”భారతీయ సాహిత్య నిర్మాతలు” పేరుతో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన దుర్గాభాయి దేశ్‌ముఖ్ జీవిత చరిత్రను అక్కిరాజు రమాపతి గారు రచించారు. భూమిక పాఠకుల కోసం ఈ పుస్తకాన్ని ధారావాహికంగా ప్రచురించాలని నిర్ణయించామని తెలియచేస్తున్నాం. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ…
– ఎడిటర
ఉపక్రమం
ఒక సహస్రాబ్దపు భారతదేశ చరిత్ర తెలుసుకోవటానికి స్పష్టమైన ఆధారాలున్నాయి, విస్తృతమైన ఆకారాలున్నాయి, శిధిల సాక్ష్యాలున్నాయి. విదేశీ యాత్రికులు, విజిగీషతో భారతదేశాన్ని జయించాలని వచ్చినవాళ్ళు. వాణిజ్య వ్యాపార ప్రయోజనాలనాశించి ఇక్కడి పరిస్థితులను తెలుసుకున్నవాళ్ళు తమ కోసమో, ఇతరుల కోసమో ఈ దేశాన్ని గురించి ఆయా విషయాలు రాశారు కొంతవరకు.
మానవ జీవితంలో శైశవమూ, కౌమారమూ, యవ్వనమూ, వార్ధక్యమూ అవృతి అయినట్లే దేశ నాగరికతలో, సంస్కృతిలో, జీవన వ్యవస్థలో ఆటుపోట్లు తప్పవు. శిథిలమైన వ్యవస్థ పునరుజ్జీవం చెందుతుంది. మహాత్ములు జన్మించి మానవ జీవితాన్ని ప్రబోధిస్తారు. మంచి జీవితం అంటే ఇది అని చెపుతారు. ప్రపంచం మనుగడ ఇట్లా ఉంటే బావుంటుంది, ఇట్లా ఉండాలని బోధిస్తారు. ఈ పరిణామం ఇట్లా సతతం కొన్ని అవస్థలకు లోనవుతూ, పునర్వ్యవస్థితమవుతూ ఆయా కాలాలలో ఆయా దేశ జన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది.
ఇటీవలి వెయ్యి సంవత్సరాల భారతీయ సామాజిక జనజీవితంలో 19, 20 శతాబ్దాల సంవత్సరాలకు గొప్ప చరిత్ర ఉంది. గతం అస్పష్టం, భవిష్యత్తు తెలియదు. కానీ ఈ రెండు శతాబ్దాల ఆనవాళ్ళు ఇంకా ప్రస్ఫుటంగా కన్పిస్తూనే ఉన్నాయి. చారిత్రకాధారాల సాక్ష్యాలు లభిస్తూనే ఉన్నాయి.
మళ్ళీ ఈ రెండు శతాబ్దాలలోనూ 20వ శతాబ్దానికి భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కూడా చాలా ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఉన్నాయి. భారతదేశ ఆధునిక చరిత్రలో 19, 20 శతాబ్దాలలో సంభవించిన మత, ఆధ్మాత్మిక, నైతిక, సాంఘిక, రాజకీయ ప్రబోధాలు, సంస్కరణలు, ఉద్యమాలు, గత శతాబ్దాలలో లేవు. దీనికి కారణం ప్రపంచ దేశాల చరిత్ర, సాంఘిక వ్యవస్థలు ఆయా తక్కిన ఇతర దేశాల వాళ్ళకు తెలియడం, అచ్చు యంత్రాలు, వార్తాపత్రికలు, ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం, పారిశ్రామికాభివృద్ధి, రవాణా సౌకర్యాలు వర్థిల్లడం కావచ్చు. ముఖ్యంగా భారతదేశ చరిత్రలో 20వ శతాబ్దాన్ని గాంధీ శతాబ్దం అనాలేమో! సుమారు రెండు శతాబ్దాలు పరాయి దేశపు రాజకీయాధికారం, పరిపాలన వ్యవస్థ కింద ఎంతో నష్టపోయిన, అనేక ఇక్కట్లకు గురయిన భారతదేశానికి ఆయన స్వాతంత్య్రం తెచ్చారు.
ఇప్పటికీ ఇంచుమించు ఒక అర్ధ శతాబ్దికాలం ముందటి రెండు మూడు దశాబ్దాలు విజ్ఞప్తులు, విన్నపాలు, మహజర్లు, పరిపాలనలో ప్రాతినిధ్య అభ్యర్థనలు, సభలు, సమావేశాలు, తీర్మానాలుగా పాలన సంస్కరణలు అర్థిస్తూ జాతీయోద్యమం రూపుదిద్దుకొంది. ఆ తరువాత స్వాతంత్య్ర సముపార్జన స్థిర సంకల్ప ఆశయంతో సత్యాగ్రహం, సాత్విక నిరోధం, సహాయ నిరాకరణ, హర్తాళ్ళు, విదేశీ వస్తు బహిష్కరణం, పన్నుల నిరాకరణ, కారాగారవాసంగా స్వాతంత్రోద్యమం సాగింది. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్రాశయ పోరాటానికీ, 1947లో స్వాతంత్య్రం సిద్ధింపచేసుకొన్న ప్రజోద్యమానికీ పోలిక లేదు. రెండోది పూర్తిగా ప్రజలు పాల్గొన్న ఉద్యమం. అందుకే విజయం సాధించింది. మొదటిది అసంఘటితోద్యమం. ప్రజలతో నిమిత్తం లేనిది, కాబట్టే కలిసి రాలేదు.
దక్షిణాఫ్రికాలో తన సాత్విక నిరోధ, సత్యాగ్రహోద్యమ ప్రయోగాలతో, ప్రయత్నాలతో చెప్పుకోదగిన సత్ఫలితాలను సాధించిన మోహనదాస్ కరంచంద్ గాంధీ, 1915లో భారతదేశానికి దక్షిణాఫ్రికా నుంచి వచ్చినప్పుడు భారతీయుల దైన్య స్థితిని, సామాజికార్థిక దుర్భర పరిస్థితులను చూసి విషాద విస్మయాలు పొందారు. భారతదేశ పునరుజ్జీవనం కోసం అప్పటికే ప్రబోధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోపాలకృష్ణ గోఖలేను గాంధీజీ తన రాజకీయాచార్యుడిగా స్వీకరించారు. భారతీయుల స్థితిగతులు స్వయంగా పరిశీలించి వాళ్ళ కష్టాలకు మూలమేమిటో స్వయంగా అధ్యయనం చేసి తెలుసుకున్నంత వరకు క్రియాశీలమైన రాజకీయాలలో ప్రవేశించవద్దని గాంధీగారికి గోఖలే హితవు చెప్పారు. గోఖలే కూడా దక్షిణాఫ్రికాను దర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నవారే. అందువల్ల ఆయన ఉపదేశం గాంధీ గారికి బాగా సమ్మతమైంది. ఇందువల్ల 1915వ సంవత్సరం నవభారత పునర్నిర్మాణ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం అయింది.
1919లో జలియన్ వాలాబాగ్ ముష్కర హింసాకాండ, లోకమాన్య బాలగంగాధర తిలక్ నిర్యాణం భారతదేశాన్ని కలచివేశాయి. అత్యంత ప్రభావితం చేశాయి. గాంధీజీ నాయకత్వం స్వాతంత్య్రోద్యమంలో స్థిరపడింది.
భారతదేశ పారతంత్య్ర, పరాధీన పరిస్థితులు గాంధీజీ స్వయంగా తెలుసుకోవడానికి సంసిద్ధమవుతున్న నాటికి దుర్గాబాయి ఆరేళ్ళ బాలిక. ఆయన స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించేనాటికి ఆమెకు నిండుగా పదకొండేళ్ళు. తన ఉద్యమ స్వరూప స్వభావాలను, దాని నేపథ్యాన్ని అధ్యయనం చేయడానికి గాంధీజీ ప్రాథమిక సన్నాహాలలో నిమగ్నమైంది ఆంధ్రదేశంలోనే కావడం ఒక అపురూప సంఘటన. 1915లోనే ఆయన నెల్లూరులో స్థానిక న్యాయవాదులతో, ఆధునిక విద్యాధికులతో సమావేశమయ్యారు. నెల్లూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు ఆయనకు స్వాగతం పలకటానికి వచ్చారు. వాళ్ళను చూసి ఇటువంటి దృఢగాత్రులు, సౌమ్యవదనులు, సాత్విక తేజస్సులు, భూమి పుత్రులు భారతదేశంలో పంటలు పండించి ప్రజలకు ఏడుగడగా ఉండగా ఈ భారతభూమికి దైన్యం ఎందుకు సంభవించింది? అని ఆయన ఎంతో ఖేదం చెందారు. భారత ధాత్రిలో ఎందుకు కరువులు కాటకాలు సంభవిస్తున్నాయి? ప్రజలు పేదరికంతో ఎందుకు బాధపడుతున్నారు? ఒకప్పుడు గ్రామాలు స్వయం పోషకంగా ఉండేవి. ప్రజలు దానధర్మ నిరతులై తృప్తిగా జీవించేవారు. మరి ఇప్పుడా పరిస్థితులన్నీ ఎందుకు తారుమారయ్యాయి? చేతి వృత్తులన్నీ ఎందుకు క్షీణించాయి? విద్యావకాశాలు ఎందుకు అడుగంటాయి? కూడు, గుడ్డకు దారిద్య్రం ఎందుకు ఏర్పడింది? అని ఆయన ఆవేదన పొందారు.
ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆయన కొల్లాయిగుడ్డ ధారణలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రేరణ ఉందని చరిత్రజ్ఞులు చెపుతారు. ఒకసారి ఆయన ఆంధ్రదేశంలో పర్యటన చేస్తుండగా, అది రాయలసీమ ప్రాంతమంటారు… బీడువారిపోతున్న నేలలు, దైన్యమూ, దారిద్య్రమూ, అంతులేని శ్రమ పెట్టుబడులుగా జీవన వ్యాపారం చేస్తున్న కర్షకులను, కార్మికులను, పశువుల కాపరులను, ఒంటినిండా బట్ట ధరించలేని వారిని వారి కార్యక్షేత్రాలలో చూసి ఎంతో పరితాపం పొందినట్లు, ఇంతటి పేదరికంతో అలమటిస్తున్న అభాగ్యులెందరో నా దేశంలో
ఉండగా వాళ్ళకు ప్రాతినిధ్య సాంకేతికంగా తాను మాత్రం ఒంటి నిండా వస్త్రం ఎందుకు ధరించాలి.? అని కఠోర నిర్ణయానికి ఆయన వచ్చినట్లు గాంధీజీ సన్నిహితులు రాశారు. ఈ దేశానికి స్వాతంత్య్రం రావాలి… భారతదేశం నుంచి పేదరికం అంతర్హితం కావాలి అని ఆయన ఆరాటపడిపోతున్నట్లూ అప్పటిదాకా తాను ఆ పేద ప్రజలతో తాదాత్మ్యం చెందుతున్నానని ప్రకటించినట్లూ గాంధీ చరిత్రకారుల వక్కణం. లండన్‌లో బారిస్టర్ చదువుకుంటున్న కాలంలో ఆయన సౌభాగ్య వస్త్ర ధారణకూ, స్వాతంత్య్రోద్యమ కాలంనాటి వస్త్రధారణకూ ఎంతో వ్యత్యాసం ఉంది. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీజీది సంపన్న కుటుంబం. వాళ్ళ పూర్వీకులు ఎంతో ధనవంతులు. సుగంధ ద్రవ్య వ్యాపారంలో విశేషంగా ఆర్జించారు.
భారత స్వాతంత్య్రోద్యమ ప్రస్థానంలో ఆయన వేసిన తొలి అడుగుల కాలం నుంచీ ఆంధ్ర ప్రాంతంతో ఆయనకు గాఢమైన అనుబంధం ఉంది. తిలక్ స్వరాజ్యనిధికి భారతదేశంలో అన్ని ప్రాంతాలకంటే ఎక్కువ ధనం పోగు చేసినవారు తెలుగువారు, అత్యంత ప్రశస్తమైన ఖద్దరును ఉత్పత్తి చేసినవారు తెలుగువారు, జాతీయ భాషోద్యమ విషయంలో ముందున్నవారు తెలుగువారు. ఆంధ్రుల
ఉత్సాహం, ఉపజ్ఞ, కార్యదీక్ష, త్యాగనిరతి చూస్తుంటే తెలుగువారు పూనుకుంటే స్వాతంత్య్రం వెంటనే సిద్ధించేట్లు ఉందని గాంధీజీ ఆంధ్రదేశ పర్యటనలో తెలుగువారి ఉద్యమ సంరంభతను ప్రశంసించినట్లు కొండా వెంకటప్పయ్య పంతులు స్వీయచరిత్రలో ఉంది.
స్వాతంత్య్ర త్రివర్ణ పతాక రూపకల్పన జరిగింది బెజవాడలో. పన్నుల నిరాకరణోద్యమం విజృంభించింది తెలుగునాడులో. ఉప్పు సత్యాగ్రహం దేశం యావత్తు దృష్టిని ఆకర్షించింది తెలుగువారి ధైర్య సాహస ఔదార్య త్యాగ గుణసంపత్తి ద్వారా. సైమన్ కమీషన్ నిరసన చరిత్రనే సృష్టించింది తెలుగు సింహ గర్జనల ద్వారా. విదేశీ వస్త్ర దహనం, వ్యక్తి సత్యాగ్రహం ఎంతో చైతన్యం తెచ్చాయి తెలుగువారిలో. అఖిల భారత స్థాయిన ఎందరో ప్రథమ శ్రేణి నాయకులు స్వాతంత్య్రోద్యమంలో తెలుగు వారిలో కనిపిస్తారు. పాత్రికేయ ప్రముఖులున్నారు. బహుళ సంఖ్యామైన పత్రికలు వెలువడ్డాయి. అఖిల భారత జాతీయోద్యమ చరిత్రను తొలిసారిగా పరమ ప్రామాణికంగా గ్రంథించినవాడు తెలుగువాడు.
ఈ విధంగా చూస్తే కౌమార వయస్సు నుంచి దుర్గాబాయిపై స్వాతంత్య్రోద్యమ ప్రభావం, గాంధీజీ ప్రభావం
ఉండడంలో అబ్బురమేమీ లేదనుకోవాలి. గాంధీజీ ఆమెను చూడగానే, ఆమె వాక్కు మొదటిసారి వినగానే ఆమెలోని చైతన్య ఉధృతిని చక్కగా అంచనా వేశారు.
భారత స్వాతంత్య్ర సముపార్జన ద్వారా గాంధీజీ ఆశించిన మహార్థాలు రెండు. ఒకటి స్వపరిపాలన, రెండు భారతదేశ నవ నిర్మాణం. వీటిని ఎవరికెవరికి కర్తవ్య నిర్వహణ పరంగా ఒప్పచెప్పాలో ఆయనకు తెలిసినంతగా స్వాతంత్య్రోద్యమ నాయకులలో మరెవరికీ తెలియదు. వాళ్ళకా భవిష్యద్దర్శనం లేదని అనుకోవాలి.
కాబట్టి రాజమహేంద్రవరంలో, కాకినాడలో ఆంధ్రదేశ పర్యటనలో, స్వాతంత్య్రోద్యమ సన్నాహంలో ఆయన వీక్షణాలు దుర్గాబాయిపై ప్రసరించగానే దుర్గాబాయి ఎవరో ఆయనకు అర్థమైంది.
తరువాత కాలంలో సంపూర్ణ వ్యక్తిత్వ శోభితురాలైన దుర్గాబాయి, గాంధీజీ ఆశయాలకు ఆచరణ రూపమిచ్చింది. దుర్గాబాయి జీవించింది డెబ్భై రెండేళ్ళు. ఇందులో అరవై ఏళ్ళు ఆమె దేశం కోసమే జీవించింది. ఒక్క ఆంధ్రదేశంలోనే కాదు సకల భారతదేశంలోనే దుర్గాబాయితో సాటిరాగల వారు ఇరవయ్యో శతాబ్దంలోనే లేరు. ప్రపంచ చరిత్రలోనే కన్పించరన్నా అతిశయోక్తి లేదు. ఉత్ప్రేక్ష అసలే అనిపించుకోదు. ఒక్క ఇరవయ్యో శతాబ్ది పరిగణనం మాత్రమే ఎందుకు? అంతకు పూర్వకాలంలోనైనా ఎవరైనా కనబడతారా?
చరిత్రలో ప్రసిద్దికెక్కిన మహిళలు ఆయా కాలాలలో, ఆయా దేశాలలో కొందరు కన్పించవచ్చు. విద్యలో, వివేకంలో, త్యాగనిరతిలో, సామస నిర్భీకతలో, అధికార నిర్వహణలో, పరిపాలన సమర్ధతలో, కళా హృదయంలో, సృజనాత్మక ప్రతిభలో, నాయకత్వ దక్షతలో, ధర్మపరతలో, హృదయ మార్దవంలో, భావుక లాలిత్యంలో ఆయా దేశాల, ఆయా కాలాల సమాజంలో, సాహిత్యంలో, సంస్థానాలలో, పరిపాలన సామర్ధ్యంలో ఒకరో ఇద్దరో ఉండవచ్చు. కానీ ఇన్ని పరమోత్కృష్ట యోగ్యతలు రాశీభూతంగా రాణించిన వారు మరెవరున్నారు ఒక్క దుర్గాబాయి కాక!
ఆంధ్రదేశంలో జన్మించిన మహా వ్యక్తులలో 20వ శతాబ్దంలో ఎవరిని అందరికన్నా గొప్పవారిగా పరిగణిస్తాము? ‘ఏకైక వ్యక్తి’గా ఎంచుకుంటాము? అని ఎవరైనా అడిగితే, ఎవరికైనా జిజ్ఞాస కలిగితే ఇందుకు సమాధానం దుర్గాబాయి అని చెప్పాలి. ఎవరైనా వారి వారి అభీష్టాన్ని బట్టి, ఆరాధన తత్పరత్వాన్ని బట్టి, వారి మనసులలో తటిదాభంగా ఇతరుల పేర్లు రానిచ్చినా, పోనీ ఒకే ఒక్క గొప్ప స్త్రీ, పుట్టిన తన ప్రాంతానికే కాక అఖిల భారత స్థాయిలో ఒక మహావ్యక్తిగా, అసదృశ్య శక్తి సంపన్నురాలిగా, మహా సంస్థా నిర్మాత్రిగా, ఆరాధనీయురాలు ఎవరు? అన్న ప్రశ్న వచ్చినప్పుడు దుర్గాబాయి అనే ఎవరైనా చెప్పాల్సి
ఉంటుంది.
ఇవాళ కాశీనాథుని నాగేశ్వరరావుగారి సంస్థలేవీ లేవు. ఆ మాటకు వస్తే వీరేశలింగం గారి సమాజ హితకారిణీ సంస్థలే లేవు. గిడుగు వారు అక్షర వ్యక్తిత్వం, లేదా భాషాతాదాత్మ్యం పొందారు. ప్రకాశం గారి ‘స్వరాజ్య’ పత్రిక లేదు. ఆయన సిరిసంపదల ఆనవాళ్ళు లేవు. ఆయన త్యాగం కథలు, కథలుగా పరిణమించాయి.
కానీ దుర్గాబాయి తెలుగువాళ్ళలోనే కాక భారతదేశంలోనే ఆధునిక కాలంలో సాధించిన భావ చైతన్యం, సమాజ ప్రగతిశీలత నేడే కాదు ఏనాడైనా సమాజ సేవా పరాయణులకు స్ఫూర్తి కలిగిస్తూనే
ఉంటాయి. దీనులకు చేయూతనిస్తూనే ఉంటాయి. ఆమె జీవిత చరిత్ర, స్ఫూర్తినీ, భావ పరివర్తనను, ఆశ్వాసాన్ని, అసహాయులకు ఉపశమనాన్నీ, దీనులకు అనుకంపనూ, ఆశావహులకు స్వావలంబనాన్ని కలిగిస్తూనే ఉంటుంది.
తెలుగువారు గొప్ప సంస్థా నిర్మాతలు కారనీ, ఒకవేళ స్థాపించినా నిలుపుకోరనే అపప్రథ ఉంది. ఆ అపప్రథకు గొప్ప మినహాయింపు దుర్గాబాయి. ఆమె సమాజ సేవారంగంలో సర్వశక్తులూ వెచ్చించి రాణించకపోయిన పక్షంలో ఒక గొప్ప కళాకారిణి అయి ఉండేది. తరతరాలు జ్ఞాపకం ఉంచుకోవలసిన సృజన ప్రతిభాశాలి, రచయిత్రి అయి ఉండేది.
స్వాతంత్య్ర భారతదేశంలో ఆయా రంగాలలో, గొప్ప ప్రతిభ గలవారికి సమాజ స్ఫూర్తిదాయకులకు కొన్ని బిరుదులిచ్చే సంప్రదాయం ఉన్నట్లే, వాటిలో జాతివిభూషణ, సమాజ సేవారత్న అనే బిరుదులే కనుక ఉండి ఉన్నట్లయితే ప్రథమంగా దుర్గాబాయి అటువంటి వాటికి అర్హురాలు కదా!
జననం – బాల్యం
దుర్గాబాయి 1909 జులై 9వ తేదీన రాజమండ్రిలో జన్మించింది. ఆమె జనన తేదీలో మూడు తొమ్మిదులున్నాయి. తొమ్మిది పరిపూర్ణ సంఖ్య. దుర్గాబాయిది కూడా పరిపూర్ణ జీవితం.
ఆంధ్ర దేశంలో రాజమహేంద్రవరం ప్రాచీన పట్టణం. ఇంతకన్నా ప్రాచీనమైన నగరం, ఇంత చరిత్ర కలిగిన, ప్రసిద్ధి పొందిన నగరం తెలుగునాట ఇంకొకటి లేదేమో! తెలుగువారు నిర్వహించిన గొప్ప ఉద్యమాలకెన్నిటికో ఇది రంగస్థలం. అఖండ గోదావరి తీరంలో ఉన్న ఈ పట్టణం గోదావరి అంత ఇష్టమైనది తెలుగువారికి. తెలుగు సాహిత్యంలో రెండే రెండు మహాయుగాలు ఇప్పటికి ప్రవర్తిల్లాయి… అవి నన్నయ యుగం, వీరేశలింగ యుగం అన్నారు సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు పింగళి లక్ష్మీకాంతం. రాజమహేంద్రవరాన్ని ప్రాచీన వెనీసు నగరంతో పోల్చారు కోటంరాజు రామారావు స్వీయచరిత్రలో.
అటువంటి రాజమండ్రిలో జన్మించారు దుర్గాబాయి. ఆమెను కన్న తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, రామారావు గార్లు. వారింటి పేరు బెన్నూరి వారు. ఈ ఇంటి పేరు తెలుగునాట గొప్ప ప్రాచుర్యం పొందినట్లు తోచదు. ఈ ఇంటిపేరు గల కుటుంబాలు ఇప్పుడు కూడా ఎక్కువ కనబడవు. వీరు ఏ ప్రాంతం వారో, వీరి స్వస్థలం ఏదో కూడా ఇతమిద్ధంగా తెలియదు. గుమ్మిడిదల అనే ఇంటి పేరు కూడా అటువంటిదే. తెలుగునాట ఈ ఇంటి పేరుతో ఉండే గ్రామం కూడా లేదేమో! దాసు, గాడిచర్ల, ఫార్శీ, ఫిరోజ్‌ఖానా, సబ్నవీసు, రోజుఖుర్దు మొదలైన తెలుగు ఇంటి పేర్లు చిత్రంగా కనబడతాయి. కొన్ని శతాబ్దాల కిందట వీరి పూర్వీకులు కన్నడ ప్రాంతం నుంచో, మహారాష్ట్ర నుంచో తెలుగునాట వచ్చి స్థిరపడ్డారని ఊహించవచ్చు. ‘దాసు’ వారు ఈ విషయం తమ దేవీ భాగవతం పీఠికలో చెప్పకనే చెప్పారు. గుమ్మిడిదల వారూ, బెన్నూరి వారూ కూడా అటువంటి కుటుంబాలకు చెందిన వారేనేమో! ఇది ఊహ మాత్రమే.
ఇతర భాషా ప్రాంతాల నుంచి వచ్చిన వారెవరైనా ఇక్కడ వారేర్పరచుకున్న వృత్తులను బట్టి, వారి వారి ప్రవృత్తులను బట్టి బ్రాహ్మణ కులంలోని అవాంతర శాఖలలో చేరిపోయి ఉండవచ్చు. బెన్నూరి రామారావు గారి తండ్రి నారాయణరావు గారు. ఆయన అంగర వారి కుటుంబం నుంచి బెన్నూరి కుటుంబానికి దత్తత వచ్చినట్లు శ్రీమతి నేతి సీతాదేవి తన దుర్గాబాయి దేశ్‌ముఖ్ జీవిత చరిత్రలో రాశారు. దుర్గాబాయిపై వచ్చిన జీవిత చరిత్రలన్నింటిలో సీతాదేవి గారిది సమగ్రం, విషయ పరిపూర్ణం.
అంగర వారు కూడా ఎక్కడివారో తెలియదు, అంటే వారి స్వస్థలం. కానీ ఇప్పుడు అంగర వారి కుటుంబాలు ఆంధ్రదేశంలో కొన్ని ఉన్నాయి. వీళ్ళది మధ్వ సంప్రదాయం. మధ్వ సంప్రదాయం ఎక్కువగా కర్నాటకలోనూ, మహారాష్ట్రలోనూ కనబడుతుంది. అంగర బ్రహ్మాజీరావు గారు తూర్పు గోదావరి జిల్లాలో సంపన్నుడైన ఒక జమిందారు అట. ఆయన ప్రియ మిత్రులు బెన్నూరి నారాయణరావు. బ్రహ్మాజీరావు గారు తమ కుమారుడ్ని నారాయణరావు గారికి దత్తత ఇచ్చారు. బ్రహ్మాజీరావు గారి జమిందారీ గ్రామం సముద్ర తీరస్థమై ఉంటుంది. ఏమంటే బెన్నూరి నారాయణరావు గారు ఆ కాలంలో ‘కస్టమ్స్’ శాఖలో పనిచేసేవారట. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అంటే, ఓడరేవుల పన్నులు వసూలు చేసే ఉద్యోగం. బెన్నూరి నారాయణరావు గారు ఉద్యోగ విరమణానంతరం రాజమండ్రిలో నివాసం ఏర్పరచుకున్నారో లేక తమ కుమారుడు రామారావు చదువుల నిమిత్తం రాజమండ్రి వచ్చారో నిర్ణయించే ఆధారాలు లేవు.
రాజమండ్రిలో అప్పుడు గుమ్మిడిదల మనోహరం పంతులుగారు పోలీసు శాఖలో పనిచేస్తుండేవారు. ఈయన వీరేశలింగం గారికి మంచి మిత్రులు, అనురక్తులు. వీరేశలింగం తలపెట్టిన వితంతు వివాహాలకు మనోహరం పంతులుగారు సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. ఈ విషయం వీరేశలింగం స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు కూడా. క్రమ క్రమాభివృద్ధి సాధించి మనోహరం పంతులుగారు పోలీసు శాఖలో జిల్లా యంత్రాంగంలో ఉన్నతోద్యోగి అయ్యారు. అది పోలీసు సూపరింటెండెంట్ వంటి ఉద్యోగం అన్నమాట. ఆయన పెద్దాపురంలో పనిచేస్తుండగా ఒక వితంతు వివాహం జరిపించడంలో తనకు మనోహరం పంతులు చాలా తోడ్పడ్డారని వీరేశలింగం స్వీయ చరిత్రలో ప్రసక్తం చేశారు. రాజమండ్రిలో మొట్టమొదటి వితంతు వివాహం జరిపినప్పుడు గొప్ప ఆందోళన, అల్లకల్లోలమూ సంభవించాయనీ, అప్పుడు పోలీసు వారు తమకు అండగా ఉన్నారనీ, ఆ తరువాత వెంట వెంటనే జరిగిన రెండు, మూడు వివాహాలలో వధూవరుల ఊరేగింపు, పల్లకీల వెంట పోలీసుల రక్షణ వలయం కూడా లభించిందనీ వీరేశలింగమే స్వీయ చరిత్రలో చెప్పారు. గ్రామాలలోని వితంతువుల భోగట్టా సేకరించడానికి కూడా తనకు పోలీసు వారు, ముఖ్యంగా మనోహరం పంతులు సహకారం చేశారని కూడా వీరేశలింగం స్వీయ చరిత్రలో ఉంది.
ఈ విధంగా గుమ్మిడిదల మనోహరం గారు రాజమండ్రి పోలీసు శాఖలో పనిచేస్తుండగా బెన్నూరి వారి కుటుంబంతో పరిచయం కలిగి నారాయణరావు గారి కుమారుడు రామారావుకు తమ కూతురు కృష్ణవేణిని ఇచ్చి పెళ్ళి చేసి ఉంటారు. మనోహరం పంతులు గారికి నలుగురు కుమారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా దుర్గాబాయికి మేనమామలే కదా!! దుర్గాబాయి జీవిత చరిత్ర రాసిన వారెవరూ వీరి ప్రస్తావన ఎక్కువగా చేయలేదు. ఒక మేనమామ (మాధవరావు) మాత్రం తన కూతురిని బెన్నూరి రామారావు గారి కుమారుడు నారాయణరావు (తాతగారి పేరు) కిచ్చినట్లు శ్రీమతి నేతి సీతాదేవి రాశారు. అయితే పెళ్ళి జరగడానికి కొద్ది రోజుల ముందే రామారావు స్వర్గస్తుడయ్యాడు. అందువల్ల తర్వాత కాలంలో రామారావు గారి కుటుంబానికీ, గుమ్మిడిదల వారి కుటుంబానికీ రాకపోకలు, సంబంధ బాంధవ్యాలూ తగ్గిపోయి ఉండవచ్చు. దుర్గాబాయి తమ్ముడైన నారాయణరావు గారి భార్య పేరు తిమ్మాబాయమ్మ. మేనకోడలికి తమ ఇంటి సంస్కారాలలో, సంప్రదాయాలలో కృష్ణవేణమ్మ గారు పెండ్లికి ముందు నుంచే మంచి తర్ఫీదు ఇచ్చేవారని తెలుస్తున్నది.
మనోహరం పంతులు గారు 1896లోనే మరణించారని కథనం. కనుక రామారావు గారికి రాజమండ్రితో ఒక రకంగా అనుబంధం సడలిపోయి ఉంటుంది. ఆయన స్కూలు చదువులో, కాలేజీ చదువులో ఒక పాలు పూర్తయి ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా కాకినాడ సబ్ కోర్టులో ఆయనకు ‘స్టెనో’ (అధికారుల ఉత్తర్వులను, నివేదికలను కార్యాలయం కార్యకలాపాన్ని ముందుగా హ్రస్వలిపీకరించి తరువాత పూర్తిపాఠం టైప్ చేసే ఉద్యోగి) ఉద్యోగం లభించింది. అందువల్ల ఆయన తన కాపురాన్ని కాకినాడకు మార్చారు. ఆయన చేసేది చిన్న ఉద్యోగమే అయినా ఎంతో పలుకుబడి గల ఉద్యోగం. స్వతహాగా ఆయన స్నేహశీలి, సేవా పరాయణుడు, ఉత్సాహం, ఉల్లాసం ఉరకలు వేస్తున్న స్వభావం కలవాడు. నవ్వుతూ, నవ్విస్తూ, నలుగురినీ నావాళ్ళనుకునే దొడ్డదైన మనఃప్రవృత్తి కలవాడు. ఉన్నతోద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకూ అందరూ ఆయన్ను నావాడనుకునేవారు. ఆయన ఉన్నచోట పదిమంది ఉన్నంత సందడి ఉండేది. కోర్టులో ఉద్యోగమే కాక స్వయంగా తన పరిధిలో ఆయనసాంకేతిక విద్యా శిక్షణ సంస్థ (టైప్, షార్ట్‌హ్యాండ్) నిర్వహించేవాడు. అందరికీ కావలసినవాడూ, అందరూ కావలసినవాడూ కనుక ఆయన ఇల్లు నిత్య కోలాహలంగా ఉండేది. ఉదార హృదయుడు, ఉత్తమ సంస్కారి, ఆచరణ వేదాంతి కాబట్టి ఆనంద జీవనుడిగా ఆయన అందరికీ ఆదర్శంగా ఉండేవారు.
దుర్గాబాయికి ఒక తమ్ముడు. అతడి పేరు నారాయణరావు. పాఠశాలలో కన్నా వాళ్ళకు ఇంట్లోనే ఎక్కువ విద్యాబుద్ధులు, సంస్కారమూ అలవరచుకునే వాతావరణం ఉండేది. అంత పసి మనస్సులు కూడా జీవిత వాస్తవికతలను తెలుసుకోవాలని తల్లిదండ్రులు అభిలషించేవారు. విశ్వాసంతో, హృదయార్పణంతో దేవుణ్ణి ప్రార్థించవలసిందిగా మతాలన్నీ బోధిస్తున్నాయని, కాబట్టి మౌళికంగా వివిధ మతాలతో భేదాలనేవి లేవని ఆ చిన్న మనస్సులకు హత్తుకునేటట్లుగా రామారావు సెలవు రోజుల్లో చర్చి, మసీదు ప్రార్థనలు వాళ్ళకు చూపించేవారట. వాళ్ళకు అవగతమయ్యేలా ఆ విషయాలను చెప్పేవారట. మానవ జీవితం ఎంత విలువైనదో, కాలం ఎంత అమూల్యమైనదో పిల్లలకు తెలియాలని మానవ జీవితంలో మరణం అనివార్యతను గురించి, స్మశానాలను గురించి వాళ్ళకు తెలిసేందుకు ఆయా ప్రదేశాల సమీపంలో వెళ్తున్నప్పుడు రామారావు తన పిల్లలకు చెబుతుండేవారని దుర్గాబాయి జీవిత చరిత్రకారులందరూ రాశారు.
కృష్ణవేణమ్మ గారిది పెద్ద చెయ్యి. చుట్టాలని, పక్కాలని, బంధువులని, నగరంలో పనిమీద వచ్చిన వారని, తన భర్త నడుపుతున్న సాంకేతిక విద్యాలయంలో పరీక్ష శిక్షణ కోసం వచ్చినవాళ్ళనీ ఎప్పుడూ ఇంట్లో సందడిగా అతిథులుండేవారట. ప్రతి రోజూ భోజనాల పంక్తిలో ఇంట్లో వాళ్ళకంటే ఇలా చేరినవారే ఎక్కువగా ఉండేవారట. కృష్ణవేణమ్మ గారి ఇంట్లో మడీ, మైలా, పూజా పునస్కారం, సంప్రదాయం పాటించినా నిర్హేతుకమైన ఆచారాలను, దయాదాక్షిణ్యాలకు విరుద్ధమైన విశ్వాసాలను దరిచేరనిచ్చేవారు కాదు. ఇక రామారావు గారు సర్వాత్మనా మానవత్వాన్నే ఆరాధించే వ్యక్తిత్వం గలవారు. ఆయనకు కాకినాడలో జరిగే సంగీతోత్సవాలలో మక్కువ ఎక్కువ. అందువల్ల ఏడాది పొడుగునా దసరా ఉత్సవాలనీ, శ్రీరామనవమి కార్యక్రమాలనీ ఏదో ఒక సాంస్కృతిక ఉత్సవాలలో తలమునకలై ఉండేవారు. ఇంట్లో కూడా అటువంటి పండుగలు, పబ్బాలు ఘనంగా నిర్వహించేవారు. కృష్ణవేణమ్మ గారికి సంగీతాభిరుచి ఉండేది. ఆమె హార్మోనియం, వీణ చక్కగా వాయించేవారు. తాను మాత్రం వెనుకబడడం ఎందుకని రామారావుగారు పట్టుదలతో వీణ సాధన చేసి భార్యతో పోటాపోటీగా నిలబడగలిగారు.
తీర్థాలలో, దేవుడి ఉత్సవాలలో తప్పిపోయిన పిల్లలను ఆయన సంరక్షించి ఇంటికి తెచ్చేవారు. అట్లా తప్పిపోయిన పిల్లలను వెదుక్కుంటూ రామారావు గారింటికి వచ్చి ఆ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను చూసి సంబరపడిపోయేవారు. పిల్లలకు తల్లిగారు రామాయణ, భారత గాథలను తీరిక వేళల విన్పిస్తూ భారతీయ పురాతన సంస్కృతి పట్ల ఉత్సుకులను చేసేవారు. వినోదం కోసం కాశీ మజిలీ కథలు కూడా విన్పించేవారు. తండ్రిగారు ఎప్పుడైనా వాళ్ళకు ఇంగ్లీషు కథలూ, నవలలూ విన్పించి వాళ్ళలో సాహిత్య ప్రీతిని విశాలతరం చేసేవారు. ఉత్తమాభిరుచినీ, సృజనాత్మకత ప్రవృత్తిని అభివృద్ధి పరిచేవారు. వాళ్ళ పసిహృదయాలలో ఇంటా, బయట సాహిత్య సంగీత ప్రపంచమే చేరువగా ఉండేది. ఈ విధంగా దుర్గాబాయిగారి మీదా, ఆమె తమ్ముడు నారాయణగారి మీద బాల్యం నుంచీ తమ తండ్రీ, తల్లీ ప్రభావశీలమైన వ్యక్తిత్వాన్ని ప్రసరింపజేశారు.
కాళిదాసు కుమార సంభవంలో ‘ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యా’ అని అన్నట్లు (పూర్వజన్మ విద్యలన్నీ అప్రయత్నంగా పార్వతిని బాల్యంలోనే చేరాయి అని దీని అర్థం) దుర్గాబాయి పదేళ్ళ వయసులోనే అన్ని విద్యలు, కళలు, కలుపుగోలుతనం, ప్రపంచాన్ని జయించగలనన్న ఉల్లాసం, విశ్వాసం, చురుకుదనం ఎట్లా ప్రోది చేసుకున్నదా? అని ఆశ్చర్యం వేస్తుంది.
కౌమార దశనుంచీ ఆమెలో నిరంతరోత్సాహమే. కార్యదీక్ష, సృజనాత్మకత ప్రతిభా వికాసమే. తమ్ముణ్ణి ప్రాథమిక పాఠశాలకు తీసుకొని వెళ్ళే బాధ్యత చిన్నతనంలో తన మీద వేసుకుంది కానీ తాను పాఠశాలలో చదివింది ఏమీలేదు. ఆమె స్వయంభువు, అంటే తనకై తాను వెలిసిన దేవత అని అర్థం.
బాల్యం నుంచీ ఆమె నిరంతర చైతన్య స్రోతస్విని. కొండనుంచి నిర్గమించే సెలయేరుకు చిన్న చిన్న ఆటంకాలు, అడ్డంకులు లెక్కలోకి వస్తాయా? ఒకవేళ వచ్చినా వాటిని చుట్టు చుట్టి అయినా గమ్యంవైపు గలగల సాగిపోతూనే ఉంటాయి. అటువంటి ప్రవాహ ప్రవృత్తి దుర్గాబాయిది.
చుట్టపు చూపుగానో లేదా శెలవులకో లేదా ఏదైనా శుభకార్యం నిమిత్తమో బాల్యంలో ఆమె పెద్దాపురం వెళ్ళింది. తాతగారు అక్కడ పోలీసు అధికారి కదా! మేనమామలు ఎవరో అక్కడ ఉండేవారేమో! అందువల్లనైనా ఆమె అక్కడ చిన్నతనంలో ఉన్నదేమో! అక్కడ ఒక మౌల్వీ దగ్గర ఉర్దూ అభ్యసించింది. నిత్య నిరంతర జాగరూక మనస్కురాలన్న అమె. వ్యవహార జ్ఞానం ఆమెకు ఉర్దూలో కూడా
ఉన్నట్లు ఆమె చరిత్రకారులు చెప్పారు. ఒక్క క్షణకాలం వృథా చేయని, చేయనివ్వని తత్వం ఆమెది. ఆమె ఏకసంథాగ్రాహి కూడా. లేకపోతే హిందీలో, తెలుగులో అన్ని పాటలు ఆమె చిన్నతనంలో ఎట్లా నేర్చుకోగలిగేది. వీణ ఎట్లా వాయించగలిగేది! చూపరులకు అబ్బురపాటు కలిగేట్లు రంగస్థలులు (ముగ్గులు) ఎట్లా రచింపగలిగేది? సంక్రాంతి పండుగ రోజుల్లో ఆమె వేసే ముగ్గులు ఆ వీథి వీథి అంతా ఆక్రమించేవట. ఏ విషయంలోనైనా ఆమె గ్రహణ ధారణలు అత్యంత నిశితంగా ఉండేవి. అందువల్లనే ఏడెనిమిదేళ్ళ వయసులోనే ఆమె తన వయసు పిల్లలకే కాక తనకంటే పెద్దవారికి కూడా ఆకర్షణీయురాలు కాగలిగింది. తల్లికి కూడా హిందీ పాఠాలు బోధించగలిగింది. ఆమె ఉల్లాస మనోప్రవృత్తికి అల్లరి చేష్టలు కూడా అందంగా ఉండేవి. నీటితో నిండివున్న గంగాళాలు ఒంపి నీరంతా నేలపాలు చేయడం, బామ్మగారి మడిబట్టలు అంటుకొని ‘ఇవాళ నీ మడిబట్టలు లేవే! ఎట్లా?’ అని ఆమెను ఉడికించడం, తండ్రి సహపంక్తిన భోజనం చేస్తున్న ఆయన మిత్రుడు, గృహిణిని ఉబ్బేయడానికి కూర చాలా బాగుంది, అని మెచ్చుకొన్నప్పుడు (గృహిణి అంటే దుర్గాబాయి తల్లి) ఇంకాస్త వేయమంటాడేమో అని వంటింట్లో గుంజాటన పడుతున్నప్పుడు, ఆ మాటలో తనలో తాను గొణుక్కోవడం విని దుర్గాబాయి, ఎటువంటి మొహమాటాలు లేకుండా ‘మరి మారు వడ్డనకు అడగకండేం!’ అని ఆ అతిథికి అర్థమయ్యేటప్పుడు ముదలకించడం మొదలైన ముచ్చట్లు ఆ దుర్గాబాయి చిన్ననాటి చిలిపి పనులుగా పాఠకులని ఇప్పటికీ ఉల్లాసపరుస్తాయి. తల్లి ఎప్పుడైనా ఆ గడుగ్గాయితనం భరించలేక కోపం ప్రదర్శించబోతే, తండ్రి తన గారాల కూతురిని వెనకేసుకురావడం, సమర్ధించడం వంటి అచ్చట్లు ముచ్చట్లు దుర్గాబాయి జీవిత చరిత్ర చదివేవారందరినీ (శ్రీమతి నేతి సీతాదేవి రచన) అలరిస్తాయి. ఆమెది బంగారు బాల్యం. అటువంటి చిన్నారిని కన్న తల్లిదండ్రులదే అదృష్టం.
(భారతీయ సాహిత్య నిర్మాతలు పుస్తకం నుండి) (ఇంకా ఉంది….)