మేరి మాదిగ
దళితులంటే దళిత మొగోల్లేనా? దళిత ఆడోల్లు దళితులు కారా? దళితులంటే – మాల, మాదిగోల్లేనా? మిగిలిన 57 ఎస్సీ ఉపకులాల వారు దళితులు కారాదళితులు అంటే హైద్రాబాద్ వాల్లేనా? 24 జిల్లాల వారు దళితులు కారా?
ఆంధ్ర రాష్ట్రంలో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ కులాలు అన్ని ఉన్నది పంచుకొని లేనిది పెంచుకొని అందరు సమైక్యంగా ఉండి ముందుకు నడవాలి. అని కలలు కన్న దళితజాతి నేతలు ఆత్మీయ బంధువులు డా|| అంబెడ్కర్, బాబూజగ్జీవన్‌రామ్‌ల జన్మదినవేడుకలంటే ప్రజలకు ప్రభుత్వానికి, దళిత వర్గాల వారందరికి గొప్ప పండగరోజనే చెప్పాలి.
దళిత లీడర్లు 2009 సంవత్సరం ఏప్రిల్ నెలలో నిర్వహించిన జయంతి ఉత్సవాల సందర్భంగా దళిత స్త్రీలను, దళిత ఉపకులాలను దళిత లీడర్లు అవమాన పర్చినారు. ఇది సరి అయిన పద్దతి కాదు. దళిత స్త్రీలు ప్రతి జయంతి వేడుకల్లో, వాల్ల అస్థిత్వంకై వాల్లే పోరాడాల్సిన దుస్థితికి కారకులైన దళిత లీడర్లు అంబేడ్కర్ జగ్జీవన్‌రామ్ వారసులు ఎలా అవుతారు?
డా|| బాబు జగ్జీవన్‌రామ్ 102వ జయంతి ఉత్సవ సభ ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద బషీర్‌బాగునందు హైద్రాబాదులో ఉత్సవాల సభ ఘనంగా నిర్వహించారు. డా|| బి.ఆర్. అంబేడ్కర్‌గారి 119వ జయంతి సభ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏప్రిల్ 14వ రోజున లోయర్ ట్యాంక్ బండ్ నందు 2009 రాష్ట్రస్థాయి ఉత్సవాల కమిటి ఆధ్వర్యంలో, ఈ సభలను నిర్వహించడం జర్గింది. వీరి ఇద్దరి జయంతుల సభల ప్రారంభకులుగా గౌరవ శ్రీ నారాయణదత్ తివారిగారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, మరియ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ. వై.యస్. రాజశేఖర్‌రెడ్డి, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, మరియు ఇతర రాజకీయ పార్టీల నేతలు డా|| చిరంజీవి, డా|| జయప్రకాశ్ నారాయణ, ప్రతి పక్షాల నాయకులు ప్రజాయుద్దనౌక గద్దర్, టి.వి. నారాయణ, మైసయ్య, జె.బి.రాజు, దండోర నాయకులు, రాగటి సత్యం మాదిగ, దేవయ్య జవా మాదిగ మేరి మాదిగలు కాంతమ్మ, రుక్మిణీ బాయిలు, దళిత ఐఏఎస్, ఐపిఎస్‌లు అంబేడ్కర్ సంఘాలు, దళిత సంఘాలు, దళిత ఉద్యోగ సంఘాలు, మహిళా నాయకురాల్లు, దళిత మేధావి వర్గంవారు, దళిత దండోర కళాకారులు, అశేష ప్రజానీకం, బస్తీల వారిగా బాజా, భజంత్రీలతో బాబుజగ్జీవన్‌రామ్, డా|| బి.ఆర్. అంబేడ్కర్లకు ఘన నివాళిని అర్పించారు. అనంతరం ఉత్సవాల బహిరంగ సభలు జరిగాయి. ఈ రెండు సభలకు సభాధ్యక్షులుగా కె.పి. నర్సింగరావ్ నిర్వహించారు. స్వాగతోపన్యాసం జి. మాష్టార్జీగారితో ప్రారంభమైయింది.
దళిత మగ లీడర్లు దళిత స్త్రీలను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో వారి తీరు మీరే గమనించండి. జయంతికి ముఖ్య అతిధులుగా గౌ|| శ్రీ. ఎ. భరత్ భూషన్ ఐఆర్‌టిఎస్ గారు విషిష్ట అతిధులుగా, ఐఏఎస్ అధికార్లను 15 మందిని ఆహ్వానించారు. వీరిలో 13 మందిని మగవారిని ఇద్దరు మహిళల్ని ఆహ్వానించినారు. వారు ఒకరు గౌ|| శ్రీమతి రాణి కుమిదినీ ఐఏఎస్ గారు, ఇంకొకామె గౌ|| శ్రీమతి రత్న ప్రభగారు ఈ ఇద్దరి మహిళా ఆఫీసర్లకి సమాచారం ఇవ్వకపోవడం వలన రాలేకపోయినారు. గతంలో, ఉత్సవాలు నిర్వహించిన 10 మంది చైర్మెన్లు మగవారే. 11వ చైర్మెను కూడా మగవారే జయంతి ఉత్పవాలు రాష్ట్రస్థాయిలో దళిత సంఘాల వారి ఆధ్వర్యంలో ప్రారంభమైన నాటినుండి నేటి వరకు దళిత మగవారే ఉన్నారు. దాదాపు ఈ జయంతులు 11 యేండ్లనుంచి దళిత సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఏ ఒక్క సంవత్సరం కూడా దళిత స్త్రీలకు ఉత్సవాల చైర్మెన్‌గా అవకాశం కల్పించలేదు.
ప్రతి సంవత్సరం ఉత్సవాల నిర్వాహణ కమిటీలను నూతనంగా దళిత సంఘాలు సాంఘిక సంక్షేమ శాఖవారు ఏర్పాటు చేస్తూ వుంటారు. ఆ కమిటీలల్లో కూడా దళిత స్త్రీలకు అవకాశం కల్పిస్తలేరు. ఉదాః ఆ కమిటీల వివరాలను కూడా లెక్కల్లో మీరే చూడండి. రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం దళిత సంఘాల వారు వేసిన కమిటీలల్లో కన్వీనర్లుగా కో-కన్వీనర్లుగా 80ని నియమిస్తే వారిలో కేవలం ముగ్గురు మహిళలకే ఈ సంఘాలు అవకాశం కల్పించినారు. ఈ ఉత్సవాలకు 40 మంది దళిత ప్రముఖులను ఆహ్వానిస్తే వారిలో ఒక్క మహిళకే అవకాశం కల్పించారు. వారే మేరి మాదిగ. ఒక్క ఈమె పేరునే ఎందుకు వేశారంటే ప్రతిసారి ఈ జయంతుల ఉత్సవ సభలో దళిత పురుషులతోపాటు దళిత మహిళలకు అన్ని స్థానాల్లో అవకాశం కల్పించాలని జయంతి సభల్లో అనేకసార్లు గొడవ చేస్తుంటే ఒక్క ఆమె పేరు మాత్రమే క్రిందిలైన్లో వేసినారు.
366 మంది సబ్ ప్రముఖులల్లో అతి దారుణంగా ముగ్గురి ఆడవాల్ల పేర్లే వేసినారు. 16 మంది గౌరవ అతిధులల్లో ఒక్క మహిళను కూడా ఆహ్వానించలేదు. జగ్జీవన్‌రామ్ జయంతి రోజున రవీంద్ర భారతిలో జర్గిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దళిత రత్న అవార్డులను 11 మందికి ఇస్తే ఒక లక్ష్మి దేవమ్మ అనే మాదిగ మహిళకు మాత్రమే ఇచ్చినారు. మిగిలిన 12 మంది అవార్డు గ్రహితలందరు దళిత మగవాల్లే. ఆ ఒక్క అవార్డు గూడా దళిత మహిళలు గొడవ చేస్తే ఆమెకిచ్చినారు. డా|| అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా 16 మంది మాలలకు 13 మంది మాదిగలకు దళిత రత్న, యువరత్న అవార్డులు ఇస్తే మాదిగ కోటాలో మాదిగ స్త్రీకి రావాల్సిన అవార్డును మాష్టార్జీ భార్య మాల మహిళలకు దళిత రత్న అవార్డును ఇచ్చినారు. ఆమెకు ఎందుకు ఈ ఆవార్డును ఇచ్చినారో అక్కడున్న వారికి ఎవ్వరికి అర్దంకాలేదు.
ఈ అవార్డులు, సెలక్షన్ చేసే వారు అంతా మాల, మాదిగ మొగోల్లే ఉన్నారు. వాల్లకు జెండర్ స్పృహ అస్సలే లేదు పేరుకు పెద్ద పెద్ద లీడర్లే. కానీ చిన్న చిన్న పాలిటిక్స్ చేస్తుంటారు. వీల్ల పాలిటిక్స్ అన్ని వీల్లు వీల్ల క్రింద ఉన్నోల్ల మీద ప్రయోగిస్తరు. వీల్ల పైనున్నోల్ల మీద వీల్లు పాలిటిక్స్ చెయ్యలేరు. వీల్లకు సదువు రాని దళితులన్నా, దళిత ఆడ్లోన్నా, ఇంకా వీల్ల కిందున్న ఉపకులాలోల్లనా వీల్లు చాల నిర్లక్ష్యం చేస్తున్నారు. దళిత లీడర్లంతా వాల్ల స్వార్దం వాల్లే చూసుకుంటున్నారు. ఈ ఉత్సవాల అడ్వయిజర్లు అంతా నేటికి మగలీడర్లే ఉన్నారు. ఈ అవార్డులు, రివార్డులు పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అన్ని వాల్లే పొందగల్గుతున్నారు. ఆ స్టేజీల మీద కూర్చున్న లీడర్లల్లో కొంతమందైతే వాల్లెక్కడ పోరాడింది ఉండదు. ఏ పోరాటాల చరిత్రలల్లో వారి గురించి ఏ పేజీలో నాల్గు అక్షరాలు రాసి ఉన్న దాఖలాలు లేనివారు కూడా వాల్లకు వాల్లే బలవంతపు తీర్పునిచ్చుకుంటున్నారు. ఏ ఉద్యమాలల్లోనైనా త్యాగాలు కొందరివి అయితే ఫలితాలను అనుభవించేవారు మరొకరు అవుతున్నారు. ఇది ఏ పోరాటాన్ని నెమరు వేసుకున్నా అంతే జర్గిందీ జర్గుతుంది. ఈ సంవత్సరంలో ఇచ్చిన దళిత రత్న, యువరత్న అవార్డులు మొత్తం 40 అయితే అందులో ఇద్దరి మహిళలకే అవకాశం దక్కింది. ఒకరు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధిగా పనిచేసినారు. ఇంకొకరు ఏ పోరాటంలో పని చేశారో ఎవ్వరికి తెలియదు. ఒక మాదిగ ఉపకులం లీడర్ నందిగామ నర్సింహ్మ అనే బైండ్లాయనకు ఈ దళిత రత్న అవార్డు దక్కింది. అతను ప్రతిసారి దళితులంటే మాల మాదిగోల్లేనా? మేముకాదా? అని కొట్లాడటం ద్వారా ఆయనకు ఈ అవార్డును దళిత లీడర్లు భయపడి ఇచ్చినారు. ఇంకా ఇట్లా కొట్లాడ వలసిన ఎస్సీ ఉపకులాలు దాదాపు 56 దాకా ఉన్నాయి. మొత్తం ఎస్సీ కులాలు రాష్ట్రంలో 59 ఉంటే అందులో మాల, మాదిగ, బైండ్లను పక్కన బెడితే మిగిలిన ఎస్సీ ఉపకులాలు, మొత్తం ఈ దళిత సంఘాల నాయకుల మీద నందిగామ నర్సింహ్మ బైండ్లలాగా తిర్గబడాలి, ఎస్సీ రిజర్వేషండ్లల్లో వీరికి రావాల్సిన ప్రతి ఫలితాల్ని అందుకునేందుకు వీరంతా ఎవ్వరికి వారు పోరాడాలి. ఎవ్వరైనా పై కులాలపై క్రిందికులం వారు తిర్గబడితేనే పై కులపోల్ల కుర్చీల కదలికలు జర్గుతాయి. అప్పుడే దళిత లీడర్లకున్న పదవి వ్యామోహం, పేరు ప్రతిష్ఠలు వారినుండి తొలగిపోయి తోటి క్రింది కులాల అభివృద్ధి, స్త్రీల అభివృద్ధి జరుగుతది. లేకుంటే ఎస్సీ సంక్షేమం, మరియు ఏ ఇతర దళిత అభివృద్ధి పేరుమీద అందే పావులో పర్కో అందరికి సమంగా అందకుండా కొందరే మెక్కుతారు.
జయంతుల ఉత్సవ సభలల్లో దళిత మహిళలకు జరిగిన అవమానం
సభ ప్రారంభమైనప్పటినుంచి సభలు ముగించే వరకు ఈ రెండు సభలల్లో ఒక్క దళిత మహిళకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ”మేము మహిళలము మాట్లాడుతం అంటే” మీరేంమ్మాట్లాడ్తరు అంత మేమే మాట్లాడినంగదా అన్నరు. లేదు మేము మాట్లాడ్తమని అంటే వాల్లన్నరు కావాలంటే మీ ”మేరి మాదిగను పాటపాడమనుండ్రి” అని సభా అధ్యక్షులు, వేదిక మీద ఉన్న మగవాల్లు ఆ మాటను మైకులో చెప్పి వాల్లు పాటకోసం చూస్తూ కూర్చిల్లో కూర్చొని సూస్తున్నరు. అప్పుడు స్వర్గీయ అమ్మ సదాలక్ష్మి ప్రారంభించిన మాదిగ హక్కుల దండోరా పోరాటాన్ని ముందుకు తీసుకెల్తున్న వారిలో బైండ్ల కులం నందిగామ నర్సింహ్మ, కె.ఎస్. బాబు మాదిగ వర్గం నాయకుడు ఆయన స్టేజీమీదినుంచి లేసి మహిళల తరపున మేరక్క మాట్లాడాలి అని గొడవ చేస్తుంటే దళిత మహిళలు, ఉపకులం వారు అంతా ఆ సభా వేదిక దగ్గర ఒక్కటై గొడవ చేస్తే అప్పుడు చివరిగా మేరిని మాట్లాడమంటే తను మాట్లాడుతుంది. ఆమె మాటల్ని ప్రేక్షకులు శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు స్టేజీ మీదున్న దళిత నాయకులు కొందరు స్త్రీ వ్యతిరేకులు, బలమైన స్త్రీ నాయకత్వాలను ఓర్వలేని మగ దళిత లీడర్లు మైకు బందువెట్టినారు. దానికి పెద్దగ గొడవ జరిగింది. అక్కడ జరుగుతున్న ఆ గొడవను ప్రేక్షకులు కార్యకర్తలు కొంత మంది నాయకులు సద్దు మనిగించారు. ఒక రెవల్యూషన్ మాదిగ ఉమెన్ దళిత స్త్రీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేని దళిత మగ నాయకులు స్త్రీ అభివృద్ధిని, అధికారాన్ని, సాధికారతని, నాయకత్వాన్ని సమర్దించలేని దళిత మొగ లీడర్లు, దళిత పేద స్త్రీలను ఎదిగించాలనే మానవత్వం లేని దళిత పురుషు నాయకులను, అంబేడ్కర్, జగ్జీవన్‌రాం వారసులని మేము ఎలా అనుకోవాలి? వాల్ల నాయకత్వాలని మేము ఎంతకాలం అంగీకరించాలి. మానవతా వాదులు స్త్రీ వాదులు మీరే ఆలోచించండి.
మాల దళిత లీడర్లు, మాదిగ దళిత లీడర్లు ఈ సంవత్సరం ఉత్సవాలకు తక్కువగా హాజరయినారు. వారిలో ఎక్కువగా మాదిగలే వచ్చినారు. ప్రతి సంవత్సరం మాలా మాదిగ మగ లీడర్లు ఉత్సవ వేదికమీద కూర్చొని వర్గీకరణ అంశంమీద గొడవకు దిగేది. ఈ సంవత్సరం దళిత స్త్రీల నాయకత్వాన్ని పెంచాలనే అంశంపై గొడవ జరిగింది. ఇది మంచి విషయమే అయినా దళిత స్త్రీల శక్తి అక్కడ సరిపోలేదు. దళిత స్త్రీల నాయకత్వాలని బలోపేతం చేయాల్సిన బాధ్యత అన్ని రంగాల్లో ఎదిగిన దళిత మహిళలపై వుంది. ఇంకా ఈ హైద్రాబాద్‌లో పుట్టి పెరిగినోల్లే ఈ రాష్ట్ర ఉత్సవాల కమిటీల నాయకులు కన్వీనర్లుగా కో-కన్వనర్లుగా, మెంబర్స్‌గా కళాకారులుగా, ఆర్గనైజర్స్‌గా అంతా హైద్రాబాదువాల్లే ఉన్నారు. ఈ అవార్డులు, రివార్డులు అన్నీ ఈ పట్నపోల్లే అందుకుంటున్నారు. ఇతర జిల్లాల నుంచి వలస వచ్చిన వారిని మాత్రం ఈ దళిత లీడర్లు, మాదిగ లీడర్లు కళా సంఘాల నాయకులు, వాల్లను ఈ ఉత్సవ కమిటీలల్లో చేర్చుకోవటంలేరు. మారుమూల జిల్లాల్లో పల్లెల్లో మార్పును తెచ్చే ప్రజా సేవచేసే కార్యకర్తలు, వీరికంట పడరు. ఒకవేళ పడ్డా అకడమిక్ లెవల్లో ఉన్నవారే తప్పా! గ్రాస్‌రూట్ పోరాటం నుంచి వచ్చినవారిని వీరు వెతకరు, వీరికి కనపడ్డా వారి ప్రతిభను వీల్లు గుర్తించరు. అందులో దళిత స్త్రీలు, మాదిగ స్త్రీలు అస్సలే కనపడరు. వాస్తవంగా పురుషులకంటే ఎక్కువగా స్త్రీలల్లోనే అధిక ఉంటాయి. అందులో కింది కులాల స్త్రీలల్లో ఇంకా ఎక్కువగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు ప్రతి పోరాటాల్లో ముందుండి పోరాడి బలి అయిపోయినారు. రాజకీయ రంగంలో, సారా పోరాటంలో, డ్వాక్రా పొదుపు ఉద్యమంలో పోరాటం చేసిన దళిత స్త్రీలు కారంచేడు, చుండూరు సంఘటనలల్లో బలియయి పోయిన బాధితుల తరపున పోరాటాన్ని కొనసాగించి ఆ పోరాటంలో గెలిచిన సులోచనమ్మ మాదిగ జోగిని, స్త్రీల హక్కులకై రక్షణకై ఉద్యమించిన మహబూబ్‌నగర్ ఆజమ్మ, చేసిన పోరాటాన్ని మీడియా వారు గుర్తించింది. ఈమెకు టివీ9 వాల్లు అవార్డు కూడా ఇచ్చినారు. ఇలా చాలా మంది ప్రతిభ కలిగిన దళిత స్త్రీ నాయకురాల్లు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్నవారు ఉన్నారు. వీల్లంతా దళిత మహాసభ ఉద్యమాల్లో దళిత పురుషులతో సమానంగా పోరాడిన వారు దళిత మహిళా నాయకురాల్లు నేటికి మీకల్లముందే ఉన్నారు. లేరని వీరు చెప్పగలరా? ఉన్నారని మేం నిరూపిస్తాం.
నెల్లూరు జిల్లా దూబగుంటలో దళిత స్త్రీలు సారా పోరాటాన్ని ప్రారంభించినారు. వీరి చరిత్ర దేశంలో ఎంతో సంచలనాన్ని సృష్టించింది. అప్పట్లో వీరి పోరాటాలు రాష్ట్ర రాజకీయాల్నే తారుమారు చేయగలిగాయి. వీల్లు మీరిచ్చే దళిత రత్న అవార్డులకు పనికిరారా? డ్వాక్రా పొందుపు సంఘాల్లోని దళిత మహిళా నాయకురాల్లు బిల్‌క్లింటన్, రాష్ట్రపతి, గవర్నరు, సోనియాగాంధీ, ముఖ్యమంత్రి చేతులమీదుగా అవార్డులు పొందిన దళిత మహిళా లీడర్లు మీకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకురాలు మీకు కనపబడటం లేదా? పోనీ స్థానిక ఎస్సీ మహిళ రిజర్వేషండ్లలో సర్పంచ్‌లుగా, ఎంపిటిసిలుగా, జెడ్‌పిటిసి సభ్యురాండ్లుగా గెలిచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన, దళిత మహిళా ప్రజా ప్రతినిధులు మీ మీరిచ్చే అవార్డులకు అనర్హులా? కుల హింసలో హింసకు గురైన స్త్రీలను కుటుంబ హింసకు గురిఅయి, గృహ హింసకు గురిఅయిన స్త్రీలను ఆదుకోని వారి రక్షణకై కృషి చేస్తున్న స్త్రీ ఉద్యమకారులు ఈ అవార్డులకు అనర్హులే?
యూనివర్సిటీస్‌ల్లో ఉన్నత విద్యలో ప్రావీణ్యం పొంది, లెక్చరర్స్‌గా, ప్రొఫెసర్లుగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్ క్రింది స్థాయి ఆఫీసర్లుగా, మండల జిల్లా స్థాయి అధికార్లుగా, ప్రమోషన్లు పొంది నిజాయితీగా వృత్తిరీత్యా తమ సేవల్ని అధికారంలో వినియోగిస్తున్న దళిత మహిళా అధికార్లు ఈ అవార్డులకు అనర్హులా? స్వచ్చంద సంస్థల్లో దళిత స్త్రీల పాత్ర శ్రమ కీలకంగా వుంది. వీల్లు దళిత మానవ హక్కుల రక్షణకై అనేక విధాలుగా పనిచేస్తున్న వారు కార్యకర్తలుగా, సంస్థల అధిపతురాల్లుగా, జిల్లాలవారిగా మండలాల వారిగా దళిత మహిళల అభివృద్దికే నిరంతరం సేవ చేస్తున్న స్త్రీలు, ఎంతోమంది ఉన్నారు. వారి సేవ దళిత సేవకాదా?
దండోరా ఉద్యమములో అనేక సార్లు జైలుకెల్లీ లాటీ దెబ్బలు తిని, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు సాధించేందుకై ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఏబిసిడిల బిల్లును తెలుగుదేశం హయామ్‌లో సాధించిన మాదిగ మహిళలు, మేరి మాదిగ, శోభా మాదిగ, రాణి మాదిగ, సృజన మాదిగ, పుష్ప మాదిగలు ఈ దళిత రత్నకు, యువరత్న అవార్డులకు వీల్లు అనర్హులా? 1998లో వీరు సాధించిన వర్గీకరణ బిల్లు ఫలితంగనే నాలుగున్నర ఏండ్లు మాదిగ ఉపకులాల ప్రజలకు న్యాయం జరిగింది. ఈ మాదిగ మహిళలు చేసిన సాహసమైన ఘట్టం వీరి త్యాగానికి ఎవరు గుర్తింపు ఇవ్వాలి? ఇది దళిత నాయకుల నిర్లక్ష్యం కాదా? ఇది మాదిగ దండోర చరిత్రలో ఘనమైన ఘట్టం దీన్ని మాదిగ పెద్దలు దళిత పెద్దలు అర్దం చేసుకోరా? డక్కలి చిందూ మాష్టి, జోగిని, మాతమ్మ, గోసంగి రెల్లీ మ్యాతరీ, వీరముష్టి, బుడ్గ జంగాలు, బైండ్లా, బాల సంతులు సంచార జాతుల కళాకారులకు వృత్తి కళాకారులు చిందుయక్షగానం డక్కలి జాంభవ పురాణాలు చెప్పే కళాకారులకు మీరు ఈ అవార్డులు రివార్డులు ఇవ్వలేరా? ఆది జాంభవ పురాణంలో చరిత్రను చెప్పే ఆదిపరాశక్తి, ఎల్లమ్మ, జమదగ్ని, జాంభవంతుని, అరుంధతి పాత్రలతో ఏషమేసి ఆటలాడే మాదిగ ఉపకులాల సాహిత్య కళాకారులు మీ అవార్డులకు పనికిరారా? వారి గొప్పతనాన్ని మీరు ఎప్పుడైనా గ్రామాలల్లోకెల్లి వాల్ల కళా నైపుణ్యాన్ని కళ్లారా చూసినారా? ఈ హైద్రాబాద్ సోకాల్డ్ దళిత నాయకులు ఒకవేళ చూసినా చెప్పరు. చెప్పితె నామోషి అయితదనేమో చెప్పరు. ఎందుకంటే కొందరిలో దళితెచ్చులుంటాయి అని అంటరు గద? అవ్వి గివ్వేనేమో. చెప్పులు గుట్టె మాదిగ యాదయ్యల్ని డప్పులు కొట్టే మాదిగ రామయ్యల దరువులకు ఈ దళిత రత్నలో గుర్తింపు లేదా? కోళాటం చెక్క భజన చేసే కనకయ్యల్ని, ఆవుల్ని కోసిన గ్రామీణా మాదిగ పెద్ద మ్యాతర్లయిన సైంటిస్టులకు ఈ అవార్డులు పనికిరారా? రాజకీయాల్లో నీతి, నిజాయితీగా పనిచేసి అర్దాకలికి అలమటిస్తూ రోడ్ల మీద అడుక్క తింటున్న దళిత మాజీ ఎంఎల్‌ఏలు ఈ దళిత రత్న అవార్డులకు పనికిరారా? ఆడోల్ల హక్కుల గురించి మాట్లాడి పనిచేసే వాల్లు, రచనలు చేసే దళిత రచయిత్రులు, ఈ అడ్వయిజర్ల కండ్లకు కనపడరా? దయచేసి ఈ పాడు సంస్కృతికి దళిత మగలీడర్లు ఇకనైన పులిస్టాప్ పెట్టి కొత్త పద్దతుల్లో దళితుల అభివృద్దికై అందర్ని గౌరవించే సంస్కృతికై కృషి చెయ్యాలి. అప్పుడే మీరు నిజమైన అంబేడ్కర్, జగ్జీవన్ వారసులు. అందుకే మీరు మారి ఇతరుల్ని మార్చండి ఇకనైన సాంఘీక సంక్షేమ శాఖ వారు, ప్రభుత్వం తరపున దళిత సంఘాల ఆధ్వర్యంలో రాబోయే సంవత్సరం చేపట్టబోయే జయంతి ఉత్సవాలలోనైనా నూతన మార్పులకు స్థానం కల్పిస్తే, దళితుల్లో అన్ని వర్గాల వారు అన్ని జిల్లాల వారు భాగస్వామ్యం అయ్యేలా చేస్తే బాగుంటదని మా ఆశ. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి నీతిగా, నిజాయితీగా దళిత అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తున్న అన్ని రంగాల వారిని 59 కులాల వారిని ప్రాంతాల వారిని 50 శాతం అన్ని రంగాల్లో ఉన్న దళిత స్త్రీలను గౌరవించి ప్రోత్సహించడం జర్గాలి. లేని పక్షంలో ఇది ప్రజా స్వామ్యానికి విరుద్దంగా కొనసాగే అంబేడ్కర్, బాబుజగ్జీవన్‌రామ్ ఉత్సవాలు అని దళిత స్త్రీలు, ఉపకులాల వారు ప్రచారం చెయ్యాల్సివస్తది. రాబోయే రోజుల్లో రాష్ట్ర దళిత లీడర్లు ఆధునిక పద్దతుల్లో అనేక మార్పులు చేసి ఈ ప్రభుత్వం ద్వారా చేపట్టే ఉత్సవాలను, సంక్షేమ బడ్జెట్‌ను వ్యతిరేకించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ ఉత్సవాలకు హాజరయ్యే నాయకులు ఎక్కువవుతున్నారు. ప్రేక్షకులు తక్కువవుతున్నారు. అనే విమర్శ కూడా ఉన్నది గత సంవత్సరం దళిత స్త్రీలు గొడవచేసిన కారణంగా, నామ్‌కే వాస్త్తే ఒక జీవా మాదిగను వైస్ చైర్మెన్‌గా నియమించినారు. నల్గురు దళిత మహిళలను 500 మంది మొగ నాయకుల లీస్టులో ఈ నల్గురి పేర్లు మాత్రమే బలవంతంగా వేసినారు. ఇప్పటివరకు రిజిస్టర్ అయిన దళిత సంఘాల నుండే మహిళా నాయకురాల్లను ఈ నల్గుర్ని తీసుకున్నారు. కొత్త సంఘాలకు అవకాశాన్ని కల్పిస్తలేరు. కావున స్త్రీల శాతాన్ని మీ సంఘాల్లో ఇంకా పెంచి జిల్లాల వారిగా దళిత స్త్రీల నాయకత్వాలల్లో పనిచేసేవారిని కూడా చేర్చితే బాగుంటది. అప్పుడే ఉన్నత స్థాయిలో క్రింది స్థాయిలో, దళిత మహిళ అభివృద్ధి పట్ల సేవ చేస్తున్న దళిత స్త్రీలని వారిని గుర్తించి గౌరవించిన వారవుతారు. ఇకనైన వారిని గౌరవించి ఆహ్వానించాల్సిన బాధ్యత దళిత సంఘాల మగ పెద్దలపై ఉంది. దళిత పురుషులతో పాటు దళిత స్త్రీలను, ఉపకులాల పురుషులను, స్త్రీలను గుర్తించి వారి శాతాన్ని దశల వారిగా పెంచాల్సిన అవసరము ఎంతైనా ఉంది. లేకపోతే దళిత పెద్దల్ని ఈ ఉత్సవాలకు అనర్హులుగా ప్రకటించాల్సి వస్తది.
దళితులంటే మాలా, మాదిగలేనా! అనే మచ్చ దళిత లీడర్లకు పోవాలి అంటే మాలలు ఎవరికి వాల్లు మాల అనుబంధ కులాలలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించాలి. మాలా మరియు మాల ఉపకులాల స్త్రీల అభివృద్ధికై మాల నాయకులు కృషి చెయ్యాలి.
మాదిగ, మాదిగ అనుబంధ కులాల కోసం పని చేసిన వారిని, చేస్తున్న వారిని మాదిగ స్త్రీల ఉపకులాల స్త్రీల అభివృద్ధి కోసం, అన్ని స్థానాల్లో, ప్రతిభ ఉన్న వారిని గుర్తించి గౌరవించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత మాదిగ పెద్దలపై ఉన్నది. ”మనల్ని మనం కించపర్చుకునే సంస్కృతి పోయి మనల్ని మనం గౌరవించుకునే” సంస్కృతి రావాలి. ఆరోజే దళితుల్లో ఐక్యత పెరిగి అభివృద్ధి జరిగి రాజ్యాధికారం సాధ్యమౌతుంది. ఇందుకనే దళిత లీడర్లను మారమంటున్నాం. దొరలు మారిండ్రూ, దొర భార్యలు సినిమా హిరోయిన్లు దొరకొడుకులు, రాజకీయాలు జేస్తుండ్రు. దళితులు మారి దళిత స్త్రీలకు దళిత బిడ్డలకు నాయకత్వాల్లో అన్నింటిలో స్థానాలు కల్పించాలి.
ఈ మహానీయుల జన్మదిన జయంతుల సందర్భంగా ఇవి మా గోసలు.