఊరేగింపులు తీసే స్త్రీల విషయం అని కొందరు అనుకుంటే మరి కొందరు స్త్రీని ప్రధాన పాత్రగా తీసుకుని రాసిన కథలు, నవలలు, కవితలు అని అన్నారు. ఇంకొందరు స్త్రీలు రచించిన రచనలు అని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ప్రారంభంలో వామావాద విషయంలో అస్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

17వ శతాబ్దంలో పాశ్చాత్య సాహిత్యాల్లో ప్రారంభమైన స్త్రీ వాదం ఇప్పటివరకు మొదటి తరంగపు ఫెమినిజం, రెండవ తరంగపు ఫెమినిజం, మూడవ తరంగపు ఫెమినిజంగా క్రమానుగతంగా బలపడుతూ వచ్చాక రాన్రాను ఒడియాలోనూ స్త్రీ వాదం గురించి రచయిత్రులు వేదాలు, పురాణాలు, చరిత్ర, సాహిత్యం అన్నిటా, అన్ని కాలాల్లోనూ స్త్రీల జీవితాలు ఎలా ఉన్నదీ చర్చిస్తూ అన్ని ప్రక్రియాల్లోనూ రచన చేయడం మొదలుపెట్టారు.

ఒడియా సాహిత్యంలో స్త్రీ వాదం 16వ శతాబ్దంలో శూద్రకవి అని అవమానపడి జనప్రియమైన రామాయణాన్ని ప్రజల భాషలో రచించిన బలరామదాసుతో ప్రారంభమైందని నిర్ణయించి చెప్పవచ్చునని స్త్రీవాదులు అభిప్రాయపడ్డారు.

బలరామదాసు రచించిన లక్ష్మీ పురాణం కావ్యంలోని పౌరాణిక జానపద కథలో శ్రీ మందిరం (పూరీ జగన్నాధ మందిరం పెద్ద కోవెల) గడప దాటి లక్ష్మీదేవి చండాలిని ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావడాన్ని నేరంగా భావించి, నేరస్థురాలిగా చేసి జగన్నాధుడు ఆమెను కోవెలలోకి అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు. లక్ష్మీదేవి కళ్ళ వెంట కారిన వేడి కన్నీటి ధారల్లో స్త్రీ వాదం ఉంది. ఆ జానపద కథలో లక్ష్మీదేవి దేవి, దేవత కాదు, సామాజికంగా పురుషులచేత వేధించబడే అసంఖ్యాక స్త్రీలలో ఒక స్త్రీ! (స్త్రీల పట్ల పురుషుల వేధింపులు చాలావరకు పైకి బాహాటంగా గోచరించకుండానే ఉంటాయి). జగన్నాధుడు కోవెలలోకి అంటే తన ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టవద్దనడమే కాదు, ఆనాటి ఆచారం ప్రకారం భరణంగా ఆవిడకు ఇచ్చిన నగలను పట్టుకు పొమ్మంటాడు. ఆత్మగౌరవంతో లక్ష్మీదేవి భరణాన్ని తిరస్కరిస్తుంది. ఆత్మగౌరవంతో, తిరస్కార భావంతో ధైర్యంగా జగన్నాధుణ్ణి సవాలు చేస్తూ వెళ్ళిన స్త్రీ చైతన్యం ఏదైతే ఉందో అదే ఇన్నిన్ని తరాల తర్వాత పైకి ఉప్పొంగిన తరంగమై లేచిందని ఒడియా స్త్రీ వాదులు నిర్ధారించారు.

స్త్రీ వాదపు (ఫెమినిజపు) మొదటి తరంగం స్త్రీ సాధికారత ప్రశ్నను లేవనెత్తింది. చాలా కాలం వరకు అది నడిచింది. 20వ శతాబ్దపు మూడవ దశాబ్దానికి కేవలం సాధికారత చాలదు అన్న భావన కలిగింది. తమలో అంతర్లీనంగా, అదృశ్యంగా ఉన్న శక్తిని సంపూర్ణంగా సామాజిక జీవితంలో గోచరింపచేసే విధంగా తమ అస్థిత్వం పెంపొందాలని అనుకుంది. పురుషాధిక్య సామాజిక వ్యవస్థ విలువలను, హద్దులను, ఆంక్షలను స్త్రీలకు విధించింది, అవి ఉల్లంఘించడానికి వీల్లేదు, హక్కు లేదు. పురుషాధిక్యత స్త్రీ స్వతంత్ర

ఉనికిని, శక్తిని అంగీకరించదు. స్త్రీ అంటే సౌందర్య ప్రతీక లేదా నరక ద్వారం. ఆవిడ దేవత లేదా రాక్షసి. దీనిని ఎదిరించే దిశలో తన అస్మితను అన్వేషించడంలో స్త్రీ వాదం ఃఔశీఎaఅఃర పశీసవ షశీఎaఅఃర తీఱస్త్రష్ట్ర్‌ః వరకూ వెళ్ళింది.

ఒడియా స్త్రీ వాద రచయిత్రులు అధికాధికంగా 70, 80 దశాబ్దాల్లో తెరమీదకు వచ్చారు. బసంతకుమారి పట్టనాయక్‌, నందిని శతపథి, సరళాదేబి, కుంతలా ఆచార్య మొదలైన వారిలో నందిని శతపథి విశిష్టురాలు. 1990ల వరకూ ఆవిడ రచనలు చేశారు. ఆమె రచనల్లో పురుషుల వేధింపు, పరాయి స్త్రీలతో తిరిగే భర్త వలన కలిగే వేదన, దుఃఖం, గొడ్రాలుతనం వలన కలిగిన విషాదం వంటి సమస్యలు వస్తువుగా కనబడతాయి.

స్త్రీ ఎదురు మాట్లాడలేని మూగదానిగా, చదువు, సంధ్య లేనిదానిగా, దౌర్భాగ్యురాలిగా ఉండడమూ ఒక విధమైన లక్షణంగా, పురుషుడు చెడు మార్గాన పడితే దండించి సన్మార్గానికి తేగలిగే శక్తి సామర్ధ్యాలు కలిగి ఉండడం రెండవ లక్షణంగా దర్శింపజేస్తూ గురజాడ వేంకట అప్పారావు గారి సమకాలికుడు, ఒడియా ప్రజా రచయిత, ఆధునిక కథా రచయిత ఫకీర్‌ మోహన సేనాపతి రెండు కథలు రచించాడు. రెండూ ముఖ్యమైనవే. రేబతి కథ భారతీయ భాషా సాహిత్యాల్లో మొట్టమొదటి ఆధునిక కథగా పేర్కొనబడింది. ఈ కథతోనే ఆధునిక ఒడియా కథా సాహిత్యం ఆరంభమయింది. రెండవ కథ ‘పేటెంట్‌ మెడిసన్‌’.

రేబతి తిరగబడే శక్తిలేక, మూగగా అన్ని కష్టాలను భరించి, చదువుకుందామన్న కోరిక తీరక దురదృష్టవంతురాలై ఆనాటి సామాజిక మూఢ నమ్మకాలకు బలై చనిపోతుంది.

రెండవ కథలో తిరుగుబోతు, తాగుబోతు భర్తను దారికి తేవడానికి చీపురు దెబ్బలను పేటెంట్‌ మెడిసన్‌గా వినియోగించిన స్త్రీ చిత్రించబడింది.

ఆనాటి స్త్రీ నోరెత్తి మాట్లాడే శక్తిలేక మూగగా ఉండడమో, రోగానపడి చనిపోవడమో, ఆత్మహత్య చేసుకోవడమో లేదా తిరగబడే ప్రయత్నం చేస్తూ పతివ్రతగా ఉండడమో… స్త్రీల స్థితి అంతే.

కేవలం తిరగబడడమే కాదు, ఎదిరించి సాహసంతో సమాజాన్ని ప్రశ్నించి తమ జీవితాలను తమ చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరాన్ని స్త్రీ వాదం గుర్తించింది.

ఫకీర్‌ మోహన సేనాపతి, కాళిందీ చరణ్‌ పాణిగ్రాహి, భగవతీ చరణ్‌ పాణిగ్రాహి, సచ్చిదానంద రావుత్‌ రాయ్‌ వంటి రచయితలను మినహాయించి, దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇతర రచయితల రచనలలో స్త్రీ పాత్రల ప్రాధాన్యత తగ్గి గౌణపాత్రలై, పురుష పాత్రల ప్రాధాన్యతతో అధికంగా చిత్రించడం కన్పిస్తుంది. వీరిలోనూ నీలమణి సాహు వంటి వారిని మినహాయించి ఇతర రచయితల రచనల్లో కనిపించే స్త్రీలు నిస్సహాయులు, నిర్జీవమైన బ్రతుకులతో దుఃఖితులు. మనోజ్‌ దాసు గారు కూడా స్త్రీని ప్రధాన పాత్రగా ఏ కథనూ డైరెక్టుగా రచించలేదు. స్త్రీ దృష్టిలో స్త్రీగా కాక, పురుషుల దృష్టిలో స్త్రీగా నీలమణి సాహు వంటి రచయితల రచనల్లో స్త్రీ పాత్రలు కనిపిస్తాయి.

ఫకీర్‌ మోహన్‌ సేనాపతి పేటెంట్‌ మెడిసన్‌ కథ రచించిన తర్వాత ఒడియా సాహిత్యంలో 60 సంవత్సరాలు శక్తివంతమైన రచన చేసే రచయిత్రి కోసం ఎదురు చూడవలసి వచ్చింది.

1970ల్లో రచయిత్రులు ఉద్యోగినుల బాధలు, వారి మానసిక వేదన, భద్రతలేనితనం, నిస్సహాయత, వేధింపులు, త్యాగాలు, రాజకీయ సంబంధిత విషయాలు, సామాజిక సంస్కరణ సంబంధిత విషయాలు… మొదలైన వాటిని కథా వస్తువుగా స్వీకరించారు. బీణాపాణి మహంతి, బీణా మహాపాత్ర, బనజాదేవి, పుణ్యప్రభాదేబి, కల్పనాదేబి, ప్రతిభారాయ్‌, మనోరమ మహాపాత్ర ఈ దశకానికి చెందినవారే.

శకుంతల పండా సంపాదకత్వంతో మహిళల కోసమే పెట్టిన ‘సుచరిత’ అనే మహిళల పత్రిక 1975లో వెలువడడంతో యువ రచయిత్రుల సంఖ్య పెరిగింది. జయంతి రథొ, సుస్మిత బాగ్చీ, కనకలత వాఢీ, హిరణ్మయి మిశ్రల తర్వాత 1980ల తర్వాత జశోధర మిశ్ర, సంయుక్త రావత్‌, తులసి ఓఝా, సుప్రియ పండా, ఇందిరాదాస్‌, గాయత్రి సరాఫ్‌, పారమిత శతపథి, మోనాలిసా జెనా, సుప్రియ నాయక్‌, మమతామయి చౌధురి, సుచేత మిశ్ర, సుప్రియా దాస్‌ వంటి రచయిత్రులు వచ్చారు.

బీణాపాణి మహంతి స్త్రీల అనుభూతిగతమైన చైతన్యం పట్ల ప్రత్యేకమైన దృష్టితో ప్రారంభంలో రచనలు చేయలేదు. స్త్రీల జీవితంలోని నిస్సహాయతను, విషాదాన్ని చిత్రిస్తూ సానుభూతి చూపించే దృక్పథంతో రచించారు. గతానుగతికమైన మూసలో తన ముందు, తన తర్వాత రచనలు చేసిన కథకుల శైలిలో పురుష పాత్రలను స్వీకరించి కథలు ఎక్కువగా రచించారు. 1970లకు ఆమె దృక్పథంలో మార్పు వచ్చింది. ఆవిడ రచించిన పట్టదేయి కథ ఒక మైలురాయి. ఈ కథను జయంత్‌ మహాపాత్ర ఇంగ్లీషులోకి, ఉపద్రష్ట అనూరాధ తెలుగులోకి అనువదించారు.

పట్టదేయి కథ జాబాలి సత్యకామ్‌ కథను గుర్తుకుతెస్తుంది. సత్యకామేని గురువుగారు నీ తండ్రి ఎవరు అని అడిగితే సత్యకామ్‌ తల్లి దగ్గరకు వెళ్ళి తన తండ్రి ఎవరో అడుగుతున్నారని, తన తండ్రి ఎవరో చెప్పమంటాడు. దానికి జాబాలి నేను నా యజమానిని, ఆయన మిత్రుల్ని అందరినీ సేవించాను. వారిలో నీ తండ్రి ఎవరో ఏమో! వెళ్ళు, నీ గురువుగారికి చెప్పు. నేను జాబాలి కొడుకునని చెప్పు అంటుంది.

ఆధునికంగా 1970లలో బీణాపాణి మహంతి రచించిన పట్టదేయి కథలో పట్టదేయి కాపురం చెడి పుట్టింటికి వస్తుంది. కూతురు కష్టాన్ని కడుపులో పెట్టుకుని ఆమె తండ్రి ఆమెను సాకుతాడు. ఊరంతా పండగ సంబరంలో ఉన్నప్పుడు పట్టదేయి నలుగురు కుర్రాళ్ళచేత బలాత్కరింపబడి ఊరు వదిలి వెళ్ళిపోతుంది. ఆ దుఃఖంతో ఆమె తండ్రి చనిపోతాడు. ఉన్నట్లుండి ఒకరోజు పట్టదేయి కొడుకుని చంకనేసుకుని ఊళ్ళో ప్రత్యక్షమవుతుంది. పాడుపడిన తండ్రి ఇంటిని బాగు చేసుకుని ఆ ఇంట్లోనే ఉంటుంది. ”ఒసే కులటా! కుర్రాడి తండ్రి ఎవరే?” అని పంచాయతీ పెట్టి యాగీ చేసిన ఊరి పెద్దలకు పట్టదేయి ఎదురుగా ఉన్న యువకుల్ని వేలెత్తి చూపెడుతూ వీరిలో ఎవరు ఈ కుర్రాడి తండ్రో చెప్పాలి అని సవాలు చేస్తుంది. ఈ కుర్రాడికి తల్లిని నేను అని ఢంకా భజాయించి చెబుతుంది. స్త్రీ అస్తిత్వాన్ని ఎత్తి చూపెట్టిన కథ ఇది.

2000 సం|| తర్వాత కథ, నవల, కవిత్వం ప్రక్రియల్లో స్త్రీవాదం వికసించి రచయిత్రుల గొంతు బలంగా వినిపించింది. దాంతోపాటు, దానికి సమాంతరంగా కొందరు స్త్రీ వాదులు నెగెటివ్‌ దిశగా నగ్న చిత్రణ చేస్తున్నారన్న తీవ్ర విమర్శ ముందుకు వచ్చింది.

1980ల్లో ప్రతిభారాయ్‌, జశోధర, సరోజిని మొదలైన రచయిత్రులు వివాహేతర సంబంధాలను, స్త్రీల మనో జగత్తులో అదృశ్యంగా ఉండే దృశ్యాలను కళ్ళెదుటకు తెచ్చే రీతిలో రచనలు చేసినప్పటికీ ఫకీర్‌ మోహన్‌ సేనాపతి గారి తిరగబడలేని, నోరు విప్పి మాట్లాడలేని మూగిరేబతి ఎంతో ధైర్యవంతురాలై గొంతు విప్పారని అనిపిస్తుంది.

అలా అయినా స్త్రీ వాదం అంత స్పష్టంగా లేదని కూడా చెప్పవచ్చు. పత్రికా సంపాదకులు ఏ రచయిత్రినైనా స్త్రీ వాది అని రాస్తే రచయితలైన పురుషులు స్త్రీ అయినపుడు స్త్రీగా ఆ ఎల్లల్లో, ఆ హద్దుల్లో ఉండొద్దా అంటూ సంపాదకులకు ఉత్తరాలు రాసిన సందర్భాలు

ఉన్నాయి.

ఃఔశీఎaఅఃర పశీసవ షశీఎaఅఃర తీఱస్త్రష్ట్ర్‌ః. విస్తృత అర్థంలో ఒడిశాలో స్త్రీ వాద రచయిత్రులకు సంపూర్ణంగా అవగాహనకు రాలేదు. దాన్ని వారు అంతా దేహమే అని అనుకుంటున్నారు. దేహం అంటే కేవలం సెక్స్‌, కామం, సంభోగం కాదు. స్త్రీల మీద పురుషుల అంకుశం ఉంటుంది. అటువంటి అంకుశం ఏదీ పురుషుల మీద ఉండదు. తల్లులు మగపిల్లల కన్నా ఆడపిల్లలకు భోజనం తక్కువగా ఎందుకు పెడతారు? బృందావనంలోనూ, పూరీలోనూ గుండు గీయించుకున్న వివిధ వృద్ధ స్త్రీలు ఎందుకు ఉన్నారు? విధవలు సంయమనంతో ఉండాలనే నియమం ఉన్నప్పుడు విధురలకు ఆ నియమం ఎందుకు లేదు? లోకం వెలుగు చూడకుండానే తల్లి గర్భంలోనే ఆడపిల్ల హత్యకు ఎందుకు గురవుతోంది? ఇవన్నీ పురుషాధిక్య సమాజం స్త్రీ దేహంమీద పెట్టిన అంకుశాలే అంటారు ప్రముఖ స్త్రీవాద రచయిత్రి సరోజిని సాహు.

ఒడియా స్త్రీ వాద పత్రికలు మంచి గృహిణి లక్షణాలు ఏమిటో, ఎలా ఉండాలో, ఆదర్శ భారతీయ స్త్రీ కర్తవ్యాలేంటో చెప్పే రచనలను ప్రచురిస్తూ హద్దుల మధ్య నడుస్తున్నాయి. అందువల్లే కొంతమంది రచయిత్రులు తాము స్త్రీవాదులం కాదని, మానవ వాదులమని అంటుంటారు. స్త్రీ మనిషి కాదా? వేరే ప్రజాతికి చెందినదా? మానవ వాది కాదా? వేరే సమూహానికి చెందినదా? అంటూ ఆమె తన తోటి రచయిత్రులను ప్రశ్నిస్తున్నారు.

ఆమె రచించిన నవల గంభీరీ ఘర (ుష్ట్రవ ణaతీస ూపశీసవ) వివాహేతర పరకీయ మహిళ కథ. అందులో సెక్స్‌, లిబిడోల నగ్న చిత్రణ ఉంది. ఈ నవలను స్త్రీ వాదపు ఉన్నత సంస్కరణగా స్థిరీకరించి చెప్పడం జరిగింది. అయినా ఇది ఒడియా పాఠకుల అభిరుచికి భిన్నంగా ఉంది. ఒడియా సమాజం మార్పు చెందుతూ ఉంది. స్త్రీ స్వావలంబనతో పురోగతిని వేగవంతం చేస్తోంది. కానీ ‘బయట’ భావజాల ముద్రలతో సంయమనం కోల్పోవడాన్ని స్వీకరించడం లేదు. అందువలన స్త్రీ వాద రచయిత్రుల రచనల్లో లివ్‌-ఇన్‌-రిలేషన్‌షిప్‌, ఫ్రీ సెక్స్‌, దేహ సంబంధమైన విశృంఖలత్వం మొదలైనవన్నీ మహా నగరాల జీవన విధాన పద్ధతులని, వాటిని అధిక శాతం పాఠకులు స్వీకరించడం లేదని కొందరు రచయిత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్త్రీ వాద కవయిత్రి అపర్ణ మహంతి స్త్రీ శరీరం గురించి చెబుతూ స్త్రీ ‘సంపూర్ణ’ అవ్వడానికి హక్కులు, సమానత్వం కావాలంటారు. ఆమె కవితా సంకలనం ‘నష్టనారి’ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది.

ఉధృతంగా ప్రవహిస్తూ ఒడ్డులను కోసేసి దాటుకుని వచ్చే నదిలా నిశ్చలమైన భావావేశంతో ఒడియా కావ్యక్షేత్రంలో ఎన్నో ఆనకట్టలను అపర్ణ తన ప్రతిభతో పడగొట్టింది. నూతన భావధారలు సాంప్రదాయక భావ ధారలను పక్కకు నెట్టేశాయి. స్త్రీ దైహిక వాంఛను, ఆవేశాన్ని, ఆకాంక్షను ఇంత స్వచ్ఛమైన, నిష్కపటమైన హృదయానుభవంగా, గొప్ప శైలితో, శక్తిమంతంగా గళం విప్పి అపర్ణకు ముందు ఎవరూ కావ్య గానం చేయలేదని విమర్శకులు ప్రశంసించారు. ఆవిడ ఏ విధమైన బౌద్ధికమైన తొడుగులతో, అలంకారాల ముసుగుతో కవిత్వాన్ని నింపలేదని, ఆవిడది దొంగ గొంతు కాదని అన్నారు.

సతొ కొహుచి

ప్రతి బాదొకి ప్రత్యాఖ్యానొ

నూహె

ఆమంత్రణొ, సమర్పొణొ, రమణొరొ

థాయె ‘నష్టనారి’

నిజం చెపుతున్నాను. వాదానికి ప్రతివాదం కాదు, ప్రత్యాఖ్యానమూ కాదు. ఆహ్వానం, సమర్పణం, కలయికలో

ఉంటుంది ‘నష్టనారి’ అని ఏ ముసుగూ లేకుండా చెబుతుంది. తనని తాను తననుంచే దాచేసుకుని ప్రపంచం ఆడించే ఆటని ‘నష్టనారి’ ఆడలేదు. మహీయసిగా మారడం ‘నష్టనారి’కి తెలియదు అంటుంది.

స్త్రీ ఎన్నెన్ని సంవత్సరాలు, ఎంతెంత కాలం, ఎంతెంత దూరం నడిచిందో! ఆవిడ పాదాలు ఆవిణ్ణి గుర్తించలేదు, ఆవిడ పేరు ఆవిణ్ణి గుర్తించలేదు అంటుంది సుచేత మిశ్ర.

స్త్రీ వాద కవయిత్రులలో అంజలి దాస్‌ సమన్వయవాది. ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తూ కర్తవ్యాన్ని వదలని స్త్రీ కంఠం ఆమె కలానిది.

ఒక తార – రాధ – అహల్య – మండోదరి – జానకి నుండి

పాంచాలి వరకు

ఒక ఈవు నుండి సిండ్రిల్లా – రెబెకా – లోలిత –

రుక్సానా – అన్నా వరకు

అందరూ కోరుకున్నారు

తమ కొరకు ఉధృత ఉత్తుంగ సముద్రాన్ని!

ఓయీ అవివేకీ!

మూర్ఖ ఆలోచనాపరుడా!

ఇక ఇప్పుడు తలుపులు బిగించి

బందీగా చేసిపెట్టినా

ఒక్కసారి కలం నా చేతికి వచ్చాక

దయనీయగా

ఆ పాత భూమిక నిర్వహించడానికి

తిరిగి ఇక వెనక్కి రాను

అది తెలుసుకో!

– అంటుంది అంజలీదాస్‌

ఇదే విధంగా గాయత్రీ బాల కవిత్వంలోనూ కనబడుతుంది. అయినా ఈ వ్యతిరేకత, తిరస్కారం, సంపూర్ణ విధ్వంసానికి కాదు, సంయమనంతో వైవాహిక వ్యవస్థను సరిచేయడానికే!!

ఒడియా పాఠకులలో అధిక సంఖ్యాకులు సంయమనంతో రచన చేస్తున్న ఈ రచయిత్రుల భావధారనే ఆహ్వానిస్తున్నారు. వీరు స్వేచ్ఛ పేరుతో ఫ్రీ సెక్సును, లివ్‌-ఇన్‌-రిలేషన్‌ను సమర్ధిస్తున్న రచనలను సూటిగానే తిరస్కరిస్తున్నారు. వ్యతిరేకత, తిరస్కారం, విధ్వంసానికి దారితీయకూడదనీ, వైవాహిక వ్యవస్థను సరిచేయడానికి సంయమనంతో మార్పు దిశగా పురోగతి అవసరమన్నదే వారి అభిమతం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.