ఒళ్ళంతా ఉక్కపోతతో
తడిసి ముద్దయింది
బురదలో దూరి
బురద ఒళ్ళంతా పులుముకుని
స్వచ్ఛంగా వెలిగిపోతున్నాం
అనే వాళ్ళను చూస్తే
ఎడతెగని ఉక్కపోత
తమ గురించి తామే
మృదంగం వాయించుకుంటూ
ఇంటిమీదెక్కి కొక్కొరొక్కో
మా మాయరోగం చూడండని
అరిచే వాళ్ళని చూస్తే
ఎడతెగని ఉక్కపోత
లోలోపల ఉడికేసే వంటలు
అందరికీ వడ్డిస్తూ
మేం వండిందే వంట
మీరంతా అదే తినాలంటూ
ఆజ్ఞ జారీచేసేవాళ్ళను చూస్తే
ఎడతెగని ఉక్కపోత
చేసేది చాపకింద కప్పెట్టి
మాది పొంగి పొరలే దేశభక్తి
నీవి పచ్చకామెర్ల కళ్ళని
ఎదురు దాడి చేసేవాళ్ళను చూస్తే
ఎడతెగని ఉక్కపోత
తనకి కావలసింది తాను
సాధించుకోవడం కోసం
నీతి నియమం తప్పి విలువలకు
నీళ్ళొదిలే వాళ్ళను చూస్తే
ఎడతెగని ఉక్కపోత
మొహం మీద పులుముకున్న
నవ్వుల పువ్వులు మొలిపిస్తూనే
కత్తులు దూసి రణరంగం సృష్టించే
వికృత ముఠాలను చూస్తే
ఎడతెగని ఉక్కపోత
జనాన్ని పిల్లిమొగ్గలు వేయిస్తూ
పిచ్చి కుక్కల్లా మార్చానని
ఒంటిమీద కప్పుకున్న
ఒక్కొక్క పొరని విప్పుకుంటూ
నగ్న నృత్యం చేసేవాళ్ళని చూస్తే
ఎడతెగని ఉక్కపోత