ఇదో అరుదయిన అపూర్వ ఘట్టం -దేవి

 

జీపు ఎక్కి నిలబడి నినదిస్తున్న ముగ్గురమ్మాయిలు

అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ

సహచరుడిని మూక దాడి నుంచి రక్షిస్తున్న బురఖా అమ్మాయిలు

జామియా మిలియా ఇస్లామియా నుండి

తలమీద కుట్లు, విరిగిన చేతికి సిమ్మెంటు కట్టు ‘ఐషీ’

”పోరాడుతాం గెలుస్తాం… మీరు దౌర్జన్యం చేస్తే

మేం చర్చలతో సమాధానం చెబుతాం”

ఇది మారుతున్న ఉద్యమాల ముఖచిత్రం… బుద్దిగా హాయిగా తమ మానానికి తాము చదువుకుంటున్న అమ్మాయిల్ని, మొత్తం విద్యార్థులపై దాడికి దిగింది ప్రభుత్వం. వెనుకంజ వేయలేదు. పరదాలు అడ్డం రాలేదు. చేద్దామా వద్దా అనే సంశయం లేదు. మనుషుల్లా నిజమయిన ప్రాణమున్న మనుషుల్లా ఈ అమ్మాయిలంతా… ఈ కాలపు అమ్మాయిలకు సమాజంతో పని లేదు సోకులు, సోషల్‌ మీడియా తప్ప అనే అపవాదును అబద్దం చేస్తూ బరిలోకి దిగారు. అత్యధిక ‘మెజారిటీ’తో మతోన్మాదంతో తమకు అడ్డే లేదనుకుంటున్న ఏలికల్ని సవాలు చేశారు. లాఠీలు, బాష్పవాయువు, తూటాలు, అవమానాలు, దొమ్మీలు… ఏది ఏమైనా సరే తగ్గేదే లేదన్నారు.

జామియాకు కూతవేటు దూరంలో షాహిన్‌బాగ్‌… నిశ్శబ్దంగా అధ్యయనంలో మునిగి

ఉండే గ్రంథాలయం. ఇనుప బూట్లతో, టియర్‌ గ్యాస్‌ షెల్స్‌తో అద్దాలు, తలుపులు బద్దలు కొడుతున్న విధ్వంసపు ధ్వనుల్తో, ఆక్రందనలతో దద్దరిల్లుతుంటే ఇళ్ళల్లో తల్లి పేగు కదిలింది. ఆర్తిగా చేతులు చాచి జామియాకు పరిగెత్తారు. వాళ్ళతో పాటు తోసివేయబడ్డారు. కన్నీళ్ళు కార్చారు. టియర్‌ గ్యాస్‌కు కళ్ళు మండుతూ బిడ్డల దుస్థితికి గుండె మండుతూ జాతీయ రహదారిపై కూలబడ్డారు. మధన పడ్డారు. ఏమిటి చేయడం? ఒక ప్రక్క సిఎఎ… పౌరసత్వంతో మత వివక్ష, మరోవైపు ఎన్‌ఆర్‌సి… తమ పూర్వీకులు ప్రాణాలర్పించి సాధించిన గడ్డపై తమ అస్థిత్వం ప్రశ్నార్ధకం కావడం. ముక్కుపచ్చలారని బిడ్డలు దేశంలో అందరి కోసం లాఠీలు, తూటాలు భరించడం. ఒక నిస్సహాయత, ఒక క్రోథం, ఒక ఆక్రందన… ఆ మహిళలందరిలో ”ఏం చేయాలి”, ”ఎట్లా చేయాలి” అని.

రోడ్డు పక్క జెండా దిమ్మ. ఒక చిన్న నిద్రగన్నేరు చెట్టుకింద కూలబడింది తబస్సుమ్‌, జామియా నుండి పోలీసులు తరుముకుంటూ వస్తే… ”రా అమ్మి ఇంటికి పోదాం” అంటే రాను ఇక్కడే ఉంటాను, మన పిల్లలందర్ని దిక్కు దివాణం లేకుండా ఇంత చలిలో వీథుల్లోకి నెట్టేస్తే నేను ఇంట్లో వెచ్చగా పడుకోనా?” అన్నది. ఇంకో ముగ్గురు అక్కడే కూర్చుండిపోయారు. ఈ జాగరణతో జామియా పిల్లలకు కాపలానా? పోలీసుల దౌర్జన్యానికి సాక్ష్యమా? ఏమనుకున్నారో మరి… తమకు తెలియకుండానే సత్యమైన ఆగ్రహం ప్రకటించడానికి నిజమయిన సత్యాగ్రహం ప్రారంభించారు.

ఈ ఏడాది గత వందేళ్ళలో ఎన్నడూ లేనంత చలి తీవ్రత ఢిల్లీని వణికిస్తున్నది. అయినా సరే…కదలలేదు. నెమ్మదిగా సంఖ్య పెరిగింది. ఒక్కరొక్కరి నుండి గుంపులుగా వచ్చి చేరారు. ఏం సాధిస్తారు ఏంటిదంతా అని మగవాళ్ళు కాస్త మందలించారు. అధికారం ఏ మాత్రం పట్టించుకోదని హితవు చెప్పారు. కానీ ఆ స్త్రీలు కదల్లేదు. ”ఏమవుతుంది అని కాదు, మేం ఏం చేశాం అనేది ముఖ్యం. మా పౌరసత్వాన్ని శంకిస్తున్నప్పుడు జవాబు ఇవ్వకుండా ఇళ్ళల్లో దాక్కోం… అంతే” అని తెగేసి చెప్పారు.

అట్లా ప్రారంభమయిన షాహీన్‌బాగ్‌ నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. మర్చిపోయిన నాటి స్వాతంత్య్ర పోరాట రూపాన్ని గుర్తు చేస్తున్నది. ప్రతిచోటా ఒక షాహిన్‌ బాగ్‌ వెలుస్తున్నది. ఢిల్లీలోనే 15 దాకా ఈ షాహిన్‌బాగ్‌ గుడారాలు వెలిసాయి. అనేక నగరాల్లో ప్రారంభమయ్యాయి. 24 గంటల జాగరణలు… దేవుడి కోసం పుణ్యం కోసం జరగటం చూశాం కానీ ఒక నియంతృత్వ పాలనపై నల్ల చట్టాలను నిరసిస్తూ ప్రజల హక్కుల కోసం జరగటం అద్వితీయం. అదీ మహిళలు చేయడం, వారే నాయకత్వం వహించడం అపూర్వం.

జాతరలా జరుగుతూ ఉంటుంది. వాకర్స్‌ దారి అంతా రకరకాల బ్యానర్లు. ఆర్టీసీ, ఆఫీసు, లైబ్రరీ… కాస్త దూరంలో ఓ చిన్న ఇండియా గేట్‌ నమూనా, ”మొత్తం ఓ పెద్ద భారతదేశపు చిత్రపటం. దాని మధ్యలో చీశీ జూూ, చీశీ చీూ=, చీశీ చీ=జ అనే అక్షరాలు వెలుగుతుంటాయి. జనాలు నగరంలో పలు ప్రాంతాలనుండి, పలు నగరాల నుండి ఇప్పుడు పలు దేశాల నుండి వస్తారు. స్థానిక స్త్రీలు బృందాలుగా ఇళ్ళకు వెళ్ళి పనులు ముగించుకుని మళ్ళీ తిరిగి వచ్చి బైఠాయిస్తుంటారు. పిల్లల్ని అక్కడి యువకులు ఆడిస్తుంటారు. ఏడ్చేవాళ్ళను బయట తిప్పి తీసుకువస్తారు. వృత్తులు, ఉద్యోగాలు ముగించుకుని మగాళ్ళు తొందర తొందరగా ”అడ్డా”కు చేరుకుంటారు. వృద్దులు కుర్చీలు తెచ్చుకుని కూర్చుని మరీ కాపలా కాస్తుంటారు. చుట్టుపక్కల గల్లీలలో చవకగా ఆహారం దొరుకుతుంది. ఆకలేసిన వాళ్ళు తినేసి తిరిగి అక్కడికి చేరుకుంటారు. మధ్యమధ్యలో పోలీసులు మందగా వచ్చి చూస్తే ప్రజల తిరస్కారపు చూపు వాళ్ళకు గుచ్చుకుపోతుంటే కంగారుగా కదిలిపోతారు.

ఉదయం కొంచెం పలుచగా ఉంటుంది. మూడు గంటల నుండి ఒక ప్రవాహం మొదలై తెల్లవారుజాము దాకా కిక్కిరిసి ఉంటుంది. వేదిక ప్రక్కన, రేకుని అడ్డంగా పెట్టి రాకపోకలు చేస్తుంటారు. అమ్మాయిలు, లేదా బుగ్గలపై ”తిరంగా” వేసుకున్న యువకులు, ఒక జట్టు ఒక మూలకు పుస్తకం, పెన్నుతో ఉంటుంది. అక్కడ మాట్లాడాలంటే పేరు నమోదు చేయాలి. నమోదు సమయాన్ని బట్టి అదే వరుసలో వారిని పిలుస్తారు. కవితలు, పాటలు, గజల్స్‌, సందేశాలు, ఉపన్యాసాలు, ఉద్వేగాలు ఖచ్చితంగా సమయం నిర్దేశించరు. కానీ స్పందన లేకుంటే మాత్రం వక్తలే దిగిపోవాల్సి ఉంటుంది. పాటలు, గజల్స్‌, ముషాయిరా నడుస్తూనే ఉంటుంది. వాహ్వాలు, వన్స్‌మోర్‌లతో ఆస్వాదిస్తారు. వివిధ కాలేజీల నుండి విద్యార్థుల గుంపులొచ్చి నినాదాలు చేసి ఆవేశంతో ఒక ఊపు ఊహించి పోతుంటారు. సెలబ్రిటీలు వస్తారు, మాట్లాడతారు. కానీ ఏం మాట్లాడారనేదాన్ని బట్టే స్పందన ఉంటుంది. ఎవరయినా మరీ ఎక్కువ సమయం తీసుకుంటే అప్పుడు కాస్త సూచనలు చేస్తారు. మధ్యమధ్యలో నమోదు చేసుకుంటున్న యువతులు, వయసులో పెద్ద అయిన మహిళలతో సంప్రదిస్తారు. యువకులు రెచ్చిపోతుంటే ఈ మహిళలు వారిని మందలిస్తారు. వాళ్ళు సరే ఆంటీ అంటూ వెనక్కి తగ్గుతారు.

మగవాళ్ళు మీ నుంచి నిర్ణయాధికారం లాక్కోలేదా, అని అడిగితే ”వాళ్ళ పెత్తనానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాం, అదుగో ఆ చుట్టుపక్కల తిరుగుతారు. మట్టిగోడలెక్కుతారు తప్ప జోక్యం చేసుకోవడం లేదు” అంటుంది 65 ఏళ్ళ ఫర్హానా. షాహినా బాగ్‌కు అంకురం వేసిన వాళ్ళలో ఆమె ఒకరు. పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె బి.ఎ. చదివింది. ‘మేం చదువుకుని కూడా ఇల్లు చాలనుకున్నాం. కానీ మమ్మల్ని బజారుకీడ్చారు. ఇప్పటి అమ్మాయిలు ముందుకు దూసుకుపోతున్నారు. వాళ్ళనిలా ఆపేస్తే ఎలా? వాళ్ళపై ఇన్ని జరుగుతుంటే నా కుటుంబం బాగానే ఉందని ఇంట్లో కూర్చోలేం కదా!’ అంటుంది.

‘నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి. నేనొక రోజు రాత్రి చలికి తట్టుకోలేక రాత్రి రెండు గంటలకి ఇంటికి వెళ్తూ ఒక 14 ఏళ్ళ బాలుడ్ని తోడు తీసుకువెళ్ళా. ఏం చదువుకున్నావురా అని అడిగా. వాడు ఇంకేం చదువు? ఎందుకు అని పుస్తకాల సంచి విసిరి పారేశా? అన్నాడు. ఆ వయస్సులో ఆ బాలుడు ఆ మాటంటే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా? అని అడుగుతుంటే కళ్ళనిండా నీళ్ళు వచ్చాయి ఆమెకి. ఈ సత్యాగ్రహం కేవలం జూూ, చీ=జ గురించి కాదు. ఒక పరాయీకరణ కలిగించిన నిరాశపై పోరాటం. విద్యార్థులు దీనిపై తన్నులు తింటుంటే మనం మౌనంగా ఊరుకుందామా అనే ప్రశ్న పరిణామం చెందుతూ దేశం గురించి మొత్తంగా ఆలోచించే దశకి చేరింది. అందరిలో ఒకే స్పష్టత ఒకే అవగాహన ఉండకపోవచ్చు. ఎవరి అనుభవాల్ని బట్టి వారు అర్థం చేసుకుంటూ ఉండొచ్చు.

కానీ మన విద్యార్థులు, యువతరం ముఖ్యంగా స్త్రీలు అమాంతం ఒక అయిదేళ్ళ చీకటి పాలనలో పరిణితితో ఆలోచించి బాధ్యతగా ప్రవర్తించడం నేర్చేసుకుంటున్నారు.

”రాందేవ్‌ వస్తానంటున్నాడు. అతన్ని రానీయడం మంచిది. అందర్నీ రమ్మంటున్నాం కదా” అని చెప్పుకొచ్చాడు ఒకాయన వేదిక మీద ఉన్న స్త్రీలతో. ఆమె మాకేసి చూసింది ”మీరు చెప్పండి… బుద్ధిజీవులు మీరు”. అతను నిజంగానే రాయబారానికి బిజెపి తరపున వచ్చి హంగామా చేయొచ్చు లేదా బిజెపి దృష్టి తనవైపు మరల్చుకోవడానికి దీన్ని వాడుతుండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా

ఉండాలి అన్నాం. ”ఇక్కడికెందుకు? వద్దు, మోడీ దగ్గరికే పొమ్మను” అంది పుణ్యవతి. ”మోడీ, షాలకు నచ్చచెప్పమనండి వాళ్ళకి మనం వినిపించడం లేదు, కనిపించడం లేదు” అని కొంచెం జతచేసి అనువాదం చేశాను. అంతే అప్పటికే వేదిక ఎక్కిన యువకుడు రాందేవ్‌ బాబా రావాలా వద్దా అని ఓటింగ్‌ పెట్టాడు. మోడీ, షా లకు ఎన్నార్సీ రద్దు చేయమని చెప్పాలి అని కేకలు వినిపించాయి.

సమన్వయం చేయడానికి ఒక ‘కమిటీ’ని వేసుకోవచ్చు కదా! అంది సోనియా గుప్తా. ”అప్పుడు అందరూ నాయకులే. కమిటీ అంటే అనవసరంగా రచ్చా. ఇలాగే అనువుగా ఉంది. అందరూ బాధ్యత తీసుకుంటున్నారు” అంది జోహ్రా. క్షితిజ సమాంతర నాయకత్వం విస్తరించడం తేలిక. నాయకులు లంబంగా ఎదిగితే వందల అడుగుల విగ్రహాలే మిగుల్తాయేమో.

”వందల ఏళ్ళ నుండి ఇక్కడే ఉంటున్నాం. పోదల్చుకుంటే విభజనలోనే పోయేవాళ్ళం. మేం మత రాజ్యం కోరుకోలేదు. ఇది మా జన్మభూమి, ఇది మాది” అంది బిడ్డను నిద్రపుచ్చుకుంటూ నైనా. ఒక మతరాజ్యం వెళ్ళగొడితే ఇక్కడికొచ్చిన

వాళ్ళు దేశ ప్రేమికులా? మతం ఒకటయినా మత రాజ్యం వద్దని ఉండిపోయిన వీళ్ళు దేశద్రోహులా? ఎంత సహేతుకత ఏలినవారి ప్రాపగాండాలో.

బయటకు వస్తే మినీ ఇండియా. గేటు ఎదురుగా రోడ్డుపై గుండ్రంగా నిలబడి ఓ బృందం బొమ్మలు గీస్తోంది. ఇంకొంతమంది ‘తిరంగా’ ఎగరేస్తూ తిరుగుతున్నారు. బుగ్గలపై తిరంగా గీయించుకుంటున్నారు. పసిబిడ్డల లేత బుగ్గలపై మువ్వన్నెల జెండాలు దేశ భవిష్యత్తు లాగా కనిపిస్తున్నాయి. వెబ్‌ ఛానల్స్‌, కొన్ని టివి ఛానల్స్‌ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి.

”దాదా! రోడ్డు మొత్తం ఎందుకు మూసారు? ట్రాఫిక్‌ అడ్డం కదా. జనాలకు ఇబ్బంది కదా!” అంటే తెల్ల గడ్డంలోంచి నవ్వుతూ ”ఎవడన్నా వెధవ రాయో రప్పో నిప్పో వేసి పోస్తే పోతే పోతూ? లేదా ఏ ఆర్‌ఎస్‌ఎస్‌ వాడో గుడారంలో చేరి వచ్చేపోయే వాళ్ళమీద రాళ్ళేస్తే? అందుకే ఈ కొంచెం మూసాం. మిగిలింది అంతా పోలీసువాళ్ళు మూసారు, మేం కాదు ఇబ్బందికి కారణం” అన్నాడాయన. ఎక్కడికమ్మా పోతున్నావు ఉండవా అంటే నడుం ఎత్తి ఒక పెద్దామె పొద్దున్న వస్తా బిడ్డా, తర్వాత కూరగాయలు అమ్ముతా, మళ్ళీ ఈడికే వస్తా, ఇంక ఇప్పుడు కూర్చోలేను అంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన గల్లీలోంచి ఒక పెద్ద ఛాయ్‌ గిన్నె పట్టుకుని, పేపర్‌ గ్లాసులతో సహా ఒక బృందం వచ్చి గుడారంలోకి వెళ్ళింది. వెనకాలే మంచినీళ్ళ ప్యాకెట్లు వెళ్ళాయి. ఎవరో ఒక వ్యానులోంచి బాక్సుల్లో ప్యాక్‌ చేయించిన ఫుడ్‌ ప్యాకెట్లు దించారు. స్టేజి వెనుగ్గా ఒక అట్టపెట్టె నిండా రకరకాల మందులు తెచ్చి అప్పగిస్తున్నాడు ఓ యువకుడు.

వీళ్ళు రోజూ రూ.500, వెయ్యి రూపాయలకు కిరాయికి కూర్చుంటున్నారని బిజెపి ప్రచారం చేస్తోంది. తన ఇద్దరు కూతుళ్ళతో రోజూ వచ్చిపోతున్న లలితతో మొదలుపెడితే… ఎవరికి ఎప్పుడు వెసులుబాటు దొరికితే వారంతా వచ్చి కూర్చుని పోతున్నారు క్రమం తప్పకుండా. అరవై శాతం ముస్లింలు ఉంటే ఇతరులంతా అన్యులే.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పోస్టరు, ప్రతి ముఖమూ, ప్రతి చర్యా వర్ణించాలనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఎంత దుర్బుద్దితో విడదీయాలనుకున్నారో అంతగా జనంలో సంఘీభావం ఏర్పడుతున్నది. ఎంత నోర్మూయించాలని అనుకుంటున్నారో అంత గొంతులు లేస్తున్నాయి. ఎంతగా అణచివేయాలని చూస్తున్నారో అంతకు రెట్టింపు శక్తితో పిడికిళ్ళు బిగుస్తున్నాయి.

మౌనంగా భరిస్తారు… నోట్ల రద్దు, జిఎస్‌టి, కాశ్మీరు, ఆదివాసీలు, వేధింపులు, అత్యాచారాలు, నిరుద్యోగం, ఆత్మహత్యలు అన్నీ సహించారు కదా అని జల్సాగా చేసిన నిర్ణయం. జూూ, చీ=జ … జనం సహనానికి చెలియలకట్ట తెగింది. పట్టణాల్లో జనసమ్మర్ధం వల్ల వేగంగా, పల్లెల్లో చాపకింద నీరులా వరద నీరు చేరుతున్నది. అది ఇంకిపోతుందా లేక

ఉప్పెనవుతుందా! ఏదయినా కావచ్చు. కానీ ఇది ఓ వినూత్న తరహా పోరాటాల రాకడకు ఓనమాలు దిద్దిస్తున్నది భారత ప్రజానీకంతో… యువ నవ నాయకత్వం ఆవిర్భవిస్తున్నది నిస్సందేహంగా…

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.