కారల్ చర్చిల్
అనువాదం : కె.సునీతారాణి
1938, సెప్టెంబర్ 3న లండన్లో జన్మించిన కారల్ చర్చిల్ కెనడాలో పెరిగారు. ప్రస్తుతం లండన్లో నివసిస్తున్న చర్చిల్ విస్తృతంగా నాటకాలు రచించారు. వాటిలో ఒకటి 1982లో మొట్టమొదటిసారిగా ప్రదర్శించబడ్డ టాప్‌గర్ల్స్ ముప్పై సంవత్సరాలుగా తన సామాజిక స్పృహను ప్రయోగాత్మక నాటకాలుగా మలుస్తూనే ఉన్నారు చర్చిల్.
ఎనభయ్యో దశకంలో ఇంగ్లండులో జరుగుతున్న స్త్రీవాద వివాదాల నేపథ్యంలో వచ్చిన ఈ నాటకం స్త్రీల జీవితాలను, విజయాలను, ఆకాంక్షలను అతి దగ్గరగా పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. టాప్‌గర్ల్స్ అనే ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీకి మానేజింగు డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన మర్లీన్ ఏర్పాటుచేసిన పార్టీతో ఈ నాటకం మొదలవుతుంది. విజయాల మాటున దాగిన విషాదాలను బయటకు తెస్తుంది. మర్లీన్‌తో పాటు పార్టీకి హాజరైన మిగతా స్త్రీలు వేర్వేరు దేశాలకు, వేర్వేరు కాలాలకు చెందినవాళ్ళు. కొంతమంది నిజంగా ఒకప్పుడు జీవించిన వ్యక్తులైతే మరికొందరు కళారూపాల్లో పాత్రధారులు. చివరికి మర్లీన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో లేక తమ విషాదాలను కలబోసుకుంటున్నారో తెలియని పరిస్థితిలోకి జారిపోతారు అందరూ. అసలు విజయమంటే ఏమిటి? ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా స్త్రీల పరిస్థితి మెరుగ్గా ఉండిందా అన్న ప్రశ్నలు సూటిగా సంధిస్తుంది రచయిత్రి.
పాత్రలు
ఇజబెల్లా బర్డ్ (1831-1904) – ఎడిన్‌బరొ నివాసి. 40-70 ఏళ్ళ మధ్య వయసులో విపరీతంగా ప్రయాణాలు చేసింది.
లేడీ నీజో (1258-?) – జపనీయురాలు. రాజు ఉంపుడుగత్తె , తర్వాత బౌద్ధసన్యాసిని. జపాన్ అంతా కాలినడకన పర్యటించింది.
డల్‌గ్రెట్ – బ్రూగెల్ గీసిన చిత్రం. ఆ చిత్రంలో ఓ స్త్రీ ఏప్రన్, కవచం ధరించి, కోటి స్త్రీలకు నాయకత్వం వహిస్తూ, నరకంలోని పిశాచాలతో యుద్ధం చేస్తూంటుంది.
పోప్ జోన్ – మగవాడిలా వేషం మార్చుకుని 854-856 జు.ఈ. మధ్య పోప్‌గా వ్యవహరించింది.
పేషంట్ గ్రిసెల్డా – విధేయురాలైన భార్య. ఛాసర్ తన ద క్యాంటర్‌బరీ టేల్స్‌లోని ఃఃద క్లార్క్స్ టేల్‌ఃఃలో ఈమె కథ చెబుతాడు.
సంభాషణాక్రమం
సాధారణంగా ఒకరి తర్వాత మరొకరు మాట్లాడతారు నాటకంలో. కానీ ఈ నాటకంలో –
1. ఒక పాత్ర మాటలు పూర్తికాకముందే మరొకపాత్ర మాట్లాడడ్డం మొదలుపెడితే ఇలా సూచించారు – /
2. ఒక్కోసారి ఒక పాత్ర మరో పాత్ర మాటలు పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉంటుంది.
3. ఒక్కోసారి అంతకుముందు మాట్లాడిన మాటలకు కాకుండా అంతకంటె ముందు మాట్లాడినదానికి కొనసాగింపుగా ఉంటుంది సంభాషణ. అలాంటప్పుడు గుర్తు జ వస్తుంది.
రంగం-1
రెస్టరెంట్ : తెల్లటి కవర్ పరిచిన టేబ్‌ల్ డిన్నర్‌కు సిద్ధంగా ఉంది. ఆరు కుర్చీలు. మర్లీన్, వెయిట్రెస్.
మర్లీన్ : అద్భుతం. అవును, ఆరు మందికి. ఒకరు ఆలస్యంగా వస్తారు. అయినా మేమేం ఎదురుచూడం. మొదలుపెట్టేస్తాం. చల్లగా దొరికితే ఫ్రాస్కటి ఒక సీసా ఇప్పుడే తీసుకురా.
వెయిట్రెస్ వెళ్ళిపోతుంది.
ఇజబెల్లా బర్డ్ వస్తుంది.
మర్లీన్ : ఇజబెల్లా, ఇటు.
ఇజబెల్లా: కంగ్రాచ్యులేషన్స్ మైడియర్.
మర్లీన్ : నిజంగా ఇదో ముందడుగు. పార్టీ చేసుకోవాల్సిన విషయం. సెలవు తీసుకోవడానికి టైం లేదు. నీలాగా దూరతీరాలకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ నేను బయటపడ్డం కష్టం. అసలు నువ్వు హవాయి ఎలా వదలగలిగావో నాకర్థం కాదు/ఎండలో అలా కూర్చునే ఉండిపోవా లనిపిస్తుంది. కాకపోతే
ఇజబెల్లా : అక్కడే ఉండిపోవాలని నేనూ అనుకున్నాను.
మర్లీన్ : కదలకుండా కూర్చోవడం నావల్లకాదు.
ఇజబెల్లా : వచ్చి నాతో ఉండమని నా చెల్లి హెన్నీకి కబురుపెట్టాను. హెన్నీ, జీవితాంతం ఇక్కడే ఉండి స్థానికులకు సాయం చేద్దాం అన్నాను. ఎడిన్‌బరొలో కంటె ఇక్కడ ఖర్చు తక్కువ. నువ్వు రమ్మంటే వస్తానని రాసింది హెన్నీ. కానీ నువ్వున్న చోటే ఉండడం నీకు మంచిదన్నాను. అక్కడి జీవితానికే ఆమె సరిపోతుంది.
మర్లీన్ : పాపం హెన్నీ.
ఇజబెల్లా : నీకు అక్కాచెల్లెళ్లున్నారా?
మర్లీన్ : నిజానికి, ఉన్నారు.
ఇజబెల్లా : హెన్నీ సంతోషంగా ఉండేది. చాలా మంచిది. బుజ్జిముండ. ఎప్పుడూ దాని మొహమే గుర్తొచ్చేది. కానీ నేను స్కాట్లండ్‌లో ఉండలేకపోయాను. ఎప్పుడూ కమ్ముకుని ఉండే ముసురంటే అసహ్యం వేసేది.
మర్లీన్ : అదిగో నీజో!
లేడీ నీజో వస్తుంది.
వైన్ తీసుకుని వెయిట్రెస్ వస్తుంది.
నీజో : మర్లీన్!
మ : మిగతావాళ్ళకోసం ఎదురుచూస్తున్నంత సేపట్లో కాస్త డ్రింక్ చెయ్యొచ్చు. ఎలాగైనా తాగాల్సిందే. వారమంతా ఒకటే పని.
వెయిట్రెస్ వైన్‌గ్లాసుల్లో పోస్తుంది.
నీ : ఎప్పుడూ మగవాళ్ళే ఎక్కువగా తాగేవాళ్ళు. నేను సేక్ అందించే అమ్మాయిల్లో ఉండేదాన్ని.
ఇ : నేను కూడా సేక్ జ తాగాను. ఘాటుగా ఉంటుంది. చిత్తడిలో రోజంతా పనిచేశాక సేక్ తాగితే వెచ్చగా ఉండేది.
నీ : ఓ రోజు రాత్రి మానాన్న మూడు రౌండ్లలో మూడుకప్పులు తీసుకుందా మన్నాడు. మామూలుగా అంతే. కానీ అప్పుడు రాజు మూడురౌండ్లలో మూడు కప్పులు అవాల్సింది పోయి మూడు రౌండ్లలో తొమ్మిది కప్పులు అన్నాడు. ఇంక మీరే ఊహించుకోండి. తర్వాత రాజు తను సేక్ కప్పు మానాన్నకిచ్చి ఈ వసంతంలో అడవిబాతులను తన దగ్గరకు రానివ్వ మన్నాడు.
మ : ఏం రానివ్వమన్నాడు?
నీ : పదో శతాబ్దపు కావ్యానికి సంబంధించినది. / మహారాజు గొప్ప పండితుడు.
ఇ : జపాన్ రాజేనా? / నేనోసారి మొరాకో రాజును కలిశాను.
నీ : నిజానికతను మాజీరాజు.
మ : కానీ అతను ముసలివాడేం కాదు కదా? / నువ్వు కలిశావా ఇజబెల్లా?
నీ : ఇరవైతొమ్మిదేళ్ళు.
ఇ : అబ్బా, అదో పెద్ద కథ.
మ : ఇరవై తొమ్మిదంటే అద్భుతమైన వయసు.
నీ : నాకప్పుడు పద్నాలుగేళ్ళే. అతనికేదో ఉద్దేశ్యం ఉందని తెలుసు. కానీ అదేమిటన్నది తెలీదు. ఎనిమిది పొరల గౌను పంపించాడు. నేనది తిప్పి పంపించాను. ఆ సమయం వచ్చినప్పుడు ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను. నా పల్చటిగౌను పూర్తిగా చిరిగిపోయింది. కానీ, ఆ రోజు ఉదయం అతను వెళ్ళేటప్పుడు కూడా / ఎర్రటి అంచున్న ఆకుపచ్చరంగు అంగీ.
మ : అంటే అతను నిన్ను రేప్ చేశాడా?
నీ : భారీగా ఎంబ్రాయిడరీ చేసిన ట్రౌజర్స్ వేసుకున్నాడు. అతని పట్ల అప్పటికే నా ఉద్దేశ్యం వేరైపోయింది. ఇబ్బందిగా అనిపించింది. లేదు, కాదు మర్లీన్. నేను అతనికి చెందినదాన్ని. చిన్నప్పట్నుంచీ నన్నందుకే పెంచారు. అతను దూరంగా ఉంటే నాకు దిగులేస్తుందని కూడా నాకు అర్థమైంది. అతను ఎప్పుడొస్తాడో తెలియకపోవడమన్నది క్రమంగా నన్ను మరింత కృంగదీసింది. అతని దగ్గరకు వేరే ఆడవాళ్ళను తీసుకుపోవడమన్నది నాకెప్పుడూ నచ్చేది కాదు.
ఇ : మా నాన్నగారు తప్పతాగి ఉండడం నేనెప్పుడూ చూడలేదు. ఆయనో మతాచార్యుడు. / యాభయ్యేళ్ళొచ్చాకే నాకు పెళ్ళయింది.
వెయిట్రెస్ మెన్యూ కార్డ్ తీసుకొస్తుంది.
నీ : మా నాన్నగారు దైవభక్తి గల వ్యక్తి. చనిపోయేముందు నాతో చెప్పారు. ఃఃరాజుకు సేవ చెయ్యి, గౌరవించు. ఒకవేళ ఆయన అభిమానాన్ని పోగొట్టుకుంటే చర్చి సేవలో ప్రవేశించుఃః అని.
మ : కానీ ఆయన చెప్పింది కాన్వెంట్లో ఉండమని, దేశమంతా తిరగమని కాదు.
నీ : మతాధికారుల్లో చాలామంది దేశదిమ్మరులే. మరి నన్స్ మాత్రం ఎందుకు తిరగకూడదు? నేను తిరగకూడదంటావా? / అయినా నేను మా నాన్నగారు చెప్పిందే చేశాను.
మ : లేదు లేదు. తిరగాల్సిందే. / చాలా గొప్పగా ఉంటుందనుకుంటాను. టేల్‌గ్రెట్ వస్తుంది.
ఇ : మా నాన్నగారు చెప్పినట్లు చెయ్యడానికి ప్రయత్నించాను.
మ : గ్రెట్, స్వాగతం. ఈమె నీజో. ఈమె గ్రెట్. /గ్రిసెల్డా ఆలస్యంగా వస్తుందని తెలిసింది. జోన్ కోసం ఆగుదామా? / డ్రింక్స్ తెప్పిద్దాం.
ఇ : హలో గ్రెట్! (నీజోతో మాటలు కొనసాగిస్తుంది) ఓ మతాధికారి కూతురి లాగా బ్రతకడానికి ప్రయత్నించాను. కుట్టుపని, సంగీతం, సంఘసేవా కార్య క్రమాలు. నా వెన్నెముకలో ఉన్న కంతిని ఆపరేషన్ చేసి తీసేశాక నేను చాలావరకూ సోఫాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కవిత్వం, హిమ్నాలజీ చదివాను. జిజ్ఞాస పెంచుకున్నాను.
నీ : ఓహో, నీకు కవిత్వమంటే ఇష్టమన్నమాట. ఎనిమిది తరాల కవులున్న వంశం నుండి వచ్చాన్నేను. మా నాన్న రాసిన ఓ కవిత / సంకలనంలో ఉంది.
ఇ : ఆడపిల్లనే అయినా మా నాన్న నాకు ల్యాటిన్ నేర్పించాడు. / కానీ
మ : మా స్కూల్లో ల్యాటిన్ లేదు.
ఇ : నిజానికి నేను శారీరక శ్రమకు తగినదాన్ని. వంట చెయ్యడం, బట్టలుతకడం, మరమ్మత్తు చెయ్యడం, గుర్రపుస్వారీ / పుస్తకాలు చదవడం కంటె కూడా బాగుండేది.
నీ : నువ్వు చాలా తెలివైనదానివన్నది మాత్రం నిజం.
ఇ : వింటున్నావా గ్రెట్? ఆరుబయట కఠినమైన జీవితం.
నీ : నా కఠినమైన జీవితం నాకు నచ్చిందని నేను చెప్పలేను. నాకు నచ్చిందల్లా రాజుకు ప్రియమైన వ్యక్తిగా ఉండడం / నాజూకైన పట్టుబట్టలు కట్టుకోవడం.
ఇ : నీకు గుర్రాలుండేవా గ్రెట్?
పోప్ జోన్ వస్తుంది.
మ : ఓ, జోన్ వచ్చేసిందా? థ్యాంక్‌గాడ్. ఇక ఆర్డర్ చెయ్యొచ్చు. అందరూ ఒకరికొకరు తెలుసు కదా? ల్యాటిన్ నేర్చుకోవడం, తెలివైన అమ్మాయిలుగా ఉండడం గురించి మాట్లాడుకుంటున్నాం కదూ? జోన్ బాలమేధావి. నిజంగా జోన్. పదేళ్ళ వయసులోనే నిన్ను కదిలించిందే మిటి?
జోన్ : దేవతలకు స్థూలద్రవ్యం ఉండదు కాబట్టి వాళ్ళు వ్యక్తులు కాదు. ఒక్కో దేవతదీ ఒక్కో ప్రత్యేకమైన జాతి.
మ : అదీ విషయం.
నవ్వుకుంటూ మెన్యూ చూస్తారు.
ఇ : అవును, నేను నా ల్యాటిన్ అంతా మర్చిపోయాను. మానాన్నే నా జీవితానికి మూలం. ఆయన పోయాక నేను దుఃఖంలో మునిగిపోయాను. నాకు చికెన్ / సూప్.
నీ : నిజమే. నువ్వు దుఃఖంలో మునిగిపోయావు. మా నాన్న ప్రార్థన చేస్తూ ఎండలోనే నిద్రపోయాడు. నేనాయన మోకాలి మీద తట్టి లేపబోయాను. ఃఃఏమవుతుందోఃః అన్నాడు. వాక్యం పూర్తిచేసేలోపే చనిపోయాడు. / ఒకవేళ చనిపోయేటప్పుడు
మ : ఎంత ఘోరం.
నీ : ఆయన ప్రార్థన చేస్తూ ఉండి ఉంటే నేరుగా స్వర్గానికి వెళ్ళేవాడు. / సాలడ్.
జో : ఏ జీవికైనా మరణమంటే తిరిగి భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోవడమే.
నీ : నేనాయన్ను తట్టి లేపకుండా ఉండాల్సింది.
జో : నరకమంటే సత్యాన్ని గుర్తించకపోవడమే. జాన్ ద స్కాట్ బోధనలంటే నాకు చాలా ఇష్టం. ఆయన కొంత అయోమయంలో ఉన్నట్లనిపించినా / దేవుడు, ప్రపంచం విషయంలో
ఇ : నేనలాంటప్పుడు దుఃఖంలో మునిగిపోయేదాన్ని.
మ : నేనీ మాంసం ఆర్డర్ చేస్తాను. నీకు గ్రెట్?
ఇ : నిజానికి నేను / చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ సభ్యురాల్ని.జ
గ్రె : బంగాళాదుంపలు.
మ : జనేను చర్చికి వెళ్ళి ఏళ్ళు దాటింది. / నాకు క్రిస్మస్ పాటలంటే చాలా ఇష్టం.
ఇ : చర్చికి వెళ్ళడం కంటె మంచి పనులు చెయ్యడమే ముఖ్యం.
మ : రెండు మాంసం ముక్కలు, ఎక్కువ బంగాళాదుంపలు ఉడికించినవి. కానీ నేను మంచి పనులు కూడా చెయ్యనే.
జో : క్యానలోనీ జ/ సాలడ్
ఇ : నిజానికి నేను ప్రయత్నించాను, కానీ అబ్బా. హెన్నీ మంచి పనులు చేసేది.
నీ : నా జీవితంలో మొదటిభాగమంతా పాపం / రెండో భాగమంతా పశ్చాత్తాపం.జ
మ : మొదట ఏం తీసుకుందాం?
గ్రె : సూప్.
జో : జనీకేది ఎక్కువ నచ్చింది?
మ:నీ ప్రయాణాలు ప్రాయశ్చిత్తాని కేనా? అవొకాడొ వినిగర్. నువ్వు / సంతోషంగా లేవా?
జో : నాకేమీ వద్దు. థాంక్యూ.
నీ : నిజమే. కానీ నేనేం సంతోషంగా లేను. / బాధగా అనిపిస్తుంది.
మ : వైన్‌లిస్ట్.
నీ : గతం గుర్తుకొస్తే. అది పశ్చాత్తాపమే అనిపిస్తుంది.
మ : ఏమో మరి.
నీ : అది కేవలం ఇంటిమీద బెంగ కూడా అయ్యుండొచ్చు.
మ : లేకపోతే కోపమా?
నీ : కోపం కాదు, లేదు. / కోపమెందుకు?
గ్రా: ఇంకొంచెం బ్రెడ్ తీసు కుందామా?
మ: నీకు కోపం రాదా? నాకొస్తుంది.
నీ : కానీ దేని గురించి?
మ : ఇంకో రెండు ఫ్రాస్కటి, ఇంకొంచెం బ్రెడ్.
వెయిట్రెస్ వెళ్ళిపోతుంది.
ఇ : జపాన్లో ఉన్నప్పుడు బౌద్ధమతాన్ని అధ్యయనం చెయ్యాలని ప్రయత్నించాను. కానీ నిరంతరం ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన పుట్టుక చావులు నాలో గాఢమైన విషాదాన్ని నింపాయి. కొంచెం ఉత్సాహంగా ఉండే విషయాలను ఇష్టపడతాన్నేను.
నీ : నేను నిరుత్సాహంగా ఉన్నానని కూడా అనలేను. ఇరవైఏళ్ళపాటు ప్రతిరోజూ నడిచాను.
ఇ : నా ఉద్దేశ్యం నడవడం కాదు. / బుర్ర గురించి.
నీ : అయిదు మహాయాన సూత్రాలను రాయాలని గట్టిగా అనుకున్నాను. / నీకు తెలుసా.
మ : మనందరికీ ఒకే రకమైన మతపరమైన నమ్మకాలున్నాయనుకోను. కార్యక్రమాలైతే ఉన్నాయి.
నీ : అవెంత పెద్దవో! నా బుర్ర కూడా ఉత్సాహంగానే ఉండేది. తలనొప్పి వచ్చేది.
జో : మత వ్యతిరేక కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉండడం మంచిది కాదు.
ఇ : ఏం మత వ్యతిరేకం? ఈమె చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌ను / మత వ్యతిరేకమంటోంది.
జో : కొన్ని చాలా ఆకర్షణీయమైన / మత వ్యతిరేక భావాలున్నాయి.
నీ : నేను క్రైస్తవమతం గురించి ఎప్పుడూ వినలేదు. ఎప్పుడూ / వినలేదు. అనాగరికులు.
మ : నేను క్రిస్టియన్ని కాదు. / బౌదు ్ధరాలినీ కాదు.
ఇ : దాని గురించి విన్నావా?
మ : అందరూ ఒకే మతాన్ని నమ్మనవసరం లేదు.
ఇ : పోప్‌తో కలిసి భోంచేయాలంటే మతాన్ని పక్కన పెట్టాలని నాకు ముందే తెలుసు.
జో : మతపరమైన వాదనలంటే నాకెప్పుడూ ఆసక్తే. కానీ నీ మతం మార్పించాలని నేను ప్రయత్నించను, నేనేం మిషనరీని కాదు. ఏదేమైనా, నేను కూడా ఓ మత వ్యతిరేకినే.
ఇ : తూర్పుదేశాల్లో కొన్ని అనాగరిక ఆచారాలున్నాయి.
నీ : అనాగరికమా?
ఇ : బీదవాళ్ళల్లో.
నీ : అయితే నాకు తెలీదు.
ఇ : మతపరమైన విషయాలంటే నాకెప్పుడూ తలనొప్పే.
మ : భోజనమొచ్చేసింది.
వెయిట్రెస్ మొదటి రౌండు భోజనం తీసుకొచ్చింది.
నీ : నన్ కాకపోతే ఆ స్థానాన్ని వదిలి ఎలా రాగలను? నాన్న చనిపోయాక నాకు మిగిలిందల్లా రాజు మాత్రమే. ఆయన అభిమానం కూడా పోయాక నాకింకేమీ మిగల్లేదు. మతమంటే శూన్యం. / నాలో మిగిలిందల్లా ఆ శూన్యానికి ధారపోశాను.
ఇ : బౌద్ధమతం గురించి నా అభిప్రాయం కూడా అదే. ఆధారాన్నివ్వదు.
మ : నీజో, వైన్ తీసుకో.
నీ : మీకెప్పుడూ అలా అనిపించలేదా? మళ్ళీ ఏదీ జరగదు. నేను చచ్చిపోయాను.
మీకందరికీ / అలా అనిపించే ఉంటుంది.
ఇ : నీ జీవితం అయిపోయిందని నువ్వనుకున్నావు. కానీ అయిపోలేదు.
నీ: అయిపోతే బాగుండుననిపించింది.
గ్రె : పాపం!
మ : నిజమే, నేను లండన్‌కు వచ్చిన కొత్తలో కొన్నిసార్లు, నేను అమెరికా నుండి వచ్చాక నాకలా అనిపించింది. కానీ కొద్దిగంటలసేపే.
ఇ : నలభైఏళ్ళ వయసప్పుడు జీవితం అయిపోయిందని నాకనిపించింది. / నేను
నీ :ఇరవయ్యేళ్ళూ అలా అనిపించిం దని నేనన్లేదు. ప్రతి నిమిషమూ కాదు.
ఇ : దయనీయంగా ఉన్నాను. ఆరోగ్యం కోసం ఓడమీద పంపిస్తే నా పరి స్థితి మరింత దిగజారిపోయింది. ఎముకల్లో నొప్పి, చేతుల్లో సూదులు, చెవుల వెనుక వాపు, ఇంకా అబ్బా, మూర్ఖత్వం. వణికి పోయాను. ఇదీ అని చెప్పలేని భయం. ఆస్ట్రేలియా నాకో దారుణమైన ప్రదేశంలాగా కనిపించింది. కసివింద చెట్లు మురుగుకంపు కొట్టేవి. / నా దగ్గర
నీ : నీకు ఇంటిమీద బెంగ పట్టుకుంది.
ఇ : హెన్నీ కోసం ఓ ఫోటో ఉండేది. అయినా అది పంపనని ఆమెకు చెప్పాను. నా జుట్టంతా రాలిపోయి, బట్టలన్నీ నలిగిపోయి పూర్తిగా పిచ్చిదానిలాగా, ఉన్నాది లాగా కనిపించేదాన్ని.
నీ : నేను కూడా ఖచ్చితంగా అలాగే ఉన్నాను, నన్ దుస్తుల్లో. నడక చెప్పులు అప్పుడే మొదటిసారి వేసుకున్నాను.
ఇ: ఇంటికి వెళ్ళాలని తపించి పోయాను, / కానీ ఏముందక్కడ? ఇళ్ళు
నీ : పదేళ్ళు వెనక్కు వెళ్ళాలని నేను తపించిపోయాను.
ఇ : పూర్తిగా దుఃఖ భాజితాలు.
మ : ప్రయాణాలు మీకిద్దరికీ సంతోషాన్నిచ్చాయనుకున్నాను.
ఇ : ఇచ్చాయి / నిజమే. ఆస్ట్రేలియా నుండి శాండ్‌విచ్ ద్వీపాలకు వెళ్ళేటప్పుడు
నీ : నేను సరదా అయిన మనిషినేం కాదు మర్లీన్. ఎక్కువ నవ్వుతానంతే.
ఇ : సముద్రం మీద ప్రేమ పుట్టు కొచ్చింది. క్యాబిన్లో ఎలకలు, భోజనంలో చీమలు ఉన్నా కూడా, అదో కొత్త ప్రపంచం లా ఉండేది. బాధపెట్టేది ఏదీ ఉండదని తెలియడంతో ఎంతో సంతోషంగా నిద్రలేచే దాన్ని ప్రతి ఉదయం. భయం లేదు. మంచి బట్టలతో అలంకరించుకునే గది లేదు.
(మిగతాది వచ్చే సంచికలో)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags