యురేనియం మూలకాలన్నింటిలో అణుధార్మికత (రేడియో యాక్టివిటీ) కలిగిన ఖనిజం. దీనితో అణుబాంబులు, విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఇది భూమిలో ఉన్నంతకాలం హానిలేదు. బయటకు తీస్తే వేలాది సంవత్సరాలు అణుధార్మికతను ప్రసరింపచేసే ప్రమాదకరమైన ఖనిజం.
‘అణుధార్మిక శక్తి’
1896లో హెన్రీ బెక్విరాల్ అనే శాస్త్రవేత్త ఒక రాయిని టేబుల్ సొరుగులో పెట్టాడు. అందులో వెలుతురు సోకని విధంగా ఫోటోగ్రాఫిక్ పెట్టబడి ఉంది. కొన్నిరోజుల తర్వాత టేబుల్ సొరుగులోంచి ప్లేట్ బయటకు తీసి బాగు చేశాడు. ఆ రాయి పెట్టినంత మేరకు ఫోటోగ్రాఫిక్ ప్లేటు మీద కాంతి కిరణాలు ప్రసరించి ఉండడం గమనించి, ఎటువంటి ప్రేరణ లేకుండా, రసాయనిక క్రియ జరగకుండా సూర్యకాంతి ప్రసరించని చీకటి ప్రాంతంలో ఉంచిన ఆ రాయి నుండి విడుదలైన శక్తే అణుధార్మిక శక్తిగా గుర్తించాడు.
దీనిలోని రహస్యాలను తెలుసుకోవాలనుకున్న మేరీ క్యూర్ ఎర్జ్ పర్వతాల నుండి యురేనియం ముడి ఖనిజాన్ని సంపాదించింది. యురేనియంను బయటకు తీయడానికి రాయిని పొడిచేసి ఆమ్లంలో కరిగించి యురేనియంను తీసింది. ఆ రాయి పొడిలో అణుధార్మిక శక్తి మిగిలి ఉందని కనుగొన్నది.
అణుధార్మిక శక్తి కలిగిన పదార్ధాలలో పరమాణువులు స్థిరంగా ఉండక విస్ఫోటనం చెందినప్పుడు ఆల్ఫా, బీటా అనే రెండు కిరణాలు విడుదలై తూటాల వంటి శక్తి విడుదలవుతుంది.
యురేనియం ముక్కలుగా విడిపోయినప్పుడు ఏర్పడే పదార్థం ప్రాటాక్టనిమ్. దీనిక్కూడా అణుధార్మిక శక్తి ఉంటుంది. ఇది ముక్కలుగా విడిపోయినపుడు థోరియంగా, థోరియం రేడియంగా, రేడియం రేడాన్ గ్యాస్‌గా మారుతుంది, రేడాన్ గ్యాస్ విడిపోయి ‘రేడాన్ సంతతి’గా మారుతాయి. ఇందులో పోలోనియమ్‌తో పాటు అరడజనుకు పైగా అణుధార్మిక శక్తి కలిగిన ధాతువులు ఉంటాయి. చివరకు మిగిలే సీసం (లెడ్)తో పాటు అన్నీ విషపూరితమైనవే.
రేడియంను క్యాన్సర్ పెరుగుదలను కాల్చడానికి ప్రయత్నించి హెన్రీ, బెక్వేరాల్, ఇద్దరూ కాలిన గాయాలతో బాధపడ్డారు. రేడియంను చేత్తో పట్టుకోవడం వలన వారికి వాతలు ఏర్పడ్డాయి. ఇది మిగతా శాస్త్రవేత్తల ఆలోచనలకు అంకురమైంది.క్యాన్సర్ ట్యూమర్లు ఉన్నవారికి రేడియం ఉన్న సూది పెడితే అది క్యాన్సర్‌ను కాల్చివేస్తుంది. అలా రేడియేషన్ ఉపయోగించి క్యాన్సర్ థెరపీ మొదలైంది.
రేడియం శ్రీబఎఱఅశీబర (మెరిసే) పెయింటింగ్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది చీకట్లో ప్రకాశపు వస్తువు. 1920లో ఒక గ్రాము యురేనియం ధర ఒక లక్ష డాలర్లు. ఇది ఆనాడు చాలా ఖరీదైన వస్తువు.
రేడియం పెయింట్ వేసే యువతకు రోగాలు రావడంతో బ్లూమ్ అనే అమెరికన్ దంత వైద్యుడు ఈ విషయాలను మొదటిసారి తెలుసుకున్నాడు. అతని వద్దకు వచ్చిన యువతుల దంతాలు రాలిపోయి చిగుళ్ళు ఇన్ఫెక్షన్‌కు గురై రక్తం కారుతూ, రక్తహీనతతో బాధపడేవారు. వారి ఎముకలు పెళుసుబారి ఉన్నట్టుండి విరిగిపోయేవి. కొందరు రక్తహీనతతో మరణించేవారు. రేడియం డయల్ పెయింటింగ్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు, రేడియం ప్రభావం వలన ఎముకల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశముంటుందని తెలిపారు.
రేడియం శరీరంలోకి వెళ్ళినా అణుధార్మిక శక్తి కలిగి ఉంటుంది. రేడియం ముక్కలుగా విడిపోయి రాడాన్ గ్యాస్‌గా మారుతుంది. రేడియం డయల్ పెయింటర్స్ ఎముకల్లో రాడాన్ గ్యాస్ ఉత్పత్తై రక్తంలో కలిసి గుండెద్వారా సరఫరా అయి సున్నితమైన కణజాలాన్ని నాశనం చేయడం వల్ల తలలో క్యాన్సర్ వస్తుంది.
15వ శతాబ్దంలో పర్వతాల్లో పనిచేసిన గని కార్మికులు చనిపోవడానికి కారణం ఊపిరితిత్తుల క్యాన్సర్ అని 19వ శతాబ్ది తర్వాత తెలుసుకున్నారు.
యురేనియంతో అణుబాంబును చేయవచ్చని కనుగొనడంతో 1942 నుంచి దీనికి విలువ పెరిగి యురేనియం కోసం గనుల తవ్వకం మొదలైంది.
1938లో అణుధార్మిక శక్తి మాత్రమే కాక పరమాణు విచ్ఛేదనంతో విపరీతమైన శక్తి విడుదలవుతుందని కనుగొన్నారు. డిమాండ్ పెరిగిన యురేనియంను తవ్వడానికి కెనడాలోని గని కార్మికులను ఉత్తర అమెరికాలోని గనుల్లోకి పంపడంతో వారు అనేక గంటలు గనుల్లో ఉండడంతో రేడాన్ వారి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వలన అనేక జబ్బులు, క్యాన్సర్ రావడం జరిగింది.
యురేనియం పరమాణువులు అణుధార్మిక శక్తి కలవి కనుక ఒక న్యూట్రాన్‌తో పరమాణువును విడగొట్టడం ద్వారా రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదై, ఎనిమిది పదహారుగా విడిపోయే ‘ఛైన్ రియాక్షన్’కు ఒక సెకనులో వెయ్యో వంతు సమయం పడుతుంది. నీరు, గాలి నుండి అదృశ్య రూపంలో ప్రయాణిస్తుంది. రేడియం, పోలోనియం, రేడాన్ గ్యాస్ యురేనియం రూపాంతరమే.
చెర్నోబిల్ దుర్ఘటన ద్వారా ఏర్పడిన రేడియేషన్‌లో 80 శాతం రేడియోషన్ రెండు కిలోల రేడియో యాక్టివిటీ పదార్థం బయటకు రావడం ద్వారానే జరిగింది. ఈ దుర్ఘటనలో వెలువడిన సెసియం-137 అనే ప్రత్యేక ఉత్పత్తి వలన గొర్రెలు రోగాల బారిన పడడం వలన ఇప్పటికీ ఇంగ్లాండులో గొర్రె మాంసం మానవులు తినడానికి ఉపయోగించడంలేదు.
యురేనియం రేడియో ధార్మిక శక్తిగల అనేక ధాతువులుగా రూపాంతరం చెంది మానవ పరిసరాల్లోకి ప్రవేశించడంతో జీవరాసులకు హాని కలుగుతుంది. ఆహారం ద్వారా, పీల్చుకునే గాలి ద్వారా మానవ శరీరంలోకి చేరతాయి. మానవ కణాలు చనిపోతే సమస్య ఉండదు. ఏ ఒక్క కణం బతికి ఉన్నా, బతికి
ఉన్న కణంతో నాశనమైన కణాలు చేరి క్యాన్సర్ అభివృద్ధి కారకమవుతుంది. అండ కణాలకు హాని కలిగి వంశపారంపర్యంగా పుట్టబోయే పిల్లలకు, మనుమలు, మునిమనుమల వరకు ప్రమాదం ఉంటుంది.
యురేనియం వ్యర్థాల వలన రేడియో ధార్మిక శక్తి కొన్ని సంవత్సరాల వరకు ఉండి వాయువును విడుదల చేస్తూ ఉండడం వలన జంతువులు, చేపలు, చెట్లు… పర్యావరణమంతా నాశనమై ప్రమాదంలో మునిగిపోతాము.
ఎన్నో అనర్థాలకు కారణమైన యురేనియం హానికరం అని తెలిసీ అణ్వాయుధాలకు గొప్ప పీట వేస్తున్నారు. శాంతియుతంగా జీవించడమే లక్ష్యమవ్వాలి. విద్యుత్తు కోసమే సర్వేలని మభ్యపెట్టి చేసిన తవ్వకాలతో నిజం తెలుసుకుంటున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. విద్యుత్తు అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. అధికమైన సాంకేతిక పరిజ్ఞానంతో జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకుని గర్వించదగ్గ మానవ మనుగడకు మార్గం వేయాలి. శాంతి సామరస్యాన్ని నెలకొల్పాలంటే యురేనియంను అలాగే పదికాలాలపాటు భూగర్భంలోనే దాచిపెట్టాలి.
లేదా మానవ మనుగడ చిన్నాభిన్నమవుతుంది. ఉన్న వనరులను ఉపయోగించుకుని ప్రగతిపథంలో సాగాలి. అష్టవంకరలతో పుట్టిన పిల్లలతో, రోగాలతో బతకడం, పర్యావరణానికి ముప్పు తెచ్చుకోవడం చేయాల్సిన పనికాదు. చరిత్రలోని చేదు నిజాలైన హిరోషిమా, నాగసాకి, చెర్నోబిల్ దురంతాలను గుణపాఠాలుగా తీసుకుని మానవ మనుగడను కాపాడుకోవడానికి యురేనియం వ్యతిరేక పోరాటంలో భాగస్వాములై సమస్యలను పరిష్కరించుకుందాం.
‘అణు ధార్మిక’ సత్యాలు, వ్యాసాల ఆధారంతో…