సిరియాలో భూమిక – ఝండా ఊంఛా రహే హమారా ప్రధమ మహిళతో భేటీ – మరికొన్ని విశేషాలు

జె.భాగ్యలక్ష్మి
సిరియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బాషర్‌ అల్‌ – అస్సాద్‌, ఆయన సతీమణి, సిరియా ప్రథమ మహిళ అస్మా అల్‌ – అస్సాద్‌ జూన్‌ 2008లో భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌కోర్‌లో అస్మాతో ముఖాముఖీ సంభాషణలు జరిగాయి.
అస్మా నిర్వహిస్తున్న సామాజిక విద్యా కార్యక్రమాల గురించి, స్త్రీల ప్రగతిపట్ల, సాధికారత పట్ల ఆమె చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధ గురించి నేను ఇదివరకు భూమికలో రాయటమైంది. ఈ సంవత్సరం (ఆగస్టు 2008) మార్చి – ఏప్రిల్‌ లో ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌కోర్‌ సభ్యులం కొందరం సిరియాకు వెళ్తున్నప్పుడు భూమిక కాపీ వెంట తీసుకుపోవటం మరిచిపోలేదు. మా పర్యటనకు ఆఖరిరోజు ప్రెసిడెంట్‌ పాలెస్‌లో ప్రథమ మహిళను కలిసే అవకాశమొచ్చింది. భూమిక కాపీని అదే సందర్భంలో వార్త లో ప్రచురించిన కాపీని, ఇంగ్లీషులో వ్రాసిన పరిచయ వాక్యాలతోపాటు ఆమెకు అందజేశాను. ఆమెనుండి సెలవు తీసుకొన్నప్పుడు ఈ వ్యాసాలు, నా కవితా సంకలనాలు కానుకగా ఇచ్చినందుకు ఆమె ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పారు.
ఇది ఒకవిధంగా లాంఛనమే అయినా భూమిక గురించి, తెలుగు గురించి సిరియాలో అత్యున్నత స్థానంలో తెలియపరచడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. భూమికః పేరు, వార్త పేరు మరికొన్ని సందర్భాలలో నా ఇతర వ్యాసాలలో తప్పక వస్తాయి.
సిరియాలో స్త్రీలగురించి మాట్లాడుకునే ముందు అస్మా వ్యక్తిత్వం, ఆమె కర్తవ్య నిష్ఠ గుర్తుకు తెచ్చుకోవాలి. బ్రిటన్‌లో పుట్టి, విద్యార్జన చేసి, బాధ్యత గల పదవులు నిర్వహించిన అస్మా వివాహంతో స్వదేశమైన సిరియాలోనే స్థిరపడ్డారు. ప్రెసిడెంట్‌ భార్యగా సుఖజీవనం గడుపుతూ లాంఛనంగా కార్యక్రమాల్లో పాల్గొనటం, అందరి దృష్టిని ఆకర్షించటం ఆమె ఉద్దేశం కాదు. ఇరవై ఐదేండ్ల వయస్సులో వివాహమైంది. ఇరవై ఆరేళ్ళవయస్సుకు తల్లి అయ్యింది. ఆ తర్వాత ఆమె దృష్టి అంతా సిరియాను సిరియా ప్రజలను ఆధునిక రీతిలో అభివృద్ధివైపు మళ్ళించటమే ఆమె లక్ష్యమైంది. దేశవ్యాప్తంగా కీలక విషయాలలో యన్‌.జి.ఓ.లు నడుపుతూ గడిచిన ఎనిమిదేళ్ళలో ఆమె సాధించింది ఎంతో ఉంది.
ఒక దేశం ప్రగతి మార్గాన ముందుకు సాగాలంటే ఎన్నెన్ని పనులు చేపట్టాలో, ఏఏ అవరోధాలు అధిగమించాలో ఆధునిక ప్రపంచం చూసిన అస్మాకు తెలుసు. తనదేశం, తన ప్రజలు, వారి అవసరాలు కనుక్కోటానికి ఆమె ప్రచ్ఛన్నంగా మూడునెలల పాటు దేశమంతా పర్యటించారు. గ్రామప్రజల కోసం, యువతకోసం, బడిపిల్లలకోసం, స్త్రీలకోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను రూపొందిస్తూ వారి సామర్థ్యం మరింతగా పెంపొందేటట్లు చూస్తున్నారు. సాంకేతిక విషయాల్లో శ్రద్ధ చూపించినట్లే సాంస్కృతిక విషయాల్లో కూడా శ్రద్ధ చూపిస్తున్నారు. సిరియా, సిరియా ప్రజలు సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలన్నదే ఆమె ఆకాంక్ష.
సిరియా గురించి, అక్కడి స్త్రీలగురించి మాట్లాడేముందు చుట్టుప్రక్కల ఉన్న ఇతర అరబ్‌ దేశాలగురించి కూడా ఆలోచించాలి. ఇస్లాం సాంప్రదాయాన్ని బలపరుచుకుంటూ ప్రథమకార్యంగా స్త్రీల దుస్తుల విషయంలో, ప్రవర్తన విషయంలో చాలా కట్టుదిట్టాలు చేయటం అందరికీ తెలిసిన విషయమే. సిరియా మాత్రం భిన్నంగా ఆలోచిస్తుంది. వీరు ప్రాధాన్యమిచ్చే విషయాలు వేరు. అందుకు ముఖ్యకారణం వారి నాయకత్వం కావచ్చు. ప్రజలకు సముచితమైన స్వేచ్ఛనిస్తుంది. దుస్తుల విషయంలో ప్రభుత్వం తరఫున నిబంధనలేమీ లేవుకాని అందరూ తమ కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి దుస్తులు ధరిస్తారు.
బాలబాలికలకు ప్రత్యేకమైన విద్యాసంస్థలున్నాయి. ఉన్నతవిద్యలలో కలిసి చదవటం, ఉద్యోగాలు కలిసి చేయటం ఉంది. స్త్రీలు అన్ని పదవులలో కనిపిస్తారు. సైన్యంలోనూ, ప్రెసిడెంట్‌ సెక్యూరిటీలోనూ ఉన్నారు. యూరప్‌లోని కొన్ని దేశాలకంటే ముందే ఈ దేశంలోని స్త్రీలకు ఓటు హక్కు లభించింది. పార్లమెంటులోని 250 సభ్యులలో 30 మంది స్త్రీలున్నారు. ఉపాధ్యక్ష పదవిలో ఒక మహిళ ఉన్నారు. సుమారు పదేండ్ల క్రితం ఈ విషయం ఆలోచించడానికి కూడా వీలయ్యేది కాదని కొందరంటారు.
యూనియన్‌ ఆఫ్‌ సిరియన్‌ ఉమెన్‌ అనే సంస్థకు దేశవ్యాప్తంగా శాఖలున్నాయి. సామాజిక, రాజకీయ విషయాలలో చురుకుగా పాల్గొనవలసిందిగా స్త్రీలను వీరు ప్రోత్సహిస్తుంటారు. వారి అవగాహన, ఆలోచన విస్తృతి పెంచటానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
యువతరం స్త్రీలలో చురుకుదనం, చొరవ, ఏదో సాధించాలనే ఆకాంక్ష కనిపిస్తుంది. దానికి తగిన అవకాశాలు లభిస్తున్నాయి. ఈదేశంలో స్త్రీలు నిర్భయంగా తిరగవచ్చు. వీరికి ఏ అపాయమూ ఉండదు. ఇంటిబయట స్త్రీలపట్ల అపరాధాల గురించి ఎవరికీ తెలియదు. నిజంగా ఏదైనా అపరాధం జరిగితే శిక్ష భయంకరమని వినవస్తుంది.
అయితే ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు ఇక్కడా ఉన్నాయి. సాంప్రదాయబద్ధమైన సమాజంలో ఇవి మరింతగా ఉంటాయి. ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన, విద్య, సమానావకాశాలు, గృహహింస, వివాహం రద్దుకావటం, విడాకులు, మనోవర్తి, పిల్లల సంరక్షణ, స్త్రీ పురుష వివక్ష వంటి సమస్యలుండనే ఉన్నాయి. అన్ని దేశాలలో లాగే చట్టం వేరు, ఆచరణ వేరు అన్న పరిస్థితే ఇక్కడా ఉంటుంది.
ఇక్కడ ప్రేమ వివాహాల్లాంటివి అరుదుగా ఉంటాయి. కుటుంబ సంబంధాలకు ప్రాముఖ్యతనిస్తారు. కుటుంబ సభ్యులు కలిసి విందు భోజనాలకు వెళ్తుంటారు. పాటలు, ఆటలు, నృత్యాలు, బెల్లీడ్యాన్సులు ఉంటాయి. స్త్రీలూ పాల్గొంటారు. అయినా ఏదో ఒక ప్రచ్ఛన్న శక్తి వీరందరినీ క్రమశిక్షణలో పెట్తున్నట్టనిపిస్తుంది. మీడియాలోగాని, ఇతరత్రాగాని అసభ్యమైన దృశ్యాలు కనిపించవు. ప్రకటనలు, హోర్డింగులు అరుదుగా కనిపిస్తాయి. ఒక పార్టీ పాలన గనుక కమ్యూనిస్టు రాజ్యాల ప్రభావమూ ఉన్నందున కట్టుదిట్టాలు ఉండనే ఉన్నాయి.
ది గుడ్‌ షెపర్డ్‌ మొనాస్టరీ అనే కాన్వెంటుకు వెళ్ళి, అక్కడున్న సిస్టరుతో మాట్లాడాము. ఈ మోనాస్టరీ నిరాశ్రయులు, దు:ఖితులు పీడితులు అయిన స్త్రీలకు ఆశ్రయం కల్పిస్తుంది. టెలిఫోన్‌ ద్వారా వీరి సహాయం అర్థించవచ్చు. పీడితుల మాటలు వినడానికి 24 మంది సమాజ సేవికలు నలుగురు లాయర్లు, నలుగురు మనస్తత్వ శాస్త్రవేత్తలు ఉన్నారు. కొంత పరిమితకాలం ఆశ్రయం పొందటానికి ఇక్కడ వీలుంటుంది.
సిస్టరు కథనం ప్రకారం ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక పెద్దసమస్య వుంటుంది. అయితే ఇక్కడ శరణార్థుల సమస్య ఎక్కువ. పదేండ్ల ఇరాక్‌ అమ్మాయిని ఎత్తుకుపోయారు. తన వయసులో ఉన్న మరో అమ్మాయిని టెర్రరిస్టులు చంపటం ఈ అమ్మాయి చూసింది. ఆ భయంకరమైన అనుభవం నుంచి, ఆషాక్‌ నుంచి ఆ అమ్మాయి బయటపడడానికి సహాయపడవలసి వచ్చింది. ఇంకొక యువతి భర్తను, సోదరుని చంపేశారు. ఆమె ఇక్కడ ఆశ్రయం పొందింది.
సిరియా కుటుంబాలలో గృహహింస, ఆడపిల్లలపై బంధువుల అఘాత్యాలు జరుగుతుంటాయి. కాని పరువు పోతుందని పైకి చెప్పరు. కుటుంబ పరువుకోసం స్త్రీలను, బాలికలను చంపే సాంప్రదాయం ఇక్కడా ఉంది. మేము సిరియాలో ఉండగా ఒక అరబ్‌ పత్రికలో వచ్చిన వార్త – ఇంట్లో గ్యాస్‌ సప్లయి చేయటానికి వచ్చిన వ్యక్తిని ఒంటరిగా ఉన్న అమ్మాయిలోనికి రానిచ్చింది. ఇంతపరువుతీసే పనా అని ఆ అమ్మాయిని హతమార్చారు.
అందరూ సుఖంగా, ఆనందంగా, సమానాధికారాలతో, గౌరవప్రదంగా జీవించే సమాజాలేవీలేవు. చట్టాలు చేయవచ్చుకాని సమాజంలోని సాంప్రదాయాలు, బలహీనునిపై బలవంతుని ఆధిక్యం ఎన్నటికీ సమసిపోవు. కొన్ని పరిస్థితులను వ్యక్తులే ఎదుర్కోవాలి. మరికొన్ని పరిస్థితులను సమాజమే ఎదుర్కోవాలి.
ది గుడ్‌ షెపర్డ్‌ మొనాస్టరీ వాళ్ళు స్త్రీలకు ధైర్యం చెప్పటానికి, ఆసరాగా ఉండటానికి కొన్ని నినాదాలను ప్రచారం చేస్తుంటారు.
ఉదాహరణకు కొన్ని:
1. మౌనంగా ఉండటం సమస్యను పరిష్కరించదు.
2. మీరు ఒంటరికాదు. మేము మీతో ఉన్నాము.
3. మీ మాటలు విన్నాము. వాటిని నమ్ముతాము.
4. కుటుంబహింసకు గురైన వారికి సహాయం చేస్తాము.
సిరియాలో సమాజం వివిధ దశలలో, వివిధ దిశలలో అభివృద్ధి చెందుతుంది. స్త్రీల సమస్యలపట్ల, వారి సాధికారతపట్ల అవగాహనతో కార్యక్రమాలు రూపొందుతున్నాయి. ఈ దేశంలో యువత సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రత్యేకమైన శ్రద్ధతో పాఠ్యాంశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచ సమాజంలో వీరు నిలబడగలిగే సామర్థ్యం కల్పిస్తున్నారు. నేనెవరు అన్నది ముఖ్యం కాదు. నేను ఏమి చేస్తున్నాను అనేది ముఖ్యం అని నేనొక దూతగా నాపని సాగిస్తున్నాను అని శ్రీమతి అస్మా అంటారు. ఆమె మాటల్లో ఎంతో నిజాయితీ ధ్వనిస్తుంది. దానికి మారుతున్న సిరియా సమాజమే సాక్ష్యం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.