-శీలా సుభద్రా దేవి
తలపులకి గొళ్ళెం బిగించి
రెప్పలకింద స్వప్నాల్ని కట్టేసి
అలసిపోయిన శరీరాన్ని పక్కపై జారుస్తాను
కాసేపైనా విశ్రాంతి తీసుకొంటానో లేదో
ఏనాటి సంగతులో పుట్టలోంచి తాచుల్లా లేచి
గుండె తలుపుల్ని బాదుతూ
నిప్పుల్ని వెదజల్లుతూ బుసలు కొడ్తాయి
ఉలికిపడి లేవాలనుకొన్నా
లేవనీయని నిద్ర శరీరాన్ని కట్టేస్తుంది
మరి కాస్సేపటికే
రెప్పల్ని మెల్లగా ఎత్తిపట్టి
స్వప్నాలు కొద్దికొద్దిగా బయటపడి
స్వైర విహారం మొదలెడతాయి
కలల దారంతో పదాల్ని
పద్యాల మాలగా అల్లుకొంటూ
రాత్రి పొడవునా తిరుగుతూనే వుంటాయి.
ఒక్కసారి మెలకువ వస్తే బాగుణ్ణు
మనసు కాగితం పరచి పద్యాల మాలల్ని
పొట్లాం కట్టి దాచుకొంటానని
కలవరిస్తూనే వుంటాను
కలత నిద్రలో చేయి కదపబోతే
నా చేతిని హత్తుకొని పడుకొన్న
చిన్నిపాప ఉలికి పడ్తుంది
గాఢ సుషుప్తిలో మళ్ళా నేను
తెల్లారేక కళ్ళు విప్పితే
కళ్ళల్లో దాచుకొన్న కలలూ లేవు
మనసులో మూట కట్టాననుకొన్న
పద్యపాదాలూ లేవు
నిర్లిప్తంగా మిగిలిపోయిన నేను
తిరిగి చూసేసరికి
నా పద్యాల్ని కాలి మువ్వల పట్టెడలో గుచ్చేసుకొని
నన్ను పట్టుకోమని కవ్విస్తూ
చిలిపి నవ్వుతో పరుగెడుతోన్న చిన్నారి!
“తెల్లారేక కళ్ళు విప్పితే
కళ్ళల్లో దాచుకొన్న కలలూ లేవు
మనసులో మూట కట్టాననుకొన్న
పద్యపాదాలూ లేవు
నిర్లిప్తంగా మిగిలిపోయిన నేను”……………..అద్భుతం.నాకు కూడా ఇలాగె జరుగుతూ వుంటుంది.
మీ కలత నిద్ర ఎలా ఉన్నా, కవిత మాత్రం చాలా బాగుంది.
భద్రత, అభద్రతల మద్య కట్టి వేయబడడం వల్ల కలుగుతున్న దోబుచులాట
చిత్రంగాను వుంటుంది.
చిత్రాలను చేయిస్తుంది.
కవ్వించే చిన్నారికి
బందీలమై
పరుగెత్తల్సిందే
అప్పుడే సజీవం
మనిషైనా, కవితైనా.