అతడు గుర్తుండే ఉంటాడు…
పసిప్రాయంలోనే ప్రాణస్నేహితుడిగా
నమ్మిన ప్రేయసి కోసం నరాల్ని
తెగ్గోసుకునే కపట ప్రేమికుడు కాదు…
ప్రేమించడమంటే తన కోసం
నడిచొచ్చిన ఆత్మీయతను
తలతెగి పడినా వదలని
మహోన్నత శిఖరంపై నిలబడి
తాను శవమైనా…
శవాల్లా బ్రతుకుతున్న
కులోన్మాదుల గుండెల్లో బాకై
గుచ్చుకున్నవాడు…
అతడు గుర్తుండే ఉంటాడు!
ఆస్తి, అంతస్థులు, కుల దురహంకార
మతోన్మాద అడ్డుగోడల్ని కూల్చాలంటే
కులం పునాదుల మీద ప్రేమ పంజరాల్ని
కట్టలేమని తెలిసినవాడు…
లైలా మజ్నూల కన్నా…
అద్భుతమైన ప్రేమ నగరాన్ని నిర్మించాలని
కలలు కన్నవాడు…
అతని గాలి సోకగానే
కసలి బుసగొట్టే కాలనాగులు
కాటేస్తాయని తెలిసినవాడు…
పరువు, డబ్బు, ఆస్తులు, అంతస్థులు
పేకమేడల్లా కూలిపోతాయని
అమృతాన్ని చిలికిన వాడు…
అతడు… అంబేద్కర్ కులం పునాదుల్ని
ప్రేమ గునపాల్తో పెకిలించ పూనుకున్నాడు…
చుట్టూ అలుముకున్న మతోన్మాద
కుంపట్లో కాలిపోతానని తెలిసినా…
బతుకు కోసం… భయపడి పారిపోనివాడు…
తాను నమ్మిన సత్యం కోసం
తల తెగిపడుద్దన్నా వెనుదిరగని
… ప్రేమాస్పదుడు
ప్రణయామృతంలో విషం
చిమ్మే కులోన్మాద కుట్రల్ని పసిగట్టలేని
అమాయకత్వాన్ని… మానవీయంగా
పెంచుకున్నోడు…
తన కలల్ని, అందమైన
జీవితాన్ని తాకట్టు పెట్టనోడు
ప్రేమించడమంటే మానవత్వం కోసం
మరణించడమేనని…
కులమతోన్మాద శిఖరాలపై
తన రూపాన్ని ‘నిహాన్’లా
అమృతకు అందిచ్చి
అమరుడైనవాడు…
అమృత విలాపాన్ని… అమానవీయ
దురహంకార్లను కాల్చే
ప్రేమఖడ్గంగా ఆమె చేతుల్లో
పెట్టి అమరుడైనవాడు…
అమృతా ప్రణయ్…