ఐదుకాళ్ళ తోడేలు

పసుపులేటి గీత
‘నాకెన్ని కాళ్ళు?’ తోడేలు తోకని మరింత వెనక్కి చాచి, ధీమాగా ప్రశ్నించింది.
‘నాలుగు….’ అతను వణికి పోతున్నాడు.
‘కాదు, మళ్ళీ ఒకసారి సరిగా చూడు…’ తోడేలు గద్దించింది. అతనోసారి భయంగా తోడేలు కాళ్ళని లెక్కపెట్టాడు.
‘…నాలుగే…’ అతని గొంతు వణుకుతోంది.
‘భయపడకు, భయంలో నువ్వు నిజాన్ని సరిగ్గా చూడలేక పోతున్నావు… మళ్ళీ చెప్పు…’ తోడేలు కాస్త దయగా చెప్పింది.
‘ఎన్నిసార్లు చూసినా నాలుగే…’అతను సడలని నమ్మకంతో సత్యాన్ని వక్కాణించాడు.
‘ఛీ… కుక్కా…, నాలుగేమిట్రా… ఐదు… ఐదు… తోకతో సహా నాకున్నవి ఐదు కాళ్ళు……, నీ కళ్ళనీ, కలల్నీ నేనెప్పుడో కబ్జా చేశాను. రాజకీయావసరం కొద్దీ ఇద్దరి తరఫునా నేనే ఒక సత్యాన్ని కలగన్నాను. ఆ కలలో నువ్వు టెర్రరిస్టువి… అంతే, అందుకే ఇప్పుడు నీకు నిజం బోధపడడం లేదు… నాకు ఐదు కాళ్ళున్నా యని నువ్వొప్పుకుని తీరాలి!’ తోడేలు కళ్ళలో లాఠీలు మొలిచాయి.
‘లేదు… అది నిజం కాదు…. నేను టెర్రరిస్టుని కాదు… అసలు ఉగ్రవాదం గురించి నాకేమీ తెలీదు. నేనొక సాధారణ స్టూడెంట్‌ని… నీకున్నవి నాలుగు కాళ్ళే….’ అతని ముందు సత్యం ఐదు పాదాలతో ఉగ్రతాండవం చేసింది. ఇంటరాగేషన్‌ గది లో చీకటి చిట్లి, నెత్తురు నల్లగా కమిలింది.
‘కాల్చి పారేయండి వాణ్ణి… వాడు నా కొడుకు కాదు…’
గర్భసంచిలో బాంబులు బద్ధల య్యాయి. ఇన్నాళ్ళూ వాడి మీద నమ్మకాన్ని కాకుండా ఆశల్ని మాత్రమే పెంచుకున్నానా? గోరుముద్దల్లోకి ఆర్‌డిఎక్స్‌ ఎలా చేరింది?
‘ద్రోహి… ద్రోహి… కాల్చిపారేయండి వాణ్ణి…’
ఓదార్పు నిట్టూర్పులేవో కన్నపేగు లోకి కార్చిచ్చులా కమ్ముకుంటున్నాయి. ఉగ్గుపాలల్లో ‘ఆదర్శం’ ఉప్పుకల్లయింది. ఎంత గుండెదిటవు…. ఎంత నిబ్బరం…, జీవితపు విలువలపై ఎంత స్పష్టమైన అవగాహన… ఎంతటి సైద్ధాంతిక నిబద్ధత…. నేను, నా పెంపకం ఆదర్శ వంతం అంటారే… అలాంటిది నా కడుపున ఇలాంటి వాడు పుట్టడమా?… ‘ద్రోహి… కాల్చిపారేయండి వాణ్ణి….’ రెప్పల మీద ముక్కలైన కలలన్నీ గుసగుసగా నినదిస్తున్నాయి.
రెప్పల కింద అమ్మ రహస్యంగా వినిపిస్తోంది. ‘నా సమాధి కనిపించడం లేదు. ఎక్కడుందో, ఏమై పోయిందో,…. కొంచెం వెతికి పెడతావా?’ ఆమె అడుగుతోంది… నేనేం వింటున్నాను?! కాళ్ళకడ్డం పడుతున్న జ్ఞాపకాల యోజనాల్ని దాటుకుంటూ, ఆమెలోకి నడిచాను. నేను సరిగానే విన్నాను, వింటున్నాను. ‘నా సమాధి తప్పిపోయింది. ఎకడుందో, ఏమై పోయిందో,… కొంచెం వెతికి పెడతావా?’… …. ఆమె నాతో పరాచికాలాడ్డం లేదు. నిజమే చెబుతోంది. అమ్మ చనిపోయి యాభై ఏళ్ళయింది. సమాధిని పొగొట్టుకున్న అమ్మ ఒక కాందిశీకురాల్లాగా నా ముందు పుట్టగొడుగు కింద ముణగదీసుకుని కూర్చుని ఉంది. తన పడకగదిలోకి మృత్యువు దొంగ దారిలో నడిచొచ్చి సమున్నత శిఖరాల నుంచి అమ్మని అగాథాల్లోకి విసిరేసిన ఆ పాపిష్ఠి క్షణం ఎన్నడో యుగాల్లోకి తర్జుమా అయింది. పాలే తప్ప ఏపాపమెరుగని నా శైశవగీతిని తీతువు గొంతులో సమాధి చేసిన అమ్మ ఇప్పుడు తన సమాధి కోసం వెదు క్కుంటోంది. పొత్తిళ్ళలో అలల్ని దాచుకున్న సముద్రం అమ్మని పరిహసిస్తోంది. ఆమె కళ్ళపుటల్ని తెరిచి అవమానాన్ని అవలోకిస్తున్నాను.
‘ఇన్నేళ్ళకి మళ్ళీ ఎందుకిలా వచ్చావు? జీవితాన్ని పోగొట్టుకున్నప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు? నువ్వు పోగొట్టుకున్నది కేవలం సమాధినే కదా…!
నా నిర్లక్ష్యం అమ్మని బాధించి నట్టుంది. మర్రిచెట్టు మీద కాకి రేపటి పిండాకూటి ముద్దని కలగంటూ కావుకావు మంటోంది. అమ్మ దానికేసి చిరాగ్గా చూసింది. ‘చావును ఎంజాయ్‌ చేసే జీవి భూమ్మీద బహుశా ఇదొక్కటేననుకుంటా! నీకెలాగూ సంతోషమంటే తెలీదు. దాన్నయినా సంతోషించనీ…’ అమ్మని నా మాటల చితిమీద మరోసారి దగ్ధం చేస్తున్నానేమో?! కానీ ఆమె నా బ్యాంక్‌లో ఏ అనునయ వాక్యాల్నీ దాచుకోలేదు.
‘ఆత్మహత్య మహా పాపమని అంటారు. బహుశా ఆ తెలివిడిలోంచే నా గురించి నువ్వు ఇంత కటువుగా మాట్లాడ గలిగావు. నేను పాపపుణ్యాల్ని బేరీజు వేసుకుని బతికే మనిషిని కాదు. కాబట్టే చావును ఎంచుకోవడంలో నాకే ఇబ్బందీ లేదు. నేను చేసిన పనికి చింతించడం లేదు. నువ్వు ఈ లోకంపై నా అంతిమ సంతకానివి. ఆ హక్కుతోనే నేనిప్పుడు ఇలా వచ్చాను…’ దుఃఖపుజీర తొలగిపోయిన అమ్మగొంతు శ్రావ్యంగా, స్థిరంగా ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ఆత్మహత్య చేసుకున్న మనిషి ఇంత స్థిరంగా మాట్లాడడం నా ఇగోని కొంత గాయపరిచింది. పాపులంతా దూషణల్ని వినడానికే తప్ప స్వీయవాదనల్ని వినిపించకూడదన్న ప్రాపంచిక సంప్రదాయమేదో నాలో గాయపడింది.
‘పాపపుణ్యాలనగానే తేలిక చేసి మాట్లాడేయడం సులభమే. కానీ బాధ్యతల నుంచి పారిపోవడాన్ని సమర్థించుకునే వాళ్లే వాటి గురించి ఇలా మాట్లాడతారు. తప్పుల్ని కన్వీనియెంట్‌గా కప్పిపుచ్చుకోవడానికి ఈ మాత్రం తెలివిడి అవసరమేమో?!’ తెలివైన రిటార్ట్‌ ఇవ్వగలగడమే ఆర్డర్‌ ఆఫ్‌ ది డే. పుట్టలోంచి పాము నాలుక జరజర బురదలోకి పాకింది. నాలుక్కి అంటిన నిప్పుని విషంతో కడిగేస్తున్నాను. అమ్మ నా కోర్టులో ఎన్నటికీ శాశ్వత ముద్దాయే! ముద్దాయి రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.
‘పాపం, పుణ్యమంటూ రెండు లేవు. నాకు తెలిసినంత వరకూ అందరూ తాము కోరుకున్న దాని కోసం రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తారు. ఇరాక్‌ సార్వభౌమ్యాధి కారాన్ని సద్దామ్‌ కాపాడాలను కున్నాడు. బుష్‌ దృష్టిలో అది పాపమైంది అందరూ ఏదో ఒక ప్రయోజనాన్ని కోరుకునే వాళ్ళే. మార్గాలే భిన్నంగా ఉంటాయి. నా దృష్టిలో ఆత్మహత్య అంటే సర్వ మానసిక, శారీరక బాధల నుంచి విముక్తి చెంది, ప్రశాంత మరణాన్ని ఎంచుకునే హక్కు…’ అమ్మ మాటల సుడిగాలికి నాలో ఎండుటాకులు చెల్లాచెదురవుతున్నాయి.
‘వాదనా పటిమ సమర్థించుకోవ డానికి పనికొస్తుందేమో కానీ, తప్పుల్ని సరిచేయలేదు. నీ భర్త మరణంతో నువ్వు ఆత్మహత్యను ఎంచుకున్నావు., కానీ నన్నీ లోకంలోకి తెచ్చి దిక్కూమొక్కూ లేకుండా వదిలి వెళ్ళే హక్కు నీకు లేదు. నీ ఆత్మహత్యతో నేను నా బాల్యాన్ని కోల్పోయాను. పరాయి వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతికే దుర్గతి పట్టింది. అనాథనన్న బిరుదును మోసుకుంటూ కన్నీళ్లు ఉగ్గబట్టుకుని బతికాను. నేను పోగొట్టుకున్న దానికి నవ్వు మూల్యం చెల్లించగలవా?’ ట్రిగ్గర్‌ నొక్కకుండానే నాలోంచి బుల్లెట్‌ దూసుకొచ్చింది. చుక్కలు వెలిసిపోయిన ఆకాశం కార్బన్‌షీట్‌లా ఉంది. అమ్మని తాకి తూటా సీతాకోకచిలుకైంది.
‘నేను చేసిన పని తప్పొప్పుల గురించి ఇప్పుడు నేను వాదించడం లేదు. నిజమే, నేను ఆత్మహత్య చేసుకోవడం మూలాన నీకు ద్రోహమే జరిగి ఉండొచ్చు. కానీ ఆ క్షణానికి సంబంధించినంత వరకు నా దృష్టిలో ఏ బాంధవ్యమూ విలువైంది కాదు. నేను, మీ నాన్న ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. జీవితంలో ఏ ఇతర మానవ సంబంధానికి చోటు లేదన్నట్టుగా నేను అతణ్ణి ప్రేమించాను. నీ తండ్రి కవి. అతని ప్రతి కవితకూ నేను కొత్త చివుళ్లు తొడిగాను. మాకిద్దరికీ జీవితానందం తప్ప పెద్దగా ఎలాంటి ఆశయాలు ఉండేవి కావు. సంతోషానికి సమాజం నిర్ణయించిన కొలబద్ధలన్నింటినీ చూసి మేం నవ్వుకునే వాళ్ళం. మా ఆనందం భౌతికావసరాలకు సంబంధించింది కాకపోవడంతో మమ్మల్ని ఈ ప్రపంచం పెద్దగా పట్టించుకునేది కాదు. ఇంతటి ఆనందానికి ఎడిక్ట్‌ అయిన తరువాత, తను లేకుండా జీవించడమనే ఊహే నాకు దుర్భరంగా తోచేది…’ అమ్మ చేతిలో భూమండలం దారపుండైంది. పోగు వెంట పోగుగా కాలపు చిక్కుముళ్ళని గొప్ప నేర్పుతో విప్పుతోందామె. హఠాత్తుగా 1958 దగ్గర ఆమె వేళ్లు సన్నగా వణికాయి. ‘… మీ నాన్న ఉద్యోగరీత్యా ఒకసారి లెబనాన్‌కు వెళ్ళాడు. అప్పుడే బీరట్‌ విమానాశ్రయాన్ని ఆక్రమించుకోవడంతో ప్రపంచంపై అమెరికా పోలీసింగుకు తొలి బీజం పడింది. పాశ్చాత్యదేశాలకు తాబేదారైన లెబనాన్‌ అధ్యక్షుడు కామెలీ చౌమన్‌కు వ్యతిరేకంగా అక్కడి ముస్లింలు జరిపిన తిరుగుబాటును అణచివేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఐసన్‌హోవర్‌ తన దళాల్ని పంపాడు. బీరట్‌ విమానాశ్రయాన్ని ఆక్రమించుకోవడానికి ఉద్దేశించిన ఆపరేషన్‌ బ్లూబ్యాట్‌లో సైనికదళాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఊహించని విధంగా నీ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఆ వార్త అతణ్ణి భారతీయ మీడియాలో ఉన్నఫళంగా హీరోని చేసేసింది. ముఖ్యమంత్రి, రాజకీయ ప్రముఖులు మందీమార్బలంతో వచ్చి నన్ను పరామర్శించారు. పత్రికలు నన్ను, నా దురవస్థని యతిప్రాసలతో హృద్యంగా వర్ణించాయి. అప్పుడు నీకు ఏడు నెలలనుకుంటా. పొత్తిళ్ళలో పాల కోసం ఏడ్చే నీకన్నా నాలో పొగిలి, పొగిలి పగిలి పోతున్న నేనే నాకు ముఖ్యమనిపించింది. దేన్ని ఎప్పుడు ఎక్కడ ముగించాలి. అందుకే నేను మృత్యువును ఎంచుకున్నాను…’ అమ్మ మాటలకు అడ్డుతగులుతూ, ‘భర్త చనిపోయిన వాళ్ళంతా నీలా చావాలనుకుంటే ఈ దేశంలో ఆడశిశువుల హత్యల కంటే వితంతువుల ఆత్మహత్యలే ఎక్కువగా ఉండేవి. జీవితం కన్నా విలువైందేదీ లేదు. ఏ కారణానికైనా జీవితాన్ని హరించి వేసే శక్తి ఉంటుందని నేననుకోను. ఆత్మహత్య పిరికితనమే తప్ప మరోటి కాదు. నీ నిర్ణయాన్ని నేను ఎన్నటికీ సమర్థించను…’ అంటూ మొండికెత్తాను.
‘సరే…ఒప్పుకోవద్దు! ఆత్మహత్య నువ్వనుకున్నట్టు నేరమే, కానీ ఇప్పుడు… ఈ క్షణంలో నువ్వు చేసుకున్న ఆత్మహత్యని ఎలా సమర్థించుకుంటావో చెప్పు?’ అమ్మ సూటిగా నా ప్రాణంలోకి ప్రశ్నని సంధించింది. విలవిల్లాడిపోయాను. ‘ఏం మాట్లాడు తున్నావ్‌? అబద్ధాలు కూడా చెబుతున్నావా? నేనా… ఆత్మహత్యా…’ నిప్పెక్కిన నా మాటల సెగసోకి అడవి పిట్టలు గూళ్లు వదిలి పారిపోయాయి. ఆకులు వేసవిని క్షమించాయి. నేను మాత్రం అమ్మని క్షమించలేకపోతున్నాను. అమ్మ నింపాదిగా గడ్డిపరకల్ని పేని పాలపుంతకి ఊయలనల్లుతూ నాలోకి సాలోచనగా చూసింది. ‘అవును, ఆత్మహత్యే! వాణ్ణి కాల్చిపారేయండి అన్న క్షణాన్నే నువ్వు ఆత్మహత్యకి పాల్పడ్డావు. ఎందుకలా నీ కొడుకుని డిజోన్‌ చేసుకున్నావు? నీకు తల్లిగా బతికే హక్కు లేదా, ఉగ్రవాదికి తల్లిగా నీ ఐడెంటిటీ నీకు జీవించే హక్కును నిరాకరిస్తోందా? మనుషులు దేశభక్తులుగానో, వీరులుగానో, త్యాగులుగానో తప్ప మనలేని వ్యవస్థకి ఊడిగం చేయడానికి నిర్ణయించుకున్న క్షణంలోనే నిన్ను నువ్వు చంపుకున్నావు. మనలో చాలా మందిమి ఇలాంటి ఆత్మహత్యలకే ఒడిగడుతున్నాం. మనవాళ్ళని, మన ప్రేమల్ని, మన భావోద్వేగాల్ని డిజోన్‌ చేసుకోవడమంటే ఆత్మహత్య చేసుకోవడమే! మన చావులు మన చేతుల్లో ఉండవంటారు. అది శుద్ధ అబద్ధం. నిరంతర హత్యాకాండకు అనుకూలంగా మన మీదికి మనల్నే ఆయుధాన్ని చేస్తుంది సమాజం. ఒక్క మాటడగనా…’ అమ్మ నా చీకటి ఉప్పెన మీద వెన్నెల పువ్వులు కుడుతోంది. నాలో కొండలు ప్రవహిస్తున్నాయి బొట్టుగా బొట్టుగా కరుగుతున్నాను. ‘మన పిల్లలు యుద్ధాల్లో చనిపోతే మనం వీరమాతలవుతాం. మన దుఃఖానికి న్యాయబద్ధమైన మద్దతు దొరుకుతుంది. మన పిల్లలు పెద్ద చదువులు చదువుతూ అమెరికాలో చనిపోతే ఆ మృత్యువు మనకు ఎక్కడలేని ప్రత్యేకతను తెచ్చి పెడుతుంది. మన వాళ్ళు టెర్రరిస్టుల దాడుల్లో చనిపోతే మనం నెత్తిన ముసుగేసుకుని, కళ్ళనిండా కన్నీళ్లు కుక్కుకుని, వాళ్ల తరపున జ్ఞాపికలందు కుంటాం. ముక్కుపచ్చలారని పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినా ఆ చావుకు సామాజిక సహానుభూతి పెద్దగా దొరకదు. అసలు అసహజ మరణాలెన్ని జరుగుతున్నా సమాజం గుర్తించదు. ఏ సానుభూతినో, సహానుభూతినో ఆశించి మృత్యువు మనల్ని చేరదీయదు. కానీ మనమే మరణానికి కిలోల్లెక్కన విలువల్ని ఆపాదిస్తుంటాం. మన పిల్లల మరణానికి సామాజిక మద్దతు లేకపోతే అన్నేళ్ళ ప్రేమని తగలబెట్టి, సమాజంతో గొంతు కలిపి వాణ్ణి కాల్చిపారేయండి అంటాం. వాడు మా బిడ్డ అని చెప్పుకోవడానికే సిగ్గుపడిపోతాం. నిజంగా మన పిల్లలు, మన వాళ్లు దుర్మార్గులైతే, ఆ దుర్మార్గంలో మన పాత్ర ఏమీ లేదని చెప్పడానికి తాపత్రయ పడతాం. వాళ్ల శవాల్ని తీసుకోవడానిక్కూడా ఒప్పుకోం. దొంగల్ని పట్టుకుని చంపేస్తాం, మంత్రగత్తెలనే పేర ఆడవాళ్ళని అమానుషంగా హింసించి హతమారుస్తాం. హింసకి అంతటి సామాజిక ఆమోదం ఉంది కనుకే మన పిల్లలు దొంగతనాలు, యాసిడ్‌దాడులు వంటి నేరాలకు పాల్పడినప్పుడు తూటా తీర్పరిగా మారి, విచారణ లేకుండానే వాళ్లని నిలువునా కాల్చిపారేసినా మనం ఆ చర్యని హర్షిస్తాం. సామాజిక ఆమోదం కోసం గౌరవంగా ఆత్మహననానికి ఒడిగడతాం. అత్యాచారా నికి గురైన ఆడపిల్లలకు న్యాయం చేయడానికి కోర్టులో ఏళ్ళూపూళ్ళూ పోరాడుతున్న తల్లిదండ్రులున్నారు, నక్సల్స్‌శవాల కోసం మార్చురీల ముందు పడిగాపులు కాసే తల్లిదండ్రులున్నారు. కానీ సమాజానికి జడిసి సర్వస్వాన్నీ డిజోన్‌ చేసుకోవడానికి అలవాటు పడిన వాళ్ళం మాత్రం ఇళ్ళలోకి, పొత్తిళ్ళలోకి, గుండెల్లోకి హింస చొచ్చుకొస్తుంటే వివేచనాశక్తిని కోల్పోయి రోబోల్లాగా ప్రవర్తిస్తున్నాం. ఏ పోలీసులో, ప్రభుత్వమో చెబితే తప్ప అప్పటిదాకా మన పిల్లల దుర్మార్గం మనకి తెలీదా? వాళ్ళు పోలీసుల చేతుల్లో కాకుండా ఏ రోడ్డు ప్రమాదంలోనో చనిపోయి ఉంటే మనం వాళ్ళ శవాల్ని మార్చురీల్లోనే వదిలి వెళతామా? మనం చావుకి కితాబులివ్వ గలం, లేదంటే అవమానించటం, సామాజిక ఆమోదం కోసం మానవ సహజ మైన పరివేదనని కూడా అధిగమించగలం. ప్రాణం పోకడ తెలియదంటూ వైరాగ్యాల్ని అభినయిస్తూనే సమాజం చావు మీద కూడా నియంత్రణను చెలాయించాలని చూస్తుంది. ఏ క్షణానైనా మనం వాళ్ళని డిజోన్‌ చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి తాము యాక్సిడెంట్ల లోనే చనిపోవాలని మన పిల్లలు కోరుకున్నా ఆశ్చర్యం లేదు. నిజం చెప్పు నీ కొడుకు దుర్మార్గుడేనని నువ్వు నమ్ముతున్నావా? వాడి ప్రాణానికి విలువ కట్టే హక్కు, ప్రాణాన్ని తృణీకరించే హక్కు నీకుందా? అసలు ఎవరు వీళ్ళంతా? రెండు దేశాల మధ్య రెండు సైనిక కూటముల మధ్య, రెండు సైద్ధాంతిక ధోరణుల మధ్య చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్న నా భర్తక్కానీ, చావు కోసం ఎదురుచూస్తున్న నీ కొడుక్కుకానీ, నాక్కానీ, నీక్కానీ వాటితో ఏమైనా ప్రత్యక్ష సంబంధాలున్నాయా? జీవించే హక్కుని గౌరవించలేని సామాజిక దౌర్భల్యం సమాధుల్లోకి కూడా చొచ్చుకొస్తోంది. అందుకేనేమో నా సమాధి కనిపించకుండా పోయింది. కొంచెం వెతికి పెడతావా?…’ మురిక్కాలువ మీద రక్తరహస్యాన్ని హత్య చేస్తున్న దోమొకటి అమ్మకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. నా రెప్పల కింద విప్పారిన స్మశానం ప్రభాతగీతిని వినిపిస్తోంది. ‘వాణ్ణి కాల్చిపారేయండి…’ పెదాలకంటుకున్న ఎంగిలి మాటల్ని కళ్ళు కడిగేశాయి.

‘వాడు నా బిడ్డ…., వాడి ప్రాణాలకి ప్రమాదముంది. కాపాడండి….’ మానవ హక్కుల కమిషన్‌కు పిటిషన్‌ రాస్తున్న నా చేతిలో కన్నపేగే కలమైంది

ఐదుకాళ్ళ తోడేలు మీద సమాధులు తిరగబడ్డాయి. ఇప్పుడది కృత్రిమ కాళ్ళ కోసం జైపూర్‌కి ప్రయాణం కట్టింది. తిరిగొచ్చిన సమాధి కింద నాన్న పూలజాతర య్యాడు, అమ్మ ఆ పూలలో పరాగమైంది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to ఐదుకాళ్ళ తోడేలు

  1. Aruna says:

    చాలా చాలా బాగుంది. ఇలాంటి కథలు మీడియాలో మరిన్ని రావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.