ఆమె జీవితం ఒక సౌగంధ్య పరిమళం
ఆమె పాదాలతో తడిసి ఏరు పరిమళిస్తుంది
ఆమె పాటలు విని మేఘాలు వర్షిస్తాయి
ఆమె నవ్వుల వాన
రాజ్యం ఆమె నవ్వు ముందు ఓడిపోతుంది
ఆమే మూలవాసిని
కట్టెల మోపును ఆమె మోస్తూ వెళ్తున్నప్పుడు
భూమిపై ఆమె అడుగులు శాసనబద్ధం అవుతున్నాయి
ఆమె గిట్టలు గుర్రపు గిట్టల కంటే
దారుఢ్యం కలవి సుమా!
ఈతలో ఆమె శ్వాసనిస్వాసాలతో
అలలు గీతాలు పాడుతున్నాయి
ఆమె పిల్లవాణ్ణి చంకనెత్తుకొని
నీళ్ళ బిందె తలనెత్తుకు నడిచినప్పుడు
చుక్క నీరు కదలకుండా అడుగులు వేయగలదు
ఆమె ముడిలో మల్లి పూల చెండు
పొదిగి నడుస్తుంటే నక్షత్రమండలి
ఆమె చుట్టూ నాట్యం చేస్తుంది
ఆమె వాడకు అందం
అడవి ఆమెకు ఓ సంపద
నెమళ్ళ నృత్యాలు ఆ సవర స్త్రీ నాట్యాన్ని
చూసి విస్తుపోతున్నాయి
నాట్యంలోని ఒడుపుకి వన్నె తెచ్చుకొన్నాయి
జలపాతాల సవ్వడి ఆమె గుంపు నృత్యానికి
మృదంగ వాద్యాలు మ్రోగిస్తుంది
ప్రకృతిని సమన్వయించుకొన్న
ఆమె ఓ భాషా నిఘంటువు
చెట్లకు పేర్లు పెట్టిన ఆమె
ఆకుల నుండి ఔషధాలు తీసింది
క్రూరమృగాలు ఆమె గజ్జల చప్పుడుకు
వెను తిరుగుతాయి
ఆమె కేకకు చల్లబడతాయి
ఆమె ఈ నేల బిడ్డ ఈ నేల ఆమె తల్లి
ఈ పుడమికి ఆమె శ్రమ పరిమళం అద్దింది
తాటి ఆకు గుడిసె నుండి కూడా