శివరాణీదేవి ప్రేమ్‌చంద్
అనువాదం : ఆర్.శాంతసుందరి
(గత సంచిక తరువాయి భాగం)
1914 నాటి సంఘటన
రెండు మూడు రోజులు గడిచాక పండిట్‌జీ మూడు నాలుగు బుట్టల నిండా చేపలు పంపించాడు. ఆ సమయంలో మా ఆయన ఇంట్లో లేరు. చేపలు లోపల పెట్టించి, అవి తెచ్చిన వాళ్లకి చెరి పావలా డబ్బులూ ఇచ్చి పంపాను. అన్ని చేపల్ని ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఆయన వచ్చారు. బట్టలు కూడా మార్చుకోకుండా మా అమ్మాయిని ఎత్తుకుని లోపలికి రాగానే చేపల్ని చూశారు. ఇవెక్కడివి? అన్నారు.
ఇది పండిట్‌జీ పని! అన్నాను నవ్వుతూ.
ఆయన ఇలాంటి పని చేస్తాడని నేననుకుంటూనే ఉన్నా. అయినా ఇన్ని చేపలేం చేసుకుంటాం?
నాకూ అదే అర్థం కావటం లేదు. మీ బావగారింటికి కొన్ని పంపించండి. ఇంకా ఎవరికైనా పంపించినా సరే, అన్నాను.
సాయంకాలానికి ఎలాగైతేనేం ఆ చేపల్ని వదిలించుకున్నాం. అప్పట్నించీ, పండిట్‌జీ ఏ బజారులోనో ఈయనకి ఎదురుపడతాడేమో అని నేను హడిలి చచ్చాను. కానీ మా ఆయనకి దాన్ని గురించి బెంగ ఉన్నట్టే కనిపించలేదు. ఆయనకి ఎంత సేపు తను చేసే పని మీదే ధ్యాసంతా ఉంటుంది.
మళ్లీ సారి పండిట్‌జీ బస్తీకి వచ్చినప్పుడు ముగ్గురం ఆ చేపల గురించి చెప్పుకుని పగలబడి నవ్వుకున్నాం.
బస్తీలో ఉండగానే ఒకసారి ఆశ్వయుజ మాసంలో ఏనుగు తొండాలంత ధారలతో పెద్ద వర్షం పట్టుకుంది. దాని ధాటికి ఇళ్లు కూలిపోతున్నాయి. మేం నలుగురం ఇంట్లో ఒకే చోట కూర్చున్నాం, ఇల్లు కూలితే అందరికీ ఒకేసారి ప్రమాదం జరగనీ అనే ఉద్దేశంతో. కానీ మర్నాటికల్లా వర్షం తగ్గి నీటిమట్టం కూడా తగ్గిపోయింది. ఆయన స్కూలుకెళ్లారు. నిన్న మీరు రాలేదేం? అని అడిగాడు హెడ్‌మాస్టర్.
మా పేటలో వర్షం చాలా ఉధృతంగా పడిందండీ, అన్నారు మా ఆయన.
ఏం వానలో తడిస్తే మీరు ఉప్పులా కరిగిపోతారా?ఃః అన్నాడు హెడ్‌మాస్టర్.
లేదండీ, నేను ఉప్పుని కాను, కానీ మా ఇరుగు పొరుగు ఇళ్లన్నీ కూలిపోసాగాయి. మా ఇల్లు కూడా కూలిపోతుందేమోనని….ఃః
మీరుండి అది కూలిపోకుండా ఆపేవారా?
ఆపి ఉండేవాణ్ణి కాదు కానీ, నా కుటుంబంతో పాటు చనిపోయి ఉండేవాణ్ణి.
అయితే అందుకోసమే రాకుండా ఇంటిదగ్గర ఉండిపోయారా?
అవునండీ! అన్నారు మా ఆయన.
మా ఆయన ఇంటి పని చెయ్యటానికి ఎప్పుడూ వెనకాడేవారు కాదు. ఎప్పుడూ ఇంటి పనుల్లో నాకు సాయం చేస్తూ ఉండేవారు. ఆయన అలా చెయ్యటం నాకు తప్పుగా తోచేది. బైటిపనులు ఆయనవి, ఇంటి బాధ్యత నాదీ అని నాకనిపించేది. నేను చెయ్యవలసిన పనిని, ఆయన నేను నిద్ర పోతూండగా పూర్తి చేసేసేవారు, ఎందుకంటే మేలుకుని ఉన్నప్పుడు నేను ఆయన్ని ఆ పనులు చెయ్యనిచ్చేదాన్ని కాదు. ఈ విషయంలో నాకు అప్పుడప్పుడూ కోపం కూడా వచ్చేది. ఏదైనా పెద్ద పని ఉంటే, ఆయనకి తెలీకుండా నేనే ఆ పని చేసేసేదాన్ని. ఏళ్ల తరబడి జబ్బుగా ఉండటం వల్ల ఆయన చాలా నీరసించిపోయారు. అందుకే ఇంటి పనులు చెయ్యటంలో మా ఇద్దరికీ ఎప్పుడూ పోటీ ఉండేది.
నాలుగేళ్ల క్రితం సంగతి….. మళ్లీ బస్తీ
నాలుగేళ్ల క్రితం బస్తీలో ఎన్నికలు జరిగాయి. ఓటు వెయ్యటం విషయంలో ఈయనకీ మిగతా వాళ్లకీ కొంత ఘర్షణ జరిగింది. ఈయనకి కాంగ్రెస్ గెలవాలని ఉండేది. వాళ్లేమో ఒక బావి తవ్వించమని అడిగారు. బావి నేను మీకోసం తవ్విస్తాను. ఓటు మాత్రం వాళ్లకే వెయ్యండి. వాళ్లవల్ల మీకు మంచి జరుగుతుంది. అన్నారీయన. మా పేటలో ఎక్కువమంది వ్యవసాయ దార్లుండేవాళ్లు. ఒకే ఒక ఓటరు పొలందున్నే రైతు కూలీ. అతను మెంబర్‌గా నిలబడ్డాడు. ఈయన చెప్పినా కూడా ఎవరూ అతనికి ఓటు వెయ్యలేదు. ఈ విషయం ఊళ్లో అందరికీ తెలిసిపోయింది. కాయస్థులందరూ ఈయన దగ్గరికి పరిగెత్తుకొచ్చి, వీళ్లందర్నీ మీరు దూరంగా ఉంచితే మంచిది. మిమ్మల్ని అవమానించిన వీళ్లని వదిలిపెట్టకండి, అన్నారు.
ఏమిటా పిచ్చి మాటలు? నా జీవిత లక్ష్యమే వ్యవసాయదార్లని సంస్కరించటం. నా మాట వినకపోవటం వల్ల నష్టం వాళ్లకే కాని, నాకు కాదు. నే చెప్పిన మాట విననంత మాత్రాన వాళ్లు నాశనం అయిపోవాలా? అదేం న్యాయం? అసలు వీళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడాలనే కదా నేను కోరుకుంటున్నది? నేనివాళ వీళ్ళకి మంచి సలహా ఇస్తూ ఉండవచ్చు. రేపు మరొకరు వీళ్లకి మాయమాటలు చెప్పి మోసం చెయ్యరనేమిటి? గొర్రెల్లాగ ఎవరో చెప్పినట్టు వినటం, పనులు చెయ్యటం పబ్లిక్‌కి నిజంగా మంచిదేనంటారా? నాకిది సరైన పద్ధతి కాదని తోస్తోంది. వాళ్లు తమ బుర్రతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. అది ఎలాటిదైనా మంచిదే అని నా ఉద్దేశం. వాళ్లు కూడా ఇప్పుడిప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు. నా బావమరిది తన ప్రాంతానికి అధికారి. అతనికి ఓట్లు రాలేదు, అంత మాత్రాన తన ప్రాంతాన్ని నాశనం చేసేస్తాడా?ఃః అన్నారాయన.
చాలా మంది ఒకేసారి, మీకు అవమానం జరిగింది! అన్నారు.
ఏమీ కాలేదు. నేను నీచుడిలా ప్రవర్తించలేను, అన్నారు మా ఆయన.
ఇక ఏమీ అనలేక, వాళ్లందరూ వెళ్లిపోయారు. ఆయన లోపలికి వచ్చాక, ఏం జరిగింది? అని అడిగాను.
ఏం లేదు లేవోయ్! ఊళ్లో జనం ఓటు వెయ్యలేదని, కోపం, అంతే!
ఆ రోజుల్లోనే మరో సంఘటన జరిగింది. ఉదయం పూట ఈయన లోపల టిఫిన్ తింటున్నారు. వీధిలో ఇద్దరు పిల్లవాళ్లు కొటుకుంటున్నారు. బోలెడు మంది జనం మూగారు. ఇద్దరు పిల్లవాళ్లు కలియబడి కొట్టుకుంటున్నారు. మూడో పిల్లవాడు ఇద్దర్నీ విడదీయటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడు ఒక పిల్లవాడి అన్న. మా ఆయన, ఇద్దరు మగవాళ్లు కలిసి ఒక పిల్లవాడిని కొడుతున్నారని అనుకుని విడదీయటానికి ప్రయత్నిస్తున్న కుర్రవాడిని చాచి లెంపకాయ కొట్టి, ఃఃవెధవా, కొడతావా?ఃః అన్నారు. ఆ కుర్రాడు, ఃఃనేను వీళ్లిద్దర్నీ విడదీస్తున్నాను,ఃః అంటున్నాడు, సరిగ్గా అప్పుడే నేను కూడా బైటికొచ్చాను. ఈయన చేతిలో లెంపకాయ తిన్న పిల్లవాడి మీద నాకు జాలేసింది. ఏడవకు, బాబూ! తప్పు ఈయనదే, అన్నాను.
ఫరవాలేదండీ, తాతగారే కదా? అన్నాడు ఆ కుర్రవాడు.
మీకు ముక్కుమీదే ఉంటుంది కోపం, అర్థం పర్థం లేకుండా కోపగించుకుంటారు. పాపం ఆ కుర్రాడేం చేశాడని! అన్నాను.
వాడు కొడుతున్నాడనుకున్నాను.
అడిగి ఉండచ్చుగా? అసలు పరిస్థితేమిటో తెలుసుకోకుండా మీద పడి కొట్టటం ఏమిటి? ఆ చిన్న వెధవలిద్దరూ తుంటరివాళ్లు. పోట్లాటల ఆపేందుకు వెళ్లినవారు, అసలు విషయం ఏమిటో కనుక్కోవక్కర్లేదూ?
అవును, అక్కడే పొరపాటు జరిగిపోయింది. నాకు కోపం వచ్చేసింది.
అలా ఒప్పుకున్నంత మాత్రాన నేరస్థులు కాకుండా పోతారా?
అయితే నువ్వే వెయ్యి, ఏం శిక్ష వేస్తావో!
ఇక మీదట ఇలా తొందర పడనని మాటివ్వండి, అదే శిక్ష!
సరే ఇంకెప్పుడు అలా చెయ్యను, సరేనా?
ఆ తరవాత ఆయన బైటికెళ్లి చూస్తే, ఆ కుర్రవాడు ఒక రాయి మీద కూర్చుని కనిపించాడు. ఈయన వాడి దగ్గరకెళ్లి, వాడిని బుజ్జగించి, నా దగ్గరకి తీసుకొచ్చారు, వీడికి తినటానికేమైనా పెట్టు, అన్నారు నాతో.
ఆహా! కొట్టింది మీరు, తాయిలం ఇవ్వాల్సింది నేనా? మీరే ఇవ్వండి, అన్నాను.
అరె! వీడు నీకూ ఃమనవడేఃగా! అన్నారు ఈయన.
ఒకసారి నేనూ, ఆయనా బస్తీకి వెళ్తున్నాం. ఆయనకి ఒంట్లో బాలేదు. రాత్రి పూట ప్రయాణం. కడుపులో ఏదో బాధ ఆయనకి. మేం ముగ్గురం కలిసి ప్రయాణం చేస్తున్నాం. రైల్లో చాలా రద్దీగా ఉంది. ఆయన కోసం పక్క వేశాను. ఆయన పడుకున్నారు. ఆమ్మాయి కూడా నిద్రపోతోంది. ఇద్దరు ప్రయాణీకులు వచ్చి, ఃఃకూర్చోవటానిక్కూడా చోటులేక అవస్థ పడుతూంటే వీళ్లు చూడండి, హాయిగా పడుకుని ఉన్నారు!ఃః అన్నారు.
మీరు కూడా ఎక్కడో ఒక చోట కూర్చోండి! అన్నాను.
ఆయన్ని లేవమను! అన్నారు వాళ్లు.
ఆయన ఒంట్లో బాగాలేదు.
ఒంట్లో బావుండనప్పుడు ప్రయాణం ఎందుకు పెట్టుకున్నారు?
ఊరికే వాగకండి!
ఏం టిక్కెట్టు నువొవ్వక్కదానివే కొన్నావా?
సరే, ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చోండి, బాబూ!
ఈయన్ని లేపి, ఇక్కడే కూర్చుంటాం.
లేపండి, చూస్తాను!
ఒకడు ముందుకొచ్చాడు. నాకు కోపం వచ్చింది, జాగ్రత్త! చెయ్యి ముందు కొచ్చిందో, బోగీలోంచి తోసేస్తాను! అన్నాను. మా మాటలకి ఆయనకి మెలకువొచ్చింది. హడావిడిగా లేవబోయారు. మీరెందుకు లేవటం? అన్నాను.
లేస్తాలే. ఎందుకు ఊరికే వాళ్లతో తగువు?
ఈ వెధవలు మర్యాదగా చెపితే వినే రకం కాదు. మనుషులు కాదు వీళ్లు, రాక్షసులు! నేను మీ పరిస్థితి చెప్పాను, అయినా వీళ్ల మట్టి బుర్రల్లోకి ఎక్కలేదు. దాష్టీకం చేద్దామని చూస్తున్నారు. వీళ్లని రైల్లోంచి తోసెయ్యగలను, ఏమనుకున్నారో!ఃః నా కోపం చూసి వాళ్లు వెనక్కి తగ్గి, ఒక మూల నిలబడ్డారు. ఆ తరవాత ఎన్నో స్టేషన్లు వచ్చాయి కానీ వాళ్లు నిలబడే ప్రయాణం చేశారు. వాళ్లు రైలు దిగి వెళ్లిపోగానే మా ఆయన, నీకు ధైర్యం ఎక్కువ. నేనైతే నీలాగ వాళ్లని బెదిరించి ఉండలేక పోయేవాణ్ణి, అన్నారు.
కాసేపాగి, ఒక వేళ వాళ్లు నన్ను లేపి ఉంటే ఏం చేసేదానివి?
రైలు చక్రాలకిందికి విసిరేసేదాన్ని, వెధవలని!
అలా చేస్తే వాళ్లు చచ్చిపోయి ఉండేవాళ్లు. నీకు ఉరిశిక్ష పడేది!
ఉరిశిక్ష గురించి ఆలోచించటం తరవాత కదా? కోపంలో అవన్నీ ఎవరాలోచిస్తారు?
నీకు చాలా పొగరు!
నేనేమీ రచయితని కాను! అయినా వాడు నాతో అలా ప్రవర్తించాడేమిటి? నన్ను ఛాలెంజి చేశాడే! మీరు జబ్బుగా ఉన్నారనీ, నేను ఆడదాన్ని అనేగా వాడలా రెచ్చిపోయాడు? నేను ఘోషాలో ఉండే స్త్రీని కానని, వాడికి బాగా బుద్ధి చెప్పి ఉండేదాన్ని! వాడు మంచిగా నన్ను బతిమాలుకుని ఉంటే, మిమ్మల్ని లేపి కూర్చోపెట్టేదాన్నేమో!
ఏమైనా నీకు పొగరెక్కువ!
పొగరు లేదని నేనెప్పుడన్నాను?
గోరఖ్‌పూర్
ఆయనకి గోరఖ్‌పూర్‌కి బదిలీ అయింది. సామానంతా గోరఖ్‌పూర్‌కి బుక్ చేశాం. తీరా సామానంతా బుక్ చేశాక, గోరఖ్‌పూర్‌లో మాకు అలాట్ అయిన క్వార్టర్ ఒక రోజు ఆలస్యంగా దొరుకుతుందని తెలిసింది.
అక్కణ్ణించి ఇంటికొచ్చి, భోజనానికి కూర్చుంటూ, మనం ఇక రేపే బైలుదేరాలి. క్వార్టర్ ఖాళీ లేదుట. ఇవాళే ఉత్తరం వచ్చింది. అందుకే రేపే వెళ్లటం మంచిదనుకుంటున్నాను.
నాకు చాలా రోజులుగా ఒంట్లో బాగాలేదు. ఆయన ఎదురుగా కూర్చుని భోజనం చేస్తున్నారు.
అలా అయితే మీరు ఒకటి రెండు నెలలు సెలవపెట్టి ఇంట్లోనే కూర్చుంటారన్నమాట! అన్నాను.
అయితే ఇవాళే వెళ్దామంటావా?
అవును, ఇవాళే! సామాన్లు బుక్ చేసేశాం. నాకా ఒంట్లో బాలేదు.
సరే, పద! ఒక రోజు స్కూల్లోనే ఉంటే సరిపోతుందిఅవును, బైలుదేరండి!
మేం మూడు గంటలకి బైలుదేరి సాయంత్రం ఐదు గంటలకల్లా అక్కడికి చేరుకున్నాం.
మాకు స్కూల్లో బస ఏర్పాటు చేశారు. స్కూలు వరండాలోనే అందరూ మేష్టర్లూ, దాదాపు రెండు వందలమంది దాకా విద్యార్థులూ, మమ్మల్ని చుట్టుముట్టారు. ఒక మేష్టర్ నాకు జబ్బుగా ఉందని తెలిసి, మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. రేపు క్వార్టర్ ఖాళీ అవగానే నేను దాన్లోకి మారిపోతాను, ఎక్కడైనా నాకు ఒకటే! అన్నాడు.
రాత్రి పది గంటలకి ధున్నూ పుట్టాడు. అప్పుడు మా ఆయన వయసు ముప్పై ఆరో, ముప్పై ఏడో. మేష్టర్ ఈ వార్త వినగానే స్వయంగా మంత్రసానిని తీసుకురావటానికి వెళ్లాడు. గుమ్మంలో బాజా భజంత్రీలు మోగ సాగాయి. అందరూ పిల్లవాడు పుట్టాడన్న వార్త విని ఃఎక్కడా? ఎక్కడా?ః అంటూ గోల చెయ్యటం మొదలుపెట్టారు.
మర్నాడు పొద్దున్నే మేష్టర్ మాకు అలాట్ అయిన క్వార్టర్‌లోకి మారిపోయాడు.
ఆ ఇంట్లో మేం రెండు నెలలున్నాం.
ధున్నూ మూల నక్షత్రంలో పుట్టాడు. శాంతి చేసిన తరవాత స్టాఫ్ అందరికీ విందు భోజనం పెట్టాం. ఆ తరవాత మేం క్వార్టర్‌లోకి మారాం. అదే నెలలో ఆయన జీతం పది రూపాయలు పెరిగింది.
ఇక ఆయన బి.ఏ. పరీక్షకి కూర్చోవటానికి చదవసాగారు. మళ్లీ బస్తీలో లాగే రోజులు గడవసాగాయి.
ధున్నూకి ఎనిమిది నెలలప్పుడు, నాకు ఒంటిమీద పుండులేచింది. అదే సమయంలో మా ఆయన్ని అలహాబాద్‌కి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోమని ఆర్డర్ వచ్చింది. హెడ్ మాస్టర్ మా ఆయన్ని వెళ్లమనీ, దీనివల్ల ఆయనకి పది రూపాయలు జీతం పెరుగుతుందనీ, అందుకే ఆయన పేరు సూచించాననీ, అన్నాడు.
నేనెలా వెళ్తాను? మా ఆవిడకి కాలిమీద కురుపు లేచింది! అన్నారు మా ఆయన.
మీరు తప్పకుండా వెళ్లాలి. ఆవిడకి తగ్గిపోతుంది, లెండి,ఃః
అన్నాడు హెడ్‌మాస్టర్.
నాకు అది మామూలు కురుపులా కనిపించటం లేదు. రెండు నెలలుగా తగ్గ కుండా అలాగే ఉంది. నేనెలా వెళ్లేది?
మీకు ప్రమోషన్ వస్తుందనే చెపుతున్నాను, మరేమీకాదు.
ప్రమోషన్ కావాలన్న కోరిక నాకూ లేదు, ఆవిడకీ లేదు. మరి నేనెందుకు వెళ్లటం?ఃః
సరే మీ ఆవిడ విషయం నాకొది లెయ్యండి. మీ ఇల్లు మా ఇల్లూ నాకు వేరు వేరు కాదు!ఃః
సరే, ఇంతగా చెపుతున్నారు కాబట్టి వెళ్తాను.
ఆయన వెళ్లే లోపల నా కాలి మీది పుండు కొంత మానింది. అందుకే ఆయనతో, మీరు వెళ్లండి, అన్నాను. ఒక నెలరోజుల కోసం ఆయన వెళ్లారు. హెడ్‌మాస్టర్ గారు రోజూ వచ్చి చూసి పోతూండేవాడు.
గోరఖ్‌పూర్‌లో నేను దాదాపు నెల రోజులు ఒంటరిగా ఉన్నాను, కానీ ఎందుకో ఒంటరితనం అనిపించలేదు. స్కూల్లో అందరూ నన్ను తమలో ఒకదాన్నిగా చూసేవాళ్లు. ఆయన అందరితో ప్రేమగా ఉంటారు కాబట్టి, స్నేహితులు కూడా ఎక్కువే ఉండేవాళ్లు.
నెలరోజుల తరవాత ఆయన అలహాబాద్‌నించి వచ్చేశారు. ఆ తరవాత జీతం పది రూపాయలు పెరిగింది. మొత్తం డెభ్బై రూపాయలు చేతికి వచ్చేవి. ఆయన తమ్ముడు లక్నోలో చదువుతూ ఉండేవాడు. అతనికి పాతిక రూపాయలు పంపించేవారు. మిగతా నలభై ఐదు రూపాయల్లో అత్తయ్యా, ఆయనా, నేనూ, మా ఇద్దరు పిల్లలూ సద్దుకునే వాళ్లం. ఇంటి ఖర్చుల పద్దు నేను ఆయన పిన్నికే వదిలేశాను. మళ్లీ అదే సణుగుడు ప్రారంభమైంది. ఆయనకి వీటన్నిటి వల్లా చాలా అశాంతిగా ఉండేది.
ఒక రోజు నాతో, మిగతా పనులేవీ నువ్వు చేసినా, చెయ్యక పోయినా ఫరవాలేదు, కానీ, డబ్బు విషయాలు నా నెత్తినెయ్యకు! అన్నారు.
నేను హాస్యానికి అన్నట్టు, మీ బాధలన్నీ నా మీద రుద్దకండి. మీ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి! అన్నాను.
ఈ విషయాలన్నీ నువ్వు చూసు కుంటే, నేనింకేమైనా పనులు చేసుకోగలుగుతాను. లేకపోతే ఎప్పుడు చూసినా వీటితోటే కుస్తీపడుతూ ఉండిపోవల్సి వస్తుంది! అన్నారు.
ఎవరు చూసుకోగలరు, చెప్పండి?
నువ్వున్నావు కదా! కావాలంటే నీకు అణా పైసల్తో సహా నాకయే ఖర్చు వివరాలు చెపుతాను. కానీ నన్నీ ఉచ్చు లోంచి విడిపించు!
ఆయన తమ్ముడికి నెలనెలా పంపించే పాతిక రూపాయలు కాక, పైఖర్చులకి రెండు మూడు నెలలకోసారి డబ్బు పంపించాల్సి వచ్చేది.
నలభై ఐదు రూపాయలతో ఏం చేస్తాను? ఒక పక్క మీ పిన్నిగారి సాధింపులు ఉండనే ఉంటాయి!
ఏం చేస్తావో తెలీదు, నువ్వే చూసుకోవాలి. ఈపనికి నీకు ఇప్పుడే ముందుగా, కావాలంటే ధన్యవాదాలు చెపుతాను.
ఆయన బాధ చూస్తే నాకు జాలేసింది. సరే ఈ నెలనించీ అన్ని విషయాలూ నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి, అన్నాను.
ఆయన డెభ్బై రూపాయలూ తెచ్చి నా చేతిలో పెట్టారు. నేను వాటిని లోపల పెట్టాను. వాటిలోంచి డబ్బు తీసి వాడుతూ వచ్చాను. సరుకులు తీసుకురావటానికి ఆయనే వెళ్లేవారు. ఏదో విధంగా నెట్టుకు రాగలిగాం.
మే నెలలో ఆయన తమ్ముడు చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. రెండు నెలలు ఇంటిదగ్గరే ఉన్నాక, బస్తీలోనే, శిస్తులు వసూలు చేసే ఆఫీసులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అప్పుడు అతని ఖర్చుకింద ఇన్నాళ్లూ ఇచ్చిన పాతిక రూపాయలని నేను బ్యాంకులో వెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఆ డబ్బుని ఆయనకి బ్యాంకులో వెయ్యమని చెప్పాను. మొదటినెల నేను ఇచ్చిన పాతిక రూపాయలని ఆయన బ్యాంకులో వెయ్యకుండా, తన అల్మైరాలో పెట్టుకున్నారు.
నాకేం తెలుసు? మరుసటి నెల మళ్లీ డబ్బులిచ్చి బ్యాంకులో వేసి రమ్మనేసరికి, ఃఃఇంకా పోయిన నెల ఇచ్చిన పాతిక రూపాయలు నా దగ్గరే ఉన్నాయి, అన్నారు.
నేను విస్తుపోతూ, ఏమయింది? అన్నాను.
ఖర్చుకి చాలవేమో, అవసరమైతే వాడుకోవచ్చని ఉంచేశాను. కానీ ఈ నెల కూడా నువ్వు దాచమని ఇస్తున్నావు కాబట్టి, రెండు నెలలవీ కలిపి, ఇప్పుడే వెళ్లి బ్యాంకులో జమ చేసి వస్తాను, అన్నారు.
– ఇంకా ఉంది.