బంటురీతి… పాలపర్తి జ్యోతిష్మతి

 

మూర్తి స్నానం చేసి వచ్చేటప్పటికి ఇంట్లో మోహన కనిపించలేదు. కంగారుగా మళ్ళీ ఒకసారి ఇల్లంతా వెతికి మోహన సెల్‌కి రింగ్‌ చేశాడు. పడకగదిలో మంచం మీది నుంచి మోహన సెల్‌ మోగుతున్న శబ్దం వినిపించింది మూర్తికి. వెళ్ళి సెల్‌ చేతిలోకి తీసుకుని అర్థం లేకుండా అటూ ఇటూ తిప్పి చూశాడు. ‘చెప్పకుండా, సెల్‌ కూడా తీసుకెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది’ అని ఒక్క క్షణం ఆలోచించి లతకి ఫోన్‌ చేశాడు.

”హాయ్‌ మోహనా!” అంది లత ఫోనెత్తి అవతల్నుంచి.

”నేనండీ! మూర్తిని” అన్నాడు మూర్తి బిడియంగా.

అవతలినుంచి ఏమీ సమాధానం రాకపోయేసరికి ”మోహన మీ దగ్గరికి వచ్చిందేమోనని…” అంటూ నసిగాడు మూర్తి.

”మోహన నా దగ్గరికి రావడమేంటి? మీరు మోహన సెల్‌ నుంచే మాట్లాడుతున్నారు” అంది లత ఆశ్చర్యంగా.

”అవునండీ! మోహన ఇంట్లో లేదు. సెల్‌ ఇంట్లోనే ఉంది. అందుకే కంగారేసి మీకు ఫోన్‌ చేశాను” అన్నాడు మూర్తి.

”గుడికెళ్ళిందేమో?”

”నేనూ అదే అనుకున్నాను. కానీ చెప్పకుండా… సెల్‌ కూడా తీసుకెళ్ళకుండా…”

”నేను గుడికెళ్ళి చూసొస్తాను. మీరు ఇంట్లోనే ఉండండి. మోహన ఇంటికొస్తే ఫోన్‌ చెయ్యండి” అని చెప్పి గుడికి బయలుదేరింది లత.

ఆ రోజు సాయంత్రం వినాయకుడి పందిట్లో మోహన కచేరి ఉంది. నెలకొక కచేరీ అయినా ఉంటుంది మోహనకి. ప్రతిసారీ కచేరీకి వెళ్ళేముందు కోదండ రామాలయానికి వెళ్ళడం మోహనకి అలవాటు. ఎప్పుడూ మూర్తే మోహనని బండిమీద గుడికి తీసుకు వెళ్తాడు.

‘బంటురీతి కొలువీయవయ్య రామా’ అంటూ త్యాగరాజస్వామి రాములవారిని వేడుకుంటూ రాసిన కృతి మోహనకి చాలా ఇష్టం. ప్రతి కచేరీలో తప్పనిసరిగా ఆ పాట పాడుతుంది. మూర్తికి ఎందుకో మోహన ఆ పాట పాడడం ఇష్టముండదు. ప్రతిసారి కచేరీకి ముందు ‘ఏ పాటలు పాడుతున్నావు?’ అని మూర్తి అడగడం, మోహన అన్ని పాటలతో పాటు బంటురీతి కూడా చెప్పడం, మూర్తి ఆ పాట పాడొద్దనడం, అయినా మోహన పాడడం జరుగుతూనే ఉంటాయి.

‘ఆ పాట గురించే మనసు కష్టపెట్టుకుని చెప్పకుండా వెళ్ళి ఉంటుంది మోహన’ అనుకుంటూ గుడికి చేరింది లత.

ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఎటో చూస్తూ దిగాలుగా కూర్చుని ఉంది మోహన.

”ఏమిటే ఇది? పద ఇంటికెళ్దాం” అంటూ మోహన చేయి పట్టుకుని లాక్కెళ్ళి బండిమీద కూర్చోబెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళింది లత.

హాల్లో సోఫాలో కూర్చోబెట్టి, మంచినీళ్ళిచ్చి, మోహనని ఒంటరిగా వదిలేసి వంటింట్లోకెళ్ళింది లత. కాసేపటికి కాఫీ తీసుకొచ్చి ‘ఇప్పుడు చెప్పు’ అంది మోహన పక్కన కూర్చుని.

”ఏముంది చెప్పడానికి? ఎప్పుడూ ఉండే గోలే. ఈ సారి చాలా గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు” అంది మోహన కాఫీకప్పుని ఏకాగ్రతతో చూస్తూ.

లత అనునయంగా మోహన భుజంమీద చెయ్యేసింది.

”ఇవాళ కచేరీలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పాట పాడడానికి వీల్లేదన్నారు. మనిషి దుర్మార్గుడేం కాదు, మంచివాడే. ఈ ఒక్క విషయంలోనే ఎందుకో మరి అంత పట్టుదల, ఆ పాటంటే అయిష్టం”.

”ఎందుకని నువ్వెప్పుడూ అడగలేదా?”

”ఎన్నిసార్లడిగినా నీ మంచి కోరి చెప్తున్నాను, అర్థం చేసుకో” అంటారు. అంతే. ఆ పాట పాడితే నాకు జరిగే కీడేమిటో, మానేస్తే ఒరిగే మంచేమిటో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు”.

”నీకు తెలీదు మోహనా! ఇంట్లో ఉన్నంతసేపు సంగీత సాధన చేసుకోవడం, స్టేజి ఎక్కాక ఐహిక ప్రపంచాన్ని మర్చిపోయి పారవశ్యంతో పాడడం, ఇదే నీ లోకం. ఎదురుగా కూర్చున్నవాళ్ళు నీ పాటని ఎలా ఆస్వాదిస్తున్నారు? ఏమి వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారు? అనే విషయాలు కూడా నువ్వు పట్టించుకోవు. కానీ మూర్తి గారి దృష్టికి అవన్నీ వస్తాయి.”

”మామూలుగా నువ్వు గణపతి ప్రార్థన తర్వాత ఇంకో కృతి ఏదైనా పాడి వెంటనే బంటురీతి పాడతావు, చాలా అద్భుతంగా పాడతావు. ఈ మధ్య మూర్తిగారు నీ మీద ఆ పాట పాడొద్దని ఒత్తిడి తేవడం వల్ల కావచ్చు. ఆ పాట పాడడం ఆలస్యం చేస్తున్నావు. నువ్వు బంటురీతి పాడేదాకా జనం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తుంటారో తెలుసా? ‘ఇంకా పాడదేంటి? అసలు పాడదా ఏంటి?’ అని గుసగుసలాడుకోవడం మొదలుపెడతారు. నీ పేరు ఆ కృతితో ఐడెంటిఫై అయిపోతోందని తెలుసా నీకు? ఇవాళ్టి కచేరీ నిర్ణయమైనప్పటినుండి ‘బంటురీతి మోహన’గారి కచేరీ ఫలానారోజు ఉంది అని చెప్పుకుంటున్నారు జనం. వీళ్ళంతా నీమీద అభిమానం పెంచుకుని, నీకు దగ్గర కావాలని ప్రయత్నించి, నిన్నేం చేసేస్తారో అని మూర్తిగారికి భయం పట్టుకుంది. వాళ్ళనుంచి నిన్ను రక్షించుకోవడానికి ఆ కృతి పాడొద్దంటున్నారు”.

మోహన మొహం మీద మళ్ళీ దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. తల వంచుకుని ఆలోచనలో పడింది. లత మోహనకి ఇంకాస్త దగ్గరగా జరిగి, మోహన చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పడం మొదలుపెట్టింది.

”పత్రికలలో పాఠకుల ప్రశ్నలకు ప్రముఖ మానసిక విశ్లేషకురాలు ఇచ్చే సమాధానాలు చదివి, వాటి గురించి చర్చించుకునేవాళ్ళం చిన్నప్పుడు మనం…” అని లత చెప్తుండగానే మోహన ఉత్సాహంగా ”అవును, ఆ శీర్షికలో చదివిన విషయాలు ఎప్పటికీ మర్చిపోలేం. ఒకావిడ ‘రోడ్డుమీద నేనూ, మా ఆయన వెళ్తుంటే నన్ను స్వేచ్ఛగా నడవనివ్వరు. కాసేపు ఇటు నడు అంటారు, ఇంకాసేపటికి అటు నడు అంటారు. ఒకసారి నేను ముందు వెళ్తాను, నా వెనక నువ్వు రా అంటారు. ఇంకోసారి నువ్వు ముందు నడు, నేను వెనక వస్తాను అంటారు. ఎందుకిట్లా నా నడకని నియంత్రించాలనుకుంటారు? అని అడిగితే నిన్ను రక్షించాల్సిన బాధ్యత నా మీదుంది అంటారు. నేను పాతికేళ్ళుగా ఒంటరిగా రోడ్లమీద ఎన్నోసార్లు తిరిగుంటాను, చిన్నప్పుడు స్కూలుకెళ్ళడం దగ్గరినుంచి నిన్న మొన్న కూరలు, సరుకులు తేవడందాకా. ఎప్పుడూ నేను ఏ బస్సు కిందో, లారీ కిందో పడలేదే! ఏ తాగుబోతువాడో, ఆకతాయి వెధవో వచ్చి నా మీద పడలేదే! నా జాగ్రత్తలో నేను ఉంటూనే ఉన్నాను కదా! మరి ఇవాళ ఈయన పక్కన నడిచేటప్పుడు మాత్రం ఆయన నన్ను రక్షించేదేంటి?’ అని రాసుకొచ్చింది” అంది.

”నయం కదూ! కూరలకీ, సరుకులకీ ఒక్కతే బయటకు వెళ్ళే అవకాశం ఇచ్చాడాయన ఆవిడకి. ఒకావిడ ‘బంగారు నగని బీరువాలో దాచుకుని రక్షించుకున్నట్లు మా ఆయన నన్ను పేరంటానికి కూడా పంపకుండా ఇంట్లో దాచుకుని రక్షించుకోవాలనుకుంటాడు. నా స్నేహితురాలి పెళ్ళికి కూడా నన్ను పంపలేదు. నీకెందుకు శ్రమ? ఆ ఇచ్చే గిఫ్టేదో నేను వెళ్ళి ఇచ్చొస్తాలే అన్నారు’ అని రాసింది” అంది లత.

‘భార్య చదివే పుస్తకాన్ని బట్టి ఆవిడ వ్యక్తిత్వాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తారేమోనని సందేహపడి భార్యను రక్షించుకోవడానికి ఆమె చదవాల్సిన పుస్తకాలను తనే నిర్ణయించుకోవాలనుకుంటాడు. భార్య ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని తనని తాను మభ్యపెట్టుకుంటూ ఆవిడ ఆహారాన్ని నిర్దేశిస్తాడు ఇంకొకడు’ ఆవేశంగా అంది మోహన.

”భార్య ప్రతి కదలికని నియంత్రించడం ద్వారా ఆవిడ చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మిస్తున్నామంటూ కరెంటు తీగల కంచె వేస్తున్నారు వీళ్ళంతా. ఈ పరిస్థితుల్లో నన్ను మీరు రక్షించాలి అని ఆ భార్యల్లో ఏ ఒక్కరూ భర్తని అడిగి ఉండరు. లేని, రాని ప్రమాదాలను ఊహించుకుని ఆ భర్తలు భార్యల్ని రక్షిస్తున్నట్లు ఫీలయిపోతూ వాళ్ళ వాళ్ళ ఇగోల్ని తృప్తి పరచుకుంటారు, అంతే.” నిస్పృహగా అంది లత.

”ఇటువంటి వాళ్ళ గురించి నాకు ఒక్కటే అనుమానం లతా! అవసరం లేకపోయినా బయటి వ్యక్తులనుంచి, బయటి పరిస్థితుల నుంచి భార్యల్ని రక్షించుకోవాలని తపన పడిపోయే వీళ్ళంతా, ఆ భార్యలకి తమ తల్లితోనో, చెల్లితోనో, మరే దగ్గర బంధువుతోనో అభిప్రాయ భేదం వస్తే ‘నా భార్యను నేను రక్షించుకోవాలి’ అనుకుంటారా?”

”ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోరు. అటువంటి సందర్భమే వస్తే ఇప్పుడు నన్ను రక్షించాల్సిన బాధ్యత మీది అని భార్య సూటిగా చెప్పినా న్యాయం, ధర్మం ఎవరి పక్షాన ఉన్నాయి అన్న ఆలోచనే చేయకుండా ‘నీదే తప్పు’ అని భార్యని అనగలగడమే ఈ రక్షకుల ప్రత్యేకత. భార్యల మనోభావాలతో వాళ్ళకి పనిలేదు”.

”ఆలోచించి, ఆలోచించి డిప్రెషన్‌ వస్తోంది. ‘ఆయన అంత వద్దంటుంటే నేను ఇంత మొండితనం చేయడం ఎందుకు? పోనీ ఆయన చెప్పినట్టే ఆ పాట పాడడం మానేస్తే…’ అనిపిస్తుంటుంది ఒక్కోసారి…”.

”అంత పని మాత్రం చెయ్యకు” మోహన మాటలు పూర్తికాకుండానే కంగారుగా అంది లత.

”లేదు, ఈ పాట మానేస్తే ఇంకో పాట బాగా పాడతానన్న పేరొస్తుంది. అప్పుడు ఆ పాట పాడొద్దంటారు. తర్వాత మరొక పాట. ఇలా వరుసగా ఒక్కో పాటా వదులుకుంటూ చివరికి సంగీతాన్నే వదులుకోవాల్సొస్తుంది. సమస్యకి పరిష్కారం అది కాదని తెలుస్తోంది కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు” దిగులుగా అంది మోహన.

”ప్చ్‌…! ఫీలింగ్‌ ఆఫ్‌ ఇన్‌ సెక్యూరిటీ” అంది లత నిట్టూరుస్తూ.

”అదేమిటి?” అయోమయంగా అడిగింది మోహన.

”నువ్వు ఆ పాట పాడి పాడి అభిమానులను పెంచుకుని, వాళ్ళ అభిమానం మత్తులో పడి ఆయనకి దూరమైపోతావేమోనని దిగులు పెట్టుకున్నారు. పా…పం… అనుకోవాలి మనం”.

ప్రశ్నార్థకంగా చూసింది మోహన లతవైపు.

”ఒకసారి నేను బస్సులో వెళ్తున్నాను. ఒకచోట ఆగింది బస్సు. ఊరు -లోపలికెక్కడికో ఉన్నట్టుంది. రోడ్డుదాకా వచ్చి ఎక్కాలి బస్సు. మా బస్సు అక్కడ ఆగేటప్పటికి ఒక భార్యా భర్త ఉన్నారు. భర్త చెయ్యెత్తి బస్సాపాడు. ఆమె ఎక్కింది. ఆమె బస్సు మెట్టుమీదికెక్కి నిలబడ్డాక అతను జేబులోంచి డబ్బులు తీసి ఆమె చేతిలో పెట్టాడు. బస్సు కదిలి వెళ్ళిపోతుంటే ‘డబ్బులు జాగ్రత్తగా పెట్టుకో’ అని అరిచి చెప్తున్నాడు. ఏ దొంగ వెధవో ఆమె డబ్బు ఎక్కడ పెట్టుకుందో గమనించి కొట్టేశాడననుకో ‘అంత మాత్రం జాగ్రత్తగా దాచుకోడం చాతకాదు. అప్పటికీ నేను అరిచి చెప్తూనే ఉన్నాను. జాగ్రత్తగా పెట్టుకోమని’ అని ఆమెనే తప్పుపడతాడు. ఆ ఇచ్చే డబ్బులేవో ఇంటి దగ్గరే ఇచ్చి, జాగ్రత్తగా పెట్టుకోవడం ఎలాగో నేర్పించి పంపొచ్చుగా? బస్సుక్కాక అందరూ చూసేటట్టు ఇవ్వడమెందుకు?

”పొద్దున్నే లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునేదాకా అతని పనులన్నీ ఆమే చేయాలి. ఆమె లేకపోతే అతనికి గడవదు. అతని పనులు అతను చేసుకోలేడు. ఆవిడ ఎక్కడికెళ్తుందో మరి! ఎప్పటికి తిరిగి వస్తుందో! తిరిగి వస్తానన్న సమయానికి వస్తుందో రాదో అన్న దిగులుతో భార్య ఊరెళుతోందంటే అతనికి ఫీలింగ్‌ ఆఫ్‌ ఇన్‌ సెక్యూరిటీ. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పదిమంది ముందు ‘ఈ స్త్రీ నా సొంతం. ఈమె నా మీద ఆధారపడి ఉంది. ఈమెను నేను పోషిస్తున్నాను’ అని చాటి చెప్పుకోవాలనిపిస్తుంది అతనికి. ఇంట్లో

ఉన్నంతసేపూ అతను ఆమెమీద ఆధారపడతాడు. బయటికి వచ్చి ఆమెమీద నాదే పైచేయి అని ప్రదర్శించుకోవాలనుకుంటాడు. అన్నిటికంటే హైలైట్‌ ఏంటో చెప్పనా? అతను అంత టెన్షన్‌ పడుతుంటే ఈమె పెదాలు బిగపట్టి నవ్వు ఆపుకుంటూ కూర్చుంది. ఆ నవ్వు వెనకాల భావమేంటో తెలుసా? పా…పం… పిచ్చి వెధవ అని” అంది లత గలగలా నవ్వేస్తూ.

”ఛ, నువ్వు మరీనూ, ఏ భారత నారైనా భర్తని గురించి అలా అనుకుంటుందా?” అంది మోహన కూడా హాస్యధోరణిలోకి దిగుతూ.

”తన నవ్వుకి ఆ అర్థం ఉందని ఆవిడకి తెలియకపోవచ్చు. అంతమాత్రాన అంతరార్థం మారిపోదు. ఒకావిడ ‘మా వారికి కాఫీ పెట్టుకోవడం కూడా చేతకాదండీ, అందుకే ఆయన్నొదిలి నేనెక్కడికీ వెళ్ళను’ అంటుంది. దానికి పోటీగా ఇంకొకావిడ ‘మా వారికి మంచినీళ్ళు ముంచుకు తాగడం కూడా రాదండీ, అన్నీ నేనే అందించాలి’ అంటుంది, అదేదే మహా ఘనకార్యమైనట్లు. ఆ మగాళ్ళు కూడా ‘మా ఆవిడ కదా నా గురించి ఇంత గొప్పగా చెప్తోంది’ అని మురిసిపోతుంటారు. ఆ మాటల వెనక ఉన్న గూడార్థం పాపం ఆ భార్యలకీ తెలీదు, భర్తలకీ తెలీదు” వ్యంగ్యంగా అంది లత.

”మనిద్దరం ఎన్ని మాట్లాడుకున్నా, మన కబుర్లలో ఎక్కడెక్కడ తిరిగొచ్చినా నా సమస్య మాత్రం ఎక్కడిదక్కడే ఉంది” భారంగా అంది మోహన.

”అప్పట్లో మనం చదివిన ఆ ‘ప్రశ్నలు-సమాధానాలు’ శీర్షికని పుస్తకంగా ప్రచురించారు. పుస్తకాల షాపులో కనిపిస్తే కొనుక్కొచ్చాను” అంటూ లత లేచి లోపలికెళ్ళి చేతిలో ఒక పుస్తకంతో తిరిగి వచ్చింది.

”చాలా చక్కటి సమాధానాలు ఇచ్చేవారావిడ ‘స్త్రీ అంత బలహీనురాలు కాదు, బలహీన మనస్కురాలు కాదు, ఇవ్వవలసిన స్వేచ్ఛని ఇచ్చి దాన్ని దుర్వినియోగపరిస్తే అప్పుడు ఆంక్షలు పెట్టాలి కానీ రక్షణనివ్వడం అంటే ఆంక్షలు పెట్టడమే అనుకోకూడదు’ అంటూ” అంది మోహన లత చేతిలోని పుస్తకాన్ని తదేకదీక్షతో చూస్తూ.

”బంటురీతి కొలువీయవయ్య రామా అని పాడుతూ నువ్వు భగవంతుడ్ని బంటురీతి కొలువు చేసే అవకాశం కల్పించమని వేడుకుంటుంటే మీ ఆయన నువ్వు ఆయన దగ్గర బంటురీతి కొలువు చెయ్యాలని కోరుకుంటున్నారు. ఆయన ఆలోచనా విధానమే మారాలి. దానికి ఏ…దో… ఒకటి చెయ్యాలి” అంది తల పుస్తకాన్ని మోహన చేతిలో పెడుతూ.

‘అవును’ అన్నట్లు తల ఊపుతూ లేచి ఇంటికి బయలుదేరింది మోహన ఆ పుస్తకాన్ని తీసుకుని.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.