ఛాయాదేవి గారితో తమ పరిచయం గురించి ఆత్మీయులందరూ సంతృప్తిగా వివరించగలరు. ఆ గౌరవం ఎంతమందికి దక్కుతుంది? ముప్పయ్యేళ్ళ నుండి హైదరాబాద్‌లో ఉన్న చాలామంది రచయిత్రులకి ఆమె సన్నిహితురాలే, స్నేహితురాలే. ఆమె మానసిక పరిధి చాలా విశాలమైనది. చాలామంది ఆచరించలేని విలువలని చాలా సాత్వికంగా, సునాయాసంగా ఆమె ఆచరణలో పెట్టి ఉంటారు అనిపిస్తుంది. అటువంటి భేషజం, అహం లేని రచయిత్రులని చూసి మా తరం… ఆ తర్వాత తరం చాలా నేర్చుకోవాలనిపిస్తుంది.
ఆమెలో ఉన్న ఇంకో విశిష్టమైన గుణం… మన రచనలు ఏమయినా ఆమెకిచ్చి చదవమంటే ప్రేమగా అందుకుని.. అంతకన్నా అభిమానంగా చదివిన వెంటనే ఫోన్ చేసేవారు. ఒక్కో కథ గురించి తన అభిప్రాయాలు చెబుతూ, అవెందుకు తనకి నచ్చాయో వివరించేవారు. అటువంటి సంస్కారం, శ్రద్ధా ఎంతమందికి ఉంటుంది? (నేనయితే మంచి కథ చదివి పరవశిస్తా కానీ ఆయా రచయితలకి ఫోన్ చేయాలనుకుంటూనే రోజులు గడిపేస్తా). ఆమెను తరచూ కలుసుకుని ఆమె అనుభవాలు వినలేకపోయామే అనే విచారం నన్ను వేధిస్తూనే ఉంటుంది. ఆమె సృజనాత్మకతా, సమయపాలనా… పరిసరాలను అనుకూలంగా మార్చే ఓపికా (సి.ఆర్.ఫౌండేషన్ లైబ్రరీ గురించి ఆమె చేసిన ఏర్పాటు) ఉన్న ప్రతిభావంతురాలు.
సౌజన్యం, నిరాడంబరత, నిష్మల్మషతా ఒకే చోట ఉండడం చాలా అరుదు. అటువంటి వారిని అజాతశత్రువులని పిలవవచ్చేమో. ఇదివరకు నాక్కావలసిన కొంతమందితో పాటు ఈ నగరంలో ఛాయాదేవిగారనే అపురూపమైన వ్యక్తి ఉన్నారు అనే నిశ్చింత ఉండేది. కాని… కాని ఓ అద్భుతమైన వ్యక్తిని సాహితీ ప్రపంచం కోల్పోయింది. సరళమైన స్వభావంతో, తాత్వికతతో అందరినీ ఆకట్టుకోలేకపోయిన ఆమె వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో… అభిమానుల ప్రతిస్పందన చూస్తుంటే అర్థమవుతోంది గదా! ఆమె కథలని ప్రచురిస్తూ పత్రికారంగం తమ నివాళిని సగౌరవంగా చాటుకుంటున్నది.
ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన వ్యవహారాలని ఎంతో బాధ్యతగా నిర్వర్తించిన భూమిక సత్యవతి గారికి, తదితర మిత్రులకి ఎన్ని కృతజ్ఞాతాభివందనాలు చెప్పినా తక్కువే.