మన జీవితాల్లో సంతోష సందర్భాలను, ఘట్టాలను సృష్టించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సి వస్తుంది. అనేక చీకటి రాత్రుల నడుమ ఒక పొద్దుపొడుపులా సంతోష సంబరాల వాతావరణం ఏర్పడుతుంది. అది తాత్కాలికమైనది. మనల్ని నిత్యం అంటిపెట్టుకునే తోడు మన నీడ, మన జీవన పర్యంతం మనల్ని వెంటాడుతూ… ముందుకు నెడుతూ జీవితాలను ఒక చోదకశక్తిలా నడిపించే శాశ్వత నేస్తం మృత్యువు ఒక్కటే. ఇదంతా వినడానికి ఏదో చేదులా నిరాసక్తంగా అనిపించినా ఎవ్వరూ కాదనలేని వాస్తవం కూడా.
అది మార్చి నెల 8, 9 తేదీలు 2001 సంవత్సరం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో అఖిల భారత తెలుగు రచయిత్రుల మహాసభలు నాడు ఉపకులపతిగా ఉన్న డా|| ఎన్. గోపి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అక్కడ పుట్ల హేమలతతో రెండు రోజులు గడిపే అవకాశం మా అందరికీ… ఎందరో రచయిత్రులు-పొద్దంతా సభల అనంతరం రాత్రి ఒక గదిలో కొందరం చేరి ముచ్చట్లాడుకునేవాళ్ళం. అట్లాంటి సమయంలోనే మా మధ్య బలపడిన స్నేహాభిమానాల వల్ల అప్రయత్నంగా హేమలతను ‘వదినమ్మా’ అని పిలవడంతో నాతోపాటు మరి కొందరు మిత్రులు అదే విధంగా పిలవడంతో మా మధ్య బంధుత్వం ఏర్పడింది. సదస్సు చివరి రోజు అందరం విడిపోతున్నప్పుడు ఆమె ”ఈ ప్రేమలు ఇప్పటివరకేనా, ఎప్పటికీ
ఉంటాయా?” అని అడిగింది. దాంతో ”లేదు, ఎప్పటికీ ఇంతే వదినమ్మా” అని చెప్పాము. నాటినుండీ నేటివరకూ నేను తనతో ‘ప్రరవే’ బాధ్యతల సోపతిలో పడినా ఆమెను పేరుపెట్టి పిలవలేదు. ఆమె సాహిత్యపు కృషిని శ్రద్ధగా ఈ పదేళ్ళ సహవాసంలో తెలుసుకుంటున్నా… ఆమె నిష్క్రమణ తర్వాత మరింత విస్తృత స్థాయిలో తెలుసుకున్నాను. తనతో తమ అనుబంధాన్ని (19 ఫిబ్రవరి, హైదరాబాద్ జ్ఞాపకాలు పంచుకున్న సభలో) మాట్లాడిన వారందరూ ఆమెను తమ బంధువుగా భావించడం, తను వారందరికీ ప్రేమనూ, వాత్సల్యాలను పంచడం ఆశ్చర్యం కలిగించింది. ఇదొక అద్భుతం అనిపించింది. ఆమె ఒక అద్భుత మానవి అనిపించింది. మనుషులు వివిధ కారణాల వల్ల ఎడమైపోతుంటారు. దూరాల్లో ఉంటుంటారు, కొన్ని నెలలూ సంవత్సరాలకు కలుసుకుంటారు. అయితే దూరాల్లో ఉండి కలయికలు లేనప్పుడు ఆ మనుషులు లేనట్టు కాదు కదా… అదే విధంగా మృత్యువు కూడా భౌతిక వియోగం కలిగించినా ‘మనసు’ అనే దానిలో కూడా జ్ఞాపకాల నిధిని కొల్లగొట్టలేదు. ఈ విషయంలో మృత్యువుదే ఓటమి.
సమాజంలో దగాపడిన వారందరూ దళితులే. అందులో దళిత స్త్రీలు అందరికన్నా అతి పెద్ద దగాపడిన వర్గం అన్న అవగాహనతో హేమలత దేశంలోని దళితుల పట్ల, దళిత స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాలకూ, దాడులకూ మధనపడేది. ఒక విధంగా ఆమె మనాది పట్టేది.
సాంకేతికంగా ఆమెది బి.సి.’సి’ సామాజిక వర్గమే అయినా ఆమె అస్తిత్వం దళిత క్రిస్టియన్ మైనార్టీ వర్గం. తన మూలాలను మర్చిపోనట్టే తన అస్తిత్వాన్ని ఏనాడూ మర్చిపోలేదు. పి.జి.విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ వారికి ఉపయోగపడేలా తన సంపాదకత్వంలో 2016లో ‘లేఖన’ సాహిత్య పరిశోధక వ్యాసాల సంకలనం ప్రచురించారు. అందులో వివిధ రచయితలతో పాటుగా పరిశోధక విద్యార్థుల సాహిత్య వ్యాసాలు 44 ఉన్నాయి. ఆ సంకలనంలో హేమలత రాసిన రెండు వ్యాసాలు, ‘తెలుగులో దళిత కవిత’, ‘స్త్రీ వాద సాహిత్య పరిణామం – కవిత్వం’ ఉన్నాయి. ‘తెలుగులో దళిత కవిత’ వ్యాసంలో భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఆధారంగా ఏర్పడిన కులాల విభజన నుండి మనుధర్మశాస్త్రం క్రూరత్వం వరకూ తెలుగు కవుల కవితల్ని ప్రస్తావిస్తూ దళితవాదాన్ని ప్రకటించింది. రెండోదైన ‘స్త్రీ వాద సాహిత్య పరిణామం – కవిత్వం’ వ్యాసంలో మన సమాజంలో మారుతున్న పరిస్థితులు, స్త్రీ ఆర్థిక జీవన విధానాలపై చూపిన ప్రభావం, స్త్రీల ఉద్యమాలు, సాహిత్యంలో స్త్రీ వాద ధోరణులు, అది ఉద్యమంగా రూపొందడం, స్త్రీలపై పితృస్వామ్య అణచివేత అంశాలను ప్రస్తావిస్తూ స్త్రీ వాద కవితల్ని ఉదహరించడం జరిగింది.
లేఖన పరంపరలో రెండోదైన ‘అంతర్జాలం-సాహిత్య దర్శనం’ అనే సంకలనం అంతర్జాల తెలుగు సాహిత్యంపై తొలి జాతీయ సదస్సుకు సంబంధించిన గ్రంథం. ఇందులో 53 పత్రాలున్నాయి. ఆమె రాసిన ‘తెలుగు సాంకేతిక పరిజ్ఞానం – సాహిత్యం’ వ్యాసం 18 నవంబర్, 2016లో హైదరాబాద్‌లో ‘సాహిత్య అకాడమీ-లేఖిని’ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ‘ప్రపంచీకరణ నేపథ్యలో తెలుగు రచయిత్రుల రచనల్లో వస్తున్న వైవిధ్యం-రచయిత్రుల కథా సాహిత్యం’ అంశంపై సమర్పించిన పత్రం ఈ సంకలనంలో చేర్చారు.
‘ప్రరవే’ 2016లో ప్రచురించిన ‘తీరొక్క పువ్వులు’ భిన్న అస్తిత్వాల స్త్రీల సాహిత్యం-పరిచయం వ్యాసాల సంకలనంలో ‘క్రైస్తవ స్త్రీల సాహిత్యం-కథ, నవల’ అంశంపై తన వ్యాసం ఉన్నది. ‘ప్రరవే’ పదేళ్ళ ప్రయాణం-సమాలోచన సదస్సు 2, 3 ఫిబ్రవరి 2019 విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగా 2017లో ‘ప్రరవే’ నిరహించిన బోల్షివిక్ సదస్సు పత్రాలతో కూడిన సంకలనానికి సంపాదకత్వం వహించిన ముగ్గురిలో తను ఒకరు. అందులో ‘వికసించిన సోషలిజమే జమీల్యా’ అన్న వ్యాసం ఆమె రాశారు. ‘నీలి కలువలు’ పేరున సంకలనం చేసిన లేఖన-3 (2019) సిరీస్‌లో 78 వ్యాసాలున్నాయి. అన్నీ దళిత స్త్రీల రచనలకు సంబంధించినవే. అందులో సుజాత గిడ్ల ఆత్మకథ, కట్ట కవిత రచనలు అన్న వ్యాసాలను హేమలత రాశారు.
… … …
హేమలత 9వ తరగతి చదువుతున్నప్పుడు తన తొలి రచన ‘తిరిగిరాని పయనం’ రాశారు. తొలినాళ్ళలో క్రైస్తవ మత అవగాహనతో ఆమె కథలు, నవలలు రాశారు.
ఆమె నిష్క్రమణ అనంతరం ‘వేకువ రాగం’ (1985-2019) పేరున ఆన్‌లైన్‌లో వచ్చిన తన 27 కవితలను పొత్తంగా ప్రచురించారు. ఈ కవిత్వంలో ఆమె నిగూఢ తాత్వికత కనిపిస్తుంది. సహజ కవి అయిన ఆమె కవిత్వం వేకువ రాగమై ప్రతి ఉదయం ప్రకృతి మీద ‘దస్తఖత్’ చేస్తూనే ఉంటుంది. పూల వనాల్లోకి చొచ్చుకొనిపోయిన తొలి కిరణాల సమూహమై విహరిస్తూ ఆ విజ్ఞాన మకరందాన్ని ఆస్వాదించమంటుంది. ఒక పరిశోధకురాలిగా, భావుకురాలైన ఆమె ప్రజ్ఞా పుష్పాలు మనకందించే సంపుటి ‘వేకువ రాగం’.
సాహిత్య వ్యాసాలతో కూర్చిన సంపుటి ‘నీలిక’. ఇందులోని అక్షరాలలో ఆమె పోలికలు కనిపించే వాస్తవికత ఉంది. తన రచనల్లో స్త్రీలకు ప్రథమ స్థానం ఉంటుంది. ఉపరితల పరిశోధకురాలు ఏ మాత్రం కాని ఈ రచయిత్రి ప్రత్యేకత పునాదుల్లోంచి మూలాల్ని వెలికి తీయడం, దూరాలకు వెళ్ళి సమాచార సేకరణ చేయడం, ప్రామాణికతకు ప్రాణం పెట్టడం, తెలుగు సాహిత్య పరిణామాలను, సమకాలీన అస్తిత్వ ఉద్యమాలను సునిశితంగా, సూక్ష్మంగా పరిశీలిస్తూ ఆమె వివిధ వేదికలపై సమర్పించిన పత్రాలను 26 వ్యాసాలతో ప్రచురించిన సంకలనం ‘నీలిక’.
అపారమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆమె గత పది సంవత్సరాలుగా ‘విహంగ’ అంతర్జాల పత్రికను నిర్వహిస్తున్నారు. ఆ పత్రిక ద్వారా ఆమె తెలుగు రచయిత్రులెందరితోనో పరిచయం, స్నేహం ఏర్పర్చుకున్నారు.
నిరంతరం కార్యశీలత, సాహిత్య సేద్యం, ‘ప్రరవే’ పట్ల నిబద్ధతతో సాహిత్య బంధుజనుల మనసుల్ని గెలుచుకున్నారు. త్వరలో ‘ప్రరవే’ మిత్రులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చే బాధ్యతను తీసుకున్న హేమలత ఆదివాసీల గురించి ఈ సంవత్సరమంతా క్షేత్ర పర్యటనలూ, అధ్యయనాలూ చేద్దామని అందుకోసం ఏర్పడిన ప్రాథమిక అవగాహనా కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. కానీ నాలుగు రోజులైనా గడవకముందే హఠాత్తుగా మా అందరినీ విషాదంలో ముంచి వెళ్ళిపోయి సంవత్సర కాలం గడిచిపోయింది. ఇది వ్యక్తిగతంగానూ, ‘ప్రరవే’నూ బాధించే పెద్ద వెలితి.
ఆ స్నేహలత మచ్చలేని నల్లనల్లని సందమామ. మా తలపుల్లో సామాజిక చేతనంలో… సాహిత్య
ఉద్యానవనంలో నిత్యం పలకరిస్తూ పదండి కలిసి పనిచేద్దామంటూ ఉత్సాహపరిచే నిత్య గాయిక కోకిలమ్మ… 0తెలుగువాళ్ళ రాష్ట్ర పక్షి కోకిలనూ, రాష్ట్ర పుష్పంగా నల్లకలువనూ చేసుకునే రోజుకోసం మచ్చలేని నల్లనల్లని సందమామకు ఈ అక్షర నీరాజనం!
(9 ఫిబ్రవరి 2020 ప్రథమ సంస్మరణ రోజు)