‘నిను వీడని నీడను నేనే’ అని ఆత్రేయ ఒక పాట రాశారు. ఎక్కడకు వెళ్ళినా వెంటాడేది నీడ మాత్రమే కాబట్టి నిన్ను నీడలా వెంటాడుతా అని అర్థం.
‘మతం’ కూడా నీడలాంటిదేనేమో… పుట్టుక మొదలు చావు వరకూ మనల్ని వెంటాడుతూనే
ఉంటుంది. అయితే నీడ పడాలంటే కాంతి తప్పనిసరి అనే ఒక సైన్స్ సూత్రం ఉంది కాబట్టి చీకట్లో నీడ నుండి తప్పించుకోవచ్చు. కానీ మతం నుండి తప్పించుకోవడం చాలా కష్టం. ఇలా తప్పించుకోకుండా
ఉండేందుకే ఆధిపత్య వర్గాలు మనువాద భావజాలంతో కుట్రలు చేశాయి. కులమతాలు లేని లక్షల సంవత్సరాల మానవ జీవపరిణామ క్రమాన్ని మతం, కులం అనే బోనులో పకడ్బందీగా బందీ చేశాయి.
మతం చెప్పడానికి నిరాకరిస్తున్నవారు మన దేశంలో లక్షల్లో ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మాకు ఏ మతం వద్దు అని అనేకమంది దశాబ్దాలుగా ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. 1957-58లలో స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ నాస్తికులు అయిన గోరా దంపతులు తమ పిల్లలు (సమరం, విజయం) విషయంలో మతరహితులుగా ప్రకటించుకునే అవకాశం ఇవ్వాలని కోరగా, అప్పటి అసెంబ్లీ సమావేశాలలో ఈ విషయం చర్చకు వచ్చింది. వీరే కాదు, అనేకమంది దశాబ్దాలుగా ఇటువంటి అస్తిత్వ ప్రకటనకు వీలుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వ్యక్తిగత స్థాయిలో అనేకమంది ఇటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాలలో వ్యక్తిగత పరిష్కారం చూపడం, లేక తమకు తోచింది నింపడం, దాటవేయడం అనే పద్ధతి కొనసాగుతోంది. కానీ విధానపరమైన నిర్ణయం తీసుకోవడం లేదు. అయితే ఈ పోరాటం ఈనాటిది కాదు. మతంతో పాటు మతాన్ని వ్యతిరేకించే లోకాయతులు, చార్వాకులు, బౌద్ధులు ఆయా కాలాలలో ఉన్నారు. వారి వారసత్వం కొనసాగుతూనే ఉంది.
మతం పేరిట జరిగిన మారణహోమంలో కోట్లాది మంది చనిపోయారు. మానవ శిరసుల్ని కోట గుమ్మాలకు కట్టారు. ఒక ఆధిపత్య మతం వారు ఇంకొక మతంపై జరిపిన ఊచకోతలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు. ఒక్క మన దేశంలోనే మతం పేరిట గత 70 ఏండ్లలో కోటి మంది వరకు హత్యకు గురయ్యారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇక కులం సంగతి కూడా అంతే. నిత్యం ఏదో ఒక ఊర్లో, ఎక్కడో ఒకచోట ఈ కులం కారణంగా అవమానాలకు, దాడులకు, అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. దళితులన్న కారణంతో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక దాడి, ప్రతి ఇరవై నిమిషాలకు ఒక హత్య, ప్రతి రోజు రెండు అత్యాచారాలకు గురవుతున్నారు. మన సమాజ ఉత్పత్తి వ్యవస్థ అనేక మార్పులకు గురవుతున్నా నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో ఒక కులానికి చెందినవారు మరొక కులం వారిని హీనపరిచే సంస్కృతి కొనసాగుతూనే ఉంది.
దీనికి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని చట్టాలు చేసినా పెద్దగా మార్పేమీ లేదు. మతం పరిధులు దాటి మనుషులుగా ఆలోచించాల్సిన సందర్భంలో మనమంతా జీవిస్తున్నాం. ”ఏది శాశ్వతం కాదు ఒక్క మార్పు తప్ప” అని ఒక పెద్దమనిషి అన్నట్లు మానవాళి తమ మూలాల ఎరుకలోకి ప్రయాణిస్తుందని నమ్ముతున్నాం. కొత్త తరం అలా రూపొందడానికి మన వంతుగా ప్రయత్నిద్దాం. అలాంటి ప్రయత్నంలో ”కుల రహిత మత రహిత అస్తిత్వ ప్రకటన” కూడా దోహదపడుతుందని నమ్ముతున్నాం. ఈ ప్రయత్నంలో మేము మొదటివాళ్ళం కాదు. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఈ దేశంలో కుల నిర్మూలన జరగనిదే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. మహాత్మా జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే, పెరియార్ సహా అనేకమంది మహనీయులు సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. మన తెలుగు నేలపై పోతులూరి వీరబ్రహ్మం, వేమన, భాగ్యరెడ్డి వర్మ, జాషువా ఇంకా అనేకమంది గొప్ప తాత్వికతతో సామాజిక వివక్షలను నిలదీశారు. గురజాడ అప్పారావు ”మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును” అని భవిష్యత్‌పై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ మధ్యనే తమిళనాడుకు చెందిన స్నేహ పార్తిబరాజా అనే న్యాయవాది సుదీర్ఘ పోరాటం తర్వాత ”మత రహితం కుల రహితం (చీశీ =వశ్రీఱస్త్రఱశీఅ – చీశీ జaర్‌వ)” సర్టిఫికెట్ పొందిన మొదటి వ్యక్తిగా వార్తల్లో నిలిచింది. మనిషిని కులంతోనో, మతంతోనో మాత్రమే గుర్తించే ఈ దేశంలో తనకు కుల, మత గుర్తింపులే అక్కర్లేదని తొమ్మిదేళ్ళు పోరాడి, ప్రభుత్వ అనుమతిని సాధించడం సామాన్య విషయం కాదు. అందుకే ”ఇది ఒక సామాజిక విప్లవంగా మారుతుందన్న భయంతో తనకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు ఇంత ఆలస్యం చేశారు” అని అన్నారు స్నేహ.
మన రాష్ట్రానికి వస్తే మా పిల్లల విషయంలోనూ మేము కూడా కులరహితంగా, మత రహితంగా పిల్లలను పెంచాలని భావించాం… అయితే మా (డి.వి. రామకృష్ణారావు, ఎస్ క్లారెన్స్ కృపాళిని) పిల్లలను స్కూల్లో చేర్పించే సందర్భంలో దరఖాస్తులో మతం కాలాన్ని నింపనందుకు స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో కుల రహితం, మత రహితం (చీశీ =వశ్రీఱస్త్రఱశీఅ – చీశీ జaర్‌వ) చెప్పుకునే హక్కు ఉండాలని కోర్టు మెట్లు ఎక్కాం. ఆ సందర్భంలో కోర్టు ”మతం నమ్మడానికి హక్కు ఉందంటే, ఏ నమ్మకం లేకుండా
ఉండడానికి హక్కు ఉన్నట్లే” అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దాన్ని చట్టం రూపంలోకి తీసుకురాలేదు. తరువాత పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ అప్లికేషన్‌లోనూ మతం కాలమ్ తప్పనిసరిగా నింపాల్సిన పరిస్థితిలో ఇక ఇలా కుదరదని మార్చి 2017న హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాము. ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది.
అలాగే 2019 మార్చి 23న భగత్ సింగ్, అతని సహచరుల వర్థంతి నాడు డేవిడ్, రూప దంపతులకు పుట్టిన బాబు ‘ఇవాన్ రూడే’ బర్త్ సర్టిఫికెట్ కోసం స్థానిక మున్సిపాలిటీ ఆఫీసుకు (వనపర్తి జిల్లా కొత్తకోట) వెళ్తే ఏ మతానికి చెందిన వాళ్ళో ‘మతం’ అనే కాలం నింపితే తప్ప సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని కరాఖండిగా చెప్పేశారు. పుట్టుక మొదలూ చావు వరకూ అన్ని సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో తీసుకోవాల్సిన నేటి పరిస్థితులలో ‘మతం’ అనే కాలం నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ రావడం లేదు. మీరు కోరిన ప్రకారం సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతున్నారు.
ఆ క్రమంలో మేము కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశాం. మా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పనంతా న్యాయవాది, పౌరహక్కుల నాయకుడు డి.సురేశ్‌కుమార్ చూస్తున్నారు.
అయితే మన దేశంలో శతాబ్దాలుగా వంచనకు గురై, అణగదొక్కబడ్డ ఎంతోమంది జీవితాలలో రిజర్వేషన్లు కొద్దిపాటి ఉపశమనంగా ఉన్నాయి. వారి అభివృద్దికి ఎంతో దోహదపడుతున్నాయి. ఇవి పోరాడి సాధించుకున్న హక్కులు అనే విషయం మా అవగాహనలో ఉంది. రిజర్వేషన్లు తీసుకునే హక్కు ఎలా అయితే ఉందో, మత, కుల వ్యవస్థల నుంచి బయటకు రావాలనుకునేవారికి ఆ హక్కు ఉండాలని మేము కోరుతున్నాం. ఈ నేపథ్యంలోనే మత రహితం – కుల రహితం (చీశీ =వశ్రీఱస్త్రఱశీఅ – చీశీ జaర్‌వ) అనే అస్తిత్వాన్ని గుర్తించాలని ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం. మా ప్రజాస్వామిక ఆకాంక్షకు మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం.
ఆ క్రమంలో 3 సెప్టెంబర్, 2019 మంగళవారంనాడు హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబుల్లా ఖాన్ హాల్‌లో సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు కుల రహిత, మత రహిత సర్టిఫికెట్ పొందిన మొదటి భారతీయురాలు, తమిళనాడుకు చెందిన స్నేహా పార్తిబరాజా (ఎం.ఎ.స్నేహ) గారితో సంభాషణ ఏర్పాటు చేశాం.