కతలొకటే… మన వెతలొకటే – ఎస్‌.రాజ్యలక్ష్మి

 

ఈ మధ్య ఆవిష్కరించిన ”మీ టూ” కథల సంకలనం చదివాక నా వంతు అభిప్రాయం రాయాలనిపించింది. స్త్రీలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు ఎన్నాళ్ళ నుంచో సాగుతున్నాయి. వారు అవన్నీ మౌనంగా భరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే, నాకు అవమానం జరిగింది, నా శరీరం వేరొకరికి ఆనందాన్నిచ్చే వస్తువు మాదిరి అయిపోయిందన్న బిక్కచచ్చినతనంతో, నేనీ విషయాన్ని బయటికి చెప్తే నాకింకా హేళనే తప్ప, ఏమీ సాధించలేనన్న నిస్పృహతో, చెప్తే పైపెచ్చు తనమీద, తన మనుగడ మీదే దాడి జరగొచ్చన్న భయంతో. ఇవన్నీ స్త్రీ సహజమైన బలహీనతలు, అశక్తతలు. ఎందుకిలా అంటే, ఈ సమాజపు దృష్టితోనే అసలు సమస్య. దాన్ని సెన్సిబుల్‌గా తీసుకుని ఆ బాధితులకు ధైర్యం చెప్పే రకంగా ఉండం మనం, అంటే సమాజంలోని ఆడా, మగా కూడా. ఎప్పుడైనా వేరే వారి కష్టం వినడానికి కుతూహలంగానే ఉంటుంది సమాజం. బోలెడంత జాలి, సానుభూతి చూపించడానికి కూడా కొరత ఏమీ ఉండదు. కానీ అది ఎటువంటి ఉపయోగమూ కాదు. ‘పద వెళ్ళి అడుగుదాం’ అనడం పక్కన పెడితే ముందు వీరినే వెనక్కి లాగే ప్రయత్నాలేమీ లేకుండా

ఉంటే చాలు. ఇప్పటికీ ఇదే మన తీరు.

మనం ప్రపంచం కోసం మాట్లాడితే మన కోసం ప్రపంచం మాట్లాడుతుంది, అనేది చాలా పాజిటివ్‌ దృక్పథమే. కానీ వాస్తవం అలా లేదు. ప్రపంచం దాకా ఎందుకు, మన చుట్టూ ఉన్నవాళ్ళలో కొంతమందైనా పనికిమాలిని సానుభూతికి పరిమితం కాకుండా, ధైర్యంగా మన పక్షాన ఉంటే చాలు. విషయం దగ్గరకొచ్చేసరికి ఎవరికి వారికి మాకెందుకు అనే సేఫ్‌ ప్లే నే. ప్రపంచం తోడు ఎంతైనా అవసరమే. కానీ అది దొరకకపోయినా, ఎవరి సమస్యకి వారే తిరుగుబాటు కార్యక్రమం మొదలుపెట్టేంత శక్తిగా ఉండాలి స్త్రీలు. మనం కూడా పక్కన వారి సమస్యకు నిర్మాణాత్మకంగా స్పందించే తీరు అలవరచుకోవాలి. ఏది ఏమైనా, ఇలాంటి వేధింపుల విషయంలో

ఉండకూడని ఒకే ఒక ఫీలింగ్‌… సెల్ఫ్‌ పిటీ. అది ఆవరించిందంటే ఇక మొత్తం ఆలోచనలనీ, తెగింపునీ అక్కడికక్కడ వదిలేయాలనిపిస్తుంది. అందుకే దాని స్థానంలో ఆత్మగౌరవాన్ని నింపుకోవాలి.

వర్గ వివక్ష అయినా, కుల వివక్ష అయినా, మత వివక్ష అయినా, ఇంకే వివక్ష అయినా అన్నింటిలోనూ కామన్‌గా ఉండేదే ఈ లింగ వివక్ష. సామాజికంగా ఒక బలహీనుడు, ఒక బానిస ఉంటే, వాడికంటే కూడా బలహీనంగా, వాడికే బానిసగా ఉండేదే ఆడది. మనం నాగరికంగా ఎంత అభివృద్ధి చెందినా, మన జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చినా, మనం రూపం ఎంత మారినా, ఇంకా దాని స్వభావంతోనే ఉన్నది ఒక్కటే… అదే స్త్రీ, పురుష సంబంధపు గుణం. గ్రామీణ, ఆదివాసీల విషయంలో పరిష్కారం దిశ చూపుతున్నారు అందరూ. అక్కడా ఈ సమస్యకి ఒక వర్గ వివక్షను కలిసి దాన్ని ముఖ్యం చేస్తే కానీ, ఆ సమస్యలని సామాజికంగా ఎదుర్కోవటం జరుగుతోందేమో. ఎందుకంటే ఆ రకంగా అయితేనే ఈ మీడియాల్లో అయినా, ప్రభుత్వాలకైనా ఎక్కువ కదలిక వస్తుంది. అర్బన్‌ వారి విషయం అయితే వారు ఒక ”నాగరిక” సమాజంలో ఉన్నారు, కొండొకచో అధునాతనంగా ఉన్నారు. గ్రామీణ మహిళల్లా వారు ఈ స్త్రీ సామాన్య, సహజ సమస్యని పైకి చెప్పాలంటే, అది ఒక పరువునష్టంగా, తమ వ్యక్తిగత కోణంలో ఒక జరగరానిదిగా భావించడం బట్టి ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. ప్రతి ఆఫీసులో, అది ప్రైవేటు అయినా, ప్రభుత్వం అయినా, ఈ వేధింపుల విచారణ తాలూకు ఒక కమిటీ వేసి తీరాలని ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్నింటిలో అవి పేరుకు మాత్రమే ఉన్నాయి, అవి ఏ మాత్రం పనిచేయవు. ఎందుకంటే కేసులే ఉండవు కాబట్టి, ఉన్నా నిరూపణ కావు కాబట్టి. సాక్షాత్తు సుప్రీంకోర్టులో నమోదయిన కేసు కూడా అబద్ధపుదే అని నిరూపణ అయింది కాబట్టి. ఈ నేపథ్యంలో ఎవరు ఎవరికి ధైర్యాన్నివ్వాలి, ఆ అవమానాన్ని ఎలా మాన్పాలి? సాటి ఆడవారే. ఏ మనిషికైనా సామాజిక బహిష్కరణ, వీడు పనికిమాలినవాడు అనే ముద్ర కంటే అవమానకరం ఇంకోటి ఉండదు. ఆ బాధితురాలికి ఈ తోడు, ఈ సహ అనుభూతి ఎంతో శక్తినిస్తుంది. ప్రత్యేకించి, ”నాకెప్పుడో ఇలా అవమానం జరిగింది” అని బహిరంగం చేయడం వేరే విషయం, అది వ్యక్తిగతం. అది ముందడుగే అవుతుందో, ఆ వేధింపుకి గురి చేసిన మనిషి గురించి సమాజానికి తెలియజేయాలనే క్రోధం అవుతుందే కానీ, ఆత్మ గౌరవం ఎలా అవుతుందో అర్థం కాదు. అలా చెప్పడం వల్ల ఎంతో సాంత్వన, ఒక రిలీఫ్‌ ఫీలింగ్‌, ఒక భారాన్ని వదిలించుకున్నతనం రావచ్చేమో. చిన్నతనపు శారీరక దాడులను మినహాయిస్తే, ఒక వేధింపు ఎదురైనప్పుడు సరైన చైతన్యంతో ఎవరికి వారు నిలబడగలగాలి. అలా నిలబడి పోరాటం కూడా చాలామంది చేస్తూనే ఉన్నారు. అదే మనలోని అసలు శక్తి.

ఈ ‘మీ టూ’ పుస్తకంలోని కథలన్నీ దాదాపు అర్బన్‌ వాతావరణం లోనివే, ఒక్క రెండో మూడో తప్ప. ముందు ఈ కథలకి పేర్లు లేవు, అవి ఉంటే వాటికి ఉనికి ఉండేది, అవి స్వానుభవం కావచ్చు, కాకపోవచ్చు అన్నారు. అందుకే కథలకి పేర్లు ఉండాలి, అప్పుడే అవి రచనలు అని తెలిసేది. ఈ ‘మీ టూ’లో రచయిత్రుల పేర్లు ఇచ్చారంటే ఎలా అనిపిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. పుస్తకంలోని ఒక కథను రిఫర్‌ చేయాలంటే ఆ రచయిత్రి పేరుతోనే రిఫర్‌ చేయాల్సి వస్తోంది. అలాగే చేద్దాం మరి.

జరీనాగారి కథలో గృహహింసలో నుంచి బయటపడాలనుకున్న ఒక స్త్రీకి ఇంకో స్త్రీ తోడు, ధైర్యం, చేసిన సహాయం చాలా బాగున్నాయి. ఝాన్సీగారి కథలో దీప ”ఎంతసేపూ మీ దిక్కుమాలిన కుతూహలాలేనా, ఏం చేస్తారు నా గురించి తెలుసుకొని, పోరాడతారా నాతోపాటు?” అంటూ ఈ సభ్యసమాజాన్ని కడిగేసింది. తన పాదాలమీద చటుక్కున పడిపోవాలన్నంత ఎమోషన్‌ వచ్చేస్తుంది. తను చెప్పకనే చెప్పింది… ఈ సానుభూతులే పనికిమాలినవి అని. సుజాతగారి కథలో అప్పటికే వేధింపులకు గురవుతున్న కోడలికి గొప్ప ధైర్యం ఇంకో స్త్రీ తెగింపు చర్య. ఇలాంటివే ఏదో తెలియని ఆనందాన్నీ, శక్తినీ ఇస్తాయి. చిన్నప్పుడు అమ్మమ్మ మమ్మల్ని సినిమాకి నేల టికెట్‌తో తీసుకెళ్ళగా, అంతా కొంత నిరాసక్తతతోనే నిద్రపోతూ చూస్తూ, విలన్‌తో హీరో ఫైటింగ్‌ సీన్‌లో మాత్రం పరమానందంతో ‘కొట్టెయ్యి, చంపెయ్యి’ అని ఉత్సాహపరచినట్లు హుషారుగా అనిపించింది ఆ ముసలోడి మొహం పగలగొట్టగానే.

దేవికారెడ్డి గారి కథలో పై అధికారులకు స్త్రీల సమర్ధత మీద ఉండే చులకన భావాన్ని చూపించారు. సాధారణంగా, ఒక పురుషుడు తన సామర్ధ్యాన్ని 25 శాతం చూపించి గుర్తింపు పొందేచోట, స్త్రీ 75 శాతం కష్టపడితే కానీ గుర్తించడానికి ఇష్టపడని పితృస్వామ్య సమాజం మనది. భారతి గారి కథలో మాండలీక భాషలో కొన్ని పదాలని ఎడిట్‌ చేసి ఉంటే, పోనీ అక్కడ బ్లాంక్‌ పెట్టి ఉంటే బాగుండేది. ఎంతయినా, ఏ భాష అయినా సాహిత్యంలో వాడకూడని కొన్ని పదాలు నిషిద్ధమే. ఈ కథలోని ముగింపు, ఆడవాళ్ళందరూ కలిసి మగపురుగుని కొట్టి అవమానించినట్లుగా రాస్తే ఏదో చల్లని గాలి తగిలినట్లు హాయిగా ఉండేది. ఎవరికీ చెప్పుకోలేక చచ్చేవాడు ఆ మోతుబరి. సాంత్వన గారి కథలో తులసికి ఓదార్పుని ఇవ్వలేక పోయినందుకు ఎంతో బాధపడిన ధన్య లాంటి స్నేహితులు అరుదైన వరం లాంటి వారు. తులసి చూపించిన పట్టుదలకి గర్వంగా అనిపిస్తుంది. స్వర్ణ గారి కథలో లాంటి అంకుల్‌ గాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనచుట్టూ, అభిలాష నవల్లో సర్వోత్తమరావుల్లా, బైరాగుల్లా. ఆ సినిమా వచ్చిన కొత్తల్లో ఎవరైనా ఆడవారిని అదోలా చూస్తుంటే అమ్మో వీడో బైరాగి అని హెచ్చరించుకునేవాళ్ళం. ఇలాంటి మనిషి రూపం జంతువుగాళ్ళని బైరాగి అని ఇప్పటికీ అనవచ్చు.

ప్రతి కథనూ చదువుతున్నప్పుడు ఎక్కడో ఇలాంటి పాత్రో, నిజజీవితంలో మనిషో గుర్తొస్తూనే ఉన్నారు. మమతగారి కథలో ఆఫీసు అసిస్టెంట్‌ చేసిన చెత్త పని చదువుతుంటే, ముంబైలో అరుణ షాన్‌బాగ్‌ గారి జీవితంలో ఆ హాస్పిటల్‌ ప్యూన్‌ గుర్తొచ్చాడు. ఆమె నర్సుగా ఉన్నప్పుడు అతని పనిలో తప్పు చూపించి మందలించారన్న కోపంతో ఆమె మీద అఘాయిత్యం చేసి, కుక్కలకి బిగించి కట్టే బెల్టుతో ఆవిడ మెడకి బిగించి లాగాడు. ఫలితం… నలభై ఏళ్ళ కోమా ఆ నర్సుకి. అదే హాస్పిటల్‌లోని తోటి నర్సులు, డాక్టర్లు, ఆయాలు ఆమెను ఎంతో దయగా, శ్రద్ధగా చూసుకున్నారు. ఆ నర్సు అరుణకి కారుణ్య మరణాన్ని అంగీకరించాలని కోరుతూ ఒక మహిళా లాయర్‌ కోర్టులో పిటిషన్‌ వేసినా వారు వినలేదు, తామే చూసుకుంటామని చెప్పారు. వారందరికీ శతమానంభవతి చెప్తూ, కన్నీళ్ళతో మనసులో నమస్కరించడం తప్ప ఏం చెయ్యగలం? ఆమె మృత్యువుతో పోరాడుతూ 2015లో చివరి శ్వాస విడిచారు. కానీ, ఆ మృగాడికి మాత్రం ఏ ఆరేళ్ళో, ఎనిమిదేళ్ళో జైలు శిక్ష, తర్వాత మామూలు జీవితం. ఇంకో అఘాయిత్యం చేయొచ్చు, వాడిష్టం.

ఉషగారి కథలో తార, తనను ఇబ్బంది పెడుతున్న వ్యక్తి ఇంటికే వెళ్ళి అతని భార్య, కూతురితోనే చెప్పింది అతని వ్యవహారమంతా, అదే అతనికి అసలైన అవమానం. గాయపడిన మనసుకి ఆ మాత్రం చేయగలిగానన్న రిలీఫ్‌ అయినా ఉండాలి. ఆఫీసుల్లో బ్యూరోక్రసీలలో, పలుకుబడుల్లో పడని శిక్ష ఒక్కోసారి ఇలాంటి భార్యాక్రసీల్లో పడొచ్చు. మైథిలి గారి కథ చదువుతుంటే ఈ రోజుల్లో శాపాలిచ్చే వెసులుబాటు ఉంటే ఎన్నో సమస్యలకి తక్షణ పరిష్కారం ఉంటుంది కదా అనిపించింది. ఉమగారి కథ ముందు పుస్తకంలో చదవగానే ఎక్కడో, ఏదో మిస్సయినట్లు అసంపూర్తిగా అనిపించింది. తర్వాత అనుబంధంలో ఏమి ఉందో చూసి చదివాక ఏం జరిగిందో తెలిసింది. ”భూమిక”లో చదివాక ఆ కథ పేరు ”మిట్టమధ్యాహ్నం నీడ” అని కూడా తెలిసింది. రచయిత్రితో మాట్లాడిన తర్వాత ఇంకా వివరం తెలిసింది. కథలో ముఖ్యమైన భాగం ఎలా పోతుందో, అంత తప్పు ఎలా జరగగలదో, అంత నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో అర్థం కాలేదు. ఎంత అనుబంధం వేసినా, అది నష్టనివారణ చర్యే అవుతుంది కానీ, ఎంతో ఆసక్తిగా కథ చదవాలని చూసే నాలాంటి వారికి ముందుగా క్షణకాలం నిరాశ తప్పదు. ముందే అనుబంధం ఒకటి ఉంది, అది చదవాలి అని ఎవరూ అనుకోరు కదా? ఇలాంటి మంచి కథ విషయంలోనే ఈ తప్పు, నిర్లక్ష్యం జరగడం విచారకరం. కథ విషయానికొస్తే, చిన్నతనంలో జరిగిన శారీరక, మానసిక హింస అలాగే ముద్ర పడుతుంది ఆ పసిమనసులో. మిథున లాంటి వాళ్ళకి తర్వాతి జీవితంలో ఆదరణ, ప్రేమ మాత్రమే ఆ గాయాన్ని మాన్పగలవు. తన ఘర్షణని చాలా క్లియర్‌గా మాటల్లో పెట్టగలిగారు రచయిత్రి. ముందు ముఖ్యంగా అర్జున్‌లాంటి పరిపూర్ణ పురుషులు కూడా ఉన్నారు, ఉంటారు అని ఎంత హాయిగా అనిపించిందో మనసుకి. నాయనమ్మే అసలు సూత్రధారి అయినా, అలాంటి ‘పెద్దమనసు’ పెద్దవాళ్ళు ఉన్నా చూడండి, కొన్ని కుటుంబ సంబంధాల్లో ఏదీ మారలేదు. ఆ చిన్నిమనసు అసలు ఘోష, అతను అందరి మధ్యా మామూలుగా గౌరవంగా తిరుగుతున్నాడని అయి ఉండవచ్చు. ఆమె అవమానంగా, శరీరానికి ఏదో మురికిపట్టిన ఫీలింగ్‌ని అన్నాళ్ళూ అలాగే మోసి ఉంటుంది. ఈ కథ చదివిన చాలామంది గతంలోకి వెళ్ళి ఉంటారు, ఆ నీలి నీడల దుఃఖం గుర్తు తెచ్చుకొని ఉంటారు. కొంతమందికి క్రమేణా ఆ గాయం మానే అవకాశం ఉంటుంది, మరికొంతమంది అలానే మోయాల్సి ఉంటుంది. ”ఆడజన్మకు ఎన్ని శాపాలో” అని సుశీలగారి పాటలోని వేదన చెవుల్లో మారుమ్రోగుతోంది. ఆఖరుగా స్వేచ్ఛ గారి కథ కూడా ఏదో అసంపూర్ణంగానే ఉన్నట్లు అనిపించింది. మరీ ఆఖరులో రాజు ఇంట్లో ఆడవాళ్ళకి ఎలా అడ్డం వేశాడో, అతనికి మందలింపు ఎలా రాగలిగిందో సరిగ్గా అర్థం కాదు. సారీ చెప్పించడం ఏదో కంటితుడుపే కానీ ఆఫీసు నుంచి వెళ్ళిపోవడంతో అతనికి అంతే అవమానం జరిగిందని బాగా అనిపించింది. ఈ కథ విషయంలో కూడా ఏమైనా ఎడిట్‌ అయిపోయిందేమో ఒకసారి చూసుకుంటే బాగుండునన్న ఫీలింగ్‌ వదలడంలేదు. మొత్తంమీద ‘మీ టూ’ ఒక మంచి ప్రయత్నం.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.