భూమిక స్త్రీ వాద పత్రిక ప్రయాణం దిగ్విజయంగా 25 సంవత్సరాలు ముగించుకున్నందులకు ముందుగా మీకు నా అభినందనలు.
మన మొదటి కలయిక నాకింకా బాగా గుర్తు. భూమిక కథా వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారని తెల్సి అనిశెట్టి రజితతో ఆ వర్క్‌షాప్‌కు నేను కూడా రావడం జరిగింది. అక్కడే మీతోపాటు లక్ష్మి (శిలాలోలిత), సుజాతా పట్వారీ, తుర్లపాటి లక్ష్మి ఇంకా అనేకమంది అప్పుడప్పుడే ఎదుగుతున్న రచయితలుగా పరిచయం కావడం ఒక తియ్యని జ్ఞాపకం. ఆ వర్క్‌షాప్ మా అందరికీ ఒక అస్థిత్వ వేదిక అయిందని చెప్పవచ్చు.
భూమిక తరఫున మీరు నిర్వహించిన అనేక క్షేత్ర పర్యటనల్లో నేనూ మీ అందరితోటి పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనం వెళ్ళిన అనేక పర్యటనల్లో నాకు చాలా ఇష్టమైన, ముఖ్యమైన పర్యటనలు రెండు. ఒకటి వాకపల్లి ప్రయాణం. అక్కడి మహిళలపై ఆర్మీ జవానులు జరిపిన లైంగిక దాడులు విని మనమందరం ఎంతగానో చలించిపోయాం. అక్కడి ఆదివాసీ మహిళలతో మనం గడిపిన ఆ కొన్ని గంటలు మనందరి మనసుల్ని ఎంతగానో తడిచేశాయి. ఆ తర్వాత రాజమండ్రి జైలులో మహిళా ఖైదీలతో ములాఖత్ మరపురాని సంఘటననే… వారి గాధలు గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు మూగబోతుంది నాకిప్పటికీ…
స్నేహ సంబంధాలను, సాహిత్యాన్ని కలబోసి స్త్రీ వాద దృక్పథంతో భూమిక ప్రయాణం సాగటం అద్భుతమైన విషయం. మొదట్లో కొన్ని ఒడుదుడుకులకు లోనైనప్పటికీ మళ్ళీ భూమిక తిరిగి కొత్త బలంతో పుంజుకొని ఈ రోజు వరకు ఎదురులేకుండా ముందుకు సాగటం వెనుక మీ కృషి వెలకట్టలేనిది.
కొంతకాలం నా వ్యక్తిగత కారణాల వల్ల నేను నా రచనా వ్యాసంగానికి దూరంగానే ఉన్నప్పటికీ భూమిక ద్వారా నిర్వహించే ప్రతి క్షేత్ర పర్యటనల్లో చాలా మటుకు మీ అందరితో కలిసి నడవడం నేను ఓ అద్భుతంగా భావిస్తాను. గత 5, 6 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో వివిధ అంశాలపై, స్త్రీల సమస్యలపై మీతో కల్సి నడవడంతో మనిద్దరి మధ్య మరింత స్నేహం చిక్కనైందనే నేను భావిస్తాను. ఆ తర్వాత భూమికలో నా కవితలు, వ్యాసాలు అనేకం ప్రచురితమౌతూ రావటం నిజంగా సంతోషకరమైన విషయం. ఒక మంచి మిత్రురాలిగా, ఒక సామాజిక వేత్తగా, స్త్రీ వాదిగా మీరంటే నాకు చాలా ఇష్టం. అనేక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ భూమిక పత్రికను మీరు తీర్చిదిద్దుతున్న తీరు మీ ప్రతిభకు, నిబద్ధతకు నిదర్శనం.
పాతికేళ్ళుగా భూమిక పత్రిక ఎంతోమంది రచయితలకు వేదిక కావటం ఎవ్వరూ కాదనలేని నిజం. ఈ సందర్భంగా మీకు, భూమిక టీం సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. రాబోయే కాలంలో ‘భూమిక’ స్త్రీ వాద పత్రిక మరిన్ని హంగులతో, ఆత్మీయతలతో, ఉన్నతంగా స్త్రీల పక్షాన నిలిచి, కొత్త రచయిత్రులకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా మీకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని తెలియచేస్తూ ప్రేమతో…
– భండారు విజయ, హైదరాబాద్