నే పోతున్నా
ఒంటరిగా…నే పోతున్నా
నిటారుగా… నిలువెత్తు వృక్షంలా
నిలవాలన్న ప్రయత్నం నాది
కానీ
ఎదగనీయకుండా తలలు
ఎప్పటికప్పుడు తుంచేస్తుంటావ్ నువ్వు
పక్కనుంచి పిలకలేసుకుంటూ
శాఖోపశాఖలుగా విస్తరించే ప్రయత్నం నాది
నీ నీడలో నన్ను ఎదగనీకుండా
మరుగుజ్జును చేసే ప్రయత్నం నీది
నేను అడుగు బయటపెడితే
దోవ పొడవునా అడుగడుగునా ముళ్ళకంపలే…
ఒడుపుగా ముళ్ళు ఏరుతూ సాగుతుంటే
నా శక్తిని, తెలివి తేటల్ని,
మరుగుజ్జును చేస్తూ…
నా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని
అందమైన భరిణెలో బందీనిచేస్తూ
నా ప్రయత్నానికి ఆనకట్ట కట్టేస్తూ
సాగే నీలి నీడలు నా వెంటే…
ఇంటా బయటా ఎటుచూసినా
ఎక్కడికి పోయినా వెంటాడుతూనే
రాబందులా వేటాడుతూనే
ఎక్కడికక్కడ పీక్కు తింటూనే
యుగయుగాలుగా ఇదే తంతు
అయినా నేను నా ప్రయాణం ఆపానా?!
ఆపను, ఇవ్వాళ కాకపోతే
రేపు, రేపు కాకపోతే ఎల్లుండి
గగనంలో చుక్కనై
వెలుగు దివిటీలు
వెలిగిస్తూనే ఉంటా
నింగినంటే దాకా ఎగుస్తూనే ఉంటా