స్త్రీలు, పిల్లలు, అణగారిన వర్గాల కోసం కృషి చేస్తున్న ”భూమిక”తో ప్రత్యక్ష పరిచయం నాకు రెండు సంవత్సరాల క్రితం నుండి మాత్రమే!
స్త్రీ వాదం పదం కూడా తెలియని చిన్నతనంలోనే రకరకాలుగా బాధలు, వెతలు అనుభవించే స్త్రీలను చూసి చెప్పలేని విషాదం కలిగేది. పుస్తకాలు చదవడం వల్ల ఆడపిల్లలు చెడిపోతారు అనే ఆలోచనలున్న కుటుంబంలో పుట్టిన నేను పుస్తకాలంటే పడి చచ్చేదాన్ని. ఇది చదవాలి, అది చదవకూడదు అన్న నియమం లేకుండా దొరికిన ప్రతి పేపర్ ముక్కా, వారపత్రిక, పుస్తకం చదివేదాన్ని.
”భూమిక” పత్రికను తొలిసారి నా నలుబది రెండవ యేట చదవడం ఒకరకంగా అదృష్టం, మరో రకంగా దురదృష్టం. నాలోని భావోద్వేగాలను అక్షర రూపంలో చదవగలుగుతున్నందుకు అదృష్టంగా, సగం జీవితం అయిపోయేవరకు భూమికను చేరుకోలేకపోవడం దురదృష్టంగా భావించాను. స్త్రీలు ధైర్యంగా తమ సమస్యను గురించి మాట్లాడడం అన్నది చాలా ముఖ్యమని నేను బలంగా నమ్ముతాను. అటువంటి మహిళలకు అండగా నిలవడం, మేమున్నామని భరోసా ఇవ్వడం అతి ముఖ్యం. ”భూమిక” స్త్రీ వాద పత్రిక ఈ పాత్రను అత్యంత సమర్ధవంతంగా పోషిస్తోంది.
భూమిక పత్రిక గురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా ”భూమిక హెల్ప్‌లైన్” గురించి చెప్పుకోవాలి. భూమిక సంస్థలో గొప్ప ముందడుగు హెల్ప్‌లైన్. బాధిత మహిళలకు 24 గంటలూ సహాయం అందించే మొట్టమొదటి హెల్ప్‌లైన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదేనేమో! కేవలం మాటలు, రాతలు కాదు చేతల్లో కూడా భూమిక ముందుండగలదు అనడానికి నిదర్శనం ”భూమిక హెల్ప్‌లైన్”.
న్యాయ సంబంధ సమస్యలు, గృహ హింస, వరకట్న బాధితులకు ఆసరాగా పోలీస్‌స్టేషన్లలో సపోర్ట్ సెంటర్ల ఏర్పాటు, కరీంనగర్‌లో ”భూమిక” ఆధ్వర్యంలో సఖి కేంద్రం ఏర్పాటు మహిళాభ్యున్నతికై భూమిక చేస్తున్న కృషికి దర్పణాలు.
”భూమిక” తనని తాను విస్తరించుకొంటూ స్త్రీలు, దళితులు, అణగారిన వర్గాల జీవన విధానంలో రావాల్సిన మార్పును సూచిస్తూ వారి జీవితాల్లో వెలుగు రేఖలను విస్తరింపచేస్తుంది. కుల, మత, లింగ, ప్రాంత, భాషాభేదాలకు అతీతంగా స్వేచ్ఛనే ఊపిరిగా రూపుదిద్దబడిన ”భూమిక” మహిళా లోకానికి అపురూపమైనది, అపూర్వమైనది. భూమిక ఆవిర్భావం, ఎదుగుదల వెనుక కొండవీటి సత్యవతి గారి అవిరళమైన కృషి తెలుసుకుని ఆవిడకు వీరాభిమానిని అయ్యాను.
ఎన్నో అసమానతల మధ్య ఒక స్త్రీ వాద పత్రిక నిలదొక్కుకుని పాతిక సంవత్సరాలు ప్రయాణం చేయడం అత్యంత గొప్ప విషయం.
పద్మావతి ఉడుతల