పుడుతూనే..
ఆమె నొసటికి దిష్టిచుక్కై
తోడొచ్చింది బొట్టు.
చిట్టి చేతుల నుంచే…
ఇనబింబాన్ని అలవోకగా దిద్దుకోవడం
నాటినుంచే…
అది విడిపోని పచ్చుబొట్టయి
ఇమిడిపోయిందామె ముఖారవిందాన…
కారణమేదైనా గానీ…
ఇప్పుడర్దాంతరంగా చెరిపెయ్యడం
అమానవీయం!
సప్తవర్ణాల హరివిల్లును
తన మోమున అద్దుకుంది
చిన్నప్పటినుంచే…చిత్రకారిణియై ఆమె
ఎప్పుడూ… ఎందుకూ…
పెట్టుకోవడమా… మానేయడమా…
బొట్టుపైని పేటెంట్ హక్కులన్నీ… తనవే మరి
పసుపూ కుంకుమా పూలూ గాజులూ
పుట్టిన్నుంచీ… ఆమెతోనే… ఆమెలోనే
నట్టనడుమీ కట్టుకథలేంటో…!
కాలం చేసిన పెనిమిటికి
బొట్టును ముడిపెట్టి
ముండమోయించి మూలకు తొయ్యడం
ముమ్మాటికీ మానసిక హింసే…
ఎవడి పుచ్చిన మెడదులోంచి పుట్టిందో ఆనాడు!?
అతడికి వర్తించని ఆ వింత తంతు
ఆధిపత్యానికి పరాకాష్ట కాక మరేమిటి!?
ఆమె చేతులని… ఆమె నెత్తినే పెట్టించడం
అందంగా అల్లిన కుతంత్రం
ఆ వితంతు కార్యక్రమంలోని తంతు… అదే…
ఆదిమకాలం నాటి
అంధ విశ్వాసాలని… సనాతనసాంప్రదాయమంటూ
కొనసాగించడం హీనాతిహీనం… నేరాతి నేరం
చివరికామె బలవన్మరణానికి… కారణం ఆ అవమానమే…
అంతరిక్షానికెగబాకే… పురోగతి ఓ పక్క
అదఃపాతాళానికి దిగజారే తిరోగమనం… మరోపక్క
అయినా…
ఎవ్వరినని ఏమి ప్రయోజనమ్!
వెర్రిగొర్రెలూ… వెంగళప్పలూ కళ్ళుతెరవనంతకాలం
నెత్తినెక్కి నర్తిస్తూనే ఉంటాయి… దురాచారాలు…