మనసు బాగాలేని వేళల్లో
దారూషిఫా మసీదు మైదానాల్లోకి వెళ్ళండి
భయంలేని లెక్కలేనన్ని పావురాళ్ళు
కువకువలాడుతూ
తిరుగుతుంటాయి అక్కడ
ఆ సాయంత్రం
కాసిన్ని జొన్న విత్తనాలు తీసుకుని
వచ్చాడా సుర్మాకళ్ళ పిల్లవాడు
వాడి అమ్మేమో వంటినిండా బుర్ఖా కప్పుకుని
కళ్ళ గంతల మధ్య నుండి
ప్రపంచాన్ని చూస్తున్నది
విసిరేసిన గింజల్ని తినేందుకు
వాడి చుట్టూ గునగునా తిరిగాయి పావురాళ్ళు
పిల్లవాడి కళ్ళలో మెరిసిన ఆనందంతో
మైదానం వెలిగింది
మొఖంపైన ముసుగు తీసిన
వాడి అమ్మ నిశ్చింతగా నవ్వింది
అప్పుడే
బడిపంతుళ్ళ చేతుల్ని విడిపించుకుని
మదరసా నుండి, అనాథ పిల్లల గృహాల నుండి ఆడుకునేందుకు
పిల్లలు బిలబిలా పరుగెత్తుకొచ్చారు
భయంలేని పావురాళ్ళు
సంతోషంతో ఒక్కసారిగా
ఆకాశంలోకెగిరి
రెక్కలు టపటపలాడిస్తూ
రమ్మని పిలిచాయి వాళ్ళని
మడెమెల పైకి పైజామాలు
తలలపై టోపీలు ఉన్న పిల్లలు
నుదుటి మీద బొట్లు, చేతులకు
దారాలు ఉన్న పిల్లలు
మెడలో వేలాడే శిలువ గుర్తుల
పోలియో కాళ్ళ పిల్లలు
మైదానంలో దుమ్మురేగేలా
అటు ఇటు పరుగెట్టారు
భయంలేని పావురాళ్ళు
వాళ్ళతో పాటు నృత్యం చేస్తూ ఎగిరాయి
గుర్తులూ, భయమూ లేని
ఆ పావురాళ్ళు ఏం చెప్పాయో
వాళ్ళు సంతోషంతో కిలకిలా నవ్వారు
ఆ పిల్లల్ని మైదానంలోకి తెచ్చిన
బడి పంతుళ్ళు
బుర్ఖా వేసుకున్న సుర్మా కళ్ళ పిల్లవాడి తల్లీ
అక్కడే రికామిగా తిరుగుతున్న నేను
అప్పుడు
దారూషిఫా మసీదు మైదానంలో
కురిసిన నవ్వుల నక్షత్రాలకేసి
ఒకరితో ఒకరం
ఒక్క మాటన్నా లేకుండా చూసాం
సరిగ్గా నాకు లానే వాళ్ళకీ
ఇట్లనే అనిపించి ఉంటుంది
పిల్లల్ని గుర్తించేందుకు పెద్దవాళ్ళు
పెట్టిన గుర్తులు వాళ్ళపై అట్లా
ఉంటే ఉండనీ గాక
గుర్తులేమీ లేని, భయం లేని
పావురాళ్ళతో
నవ్వుతూ, కలిసి ఆడుకునే ఈ పిల్లలు
ఇక పెద్దవాళ్ళు కాకుండా ఉంటే బాగుండునని.