హంస వింశతి కథాకావ్యంలో స్త్రీ పాత్ర చిత్రణ -డా. వై. కామేశ్వరి

తెలుగు ప్రాచీన సాహిత్యంలో శుకసప్తతి కథలకు, హంసవింశతి కథలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇవి ప్రాచీన రచనలే అయినా, ఉత్తమ నాయికా నాయకులను, ఉత్తమ కథను చిత్రించాలనే నిబంధనలను పట్టించుకోక, కేవలం, సామాన్యులు, సామాజికమైన నియతి తప్పినవారు అయిన వ్యక్తులను నాయికా నాయకులుగా చేసుకొన్న కథలు. సామాన్య జనజీవితాన్ని వాస్తవికంగా చిత్రించిన కథలు. అందుచేత, ఈ కథల్లో స్త్రీ పాత్రచిత్రణ విలక్షణంగా ఉంది. ఈ పత్రంలో చర్చిస్తున్న హంసవింశతి కథకావ్యాన్ని అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించాడు. ఆయన 1770-75 కాలానికి చెందిన వాడని పండితులు భావిస్తున్నారు.

సంప్రదాయకంగా ఆదర్శప్రాయులైన కథానాయకులను సృజించకపోవటం వేరు, పాత్రను అన్నింటిని అందుకు విరుద్ధమైనవిగా ఎన్నుకోవటం వేరు. శుకసప్తతిలోను, హంసవింశతిలోను ఇలాంటి పాత్రలను మాత్రమే ఎందుకు స్వీకరించారు అని సందేహం వస్తుంది. హంసవింశతి కథాకావ్యంలోని విజ్ఞానసర్వస్వ లక్షణాలపై డా. జి. వెంకటరత్నంగారు పరిశోధనచేశారు. కావ్య ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న వేసుకొని ఇలా నిర్ణయించారు. ”అయితే జార శృంగారానికి సంబంధించిన కథల ద్వారా నీతినుపదేశించడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అనేది తెలుగులో ఒక సామెత. అంటే ఏ కార్యాన్ని దానితోనే సాధించాలిగానీ, తదితరాలతో అదిసాధ్యం కాదని దీనిభావం. ఇచ్చట కవి తన కావ్యం ద్వారా జారశృంగారం సమాజానికి హానికరం అని చెప్పదలచుకున్నాడు. జారశృంగారం ప్రమాదకరమంటూ మళ్ళీ అవే కథలను చెప్పడమేమిటి అనేది మరొక ప్రశ్న. ఇది మానసిక తత్వపరిశీలనకు సంబంధించిన విషయం. ఎవరు దేనిని ఎక్కువగా కోరుకుంటారో వారు దానితోనే ఉపహతులౌతుంటారు. ఇది లోక సహజం. ఈ విషయాన్ని చక్కగా నెరిగినవాడవటంచేత కవి నాటి సమాజంలో ప్రజలెక్కువగా మక్కువ జూపుతున్న జారశృంగారం ప్రమాదకరమని చెప్పేందుకు, అటువంటి కథలనే ఆలంబనంగా తీసుకొన్నాడు.” – హంసవింశతి కావ్యస్వరూపం – విజ్ఞాన సర్వస్వ లక్షణాలు – పుట 19-20.

ఈ మధ్య విడుదలై ఎంతో ప్రజాదరణ పొందిన పోకిరి చలనచిత్రాన్ని చూద్దాం. అందులో ప్రతినాయకునిగా కనిపించే వ్యక్తి నిజానికి నాయకుడు. చిత్రమంతా అతడు నియతరహితంగా చేసే హత్యలన్నీ, అతడు ఆజ్ఞాతంలో ఉన్న పోలీసు అధికారి అని తెలియగానే మంచి పనులు అయిపోతాయి. గమనించి చూస్తే చిత్రంలో ప్రతికూలభావమైన హింసను చూపినంతగా ఆత్మీయత, అనురాగాల వంటి సమాజహిత విషయాలను చూపనేలేదు. అయినప్పటికీ చిత్రం అంతగా ప్రజాదరణ పొందిన రహస్యం ఏమిటి? మనుషులను చెడు ఆకర్షించినంత తేలికగా మంచి ఆకర్షించదు. ప్రజల మనోభావాలను ప్రభావితం చేయాలంటే వారికి అనుకూలంగా నడుస్తున్నట్లుగా కనిపిస్తూనే వారిని మంచి మార్గానికి మళ్ళించాలి. పిల్లల పెంపకం విషయంలో కూడా నిపుణులు తల్లిదండ్రులకు ఇదే సలహాను ఇస్తున్నారు. ఇదే మార్గంలో చెడును చూపుతూనే దాన్నే మంచికి ఆలంబనగా చేయటం చలన చిత్ర కథారచయిత చేసిన మాయ. ఈ శిల్పం మనకు ప్రాచీన కాలం నుంచి వస్తున్నదే! మన ప్రాచీన సాహిత్యంలో ఈ శిల్పాన్ని సమర్థవంతంగా ఉపయోగించిన కవులలో అయ్యలరాజు నారాయణామాత్యుడు ఒకరు.

సమాజంలో ఉన్న ఏ సమస్యనైనా రచనా వస్తువుగా సున్నిత మనస్కులైన రచయితలు బాధ్యతతో స్వీకరిస్తారు. సమాజహితాన్ని కోరే కవి ఎప్పుడూ వ్యవస్థాధర్మపక్షపాతే! అందువల్ల ఆ సమస్యా పరిష్కారానికి, సమస్య తలెత్తకుండా ప్రజల భావాలను సంస్కరించడానికి సామోపాయంతో, కావ్యసమ్మితంగా చెప్పటానికి రచయితలు సకల ప్రయత్నాలు చేస్తారు. పాలవేకరి కదరీపతి రచించిన శుకసప్తతి ఇలా వెలువడిన కథాకావ్యమే! దానిని మించిన ప్రతిభతో ప్రయత్నంతో వెలువడింది హంసవింశతి కథాకావ్యం. చిలుకస్థానంలో హంసను

ఉంచటం కూడా అర్థవంతంగా ఉంది. హంస పాలను నీళ్ళను వేరుచేస్తుందని ప్రతీతి. అలాగే హంస జ్ఞానానికి ప్రతీక. ఈ కథలో హంస కథానాయిక అజ్ఞానాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేసింది.

ఆ కాలానికి సహజమైనట్లుగా స్త్రీ అనగానే అంగ వర్ణన చేసినప్పటికీ, సామాజిక నియతి తప్పిన పాత్రల పట్ల కవికి సానుభూతి లేనందున ఆ అంగాంగ వర్ణన ఒక్కొక్కచోట వికటంగా కూడా కనిపిస్తుంది. ఆ కాలపు పోకడకు విరుద్ధంగా ఆ స్త్రీల శరీరగత సౌందర్యం కంటే వారి బుద్ధివైశిత్యంపై కవి ఎక్కువ దృష్టిని ఉంచాడు. కథా సందర్భంగానైనా అలా స్త్రీ బుద్ధివైశిత్యాన్ని చూపటమే ఆ కావ్యంలోని స్త్రీపాత్ర చిత్రణ అధ్యయనం చేయటానికి ముఖ్య అర్హతను కలిగించింది.

కథా సారాంశం

ఈ ప్రబంధంలో చిత్రభోగుడు అనే రాజ పరిపాలనలో విష్ణుదాసుడనే సాతాని తన భార్య హేమావతితో నివసిస్తున్నాడు. అతడు బాల్యం నుంచి తాను పెంచిన హంసకు ‘ఇల్లు భద్రమని’ చెప్పి వ్యాపార నిమిత్తం విదేశానికి ప్రయాణమై వెళ్లాడు. జోగురాలైన శివసత్తి హేమావతి అందం గూర్చి ఆ రాజుకు చెప్పి అతనికి ఆమెపై మోహాన్ని కలిగించింది. ఆమెపై కాంక్షను పెంచుకొన్న రాజు హేల అనే దూతికను హేమావతిని తనకు అనుకూలంగా మలచటానికి నియమించాడు. ఆమె ఏదో వంకతో విష్ణుదాసుని ఇంటికి వెళ్ళి హేమావతితో, ఆమె కుటుంబసభ్యులతో స్నేహం చేసి, మెల్లమెల్లగా హేమావతిని మాలిమి చేసుకుంది. ఆమెను రాజు కోరికకు ఒప్పించింది. ఆ రాత్రి హేమావతి రాజు వద్దకు బయలుదేరుతూ, విష్ణుదాసుడు పెంచుకొన్న హంసకు తాను వెళుతున్న పనిని చెప్పింది. ఇల్లాలు తన నియతి తప్పటం తప్పు అని పురాణాలను ఉదాహరించి చెప్పింది హంస. హేమావతి హంసను కోపంగా చూసింది. మొదటికే మోసం వస్తుందని అనుకొని కాబోలు హంస ‘అందమైన యువకులు ఎవరో ఒకరితో కాక రాజుతో (ఆధికారంలో ఉన్న వారితో అనిభావం) పొందు ఎందుకు కోరుతావు, అది ప్రమాదకరం సుమా అని చెప్పింది. ఆ భయం కూడా పని చెయ్యకపోయినప్పుడు – ఆకలి ఆత్రంతో ఏతాముకు బిగించిన చర్మపు తాడు కొరికి చచ్చిన నక్క కథను చెప్పి, సహజాతాలను తీర్చుకోవటంలో విచక్షణను ఉపయోగించకపోతే చాలా ప్రమాదం అని హెచ్చరించింది. ఇన్ని చేసినా సరియైన మార్గానికి రాదలచని హేమావతిని ఇక సూటిగా కాక, సామోపాయంతో మంచి మార్గాన పెట్టే ప్రయత్నం చేసింది హంస. విష్ణుదాసుడు తిరిగి వచ్చే వరకు, ఇరవై రాత్రులపాటు చెప్పిన కథ చెప్పకుండా, ‘ఉపపతులతో కూడిన ఇల్లాళ్ళు – వారు ఎదుర్కొన్న సమస్యలను చెప్పి, ఒక్కొక్క కథ ముగింపులో హేమావతిని ‘నీవైతే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటావు’ అని ప్రశ్నిస్తుంది. హేమావతి తెల్లబోయి, హంసనే జవాబు చెప్పమంది. ఇలా ఇరవై రాత్రులు గడిచాక, హేమావతికి తాను చెయ్యబోయే పనిలోని ప్రమాదం, తన తెలివితేటలకు గల పరిమితులు తెలిసివచ్చాయి.

తే. కథలు రేల్‌ తెల్పుటయెకాదు కరుణబ్రోద్దు

పోనియపుడెల్ల రాయంచ పూని చెప్పి

నట్టి నయవాక్యముల చేతనైన సన్మ

నీష హేమవతీ మంజుభాష యపుడు. 5-363

క. పరపురుష సంగమం బిహ

పరసుఖ దూరంబు గాన బాతివ్రత్య

స్ఫురణగల పతులు మదిగోఁ

ర రటంచును నిశ్చయించి ప్రమదం బెసఁగన్‌. 5-364

ఇంతలో భర్తరానూ వచ్చాడు. తన పరిమితులను తెలుసుకొన్న హేమావతి భర్తకు అనుకూలంగా మెలగి మంచి దాంపత్య జీవితాన్ని గడిపింది. ఆ తరువాత రాజు చిత్రభోగుడు కూడా తన తప్పును గ్రహించాడు. ఇలా ప్రజలకు ఏది ఆకర్షణీయంగా ఉంటుందో దాన్ని మాత్రమే కథల రూపంలో చెప్పాడు కవి. ‘ప్రొద్దుపోనియపుడెల్ల చెప్పిన నయవాక్యాలు’ ఏవో మనకు తెలియదు. బహుశ ఆ బోధనలు ప్రజాబాహుళ్యానికి ఇంపుకావని కవి పరిహరించి ఉండాలి.

ప్రధాన కథానాయిక హేమావతి వ్యక్తిత్వం

ప్రధాన కథానాయిక హేమావతి భర్త ‘విష్ణుదాసుఁడను పేరుకలవాడు, గలవాఁడు, పెద్దవాడు’. ఇక్కడ పెద్దవాడు అంటే సంఘంలో మంచి స్థానం కలవాడు అని అర్థం. హేమావతి అత్తమామలు సంతోషపడేటట్లుగా సంసారాన్ని నిర్వహిస్తోంది. ఆమె బంధుసంఘాలను దయతో చూసింది. ఆమె నిర్వహణలో దాసదాసీజనం విశ్వాసం కలిగి ఉండేవారు. ఏలోటులేని ఉన్నత కుటుంబం. ఇంత పెద్దింటి ఇల్లాలైనప్పటికి హేమావతి ముగ్ధ. చిన్నపిల్ల, బాల్యచాపల్యం వదలనిది. అందువల్లనే హేమావతి రాజదూతిక హేలపెట్టిన ప్రలోబాలను లోబడి రాజువద్దకు బయలుదేరుతుంది. మొదట ఆమెలో సంఘర్షణ, ఆత్తమామలు ఏమనుకుంటారో, బంధుజనం ఏమనుకుంటారో అనే సందేహం కనిపిస్తాయి.

”తే. అనిన హేమావతికి నిట్టులనియె హేల

రేపటికి నేఁటి ప్రాయంపుటేపు గలదె?

మోహమెక్కొనఁ జక్కని ముద్దుజాణ

యొకని బిగికౌఁగిఁటను జేర్చి యుండవలయు. -100

క. ఎక్కడి మగఁడెక్కడ సఖు

లెక్కడి నీయత్తమామ లెక్కడి చుట్టా

లెక్కొలఁది దొడ్డకొంచెము

లెక్కింపకు మరునిహావళిన్‌ బడువేళవ్‌.-101

ఇలా చెప్పిన హేల మాటలకు ఆమె లొంగిపోయింది. ఆమె వ్యక్తిత్వం దృఢమైనది కాదు అనటానికి ఇదే నిదర్శనం. ఆమె భర్తకే కాక హేమావతికి కూడా హంస ఆప్తమిత్రం. అందుచేత ఆమె చక్కగా అలంకరించుకొని రాజు వద్దకు బయలుదేరుతూ హంసవద్ద నిలచి తాను తలపెట్టిన పనిని తేలిపింది.

తే. తనదు ప్రాణంబు దైవంబు తల్లితండ్రి

యనుచుచెలిఐన యలరాజహంసమున్న

దివ్య నవరత్న ఖచితదేదీప్యమాన

కనకపంజరమక్కింత గదిసినిలిచె. 1-122

చ. నిలిచి దరస్మితంబయిన నెమ్మొగమించక వంచి యాత్మఁదాఁ

దలఁచినకార్యమెల్లఁ బ్రమదంబునఁదిన్నని కల్కిపల్కులం

దెలిపిన రాజహంస సుదతీమణిఁగన్గోనిపక్షయుగ్మముం

దలఁగదలించి యందుకు మనంబునఁజింతిలి యప్పుడిట్లమన్‌. 1-123

ఇలా హంసకు తన మనోభావాన్ని చెప్పటంలోనే హేమావతి ముగ్ధత్వం కనిపిస్తోంది. రాజు వద్దకు బయలుదేరిన హేమావతికి హంస ధర్మాచరణ గూర్చి ఎంత చెప్పినా వినకపోవటంలో ఆమెకు ఉన్న చాపల్యం, అపరిణత మనస్తత్వం, సాధారణంగా కౌమారంలో

ఉండే ‘వద్దన్న పనినే చేయాలనే’ తలతిక్క బయటపడుతుంది. హంస మాటలు ‘నారాచములు’గా అనిపించాయి హేమావతికి. అయినా హంస చెపుతున్న కథలపట్ల ఆసక్తితో ప్రతిరాత్రి చెవియొగ్గి వినటంలో ఆమెకు ఉన్న బాల్యచాపల్యం కూడా కనిపిస్తోంది. హంసను బ్రతిమాలి కథలను చెప్పించుకొంటుంది. రాజు పట్ల ఆమెకు కలిగినది పట్టరాని కాంక్షకాదు. హేలమాటల ప్రభావం వల్ల ఆమెకు కుతూహలం మాత్రమే కలిగింది ఆని అనిపిస్తుంది. ఆమెకు మొండితనం కూడా లేదు. హంస చెప్పినమాట వినవలసిన అవసరం ఇల్లాలిగా ఆమెకు లేదు కాని, ఆమెకు, హంసకు గల అనుబంధాన్ని కవి ముందుగానే స్థిరపరచి చెప్పి ఉన్నాడు. అలాగే ప్రతికథ వద్ధ ఆమె ఆలోచనలో పడటం ఆమె విచక్షణా శక్తిని తెలియజేస్తోంది. ఈ విధంగా హేమావతి పాత్రలో మానసిక పరిణామాన్ని ప్రతిభావంతంగా, సహజసిద్ధంగా చిత్రించాడు నారాయణామాత్యుడు.

ఇక మిగిలిన కథలలో స్త్రీలందరూ ప్రౌఢలే! గొప్ప సమయస్ఫూర్తి కలవారే. 1. ఆసహాయుని భార్య హేమరేఖ, ఒక వైద్యునితో కూడి ఉండి భర్తకు దొరికిపోయింది, తనకు కడుపునొప్పి వస్తే అతడు చికిత్సచేసి బ్రతికించాడని చెప్పి, అతనికి భర్తతో సత్కారం కూడా చేయించింది. 2. తొగటసెట్టి భార్య, నేర్పుగా, ‘స్నానానికి వెళుతూ భర్త కంఠధ్వని విని ఆదరాబాదరాగా వచ్చా’నంటూ, భర్త కళ్ళుమూసి, ప్రియుని తప్పించింది. 3. గొల్లవాని భార్య మంజుల, భర్త ఎదురుగానే ప్రియుని కౌగలించుకొని, దెయ్యాలమర్రిచెట్టును చూసి తాను భయపడగా ఆతడు భయం తీరుస్తున్నాడని బొంకింది. 4. హరిశర్మభార్య భాస్వతి, కూడా భర్త ఎదురుగానే ప్రియుని కౌగలించుకొని అతడు తన మేనమామ కొడుకని చాలా కాలానికి కలిశాడని చెప్పి తప్పించుకుంది. 5. కంసాలి భద్రకారుని భార్య శుభవాటి, భర్త శిష్యునితో గ్రంథం నడుపుతూ, దొరికిపోయినప్పుడు, శిష్యుడు భర్త వద్దకు తీసుకొనిపోవలసిన త్రాసు త్రాళ్ళుతెంపి, అతడు పనికిమాలిన వాడని, తెగిపోయి త్రాసు ముళ్ళువేసుకొంటూ కూర్చున్నాడని అబద్ధం చెప్పింది. 6. ధనచిత్తుడనే వైశ్యుని భార్య వసుమతి. ఈ దంపతులిద్దరూ ఒకరికొకరు కట్టుబడనివారే. పొరపాటుగా చీకటిలో కాళికాలయం వద్ద ఒకరికొకరు తారసపడ్డారు. వెంటనే ఆమె తనగోడును తల్లికి చెప్పుకొన్నాననీ, ఇప్పుడే తనభర్త తనను కలుసుకొంటాడని ఆమె చెప్పిందని అసత్యం చెపుతుంది. ఆమెను రక్షించేందుకు పొదలలో దాగిన ప్రియుడు కాలికలా సత్యం అని పలికి ఒప్పించాడు. ఈ కథలో భర్త తన ప్రవర్తనను ఆ సంఘటన తరువాత మార్చుకొన్నాడని చెప్పటం గమనార్హం. 7. చిత్రఘమని భార్య వాచాలి, చీకటిలో ప్రియుని కోసం వెళుతూ భర్తకు దొరికిపోయింది. తప్పిపోయిన పిల్లవాడిని వెతుకుతున్నాను అని ఆబద్ధం చెప్పి, అతన్ని వీధుల వెంట పరిగెత్తించింది. 8. భూతవైద్యుని భార్య, భర్తను చూసి పారిపోతున్న ప్రియులను అతడు వైద్యం వల్ల వదిలించిన భూతాలే అవి అని నమ్మబలికింది. 9. చండశర్మ పెద్దభార్య, అర్థరాత్రి భర్తరాగా, ప్రియుని తలుపుమూలకు నిలబెట్టి, భర్తకు సవినయంగా స్వాగతం చెప్పి, ‘ఇవాళ వీలుకాదు, నువ్వు రేపురా సఖీ’, అంటూ చీకట్లోకి ప్రియుడిని సుఖంగా సాగనంపింది. 10. శివదత్తుని భార్య విశాల, భర్త రంగులాడి అని తిట్టడం వల్ల అతని ఆమోఘవాక్కు ఫలించి ఇలా తయారయ్యాను అని చెప్పిమెప్పించి, పతివ్రతగా దీవించమని కోరింది. 11. శఠుని భార్య సుఖమతి, జోతిష్యునితో సరసమాడబోతూ, అనుమానంతో అటకమీద దాగి ఉన్న భర్త ఉనికిని గమనించి, తనభర్త కష్టాలను ఏకరువుపెట్టి అతడు ఎప్పుడు వస్తాడో చెప్పమని ప్రియుని అడిగి, ప్లేటు ఫిరాయించింది. అతడుకుడా ఆమె సైగ గమనించి ‘ఇప్పుడే’ వస్తాడని జోస్యం చెప్పాడు. 12. హిరణ్యగుప్తుని భార్య హస్తిని, భర్తకు పన్ను కట్టడమంటే కష్టం అని తెలుసు నుక, సుంకరి వచ్చి అతనికోసం అరుగు మీద పడుకొన్నాడని ముసుగులోని ప్రియుని చూపింది. భర్త ఆ రాత్రికి ఇంటికి రాక పారిపోయాడు. 13. రెడ్డిసాని సత్యకేశినికి ఇద్దరు ప్రియులు. బంట్రోతు, వైశ్యుడు. ఒకరు ఉండగా మరొకరు రాగా, ఒకరిని దాచింది. అప్పుడు భర్తరాగా బంట్రోతును వదరుతూ వెళ్ళమని చెప్పి, భర్త ఆడిగినప్పుడు, వైశ్యుని తరుముతూ బంట్రోతు రాగా, వైశ్యుడు తమ ఇంట దూరి దాగి ఉన్నట్లు చెప్పింది. రెడ్డి తాను వైశ్యుని రక్షించినట్లుగా భావించి అతనికి ధైర్యం చెప్పి పంపించాడు. 14.బెస్తవాని భార్య మచ్చెకంటి, ప్రియునితో పాటు ముసుగులోనుండి, మారుగొంతుతో ‘మేము యాత్రికులము, ఈ రాత్రికి తలదాచుకున్నాము’ అని చెప్పింది. భర్త లోపలికి వెళ్ళగానే, అతని వెనుక ఇంటిలోపలికి నీటిబిందెతో వెళ్ళి, ఆలస్యం చేసినందుకు అతనిపై ఆలిగింది. 15. కుమ్మరి భార్య రూపసేన, ప్రియునితో కూడి ఉన్నప్పుడు భర్త వచ్చాడు. ఆమె దున్నపోతు తలుగు విప్పి హడావుడి చేసి, దాన్ని అదుపుచేసేందుకు తెరువరి సాయం వచ్చాడని బొంకింది. 16. బలిజెసెట్టి భార్య విహారి, 17. ఆమె కోడలు, వీరిద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు ప్రియులను ఇంటికి తెచ్చుకొన్నారు. కోడలు ‘భార్య భర్తల ఆన్యోన్యత కలిగిస్తాడని తెలిసి ఇతడిని రప్పించాను, ఆ ప్రక్రియకు సహాయం చేయమని అత్తగారినే అడిగింది. నేనూ అందుకే వైద్యుని పిలిచాను అని అత్త దిద్దుకొంది. ఇద్దరు విటులూ వెళ్ళిపోయారు. ఆత్తాకోడళ్ళకు ఒకరిగుట్టు మరొకరికి తెలియలేదు. 18. గాండ్లసెట్టి భార్య మణిచిత్రిణి, మేకపోతును పట్టుకొనిపోయే వ్యక్తితో కూడి ఉండి, భర్త వచ్చే సమయానికి మేకను విడిచి, పట్టుకో పట్టుకో అని అంటుంది. భర్త మేకపోతును పట్టి వ్యక్తికి ఇచ్చి సాగనంపాడు 19. మంత్రి కొడుకు ఇద్దరు భార్యలు సువర్ణ, 20. సుప్రభ మంత్ర సహాయంతో ఉపవనంలో ప్రియులతో సుఖిస్తూ, ఒక మూలిక కోసం భర్త అక్కడకు రాగా ‘మేము నీ భార్యలం కాదు, వారి పోలికలతో ఉన్న వనదేవతలం” అని అబద్ధం ఆడారు. అతనికి అనుమానం రాకుండా మంత్ర సహాయంతో సమయానికి ఇల్లు చేరారు.

ఈ కావ్యంలో మొత్తం ఇరవైమంది దాంపత్య నియతి తప్పిన స్త్రీల కథలు ఉన్నాయి. హేమావతిని కూడా కలుపుకుంటే ఇరవై ఒక్కమంది స్త్రీ పాత్రలను చిత్రించాడు అయ్యలరాజు నారాయణామాత్యుడు. ప్రతికథలోనూ స్త్రీ ఎవరితోనో వ్యభిచరించటం భర్తకు పట్టుబడటం సమయస్ఫూర్తితో తప్పించుకోవటం జరుగుతూ ఉంటుంది. ఒకే విషయాన్ని ఇరవైసార్లు ఆసక్తికరంగా చెప్పటమెలా? ఇక్కడే అయ్యలరాజు నారాయణామాత్యుని ప్రతిభ కనిపిస్తుంది. ఒక్కొక్క స్త్రీది ఒక్కొక్క ప్రతిభగా చూపుతాడు. అందుకే ఈ కావ్యాన్ని పరిష్కరించి పీఠిక రచించిన శ్రీ. సి.వి.సుబ్బన్న శతావధాని ఇలా అన్నారు. ‘బుద్ధిచాతుర్యము, దానిమించిన సాహసము, దానిని మించిన కామము, స్త్రీ యందు భాసించు తీరులు చూపినాడు. అవే కథలు. ఏదో యొక విపత్తు పుట్టిమునిగినట్లు తటస్థించుట, బుద్ధిశక్తిచే దానిని తేలికగా దాటుట కథా సామాన్య లక్షణము.

వివిధ స్త్రీ పాత్రచిత్రణలో నారాయాణామాత్యుడు చూపిన చాతుర్యం, వైవిధ్యం

ఈ కథాకావ్యంలో హేమావతి ఒక్కతే ముగ్ధ. ఇతరులందరూ ప్రౌఢ నాయికలు. వీరికి సమయస్ఫూర్తి, ధైర్యం, తెగువలతో పాటు, భర్తల బలహీనతలను చక్కగా తెలుసుకొని అందుకు తగినవిధంగా ఆటాడటం చూడగలం. భర్తల మానసికస్థితిని అంచనా సరిగా వేసి, వారి ప్రవృత్తి, వృత్తులను పొగడటం ద్వారా చల్లబరచటం, (విశాల కథ, భూతవైద్యుని కథ) పన్నులు చెల్లించక భయపడే భర్తను సుంకరి వచ్చి నిద్రిస్తున్నాడని చెప్పి బెదిరించటం (హిరణ్యగుప్తుని భార్య హస్తిని కథ) భర్త పారిపోవటం, పిల్లలపై ప్రేమ ఉన్న భర్తను పిల్లవాడు ఇంటికి రాలేదని వెదకుతున్నానని చెప్పి, తన ప్రియుని నుండి అతని దృష్టిని మళ్ళించి మరపించటం (చిత్రఘనుని భార్య వాచాలి కథ) ఇవన్నీ ఆ స్త్రీలకు గల మనోవిశ్లేషణా చాతుర్యాన్ని, దాన్ని తమ భద్రత కోసం ఉపయోగించుకొనే తెలివితేటలను తెలియజేస్తాయి.

హంస వింశతి కథపై ఒక అసమంజస వ్యాఖ్య

‘తెలుగునాట మహిళల ఉద్యమం: విమర్శనాత్మక అంచనా’ అనే వ్యాస సంకలనాన్ని కాత్యాయనీ విద్మహేగారి సంపాదకత్వంలో కేంద్రసాహిత్య ఆకాడమీ వారు 2009లో వెలువరించారు. ఈ పుస్తకంలో ‘మహిళా ఉద్యమానికి దేశీయ మూలాలు’ అనే వ్యాసంలో కాత్యాయనీ విద్మహేగారు హంసవింశతి వంటి కథాకావ్యాలను గూర్చి ఇలా వ్రాశారు. ”భార్యలకు శరీరం, హృదయం వుంటాయన్న సంగతే పట్టించుకోకుండా వాళ్ళ కోర్కెలను, అనుభవ అకాంక్షలను, విస్మరించి ప్రవర్తించే పురుషుల ప్రవృత్తికి, ఆధికార స్వభావానికి కారణమైన దాంపత్య సంబంధ వ్యవస్థ పట్ల నిరసనను వ్యక్తం చేయటానికి విశాల ఏర్పరుచుకొన్న మార్గం దాంపత్యేతర సంబంధాలను ఏర్పరచుకొనటం. ఒక్క విశాల విషయంలోనే కాదు శుకసప్తతి, హంసవింశతి లాంటి కథాకావ్యాలన్నిటలోనూ దాంపత్యేతర సంబంధాలపట్ల ఆసక్తిగా పైకి కనబడే స్త్రీల ప్రవృత్తికి ప్రధానకారణం దాంపత్య సంబంధాలలోని ఆసమానతలు, ఆసంతృప్తులు, ద్వంద్వ విలువలు మొదలైన వాటిపట్ల ఏర్పడిన ఏహ్యత నుండి పుట్టిన నిరసన. తత్ఫలితం కుటుంబ వ్యవస్థాచట్రాన్ని ధిక్కరించాలనుకొనటం, ధిక్కరించేందుకు విఫలప్రయత్నాలు చేయటం. నిపుణిక చర్య, విశాల తెంపరితనం ఈ కోణం నుండి అర్థం చేసుకోవలసినవి.” – పుట 20

సమాజం ఎప్పుడూ ఆదర్శవంతంగా ఉండదు. ఇప్పటిలాగానే! అందులో వ్యక్తుల లోపాలు వ్యవస్థలో లోపాలు అన్నీ కలిసే పనిచేస్తూ ఉంటాయి. వ్యక్తుల వల్ల వ్యవస్థ, వ్యవస్థ వల్ల వ్యక్తులు ప్రభావితం అవుతూనే ఉంటారు. రచయిత చేయవలసిన పని ఏమిటంటే ఏ లోపాల ఫలితం ఎలా వుంటుందో ప్రజలకు తెలియజేయటం, అంతేకాని ప్రతిఒక్కరి సమస్యకు పరిష్కారాన్ని చెప్పటం కాదు. అదిసాధ్యం కూడా కాదు. పైన కాత్యాయనీ విద్మహేగారు చెప్పిన మాటల్లో స్త్రీల నియతి తప్పే ప్రయత్నాలకు ఆమె చెప్పిన కారణాలు ఒకవేళ నిజమే అయినా, ఆ పాత్రలు కుటుంబ వ్యవస్థా చట్రాన్ని ధిక్కరించాలనుకున్నాయనటం నిజం కాదు. అలాగే వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయనటం కూడా నిజంకాదు. వారు ఉపపతులతో సుఖించటంలోనూ, భర్తలను మభ్యపెట్టి తమ కుటుంబ భద్రతను కాపాడుకోవటంలో చక్కగా సఫతల పొందారు.

కుటుంబ వ్యవస్థా చట్రాన్ని ధిక్కరించాలనుకొనే స్త్రీ, కుటుంబాన్ని వదలి తన ఉపపతితో ఉండాయిస్తుంది, కానీ ఈ కథల్లో స్త్రీలు ఉపపతులతో చక్కగా ఆనందిస్తారు. భర్తకు దొరకిపోగానే నిపుణంగా కథ అల్లి తప్పించుకొంటారు. అందులో వారి నైపుణ్యమంతా చూపుతారు. ఇక్కడ ఆయా పాత్రలు తమ కుటుంబ భద్రతను ఒదులుకోకుండానే చాటుమాటు వ్యవహారాలను కొనసాగించాలనుకోవటమే స్పష్టంగా కనిపిస్తోంది. అది వారి నైతిక పతనాన్ని స్పష్టంగా చూపుతోంది. హంసవింశతి కథల్లో కాత్యాయనిగారు పేర్కొన్న విశాల కథను పరిశీలిస్తే వారి వ్యాఖ్య అసలే పొసగటంలేదు.

హంసవింశతి కథాకావ్యంలో పన్నెండవ రాత్రికథ ఇది. విశాలశివయోగి భార్య. ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయిన భర్త ఆమెను ఆదరించకపోగా, అతని దరిచేరాలని ఆమె చేసే ఏ ప్రయత్నం ఫలించదు. పైగా భర్త పొందుకోరిన భార్యను శివయోగి ‘రంకులాడి’ అని నిందిస్తాడు. ఆమె తన తోవ తను చూసుకున్నది. భర్తకు దొరికిపోయింది. అప్పుడు ఆమె తన సమయస్ఫూర్తితో, భర్త మానసిక బలహీనతతో ఆడుకుంటూ ఇలా ఆంటుంది- ‘నీకున్న నాక్ముద్ధి వల్ల ఇలా ఆయ్యాను. నువ్వు ఎప్పుడూ రంకులాడి రంకులాడి అన్నావు. అలాగే ఆయ్యాను. ఇప్పుడు మళ్లీ పతివ్రతపు కమ్మని దీవించు, మళ్లీ అలాగే ఆవుతాను. ఆలా చేయకపోతే ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటాను. నిందపడిన జన్మ ఎందుకు’ అని అఘాయిత్యం మాటలు మాట్లాడుతుంది. ఆమాయకుడైన ఆ శివయోగి, తన వాక్శుద్ధికి ఆశ్చర్యపోయి, స్త్రీ హత్యా పాపానికి భయపడిపోయి ఆమెను అలాగే దీవిస్తాడు.

”తే. ఆవెడు పతివాక్యమునకును, స్త్రీహత్య కులికి

తన వాక్సిద్ధికిని సద్భుతంబుఁజెంది

‘నీవిఁక మహా పతివ్రతా భావమహిమ

వెలయవే!” యనియోగి దీవించెఁబ్రీతి. 3-241

క. ఆటువలె దీవించుచు నె

ప్పటియట్లనె వేరులేని పక్షంబున న

జ్జటిలుండుండెను జెలియును

బటుముదమున మెలఁగుచుండె బడఁత్రుక! వింటే? -3-242

ఈ పరిణామంపై కాత్యాయనిగారి వ్యాఖ్యానం ఇలా ఉంది. ”రంకులాడి అని రోజా నన్ను నిరసించే వాడివి కదా! యోగివి! నీవాక్కే నాకు తాకింది. నీమాట ఆమోఘమైంది అది వృథాపోదు- అని సమాధానమిచ్చింది. అంతేకాదు ‘పతివ్రతాపటిమ వహించుమంటు’ పల్కు నీవాక్సిద్ధి వల్ల నేను పతివ్రతనే అవుతానని ఎదురు సవాలు వేసింది. తన వాక్సిద్ధి లక్షణాన్ని గురించి ఆశ్చర్యపడుతూ శివయోగి భార్యను పతివ్రతా భావ మహిమగా ప్రకాశించమని దీవించాడు. ఆ తరువాత ఆమెను ఆ వ్యథా ప్రవర్తించాల్సిన అవసరం కలగలేదు” – పుట 20.

దంపతుల మధ్య అసమానమైన ఆకాంక్షలు ఏ కాలంలోనైనా ఉంటూనే ఉంటాయి. ఈ కథలో శివయోగి తప్పు ఉందా అనే విషయం అలా ఉంచితే, అసలుకథలో జరిగిన విషయంలో కాత్యాయనిగారి వ్యాఖ్యానం పక్షపాతంతోకూడి ఉన్న మాట నిజం. విశాల ఆత్మహత్య చేసుకుంటానని చేసిన బెదిరింపు కాత్యాయనిగారి వ్యాఖ్యలో లోపించింది. తరువాత దీవించమని సవాలు చేయటం చేసుకుంటానని చేసిన బెదిరంపు కాత్యాయనిగారి వ్యాఖ్యలో లోపించింది. తరువాత దీవించమని సవాలు చేయటం ఏమిటో అర్థంకాదు. ఎవరైనా దీవించమని అర్థిస్తారు. విశాల ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అది కూడా సవాలు కాదు. ఎదుటివారి బలహీనతపై ఆడుకోవటమే! అతడు ఆధ్యాత్మిక సాధనాపరుడు కనుక అతని వాక్సిద్ధిపై నమ్మకాన్ని ప్రకటించటం ద్వారా అతని సాధనను పొగిడి, మంచి చేసుకున్నది విశాల. ”అతని దీవన ఫలిస్తుంది’ అంటే ఇక అతడు భవిష్యత్తులో కూడా ఆమె ప్రవర్తనను అతడు అనుమానించటానికి వీలులేదు. ఆమె మాటల్లో ఇంత జాణతనం ఉంది. ఇక ‘ఆ తరువాత ఆమెను అన్యధా ప్రవర్తించవలసిన అవసరం రాలేద’నటాన్ని కూడా కావ్యంలోని కందపద్యం సమర్థించటం లేదు. ఆ పద్యంలో యోగి భార్యపట్ల అనుకూలుడై ప్రవర్తించాడు, ఆమె తన ప్రవర్తనను మార్చుకున్నది అనే ఆర్థం రావటంలేదు. ”ఎప్పటియుట్లనే” అన్న పదం వారిరువురి ప్రవర్తనలో మార్పును చూపటానికి అడ్డంకిగా ఉంది. వారు ఏ మార్పూ లేకుండానే (ఎవరి మార్గంలో వారు) ఆనందంగా గడిపారు అనేది ఆ కందపద్యార్థం.

ఈనాటి సిద్ధాంతాలకు అనుగుణంగా అనాటి కథాకావ్యాన్ని వ్యాఖ్యానించే ప్రయత్నం వల్ల ఈ ప్రమాదం జరిగింది. విశ్వజనీనమైన ఒక కావ్యాన్ని ఏ సిద్ధాంతానికైనా అనుగుణంగా వ్యాఖ్యానించవచ్చు, కానీ ఆ కావ్యంలో అందుకు అనుగుణమైన అంతర్గత సాక్ష్యం కనిపించటం ముఖ్యం. ఒకవేళ అటువంటి సాక్ష్యం దొరకనప్పుడు, ఉన్న సాక్ష్యాలను వదలి, పొంతనలేని వ్యాఖ్యతో కథార్థాన్ని వేరొకవిధంగా పాఠకులకు అందించటాన్ని మాత్రం అంగీకరించలేం. ముఖ్యంగా కవిదాంపత్య ధర్మం వైపు నిలబడి ఉన్నట్లుగా మనకు ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నపుడు ఇటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆక్షేపణీయం.

అయ్యలరాజు నారాయణామాత్యుడు నిలబడినది ఎటువైపు?

ఈ కథలన్నీ సంప్రదాయక ఆదర్శపాత్రలను చిత్రించనందున, కథా వస్తువు వ్యవస్థా ధర్మానికి వ్యతిరేకమైనందున, కవి ఏవైపు నిలబడి ఉన్నాడు అనే విషయం అతను కథను సానుభూతితో చిత్రిస్తున్నాడా, గర్హిస్తున్నాడా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రింది పద్యాన్ని చూస్తే నారాయణామాత్యుడు ఎటువైపు నిలబడిఉన్నాడో తెలుస్తుంది.

నీ. ఆసువోపెడు దాని హస్తంబురీతిని

కుంబెదీసెడు దాని కొమరు మిగుల

జడచిక్కు దయ్యంబు చందంబునను జెట్టు

విడిచిన భూతంబు కడఁక తోడ

మద్దెలలో నెల్క మర్యాద, నర్థార్జ

నాసఁక్తి దిరుగు సన్న్యాసిమాడ్కి

వల్లంబు పోనాడు వైశ్యుని ఠేవను

గాలుగాలిన పిల్లి క్రమము దోప

తే. గంతుమాయల నుమ్మెత్తకాయ దినిన

వెర్రితెరగున వ్యసనంపు వెర్రివొడమి

చికిలి నెరవన్నె కాండ్రకు సివములెత్త

వెనసి చరియించు నీఁట నాహేమరేఖ. 1-220

హంసవింశతికథలు వ్యవస్థకు బాహ్యమైన ప్రవర్తనను ఖండిస్తున్నాయి. కవి నారాయణామాత్యుడు హంస స్థానంలో నిలబడి

ఉన్నాడు. సమాజంలో ఉన్న చెడునడతను ఆయన నిపుణతతో ఖండించాడు. సూటిగా బోధచేస్తే హేమావతికి నచ్చనట్లే ప్రజలకు కూడా నచ్చదు. ఇక్కడ హేమావతి చెడుతోవ పడుతున్న సమాజానికి ప్రతినిధి. హంస ఆ నడతను సరిచేసే హితునికి ప్రతినిధి.

అందువల్ల కవి ఖచ్చితంగా దాంపత్య ధర్మంవైపే నిలబడిఉన్నాడు. ఈ విషయం రచనలో ఎన్నో చోట్ల స్పష్టమైంది. చీకట్లు తెల్లవారుతున్నప్పుడు కావ్యంలో చేసిన పలు వర్ణనలు చూస్తే కవి ప్రతిభ అవగతమవుతుంది. ఇక్కడ గమనించ వలసిన అంశం ఏమిటంటే కవి సూర్యోదయ వర్ణన చేయడు. చీకట్లు తొలగిపోవటాన్ని వర్ణించాడు. ఇలా చేయటం ఉద్దేశపూర్వకంగానే చేశాడు. వైవిధ్యభరితంగా చీకట్లను తొలగటాన్ని వర్ణించటాన్ని నాయిక అజ్ఞానం తొలగిపోవటానికి ప్రతికగా గ్రహించినప్పుడు కావ్య గౌరవం ఇనుమడిస్తుంది. పాత్రల పేర్లను కూడా సాభిప్రాయంగా ఏర్పాటు చేశాడు కవి. చిత్రభోగుడు: చిత్రంగా భోగించటం, హేమావతి: బంగారం వంటి శీలం కలది అని అన్వయించవచ్చు. హంస: నీళ్ళను వేరుచేసినట్లు మంచిచెడులను వివరించి చెప్పింది.

ఆప్తమిత్రుడు ఎప్పుడూ మిత్రుని సరియైన తోవలో పెట్టాలని చూస్తాడు. హంసకూడా అలాగే చేసింది. హేమావతి మనసులో ‘పరాయివానితో పొందు’ అనే ముల్లు దిగింది. ‘సమధ మదన ప్రదరవేదనా దోదూయమానంబైన దీని మానసంబు సామంబునం గాని చక్కంబడదని’ తలచిన హంస అటువంటి కథలనే చెప్పి ఆ ముల్లును ముల్లుతోనే తీసివేసింది. ఇక్కడ హంస హేమావతి మనసు ఎలా పని చేస్తుందో అంచనా వేసి దానికి తగిన కథలను నేర్పుతో కూర్చింది. ముందుగా ఆమె అందాన్ని, అలంకరణను పొగిడి ప్రసన్నం చేసుకుంది. వద్దు అన్న పనిని చేయటం సాధారణ మనస్తత్వం కాబట్టి, ‘వెళితే వెళ్ళు, కానీ నీకు ఫలానా కథానాయికకు ఉన్నతెలివి, సమయస్ఫూర్తి, నేర్పు ఉన్నాయా’ అంటూ ఆమెను ఆలోచనలో పడవేసింది. అలాగే ఈ కథలన్నింటిలో ఉన్నది నాయిక పాత్రలు సమాజం అంగీకరించే నీతితప్పటం అనే వస్తువే అయినా, కవికంఠం వాటిని సమర్థించదు. రచనా విధానంలో ఏ మాత్రం సానుభూతి కనిపించదు, ఈ విషయాన్ని తప్పక గుర్తించాలి. నారాయణామాత్యుడు కావ్యాన్ని శ్రీరామాంకితం చేశాడు. అతడు ‘ఏకపత్నీవ్రతమ’నే శ్రీరామనీతికి వ్యతిరేకమైన కథను సమర్థించలేదు. కవి ఇక్కడ హంస పాత్రను నిర్వహించాడనే మాట విదితం. దూతిక సమాజంలో చెడును ప్రేరేపించే అనేకనేకాంశాలు అనుకోవచ్చు.

ఈ కథలోని వస్తువు ‘ఉద్వేగాల, సహజాతాల ఉధృతి – వాటిని సక్రమ మార్గంలో ఉంచటం’. ఇది మానవజాతికి నిరంతరం

ఉండే సమస్యే! బలహీనతలను భయంతో కాని భక్తితో కాని నియంత్రించవలసి ఉంటుంది. ఈ సమస్య వలన సుస్థిరమైన ధర్మానికి కానిపని చేసినవారు సమాజంలో కించపడటమే కాక మరెన్నో సమస్యలు ఉత్పన్నమౌతాయి. అయితే వాటినన్నింటిని ఏకరువుపెడితే కథలపట్ల ఎవరికీ ఆసక్తి ఉండదు. ఉద్వేగాలకు, సహజాతాలకు నియతి ఉండటం మానవులకు అవసరం. జంతువులకు వాటితో పనిలేదు. అవి సమాజంలో బ్రతకవు. ఈ రకమైన సంబంధాలు మానవుల సమాజ నిర్మాణంపై అనేక విధాలైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది మానవుల, శారీరక, మానసిక బలహీనతకు సంబంధించిన సమస్య. అందువల్ల శాశ్వతమైన సమస్య. ఈ కథాకావ్యంలో చిత్రించిన సమస్య సర్వకాలీనమైనది.

హంసవింశతికథల అధ్యయనంలోని ప్రాసంగికత:

నేటి సమాజంలో కుటుంబ జీవితాన్ని ”ఎక్కడి మగఁడెక్కడ సఖులెక్కడి నీయత్తమామ లెక్కడి చుట్టాలం’టూ నిరసించే రాజదూతిక పాత్రను పోసించే రచనలు వస్తున్నాయి. వారందరూ కలిస్తేనే సమాజం. సమాజంతో సంబంధంలేని మానవజీవితాన్ని ఊహించలేం. ఈ కాలంలో స్త్రీలు బాగా చదువుకుంటున్నారు. తద్వారా మంచి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని, గాడితప్పుతున్న ఎందరో పురుషులవలె కాక చక్కని ప్రవర్తనతో మెలిగి వారికి తోవచూపటం, జీవితం పట్ల స్పష్టమైన దృక్పథంతో, విచక్షణా జ్ఞానంతో, తమ జీవిత భాగస్వామిని ఎన్నుకోవటం, వివిధ కారణాలవల్ల జటిలమవుతున్న జీవితాన్ని స్ఫూర్తివంతంగా తమకు అనుకూలంగా మలచుకోవటం, ఆధునిక విద్య ఇచ్చిన తెలివి, ఆర్థికస్వాతంత్య్రాలతో జీవన సహచరుని, తన చుట్టుపక్కల వారిని సంస్కరించుకొని, కుటుంబ జీవనాన్ని మరింత ఆనందమయంగా మలచుకోవటానికి ప్రయత్నించటం, జీవితంలో ఎదురయ్యే చిక్కులను దాటి తెలివిగా గట్టెక్కటం వంటి ఆరోగ్యకరమైన ఆంశాలతో కథలు, నవలలు వెలువడవలసి ఉంది. కానీ అలా కాక – కేవలం ఒక్క లైంగిక స్వేచ్ఛ, కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేసి, బాధ్యతలను వదలిపోవటం, తరతరాలుగా ఎందరో పురుషులు చేస్తున్న కుటుంబ వ్యతిరేక చర్యలనే వారితో పోటీ పడి స్త్రీలు కూడా చేయటం వంటి వస్తువులను గ్రహించి ఆకర్షణీయమైన రచనలను ప్రచురించటం మాత్రమే కాక, కొత్త మతం లాగా ప్రచారం చేస్తున్న ఈ కాలంలో హంస వింశతి కథల అధ్యయనానికి ఎంతో సందర్భశుద్ధి ఉంది.

ఈనాడు సమాజంలో ఏ నియంత్రణలేని చలనచిత్రాలు, వెబ్‌సైట్లు, చివరకు సాహిత్యం అన్నీ వ్యక్తుల్లో ఆత్మ నియంత్రణ చేజారిపోయే అవకాశాలనే కల్పిస్తున్నాయి. ఆకర్షణీయ కథనంతో ఆరోగ్యకరమైన వ్యవస్థా నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ హంసవింశతిలో రాజదూతిక పాత్రను పోసిస్తున్నాయి.

జీవితంలో పెరిగిన వేగం ఆలోచనకు అవకాశం ఇవ్వటంలేదు. ధనసముపార్జనాదృష్టి అన్ని రంగాలను ఆవహించిన జాడ్యం అయింది. బలమైన వ్యక్తిత్వాన్ని కలిగిన వారి సంగతి ఎలా ఉన్నా అది ఇంకా ఏర్పడనివారు ఎంత చదువుకొన్న వారైనా, ఈ కథలోని హేమావతి వంటివారే. ఈ పరిస్థితుల్లో రచయిత కూడా, ఇతరులతో పాటుగా రాజదూతిక పాత్రను పోషించకుండా, హంస పాత్రలో నిలచి, సమాజానికి బోధ చేస్తున్నట్లుగా కాక, సామోపాయంతో, కావ్య సమ్మితంగా ఆ పరిస్థితిని నివారించగల స్థానంలో నిలబడవలసి

ఉంది. ఈ సందర్భంలో హంసవింశతి కథలను చర్చించుకోవటంలో ఎంతో సందర్భశుద్ధి ఉంది. అయ్యలరాజు నారాయణామాత్యునిలాగా, సరసకథలను చిత్రించినా చివరకు అవి మంచికే దారితీసేలా రచించటానికి ఈ అధ్యయనం నేటి రచయితలకు స్ఫూర్తినిస్తుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.