కొండేపూడి నిర్మల
మాతాశిశు మరణాలూ – పోషకాహారం – సాంస్కృతిక కారణాలు అనే విషయం మీద ఒక వేదికపై మాట్లాడుతున్నాను
…కానీ జన్యుపరంగా మీ ఆడవాళ్ళకి ఆయుర్దాయం ఎక్కువ కదండీ సభికుల్లో ఒక పెద్ద మనిషి అడిగాడు. మొదట అర్థంకాలేదు. అది ప్రశంసా? విమర్శా? లేక అదనపు సమాచారమా? – అడిగాను. అహా ఏం లేదు. మీరు అకాల మరణాల గురించి మాట్లాడుతున్నారు కదా? అన్నాడు.
అవును. సకాలంలో, సకారణంగా అయితే ఆడవాళ్ళే ఎక్కువకాలం బతుకుతారు. కానీ మనం సదుపాయాల లోపంతో అజ్ఞానంతో జరుగుతున్న అకాల మరణాల్ని గురించి చర్చించుకుంటున్నాం చెప్పాను. ఇంటికొస్తుంటే ప్రయాణం పొడుగుతా ఇదే ఆలోచన పురుగులా బుర్రలో పాకింది.
నాకు తెలిసిన బంధుమిత్రుల్లో డెబ్భైదాటిన వాళ్ళని లెక్కపెట్టాను. ఆడామగా సమానంగానే వున్నారు. ఎనభై దాటిన వాళ్ళని లెక్కపెట్టాను. ఆడవాళ్ళే ఎక్కువ వున్నారు. మా ఇంట్లోనే బామ్మకి, అమ్మమ్మని చూశాను. బామ్మ అమ్మతో మాట్లాడాను. ఏడెనిమిదేళ్ళ వయస్సు వరకూ ఆవిడ చెప్పే కథలు కబుర్లూ విన్నాను. మా ఇంటికి రెండు సందుల అవతల రెండు గదుల పెంకుటింట్లో ఒక్కతీ వుండేది. ఎవరి మీదా ఆధారపడ్డం ఆవిడకిష్టం వుండేది కాదు. భర్తలేని ఒంటరితనం, చదువు లేకపోవడం, వృద్ధాప్యం ఏవీ ఆవిడ్ని కృంగదీయలేదు. పదెకరాల పొలం కౌలుకిచ్చి పండించేది. వారానికి రెండుసార్లు ఎంతో పవిత్రంగా మల్లుచీరకట్టి రాట్నం వడికేది. దేవుళ్ళ పటాలకి బదులు ఆ రెండ్రోజులూ గాంధీగారి పటం వంక చూస్తూ మౌనంగా వుండేది. ఎందుకో తెలీదుకానీ మా బామ్మతో సహా బంధువులందరికీ ఆవిడంటే ఏదో గిట్టని తనం వుండేది. ఃచైనాభూతంః అని పేరు పెట్టి కసి తీర్చుకున్నారు. అప్పట్లో భారత్‌కీ, చైనాకీ మధ్య ఎటువంటి రాజకీయం వుందో నేను చెప్పలేను కానీ శత్రువు పేరు పెట్టి నవ్వుకోడానికి మా తాతమ్మ బాగా దొరికి పోయింది. ఎవరికీ తెలీకుండా తాతమ్మని కలవాలంటే అరగంట ముందయినా స్కూలుకి బయలుదేరాలి. అరగంట ఆలస్యంగా అయినా ఇంటికి రావాలి. చివరికి ఈ కుట్ర కూడా ఇంట్లో తెలిసిపోయి దెబ్బలు తిన్నాను.
తాతమ్మ కందిసున్ని విసురుతూ వుంటే ఆ కమ్మటివాసన మా స్కూలంతా అల్లుకుపోయేది.
ఃఃవుండు నీకు తిరగమోత పెడతాఃః అంటూ అష్టాచమ్మా ఆటలో గవ్వలు గిలకరించి విసిరిందంటే సోలాలు, బారాలు పడాల్సిందే. ఆవిడకున్న రాజకీయ పరిజ్ఞానం మీసాలు తిప్పే మానాన్నకి గాని తాతకి గాని లేవని ఘంటాపథంగా నేను చెప్పగలను.
ఒకసారి మా ఆఖరి బాబాయి ఏదోపనిమీద ఆ వీధిలో నడుస్తున్నాడు.
ఃఃఒరే ఆగుఃః అంటూ వెనకనుంచి చొక్కా పట్టుకుని ఆపేసింది.
ఃఃచచ్చాంరా దేవుడాఃః అంటూ ఆగిపోయాడు.
ఃఃఅక్కకెలా వుందిరాఃః ఆదుర్దాగా అడిగింది.
ఃఃబానేవుందిఃః అన్నాడు గింజు కుంటూ. అల్పాచమానం బాగా అవు తోందిట్రా?ఃః ప్రశ్నించింది.
అప్పటికి మా మేనత్త పురిటికోసం ఇంటికి వచ్చి వుంది. తనకేదో యూరిన్ ఇన్‌ఫెక్షన్ కూడా వచ్చి తగ్గినట్టుంది.
అల్పాచమానం అంటే ఏమిటో మా బాబాయికి అర్థంకాలేదు. సున్నా మార్కులు వచ్చే ఇంగ్లీషు పుస్తకాన్ని నామంపెట్టి గణపతి పూజలో పెట్టడం, మధ్య మధ్య పానీయం, ఆచమనం లాంటి మంత్రాలు ఏవో గుర్తొచ్చాయి.
ఓహో అదా, ఃఃలేదు అమ్మమ్మా అక్క ఈ మధ్య అలాంటివి చేస్తుంటే నే చూళ్ళేదుఃః
ఃఃఅదేమిట్రాఃః సూలింతలు రోజుకు నాలుగైదుసార్లన్నా చెయ్యాలి. మొన్ననే కదా అంత సుస్తీి పడి లేచింది.
ఃఃఅందుకే కదా అమ్మమ్మా, అందరి బదులూ మా పెద్ద వదిన చేస్తుంది. గంట వాయిస్తూ రెండుపూటలా పెద్ద మరచెంబు నిండా చేసి, తులసి ఆకులూ అవీ వేసి అందరికీ తీర్థం ఇస్తుంది. అక్కకి కూడా తనే ఇస్తుందిఃః అర్థమయ్యేలా చెప్పాననుకున్నాడు.
ఆవిడకి మతిపోయింది. దిక్కులు చూస్తూ నిలుచుండగానే బాబాయి వచ్చేశాడు.
వస్తూనే అమ్మదగ్గర మండిపడ్డాడు.
ఆ చైనా భూతం ఏమిటి వదినా! రోడ్డు మీద చొక్కా పట్టుకుని నిలదీసేస్తుంది. నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? మర్నాడే తాతమ్మ మా ఇంటికొచ్చి నాన్నని నిలదీసింది. అంత తిరగర మనిషేమిట్రా నీ తమ్ముడు? ఆచమనంకీ, అల్పాచమానంకీ తేడా తెలీకుండా ఏం చదువుతున్నాడు వాడు? అందుకే ఆ ఫోర్తుఫారం అలా డింకీలు కొడుతున్నాడు. ఏడీ వాడికి తెలుగు నేర్పే పంతుల్ని ఇలా పిలవండి. ఇంగువ నూనె కాచి చెవిలో తిరగమోత పెడతాఃః
చాల్లే అమ్మమ్మా నీ సంస్కృతం నువ్వూనూ, వాడికేం అర్థమవుతుంది కుర్రకుంక, తెలుగులో మాట్లాడచ్చుకదాఃః అంటూ తమ్ముడ్ని వెనకేసుకొచ్చాడు మానాన్న.
స్వభావంలో అంత సింహనాదం, భాషాపరిజ్ఞానంలో అంత సంపదా వున్న మా తాతమ్మ ఇప్పుడు లేదు. నాంపల్లి, మల్లేపల్లి, పాతబస్తీ లాంటి చోట్ల తిరుగుతుంటే అక్కడన్ని బోర్డులు చూసినప్పుడల్లా ఆవిడ గుర్తొస్తుంది.
మెడకింద వాటా అద్దెకివ్వబడును
మీ శిరోజములు అందముగా నరకబడును
మీ తాళం బుర్రలకు మా చెవులు సప్లై చేయబడును
ఃఃమా డిగ్రీ నకళ్ళకు సంప్రదించ గలరుఃః
ఃఃఇచ్చట సుఖముగా బెడ్ వర్క్స్ దొరకును.ఃః
ఃఃకీళ్ళు విరిగినవా? మా వద్ద మీ బోన్స్ సెట్టింగు చేయబడునుఃః
మా తాతమ్మగనక ఆ బోర్డులు చూసిందంటే ఎన్ని తిరగమోతలు పెట్టేదో? ఏ బోర్డుకి ఉరేసుకుని బాల్చీ తన్నేసేదో ఇథమిథ్దంగా చెప్పలేను. తాతమ్మనుంచి బామ్మకీ, బామ్మనుంచి అమ్మకి, అమ్మనుంచి నాకు, నా పిల్లలకీ వచ్చే సరికి మాతృభాష రక్తహీన అయిపోయింది. ఇప్పుడు తెలిసిన ఆంగ్లపదాలకు తెలియని తెలుగు అర్థాలు వెతుక్కుంటున్నాం.
ఎవరికి ఏ సుస్తీ చేసినా కంట్లో కలికం పెట్టి నయం చేసే మా తాతమ్మ నాటువైద్యం భాషకి ద్రోహం చేస్తున్న వాళ్ళకు కూడా జరగాలేమో!
ఇంట్లో ఏమూల చీమల పుట్టలు కనిపించినా తాతమ్మ అందరిలా మందు చల్లేది కాదు. పిడికెడు పంచదార వదిలేది. ఒక్కో పంచదార గుళికెనూ భుజాలమీద మోసుకుంటూ చీమలు పారిపోయేవి.
అదిగో చూశారా? ఏ ప్రాణి అయినా తిండికోసమే పుట్టలోంచి బైటికొస్తుందిరా! అది కాస్తా దొరికితే ఇక ఎవరికీ అపకారం చెయ్యదుఃః అని బోధపరిచేది.
దజీజ్ ది గ్రేట్ అరుంధతీ తాతమ్మ ఉరఫ్ చైనా భూతం ప్లస్ బ్రహ్మరాక్షసి!!!
ఒకానొక అర్థరాత్రి ఎవరితోనూ ఏమీ చెప్పకుండా యమధర్మరాజుతో లేచి పోయింది.
లేచిపోవడం అనే మాట చుట్టూ వున్న అవహేళన, భయం, దిగ్భ్రాంతి ఆవిడ ఛలోక్తుల మధ్య ఎగిరిపోయేవి.
ఒక్కదానివీ ఎలా వుంటావు తాతమ్మ? చీకట్లో భయం వెయ్యదూఃః అని అడిగితే
ఒక్కదాన్నీ ఎక్కడున్నాను పక్కనే వున్నాడుగా యముడు! వృషభవాహనం అదిగో, అంత దూరాన వుంది. వాడు సైగ చేయడం ఆలస్యం, చెప్పా పెట్టకుండా లేచిపోవాల్సిందే కదాఃః అనేది.
మూసిన తలుపుల వెనకనుంచి బారులుకట్టిన చీమలద్వారా ఆవిడ మరణవార్త పక్కింటికి తెలిసింది.
ఎనభై ఎనిమిదేళ్ళు బతికింది. ముని మనవల్ని ఎత్తుకుంది. ఇంకా ఏం కావాలి? అదృష్టవంతురాలుఃః అన్నారు అంతా ఃఃపన్నెండేళ్ళముందే పోయింది. వందేళ్ళు వుంటానంది. అంతా అబద్ధం, మోసం, దగా కుట్ర అనిపించింది నాకు.
ఇప్పటికీ తెలుగులో ఎవరు తప్పులు మాట్లాడినా, రాసినా, పిలక పట్టుకుని ఆపేసే తాతమ్మ గుర్తొస్తుంది.
కలికం పెట్టడానికి, కంటిలోనికి గురిపెట్టిన ఆవిడ చూపుడువేలు గుర్తొస్తుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
మేడం మీ రచనలు చాల బాగుంటున్నాయి.మీ రచనలను మా సిస్టెర్స్ తో రెగ్యులర్ గా చదివిపిస్తాను. ఇంత మంచిగా రాస్తున్నందుకు అభినధనలు.