-ఉదయమిత్ర
క్యాష్ బ్యాగ్ భుజాన వేసింది మొదలు
క్యాష్ డౌన్ జేసిందాకా
బతుకంతా యుద్ధమే…
……………………..
మగ కండక్టర్ల నవ్వుల్ని దాటి
మగ డ్రైవర్ల చూపుల్ని దాటి
ఫుట్ బోర్డు మీద కాలుమోపుతుందో లేదో
కత్తుల కోలాటం మొదలు..
………………………
వేసిన మొదటి అడుగుమీద
వేయి సమ్మెట దెబ్బలు..
అయినా అనేక షార్కుల్ని తట్టుకుంటూ
మానవ సముద్రంలో ఈదాల్సిందేగదా…
…………………………….
చిన్నప్పుడు బస్సెక్కడానికి
ఎంతగ మారాము జేసేది?
పోరాడి, కిటికీ దగ్గర సీటు గెల్చుకుని
పరుగెత్తే దూరాల్నీ, పచ్చిక బయళ్ళను జూసి
మనస్సెంత ప్రవాహమయ్యేది?
పరీక్షల సమయాన
ఈ బస్సుకోసరం ఎంతగ పడిగాపులుగాసేది?
ఇప్పుడీ బస్సే తనకో పరీక్షాకేంద్రంగ మారుతుందనుకోలేదు.
క్రిక్కిరిసిన బస్సులో
అతికష్టం మీద ఈదుకుపోతుంటే
బస్సు నిండా ముళ్ళచూపులే…
చిల్లరకోసం
చిల్లరగా గొడవజేసే చిల్లర నాకొడుకొకడు
కావాలని రాసుకుపోయే
కంతిరి నాకొడుకొకడు
ఫుట్ బోర్డు దగ్గర
గప్‌చిప్‌ని స్లిప్పయే చెత్తిరి నాకొడుకొకడు.
బస్సు ఒక సర్కస్, ఒక జీవితం…
ఒక పాఠశాల, ఒక నిరంతర అలసట..
అనేక సున్నితత్వాలను
తొక్కుకుంటూ పోయే బుల్డోజర్..
……………………
చెమట విసుగులో
ఎన్ని నవ్వుల్ని భరించాలో?
ఎగదన్నే సంఘర్షణల్ని
ఎంతగ దిగమింగుకోవాలో?
పెగలిరాని గొంతుతో
ఎంతగ పెనుగులాడాలో?
……………………..
ఇదంతా జీవితమేనా?
పొట్టకూటికి జేరిపోతులాటేనా?
———————
అధికారమూ, మగదురహంకారంతో
పోరాడి, అలిసి
ఒళ్ళంతా హూనమయి
మనస్సొక పచ్చిగాయమయి
పడుతూ లేస్తూ ఇంటికి చేరుతుందో లేదో
కొండ చిలువలా వంటిల్లు నోరు తెరిచి
రెండు చేతులా ఆహ్వానిస్తుంది
చాలా బావుందండి..
కరాటె నేర్చుకో0డి. మగదురహంకారులను తన్నండి