అపారమైన ఖనిజ, అటవీ సంపదలకు నెలవు గనులూ, నిధులూ ఉన్న మన భూగర్భం అడవులూ. నాగరిక, ఆధునిక ప్రపంచం అని, మన ఆవాసాలున్న మైదాన ప్రదేశాలను పిలుచుకుంటున్నాం. కానీ ఇక్కడ నిత్యం రణగొణ ధ్వనులు, బుసలుకొట్టే కాలుష్యం, అంతులేని అంతు తెలియని ప్రమాదాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ పట్టణ, నగర జీవితాలను అభద్రతా యాంత్రికతలోకి నెట్టివేస్తూ శవప్రాయం చేస్తూనే ఉంటాయి. అయినా మనం ఇదే సుఖజీవితమని మనం నాగరికులమని, మేధావులమని గర్విస్తుంటాం.
భూగర్భంలోనూ, అడవుల్లోనూ ప్రశాంతంగా ఉంటుంది. భూమికి సంబంధించిన విపత్తులు, అడవుల్లో కల్లోలాలు, ఆపదలు సంభవించడానికి కారణం మానవ తప్పిదాలు, అకృత్యాలే. రానున్న ఇరవై ఏళ్ళలో గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళికి జరగబోయే శాస్తిని ఊహిస్తే భయకంపితం అవుతాం.
సుదీర్ఘమైన కాల చరిత్రకు సాక్ష్యం పంచ భౌతికాలు అయితే వేల సంవత్సరాల భూమి ఉనికికీ, ఉత్పత్తి చరిత్రకూ సాక్ష్యం పంచభూతాలను కలిగి ఉన్న కాలం.
ఈ నేల, నేల పొరలు, నేల గర్భం అన్నీ అమూల్యమైనవి. భూమి సారవంతమైనది. ఎక్కడ భూమిని లోతుల్లోకి తవ్వినా జీవ సంపదలు బయటపడతాయి. ఇక అడవులు, కొండలూ, కోనలూ, గుట్టలూ, చెట్లూ, పశుపక్షి జంతుజాలం, సెలయేళ్ళూ, వాగులూ, చెరువులూ, కుంటలూ, నదులూ, నదీపాయలూ… మూలికలూ ప్రకృతికీ, ప్రాణకోటకీ, సజీవతకూ, చలనాలకూ నెలవైన నిధులూ, నిక్షేపాలూ ప్రాచీన గిరిజనాలు, ఆదివాసీల ఆవాసాలు… అన్నింటికీ ఆధారం మన కాళ్ళ కింది ఈ నేల.
అనగనగా ఈ భూమి కాలగమనంలో ఈ ప్రాణులు, ఈ ప్రపంచం, ఈ సమాజం, అభివృద్ధీ, ప్రగతులూ, పురోగమనాలూ… వీటితోపాటు పరిణమించిన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దశలు దిశలూ గడుస్తుంటే తెలుగు నేలన పెద్ద ప్రమాదం ప్రజల నెత్తిమీద కాచుకొని ఉన్న రహస్యమొకటి బట్టబయలయింది.
నల్లమల అడవిని చుట్టుకొని ఉన్న ఐదు జిల్లాల అస్తిత్వం, వందల మైళ్ళు విస్తరించిన పల్లెలు, ఆదివాసీల పెంటలు (పేటలు), శివారు గ్రామాలు, కృష్ణానదీ జలాలు, ఉపనదులూ నాశనం కానున్న కుట్ర బహిర్గతమైంది.
… … …
మన ప్రభుత్వాలు ఖనిజ, లోహ నిక్షేపాల నిల్వలను గుర్తించడం, గుర్తించిన ప్రాంతాల్లో సర్వేలూ, పరిశోధనలూ జరిపి తవ్వకాలు చేయాలనుకోవడం చూస్తున్నాం. ఇతర దేశాల నుండి యురేనియం దిగుమతులు చేసుకోవడం కన్నా మన దేశంలో వివిధ ప్రాంతాలలో అపారంగా ఉన్న యురేనియం నిల్వలను గుర్తించి వెలికి తీయడం ద్వారా విద్యుత్ కొనుగోలు వ్యయం తప్పుతుందనీ, విద్యుత్ అవసరాలు తీరుతాయనీ వాదిస్తున్నది ప్రభుత్వం. నిజమే కదా అనిపిస్తుంది.
యురేనియం భారీ ఖనిజం. అది అణుధార్మిక శక్తి కలిగి ఉన్నది. యురేనియం తవ్వకాల వల్ల ఎవరికి ఏ నష్టం లేకపోతే ఈ సందర్భం వేరుగా ఉండేది. కానీ ‘అణు’ ఆగ్రహంలో ప్రజలూ, అడవీ రగిలిపోతున్నవి. జరిగిన, జరగబోయే నష్టం హేయమైనది. నష్టం అంటే ఘోర వినాశనం.
2030వ సంవత్సరం నాటికి మన దేశంలో అత్యధిక శాతం విద్యుత్ అవసరాలు తీర్చేందుకు భారీగా విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. అందుకు అణుశక్తిని పెంచుకోవాల్సి వస్తుంది. దానికోసం యురేనియం నిల్వలను గుర్తించిన ప్రాంతాలను అంచనా వేసి తవ్వకాలు చేపట్టడం అనివార్యం అని భారత ప్రభుత్వం భావిస్తున్నది.
యురేనియం తవ్వకాలు లాభదాయకమైనవే. బహుళజాతి కంపెనీలు బాగా లాభపడతాయి. ఆ కంపెనీలు చెల్లించే డబ్బు, కమీషన్లు పొందేవాళ్ళు బాగా బలపడతారు. రెండు ప్రధాన లాభాలుంటాయని అందరూ గ్రహించిన విషయం.అవి విద్యుదుత్పత్తి, అణు ఆయుధాల తయారీ. మొదటిది అశేష దేశ ప్రజలకు విరివిగా ఉపయోగపడేది, రెండవది దేశ రక్షణకు అణ్యాయుధాలు తయారు చేసుకొని రక్షణలో బలపడడానికి. మరొక ముఖ్యమైన అంశం అణుధార్మిక పారిశ్రామికీకరణ జరుగుతుంది.
1967లో రాయలసీమలో యురేనియం నిల్వలు ఉన్నాయని గుర్తించారు. దశాబ్దంన్నర కాలంగా దానికి సంబంధిత సర్వేలూ, పరిశోధనలూ జరుపుకున్నారు. ప్రజలు నిరసన తెలిపితే తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. నల్లమల ఫారెస్ట్ రిజర్వ్, చుట్టుపక్కల గ్రామాల్లో 83 కిలోమీటర్ల మేరకు వేల అడుగుల పాతాళంలోకి పెద్ద బోరు బావులు వేస్తూ తమ పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఆగంతకులు తమ భారీ మిషన్లను దింపి పల్లెల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ మినీ హెలికాఫ్టర్లలో చక్కర్లు కొడుతున్నారు. ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉలిక్కి పడుతున్నారు.
ఈ తతంగమంతా చిత్ర విచిత్ర రీతుల్లో జరుగుతున్నది. వందల వేల సంవత్సరాలుగా విస్తరించిన అడవులు, కొలువైన గుట్టలు, కొండలు వాటిలో నివాసముంటున్న ప్రజలు తమ జీవనభృతినీ బతుకునిచ్చే అడవినీ విడిచి ఎక్కడికి పోతామన్న అలజడీ, అయోమయంలో ఉన్నారు. తమ ప్రాచీనమైన తావులను వదిలి వెళ్తే అక్కడ ఊరూ, వ్యవసాయ భూమీ, పశుపక్షుల పోషణకు అడవీ ఇత్యాదియన్నీ పునరావాసంలో ఉంటాయా అని ఆవేదన చెందుతున్నారు. ప్రజలు సర్వం కోల్పోతామని నిర్బంధంగా తమను నిర్వాసితులూ, తాము నేలకూ, బతుకుకూ తమనే పరాయివాళ్ళను చేయొద్దని వాపోతున్నారు.
కానీ ఏలినవారు మాత్రం అంతా ప్రజల అభివృద్ధికేనని వాదిస్తున్నారు. అనుమతులిచ్చేశా, అరవకుండా పడి
ఉండండని అన్యాపదేశంగా సూచిస్తున్నారు.
‘అభివృద్ధి’ ఇప్పడు చిత్రమైన భావన. వింత వితండ వాదన అనిపిస్తున్నది. ఈ దేశంలో ఈ చీలికల వ్యవస్థలో పేద ప్రజలకు ఎప్పుడు న్యాయం జరిగిందో వారి అభివృద్ధి ఎక్కడ జరిగిందో గతమంతా శోధించినా గుర్తుకు రాదు. అడవి బిడ్డలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, తరిమివేయడాలు, ఉన్నట్టుండి ప్రమాదాల్లోకి నెట్టివేయడాలు ఈనాటిదే అయినా కొత్త వ్యవహారం ఏమీ కాదు.
ఒక నియంగం, కూడంకుళం, జొదుగూడ, తుమ్మలపల్లి, నంభాపురం, నల్లమల రాష్ట్రం, ప్రాంతం ఏదైనా కావచ్చు అంతటా కంపెనీలూ, ప్రభుత్వాలూ తెగబడటం దౌర్జన్యాలూ, జులుంలు సామాన్యమైనవే.
ఇప్పుడు నల్లమల చుట్టూ ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాలు, ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటుగా కృష్ణానది నీటిని వినియోగించుకునే అన్ని జిల్లాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతాయి. వారి అభాగ్య చక్రం ఎటు తిరుగుతుందో వారిని ఎక్కడికి విసిరేస్తుందో ఏమి జరగనున్నదో అంతా దేవ రహస్యం.
‘అణు’ విపత్తుల భయంతో బక్కచచ్చిన ప్రజలపై ప్రతిక్షణం ‘అనుమతి’ అనే భయానక వాతావరణం ఆవహిస్తున్నది. ఊరించే ‘అభివృద్ధి’ ఫలం, చేతికొచ్చే నష్టపరిహారం, అనుమతించే ఉత్తర్వుల పిడుగుపాటు వీటన్నింటి నడుమ విచ్ఛిన్న, విపరీత పరిస్థితి నెలకొంది.
… … …
ప్రజలు బాగుంటే దేశం, దేశం బాగుంటే ప్రజలు బాగుంటారనే అర్థం. ప్రభుత్వాలు, కంపెనీల వాదనలూ, అడవిలో, పల్లెల్లో నిర్వాసితులు కాబోయే ప్రజలు ఈ రానున్న విపత్తును అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు మరెన్నో రంగాలూ, విభాగాలకు చెందిన పౌరులు యురేనియం తవ్వకాలను ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు నిరసిస్తూ ఉద్యమిస్తున్నారు? ఇంతటి అభివృద్ధికరమైన ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారు?
యురేనియం తవ్వకాలూ, వెలికితీతలో శుద్ధికరణా, దేశ ఉద్ధరణ కోసమంటూ ఎవరు ఎవరికి ‘అనుమతు’లిస్తున్నారు. వందల సంవత్సరాలపాటు వందల మైళ్ళ దూరాలకు ప్రజా జీవనంపై మృత్యుకాండను జరిపే, చూసే ప్రయోగాలకు అనుమతులిచ్చే హక్కు ప్రజాక్షేమం పేరున రాజ్యాంగపరంగా, చట్టపరంగా ప్రభుత్వాలకు ఉండదా?
ప్రత్యామ్నాయ వనరుల వినియోగం, రెన్యూవబుల్ సోర్సెస్, ఇతర రీ స్టోరీస్ పద్ధతులు ఎన్నో ఉండగా ఈ మొండి వైఖరీ, పట్టుదల ఎందుకు?
ప్రప్రథమంగా ఆదిమ తెగల ప్రాచీన నాగరికత స్మృతులూ, జ్ఞాపకాల పుట్టలూ ఛిద్రమైపోతాయి. వారి సంస్కృతి జీవన పునాదులు పెళ్ళగించబడతాయి.
ఏజెన్సీ ప్రాంతంలోనూ, రిజర్వు అటవీ ప్రాంతలనూ కొల్లగొట్టి అవసరం ఏర్పడినప్పుడు వాటిని అంటిపెట్టుకొని ఆధారితులుగా, వందల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న ప్రజా సమూహాలు, వాటికి సంబంధించిన తొలగింపులూ, ధ్వంసాలూ జరిపే ‘అనుమతి’ని ఆయా గ్రామ పంచాయితీల నుండి తీసుకునే పద్ధతి పాటించాలి కదా!
దిక్కుమొక్కులేని పేద జనం, నోరులేని అడవీ, జీవాలూ అని ఆధిపత్య దురహంకారంతో అధికార బలంతో దురాక్రమణ చేయబోతే ప్రజాగ్రహం ఉద్యమమై అగ్నిగీతం పాడుతుంది.
రానున్న రోజుల్లో కంపెనీలూ, ప్రభుత్వాలూ వెనకకు తగ్గుతాయా? ప్రజల నిర్బంధాలకూ, కుట్రలకూ, ప్రలోభాలకూ లొంగిపోతారా? అభివృద్ధి మంత్రం కార్పొరేటీకరణ తంత్రం పారుతుందా? ఎత్తిన నెత్తుటి పిడికిళ్ళు ఉక్కు డేగలతో తలపడనున్నాయా!? గెలుపు ప్రజలదే! ప్రకృతిని పొదుముకున్న కాలమే సాక్షి!