చుక్కల ఆకాశంలో
కాలపు ముళ్లను బిగించి,
తనదైన ఇంటి పరిసరాలకు
తానే గౌరవ అతిథిగా నిలబడి
ఒక చేత్తో కొడవలి
మరొక చేత్తో కత్తిపీటను చేపట్టి
పట్టుసడలని ఉక్కుపిడికిలితో
అసలుసిసలు నారీ విశ్వరూపానికి ప్రతినిథిలా.. ఆమె..!
చేన్లు.. చెల్కలల్ల పనిచేసే కాయలు
గట్టిన చేతుల్తో అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణ ఆమె..!
గాయమో.. దెబ్బో తగిలితే పసరు మందేసి
ఉడుకుడుకు ఉప్పుకాపుడం బెట్టి
”నొస్తుందా..! బిడ్డా..!” అని కళ్ళలో వత్తులు వేసుకొని
కాపాడే దయామయి ఆమె..!
పెత్తందార్ల దురాక్రమణను ఎదిరించి
”గీవేంపైసలంటూ..” ప్రశ్నించే ధిక్కార స్వరం ఆమెది!
ఇటుక బట్టీలు.. ఇళ్ళ నిర్మాణానికి
రాళ్ళెత్తిన వేడిస్వేదం ఆమెది!
అస్తమిస్తున్న సూర్యుణ్ణి తన బుట్టలో దింపుకొని
ఇంటివైపుకు సగర్వంగా మళ్లే ఆమె..
హక్కులు.. బాధ్యతల చట్రంలో ప్రధాన ఇరుసు…
దినసరి కూలీకై అడ్డాలో
”ఆడకూలి”… ఒక ఎగసే ఉద్యమ పతాక!
బతుకు జీవన పోరాటంలో
అలుపెరుగని ధీరవనిత!!