నాకు ప్రేమ లేఖలు రాయడం చాలా ఇష్టం.
నా నేస్తాలందరికీ ప్రేమలేఖలు రాసాను. ఇంకా రాయాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు.
వీళ్లకి ఒక ప్రేమలేఖ రాయాలి అనిపించేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు.
నేను ఆనందార్ణవం పుస్తకం రాస్తున్నప్పుడు నా మనసులో ఒక ప్రేమ కెరటం ఎగిసి పడుతుండేది. ఆనందం అంటే ఏమిటి? ఎక్కడుంటుంది? ఎలా ఆనందాన్ని వెతికి పట్టుకోవాలి అంటూ నేను మొదలు పెట్టిన అన్వేషణ, ఆ అన్వేషణకి నాకు దొరికిన సమాధానం నా డైరీలో భద్రంగా ఉన్నప్పుడు నాకెంతో ప్రియమైన వాళ్లు కొందరు నా వెంటపడి దానిని పుస్తకంగా తెచ్చారు.
ఆ ప్రియమైన వాళ్లందరికీ ప్రేమలేఖలు రాసాను. నాతో ఉన్నవాళ్లకీ, నన్ను వదిలేసి, నా స్నేహాన్ని తెగ్గొట్టుకున్నవాళ్లకి అదే ప్రేమతో ప్రేమలేఖలు రాసాను.
నాకు ఉత్తరాలు రాయడం ప్రాణస్పదమైనది. ఉత్తరాలు రాయాలంటే ఊటబావి లాంటి జ్ఞాపకాలుండాలి.
నాకు ఊటబావి మా సీతారామపురం. నేను పుట్టి, పెరిగిన ఊరు. తవ్వేకొద్దీ ఊరే పసందైన జ్ఞాపకాల సమాహారం మా ఊరు. మా ఊరు గురించి చాలాసార్లు రాసాను.
ఇప్పుడు ఎవరికి నా ప్రేమలేఖ రాయాలి?
ఒక భయానక, బీతావహ స్థితిలో మగ్గుతూ ఎవరికి ప్రేమలేఖ రాయను?
మార్చి 20న చింతూరు మీదుగా రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చాం నేను, ప్రశాంతి.
ఆ అడవి దారంతా స్వేచ్ఛగా ప్రయాణం చేసి, రాత్రి రమణ ఆకుల ప్రాజెక్ట్ డైరక్టర్ గారింట్లో గెస్టులుగా ఉన్నాం. మర్నాటి
ఉదయాన్నే ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తూ మమ్మల్ని అడవి గర్భంలోకి తీసుకెళ్ళి అడవి సౌందర్యాన్ని చాలా సమీపంగా చూపించారు.
అంతకు ముందు రోజు ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు గ్రామం కుంటా చూసాం. ఒరిస్సా సరిహద్దు గ్రామం కూడా చూసాం.
సీలేరు, శబరి నదుల పరవళ్ళు చూసాం.
ఆ అడవి, అడవి బిడ్డల జ్ఞాపకాల పారవశ్యం ఇంకా మనసులో ఇంకనేలేదు. ఆ జ్ఞాపకాలను అక్షరీకరించనేలేదు.
భద్రాచలం మీదుగా హైదారాబాదుకు చేరాం. మనసులో అడవి ఉప్పొంగుతూనే ఉందింకా.
మార్చి 21 న హఠాత్తుగా ఉరమని పిడుగులాంటి వార్త.
22 మార్చి జనతా కర్ఫ్యూ. ఆ తర్వాత దేశం మొత్తానికి తాళం వేసామన్నారు.
దేశమంతా లాక్ డౌన్. లాక్ డౌన్ అంటే ఏమిటీ? ఎన్నాళ్లుంటుంది?
అంతవరకు కరోనా పేరు విమానాశ్రయాల దగ్గరే వినబడింది. విదేశాల నుండి వచ్చేవాళ్ళకు ఏవో టెస్టులు చేస్తున్నారనే వార్తలు పేపర్లలో చదువుతూ ఉన్నాం.
ఇంత వేగంగా మన వీధి గుమ్మాలకు పాకి, వాటికి తాళాలు పడేంత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామా? నేనింకా అడవి మత్తులోనే ఉన్నాను.
మారేడుమిల్లి మహారణ్యం నన్ను ఆవహించే ఉంది.
ఈ కరోనా ఏంటి? ఈ కర్ఫ్యూ ఏంటి? ఏమి జరగబోతోంది. చస్తామా? బతుకుతామా?
మార్చి 23 నుండి నేటివరకు దేశానికి తాళం వేసే ఉంది.
ఇంటికి తాళం వేసుక్కూర్చుంటే నోట్లోకి తిండి ఎలా అని దేశాన్ని పాలిస్తున్న వాళ్లు ఒక్క క్షణమైనా ఆలోచించి ఉంటారా?
ఆలోచించలేదని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ… ఈ దేశంలో ఉన్న కోట్లాది శ్రామికులు, వలస కార్మికుల వెతలు, కతలు, కల్లోలాలు, మండుటెండలో నడకలు, దారి మధ్యలో దయనీయమైన మరణాలు… వెరసి హైవేలమీద జరుగుతున్న కోట్లాదిమంది భారతీయుల ప్రస్థానాలు.
భారతదేశ ‘అభివద్ధి’కి అసలైన కొలమానాలైన కోట్లాది శ్రమజీవుల జీవితాలు హఠాత్తుగా తాడు బొంగరం లేనివిగా మారిపోయాయి.
లాక్‌డౌన్ వల్ల పనులాగిపోయాయి. జీతాల్లేవు. కొనుక్కోవడానికి డబ్బుల్లేవు.
వేలాది కిలోమీటర్ల దూరంలో స్వగ్రామాలు. కరోనా బతకనిస్తుందో, చంపేస్తుందో!
ఊర్లో పిల్లలు, తల్లితండ్రులు ఎలా ఉన్నారో. అంతా అగమ్యగోచరం. బీభత్సం.
ఇక్కడ రేషన్ కార్డులుండవు. యజమానులు జీతాలివ్వరు. బయటకు పొమ్మన్నారు. రోడ్లపాలయ్యారు. బయటకొస్తే పోలీసులు కొడతారు.
ఇల్లు లేదు, వాకిలి లేదు, పని లేదు, ఆదాయం లేదు. ఊరు మీద దిగులు. ఇంటి మీద దిగులు. పిల్లల మీద దిగులు.
ఎంతోమంది వారి తిండితిప్పలు గమనించి డ్రై రేషన్ పంచారు, ఓపెన్ షెల్టర్లు పెట్టి అన్నం పెట్టారు.
అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం కూడా అన్నం పెట్టింది.
కానీ ఒకరా, ఇద్దరా, పదులా, వందలా, లక్షలా… లెక్కా పత్రం లేదు ఎవరిదగ్గరా. మొదట మూడు లక్షలన్నారు. చివరికి తేలింది 15 లక్షలు పైనేనని. ఇంతమంది సమస్తం కోల్పోయి రోడ్డున పడ్డాక కానీ ఎంతమంది ఉన్నారో లెక్క తేలలేదు.
హైదరాబాదు ‘అభివద్ధి’లో కీలక పాత్ర పోషించిన ఈ శ్రామికుల చెమటతో, రక్తంతో రహదారులు తడవడం మొదలయ్యాకా కానీ ఈ ‘అతిథు’ల గుండెఘోష ఎవ్వరికీ అర్థం కాలేదు. నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ తమ ఉనికి, ఆచూకీ ఎవ్వరికీ తెలియని వీరు… చీమల దండుల్లాగా రోడ్ల మీద నడవడం మొదలయ్యాకా సభ్య సమాజం, బహుశా ప్రభుత్వం కూడా నివ్వెరపోయి చూసింది.
ఒకప్పుడు వాళ్ళ తండ్రులో తాతలో చెమట చిందించి నిర్మించిన జాతీయ రహదారులపై కోట్లాదిమంది వలస కార్మికుల పాదాల పగుళ్ల నుండి రక్తం చిందడం మొదలైంది. తిండి లేక, నీళ్లులేక, నిలవ నీడలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఆ లెక్కలు ఎవరైనా తీస్తే కదా ఎంతమరది చనిపోయారో తెలిసేది.
దేశంలోకి కరోనా తెచ్చింది ఒకరైతే భయంకరమైన శిక్షకు గురౌతున్నది మాత్రం వలస కార్మికులు.
నడిచిపోతున్న వాళ్లని ప్రభుత్వాలు ఆదరించకపోగా, వాళ్ళ కోసం ఏమీ చెయ్యకపోగా పోలీసులు మాత్రం వాళ్ళని కొట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. అదే పోలీసులు కొన్నిచోట్ల అక్కున చేర్చుకున్న సందర్భాలూ ఉన్నాయి.
భవన నిర్మాణాల్లో, ఇటుక బట్టీల్లో, మగ్గం పనిలో, రోడ్లేయడంలో, హోటళ్ళలో, ఎన్నో రకాల పనుల్లో నిశ్శబ్దంగా నిమగ్నమై ఉన్న వలస కార్మికులు ప్రభుత్వాలకు పట్టని వాళ్ళై వేలాది కిలోమీటర్లు నడక మొదలు పెట్టారు.
పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తులు ఒక్కటైనారు. మొదట వారికి రేషన్ అందించే పనిలో నిమగ్నమై ఉన్న మాలో… జాతీయ రహదారుల్లో దిక్కు, మొక్కు లేకుండా ఎండా, వానా, పగలు, రాత్రి నడుస్తున దశ్యాలు కల్లోలపరచడం మొదలుపెట్టాయి. నడుస్తున్న వాళ్ళని ఆపి మీరు నడవకండి, రైళ్ళు నడుస్తాయి, బస్సులు నడుస్తాయి అని నమ్మకమిచ్చే పరిస్థితిలేదు. వాళ్లని ఆపే అధికారం ఎవ్వరికీ లేదు.
నడుస్తూ వెళుతున్న వాళ్ళకి కనీసం అన్నం పెట్టి మంచినీళ్ళిచ్చే పని చేద్దామని కొంతమందిమి సంకల్పించాం.
ఎలా? బయటకు వచ్చే వెసులుబాటు లేదు. రాత్రి కర్ఫ్యూ నడుస్తూనే ఉంది. కొనడానికి షాపుల్లేవు.
లాక్‌డవున్ తొలి రోజుల్లో పదిహేను రోజులు నేను గేటు బయటకు కూడా వెళ్ళలేదు. కరోనా వైరస్ అంటే చావో రేవో ఇంకో దారి లేదు అని జరిగిన ప్రచారం మనుష్యుల్ని విపరీతంగా కల్లోల పరిచింది. సీనియర్ సిటిజన్ హోదాలో ఉన్న మేమిద్దరం చాలా జాగ్రత్తగా
ఉండాలి కాబోలని 15 రోజుల పాటు అందరిలాగానే ఇంటికీ, దిగుళ్లకీ పరిమితమైనాము.
నిజానికి నేను చావుకు భయపడేదాన్ని కాదు. కానీ కరోనా పేషంట్ల భయానక వేదన గురించి ఎన్నో వీడియోలు చూసి, చదివి హమ్మో ఇలా చావకూడదు అనుకుని ఇంట్లో రక్షణ ఉంటుంది కాబోలనే భ్రమలో గడిపాను.
ఆ తర్వాత బయటకొచ్చి బస్తీలలో రేషన్ పంచే పనిలోకి వెళ్లిపోయాను. ఎప్పుడైతే బయటకొచ్చానో అప్పుడే నా మనసులో గూడు కట్టిన దిగులు, కరోనా భయం ఎగిరిపోయాయి.
మేడ్చల్‌కి ఎలా వెళ్లాను ?
ఒకరోజు అడ్వకేట్ వసుధా నాగరాజ్ మేడ్చల్ రోడ్లో నడిచి వెళుతున్న వలస కార్మికుల గురించి మా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టింది.
మేడ్చల్ జాతీయ రహదారి 44 ఆదిలాబాద్ దాటగానే నాగ్‌పూర్ వెళ్లొచ్చు. అటునుండి రకరకాల రాష్ట్రాలకు వెళ్లొచ్చు అనే
ఉద్దేశంతో మేడ్చల్ ఓ.ఆర్.ఆర్ దగ్గరికి వలస కార్మికులు వస్తున్నారని తను చెప్పింది. నాగ్‌పూర్ వైపు వెళ్లే ట్రక్కుల్లో ఎక్కుతున్నారని, మహిళలు, పిల్లలు, నిండు గర్భిణులు కూడా నడుస్తున్నారని తెలిసింది.
వసుధా ‘నేను కూడా నీతో వస్తాను’ అని అడిగినప్పుడు, రేపు మనిద్దరం వెళదామని వనజ రిప్లై ఇచ్చింది.
అంతకు ముందు రోజే అనుకుంటాను వనజ రేషన్ అందించిన ఒక ఛత్తీస్‌గఢ్ మహిళకు డెలివరీ అయ్యి, వాళ్ల గ్రూపంతా నడిచివెళ్లడానికి సిద్ధమైతే తను ఆ పాపను తీసుకుని మేడ్చల్ వచ్చి కన్నీళ్ళతో వాళ్లను ట్రక్క్ ఎక్కించి పంపింది. ఆ పాప పేరు నిధి.
అలా తను ”మనం కలిసి రేపు వెళదాము” అనగానే మా డ్రైవర్‌కి ఫోన్ చేసి రేపు రావాలి అని చెప్పాను.
మర్నాడు మా బొలేరోలో హిమాయత్‌నగర్‌లోని వనజ వాళ్ళింటికెళ్లాను. తను బోలెడన్ని బ్రెడ్డులు, వాటర్ పేకెట్లు సంపాదించి
ఉంచింది. అవన్నీ బండిలో వేసుకుని మేడ్చల్ బయలుదేరాం.
మేడ్చల్ ఓ.ఆర్.ఆర్ అండర్ పాస్ కింద చాలామంది కూర్చుని ఉన్నారు.
బయట చాలా ఎండగా ఉంది. వాళ్లు నీడలో కూర్చుని ట్రక్కులు, లారీల కోసం ఎదురుచూస్తున్నారు. మేము తెచ్చిన బ్రెడ్డు, వాటర్ వాళ్లకిచ్చాం. వాళ్లని ఎక్కించడానికి ట్రక్కుల్ని ఆపాలని ప్రయత్నిస్తుంటే పోలీసులొచ్చి ”ఎందుకు లారీలు ఆపుతున్నారు” అని గొడవకు దిగారు. వాళ్లు నడవొచ్చు కానీ, లారీలు, ట్రక్కులు ఎక్కకూడదని వాదనకి దిగారు. ”నడుస్తున్న వాళ్లకి మనం కొంతైనా సహాయం చెయ్యాలి” కదా అంటే, ”మా ఆఫీసర్లు మమ్మల్ని తిడతారు కదా ఆపకపోతే. మాకు మాత్రం బాధలేదంటారా” అంటూ తానే ఆపి ఎక్కిస్తానని చెప్పాడు.
ఇంకా ముందుకెళ్లి బండిలో ఉన్నవన్నీ ఖాళీ చేసి తిరిగి వచ్చాం.
అలా మేడ్చల్‌కి నా రాకపోకలు మొదలయ్యాయి.
ఓ.ఆర్.ఆర్ బ్రిడ్జి దాటగానే వచ్చే ఖాళీ స్థలంలో చిన్న టెంట్ వేశాం.
మొదట్లో మేమే ఏమి దొరికితే అవి తీసుకెళ్లాం.
తార్నాకాలోని మోడరన్ బ్రెడ్డు ఫ్యాక్టరీలో ఆర్డర్ మీద ఫ్రూట్ బన్ కొనడం, బండి నిండా వేసుకెళ్ళడం మొదలుపెట్టాను. ఒకో రోజు నాకు సీటు దొరికేది కాదు.
ప్రతి రోజూ హెరిటేజ్ ఫూడ్స్‌లో మజ్జిగ పేకెట్లు బుక్ చేయడం, వాటిని సజ్జా శ్రీనివాస్ ద్వారా డైరెక్ట్‌గా టెంట్‌కే పంపడం. మొదట్లో 1000 పేకట్లతో మొదలుపెట్టి 4000 పేకెట్లు కొనడం, కొంపల్లిలో ప్రశాంతి రోజుకు 8000 మసాలా చపాతీలు చేయించడం మొదలైంది.
ఇంకా ఎందరో ఎన్నో రకాల ఆహారాలను, పళ్లను, బిస్కెట్లను తీసుకురావడం మొదలైంది.
ఒక చిన్న టెంట్ కాస్తా పొడవుగా చాలా పెద్దగా అయ్యింది.
మేడ్చల్ అధికారులు రావడం, టెంట్‌కి పర్మిషన్ ఎవరిచ్చారని అడగడంతో విషయం కలెక్టర్ దష్టికి వెళ్లడంతో ఒక రోజు ఆయనొచ్చారు.
ఎక్కువ రోజులు కొనసాగించవద్దని చెప్పి వెళ్లిపోయారు. మీకు అన్ని విధాలుగాను సహకరిస్తామని హామీ ఇచ్చారు. సానిటేషన్ వర్కర్స్‌ను పంపించడం, టెంట్ శుభ్రంగా ఉంచడం చేయించారు.
రెండు రోజుల తర్వాత మేము వెళ్ళేసరికి ఒక్క టెంట్ ఉంచి మిగతా టెంట్లన్నీ పీకేసి తీసుకెళ్ళిపోతూ కనిపించారు. విపరీతంగా పోలీసులొచ్చి ఇక్కడ టెంట్ ఉండకూడదు, టెంట్లో ఎవ్వరూ తినకూడదు అంటూ గొడవ మొదలు పెట్టారు.
కలెక్టర్ జోక్యంతో టెంట్లు మళ్ళీ వేసారు.
ఈ ఘర్షణలు, సముదాయింపుల మధ్య ప్రస్తుతం ఫుడ్ క్యాంప్ కొనసాగుతోంది.
ప్రతిరోజూ వందల సంఖ్యలో వలస కార్మికులను కలవడం… ముఖ్యంగా మహిళలు, పిల్లలు, గర్భిణులతో మాట్లాడం చెప్పలేనంత వేదనగా, గుండె పిండేస్తున్నట్టు ఉండేది. మాసిపోయి, చెమటతో తడిసిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు, కమిలిపోయిన ముఖాలు. పిల్లలు కందిపోయి కమిలిపోయి చెప్పులు లేకుండా ఉండేవారు. అందరి ముఖాల్లోను ఒక అభద్రత, దుఃఖం, అనిశ్చితి కొట్టొచ్చినట్టు కనబడేవి. భోజనం తినేటప్పుడు కూడా తలవంచుకుని అలా తినడానికి చాలా బాధపడుతూ కనబడేవాళ్లు. చేతిలో ఓ పండో, ఓ
ఉడికించిన గుడ్డో పెడితే, మళ్ళీ ఎవరైనా ఇవ్వబోతే ‘హం కో దియా’ అంటూ రెండోసారి తీసుకునే వారు కాదు. వాళ్ళ ముఖాల్లో ఏ భావాలు కదలాడుతున్నాయో పసిగట్టాలని చాలాసార్లు ప్రయత్నించినా ఏమీ అర్థమయ్యేది కాదు. కనీసం తమ బతుకుల్ని ఇలా బజారుపాలు చేసిన వాళ్ళమీద వీసమెత్తు కోపం కూడా కనబడేది కాదు. ఇలాంటి శాంతమూర్తులనా ఇంత మానసిక క్షోభకు గురిచేస్తున్నాం. వారికే కోపమొస్తే…
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు చాలా భిన్నంగా ఉండేవారు. ఛత్తీస్‌గఢ్ వాసులంతా మహిళలు, పిల్లలతో కనబడేవారు. ఒరిస్సావారిలో కూడా మహిళలు, పిల్లలు ఉన్నారు. బీహార్ యూపి, ఎంపీ రాష్ట్రాలకు చెందిన వారిలో చాలావరకు పురుషులే ఉండేవారు. ప్రతిరోజూ ఎంతోమంది పిల్లలు కలిసేవారు. వాళ్లు ఆనందంగా తింటుంటే వాళ్ల హావభావాలను చాలామంది కెమెరాల్లో బంధించారు. ఆ ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి కూడా.
ఒక రోజు నేను టెంట్‌లో ఎవరితోనో మాట్లాడుతుంటే ఒకబ్బాయి వచ్చి ”ఎం.ఆర్.వో గారు మిమ్మల్ని పిలుస్తున్నారు” అని పిలిచాడు. ఎందుకా, టెంట్‌కి మళ్లీ ఏమైనా ఇబ్బంది వచ్చిందా అనుకుంటూ వెళ్ళాను. ఆయన ముఖంలో ఆందోళన స్పష్టంగా కనబడింది. ”మేడం అటు చూడండి 7 రోజుల పిల్లతో ఆమె కింద దుమ్ములో కూర్చుంది. నేనే మా వాళ్ళని ఇక్కడికి పిలుచుకు రమ్మన్నాను. వాళ్ళకి ఏదైనా వెహికల్ బుక్ చేసి పంపించండి” అన్నారు. ఈలోగా ఆమె అక్కడికి వచ్చింది. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్నట్టు ఉంది. బిడ్డని ప్లాస్టిక్ కవర్లో చుట్టినట్టు అర్థమై నా గుండె ఆగినంత పనైంది. అంత ఎండలో ప్లాస్టిక్ కవర్‌లో పాప. అక్కడే ఉన్న ఉమన్ అండ్ చైల్డ్ డెవెలప్‌మెంట్ వాళ్ళ స్టాల్లో టవల్ ఉందా అంటే లేదన్నారు. మా డ్రైవర్‌కి ఫోన్ చేసి నా బండిలో ఉన్న టవల్ తెప్పించి పాపను అందులో చుట్టి పట్టుకున్నాం. ఆమె పచ్చి బాలింత. వేలాడిపోతోంది. ఎండకి డస్సిపోయి కుర్చీలో కూలబడి పోయింది. ఆమెకి భోజనం తెప్పించాం. పాపను నాకు ఇచ్చింది.
ప్రైవేట్ వెహికల్ కోసం వేట మొదలుపెట్టాం. వాళ్లు ఐదుగురు ఉన్నారు. ఇనోవాలాంటి బండి కావాలి. పోలీస్ పర్మిషన్ కావాలి. బిడ్డ తండ్రి అర్జున్‌తో మాట్లాడాను. ”మీరు తొందరపడి వెళ్ళకండి. మేము వెహికల్ కోసం వెతుకుతున్నాము” అని వాళ్ళని కూర్చోబెట్టాం కానీ చాలాసేపటి వరకు వెహికల్ దొరకలేదు.
టైం చూస్తే రాత్రి ఎనిమిది. ఏడింటికి కర్ఫ్యూ మొదలౌతుంది. మా డ్రైవర్ భయపడుతున్నట్టు కనబడుతున్నాడు.
ఫర్వాలేదులే మన బండిని ఆపరులే అంటున్నాను కానీ సీజ్ చేస్తే….
ప్రశాంతి కూడా బస్సుల దగ్గరుంది.
వెహికల్ దొరికింది, కొంపల్లి వరకు వచ్చింది అని కబురొచ్చింది.
మొత్తానికి తొమ్మిదింటికి ఇన్నోవా వచ్చింది. డ్రైవర్‌కి అన్ని జాగ్రత్తలు చెప్పి పాపని, తల్లిని జాగ్రత్తగా కూర్చోబెట్టి వాళ్లకు సరిపడా ఫుడ్ పెట్టి బై బై చెప్పాం. ఆ రాత్రి ఇంటికి చేరేసరికి 10 దాటిపోయింది. పోలీసులు మా బండిని ఆపలేదు.
మర్నాడు మధ్యాహ్నం అర్జున్ ఫోన్ చేసి క్షేమంగా చేరామని, ధన్యవాదాలు చెప్పారు.
కరోనా వైరస్ వలస కార్మికుల జీవితాల్లో సష్టించిన వందలాది బీభత్స సంఘటనల్లో ఇదొకటి మాత్రమే.
భవన నిర్మాణ పనుల్లో ఉన్న వారు పనులాగిపోయి, జీతాలు లేక యజమానులు వాళ్లని నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టేసినపుడు వాళ్లు పడ్డ బాధలు వర్ణనాతీతం.
అలాంటి ఒక వలస కార్మికుడు అన్సారీ జార్ఖండ్ నుండి పనికోసం వచ్చాడు. యజమాని అద్దె కట్టమని, లేకపోతే రూం ఖాళీచేయమని ఒత్తిడి చేస్తున్నప్పుడు అతడు హెల్ప్ లైన్‌కి కాల్ చేసాడు.
అన్సారి రూంకి రెంట్ కట్టి అతనితో పాటు ఉన్న ఐదుగురు మిత్రులకు నాలుగుసార్లు రేషన్ ఇప్పించాల్సి వచ్చింది. సమీపంలోని కిరాణా షాప్‌కి లింక్ చేసి వాళ్లకి రేషన్ ఏర్పాటు చేసాను. చెర్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో రిజిస్టర్ చేయించి రైల్లో పంపాలనే ప్రయత్నం విఫలమై వాళ్ళని బస్సులో పంపాల్సి వచ్చింది.
అన్సారి ప్రతిరోజూ మాకు ‘గుడ్ మార్నింగ్’ అని మెసేజ్ పెడతాడు.
అష్టకష్టాలూ పడి వాళ్ళు వెళ్ళారు కానీ అక్కడా వాళ్లకి పనేమీ లేదు.
రంజాన్ పండగ చేసుకోమని డబ్బు పంపించాను.
వాళ్ళమానాన వాళ్ళు పనులు చేసుకుంటూ ఎవ్వరినీ సహాయం అడగని లక్షలాది మంది వలస కార్మికులకు ఈ రోజు ఎలాంటి ఆధారం లేకుండా అయ్యింది.
వాళ్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది.
లాక్‌డౌన్‌లోనూ ఇటుకబట్టీల కార్మికులతో (ముఖ్యంగా అందరూ ఒరిస్సాకి చెందినవారు) పనిచేయించుకున్న యజమానులు కొంతమందిని బంధించి ఉంచడం వల్ల వారూ ఇపుడిపుడే బయటకొస్తున్నారు.
అలాంటి 200 మంది ఇటుకబట్టీల్లో పనిచేసేవారిని సంగారెడ్డి వెళ్ళి 5 బస్సుల్లో పంపించగలిగాం.
ప్రస్తుతం చాలామంది ఫోన్లు చేస్తున్నారు వారిని కూడా పంపించమని.
ఇది వ్యక్తుల వల్ల కొన్ని బందాల వల్ల జరిగే పని కాదు. ప్రభుత్వాలు పూనుకొని వలస కార్మికులను సగౌరవంగా, సురక్షితంగా వారి వారి స్వస్థలాలకు పంపించాలి.
సరిపడిన శ్రామిక్ ట్రైన్స్ వేస్తే వెళ్లాలనుకుంటున్న వారంతా వెళ్లిపోతారు. రావాలనుకున్నవారు తిరిగి వస్తారు.
మేడ్చల్ ఫుడ్ క్యాంప్… మానవత్వపు అడ్డా
ఏ కొత్త ప్రయత్నమైనా ఒక్కరితోనో కొందరితోనో మొదలౌతుంది. మేడ్చల్ ఫుడ్ క్యాంప్ కూడా అంతే. ఇదొక అద్భుతమైన సామూహిక ప్రయత్నం.
ఎర్రటి ఎండలో పిల్లాపాపలతో వలస కార్మికులు నడుస్తూ వెళుతున్న దశ్యాలు చూసి మనసు చెదిరి కొంతమందిమి మొదలు పెట్టిన కార్యక్రమమిది. క్రమంగా ఎంతోమంది సహదయులు క్యాంప్‌ని ఓన్ చేసుకున్నారు.
స్వయంగా వొండి తెచ్చేవాళ్లు, కొనుక్కుని తెచ్చేవాళ్ళు, నిరంతరం వడ్డించేవాళ్లు, వాళ్ల కోసం ట్రక్కులు మాట్లాడేవాళ్ళు, ట్రక్కులకు డబ్బులు చెల్లించేవారు… ఇలా మేడ్చల్ ఫుడ్ క్యాంప్ ఒక మానవత్వం వెల్లివిరిసే అడ్డాగా మారిపోయింది.
రెండు నెలలపాటు మహా సందడిగా మానవీయ పరిమళాలు వెదజల్లుతూ విలసిల్లింది.
నడిచివస్తున్న వాళ్ళను ప్రేమగా ఆహ్వానించి వారికి అంతే ప్రేమగా వడ్డించారు. పిల్లల్ని ప్రత్యేక శ్రద్ధతో చూసుకున్నారు. మెల్లగా మేడ్చల్ అధికార బందాన్ని రంగంలోకిదింపాం.
ఒక్క టెంట్ స్థానంలో పలు టెంట్‌లు వెలిసాయి. ఎండలో ఏ ఆధారం లేకుండా నేల మీద కూర్చుని తింటున్న వారి కోసం టేబుళ్లు వచ్చాయి.
మొబైల్ బాత్ రూములు ఏర్పాటయ్యాయి. వేలాది మంది ఆగి అన్నం తింటున్న చోటును శుభ్రం చెయ్యడానికి పారిశుధ్య కార్మికులొచ్చారు.
మహిళలకు, పిల్లలకు కావలసినవి అందించడానికి ఆ శాఖ సిబ్బంది డెస్క్ ఏర్పాటయ్యింది. జిల్లా అధికారులు క్యాంప్‌ను సందర్శించి మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో అంతకు ముందు క్యాంప్ పెట్టకూడదని వాదించినవాళ్ళు కూడా మాతో కలిసి పనిచెయ్యాల్సి వచ్చింది.
మొదట మేమనుకున్నది జాతీయ రహదారి 44 మీద నడుస్తున్న వలస కార్మికులకు ఆహారం అందించి వారి ప్రయాణంలో కూడా తినగలిగే బ్రెడ్డు, రొట్టెలు, మంచినీళ్లు ఇవ్వాలన్నదే ఆలోచన.
కానీ వారు చాలా ప్రమాదకరంగా లారీలలో, ట్రక్కులలో పిల్లలతోసహా ప్రయాణించడం, కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడంతో వారిని ట్రక్కులెక్కకుండా పోలీసులు ఆపాలని ప్రయత్నించారు. కానీ వేలల్లో నడిచి వస్తున్న వారిని ఏమి చెయ్యాలి. ఎక్కడుంచాలి?
ఈ సందర్భంలోంచి వచ్చిన ఆలోచనే డొనేషన్స్ సేకరించి వారందరినీ బస్సుల్లో వాళ్ళ ఊళ్లకు పంపాలనే ప్రయత్నం.
ఇంకెంతోమంది ఫుడ్ కేంప్‌కి రావడం మొదలైంది.
ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి స్పాన్సర్లని వెతికి బస్సులు బుక్ చేయడం మొదలైంది.
కొంతమంది ఫుడ్ కేంప్‌లో సేవలందిస్తుంటే మరికొందరు ప్రయాణీకుల లిస్టులు తయారు చేసి, అంతర్రాష్ట్ర రవాణా పాసులు తీసుకుని బస్సుల్లో వారిని వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు పంపించడం మొదలైంది.
ఒక తపనతో వలస కార్మికుల దుఃఖాలకు, వేదనలకు హదయం చలించిపోయిన చాలామంది సామూహికంగా చేసిన ఈ ప్రయత్నం సఫలమై సుమారు రెండు లక్షలమంది బస్సుల్లో బయలుదేరి వెళ్ళారు. ఈ బస్సులు ముఖ్యంగా ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్ళాయి.
ఈ రెండు నెలల్లో ఓ.ఆర్.ఆర్‌కి దగ్గరలో వెలసిన ఈ ఫుడ్‌క్యాంప్ వాలంటీర్లతో, వలస కార్మికులతో నిండిపోయి ఉండేది. ఎండలో నడిచి వచ్చే వలస కార్మికులకు ఒయాసిస్సులా ఆదరంచింది.
మేము మొదటి రోజు నుండీ చల్లటి మజ్జిగను క్యాంపులో ఉంచాము. హెరిటేజ్ ఫుడ్ వాళ్లతో మాట్లాడి డైరక్టుగా ఉదయమే మజ్జిగ అక్కడికి చేరేలా ఏర్పాటు చెయ్యడం వల్ల ఎందరి దాహార్తినో ఆ మజ్జిగ తీర్చగలిగింది. లక్షా పది వేలు కేవలం మజ్జిగకే చెల్లించాము. అలాగే ప్రశాంతి తన ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయించిన రోజుకు 8000 మసాలా చపాతీలు ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మికులు ఎంతో ఇష్టంగా తిన్నారు.
ఇక్కడ రేణుకా దేవి అనే వాలంటీర్ గురించి తప్పక చెప్పుకోవాలి. ఆవిడ ప్రతిరోజు ఎన్నో తినుభండారాలను స్వయంగా వండి తీసుకొచ్చేవారు. ఆత్మీయంగా వడ్డించేవారు. స్వీట్లు, హాట్లు కూడా అంతమంది కోసం వండి తీసుకురావడం మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
అలాగే ఇక్కడ మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సజ్జా శ్రీనివాసరావు అనే పశువుల వైద్యుడు.
నేను మేడ్చల్ బయలుదేరుతున్నాను అని ఎఫ్‌బీలో పెట్టిన పోస్ట్‌కి అతను స్పందించి ”అక్కా, ఏటైంకి వస్తారు నేనూ వస్తాను” అని మెసేజ్ పెట్టాడు.
ఆ రోజు నుండి ఈ రోజు వరకు అతను ఫుడ్ క్యాంప్‌కి అంకితమైపోయాడు. పగలు, రాత్రి అదే పని. ఫుడ్ క్యాంప్‌కి కాంటాక్ట్ పర్సన్ అయ్యాడు. ఫుడ్ ఉందా, ప్లేట్లున్నాయా, మంచినీళ్లున్నాయా లాంటి విషయాలను సమన్వయం చేసుకుంటూ అతనూ అతని మిత్రబందం అందించిన సేవలకి ఖరీదుకట్టే కొలమానాలేవీ నా దగ్గరలేవు. శ్రీరాం ప్రసాద్, అభి, గౌతం, తవి ఇంకా చాలామంది యువత గొప్ప నిబద్ధతతో ఫుడ్ క్యాంప్‌లో పనిచేసారు.
వసుధా నాగరాజ్, సునీత అచ్యుత, సి.వనజ, పింగలి చైతన్య, కవిత పులి, అపర్ణ తోట, సూరేపల్లి సుజాత, సజయ కాకర్ల, జ్యోతి, క్రిష్ణ కుమారి, సంధ్య, ఉషా బంధం, ప్రశాంతి, ఖలీదా పర్వీన్ వీరి కషిని తూచే తూనిక రాళ్లు కూడా నా దగ్గరలేవు. ముఖ్యంగా బస్సుల్లో వలస కార్మికులను ఎక్కించి పంపే క్రమం మొదలైనప్పటి నుండి ఇండస్ మార్టిన్, అరుణాంక్ లత, నవీన్, స్వప్న… వీళ్లంతా బస్సుల చుట్టూ, వలస కార్మికుల చుట్టూ ఎర్రటి ఎండలో బొంగరాల్లాగా తిరుగుతూ, లిస్టులు, రాస్తూ, పాసుల కోసం ప్రయత్నాలు చేస్తూ, బస్సు ఆపరేటర్లతోను, డ్రైవర్లతోను మాట్లాడుతూ శతావధానాలు చేసారు.
మేమంతా తెరముందు కనపడితే తెరవెనక చాలామంది కషి ఉంది. హర్ష, హరీష్, కిరణ్. ఇంకా ఎంతోమంది కనిపించినవారి, కనబడకుండా పనిచేసినవారి సామూహిక ప్రయత్నం మేడ్చల్ ఫుడ్ క్యాంప్.
అరదరినీ కలిపింది కూడా ఒక సామూహిక దుఃఖం… వలస కార్మికుల సామూహిక జీవన్మరణ పోరాటం.
దేశ అభివద్ధి కార్యక్రమంలో సింహభాగం కషి వీరిదే అయినప్పటికీ ప్రభుత్వాలు వారి పట్ల అనుసరించిన అమానుష విధానాలకి, వారిని అవమానకరంగా గాలికి ధూళికి, ఎండకు, వానకు వదిలేసిన తీరుకు మనసు కలత చెందినవాళ్లందరం ఎంతో బాధ్యతతో నిర్వహించిందే మేడ్చల్ ఫుడ్ క్యాంప్.
ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో పని చేసిన యువ బందంతో కలిసి పనిచెయ్యడం నాకెంతో గర్వకారణం.
వీళ్లతో కలిసి పనిచేసినంత కాలం నాకు కరోనా అనే పదమే గుర్తుకురాలేదు.
ప్రతిరోజూ వేలాదిమందితో కలిసి తిరిగినా భౌతిక దూరం అనే అంశమే మనసులో మెదలలేదు.
కరోనా వైరస్ మరణాన్ని దగ్గర చేస్తుందనే స్పహలేని సందర్భమది.
జీవితాన్ని అర్థవంతంగా జీవించడానికి అవకాశమిచ్చిన గొప్ప మానవీయ ప్రయత్నం మేడ్చల్ ఫుడ్ అండ్ ట్రావెల్ క్యాంప్.