క్రిమి -మొయిదా శ్రీనివాసరావు

నాకు కులం, మతం లేదు, ఏ సమూహాలపైన మీరు ఇప్పుడు దాడి చేస్తున్నారో, ఆ సమూహాలను తరలి వెళ్లేలా చేసింది నేనే.

వాతావరణం చల్లగా ఉంది. గత కొద్దిరోజులుగా అన్నింటా… అంతటా నెమ్మదిగా నిశ్శబ్దం అలుముకుంటోంది. నడిరోడ్లపై నత్తగుల్లలు నెమ్మదిగా పాకుతున్నాయి. ఆగి ఉన్న కార్లు పైకి తలకిందులుగా వేలాడుతూ గొంగళిపురుగులు జాయిగా దిగుతున్నాయి. మూసి ఉన్న థియేటర్ల తెరలపై సాలె పురుగులు గూళ్ళు కట్టుకుంటున్నాయి. ఆగి ఉన్న విమానం రెక్కలపై పిట్టలు రెట్టలు వేసుకుంటున్నాయి. నగరానికి అడవికి అట్టే తేడా తెలియక జంతువులు నిర్భయంగా సంచరిస్తున్నాయి.

అది ఒక సమావేశ మందిరం. ఆ సమావేశానికి సమయానికి అన్నీ హాజరైనాయి. రావాల్సిన ఒక్క దానికై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆ సమావేశ మందిరంలో ఒకవైపు వివిధ రకాల బ్యాక్టీరియాలు కలరా, క్షయ, లెప్రసి, ప్లేగు, ఆంత్రాక్స్‌ లాంటివి… మరోవైపు వివిధ రకాలైన వైరస్‌లు రేబిస్‌, పోలియో, హెపటైటిస్‌, డెంగ్యూ, ఫ్లూ, మలేరియా, ఎబోలా, ఎయిడ్స్‌ లాంటివి కూర్చొని ఉన్నాయి. సార్స్‌ ఫ్యామిలీ రాకకై ఎదురుచూస్తున్నాయి. ఈసారి ఏ కుటుంబం నాయకత్వ స్థానం చేపట్టాలో అన్న దానిపై ఏర్పాటైన అత్యవసర సమావేశం అది. తమలో ఒకడిని నాయుకుడిగా ఎన్నుకోవాల్సిన సమయమది.

తమ కులానికే నాయకత్వ పీఠం దక్కాలని బ్యాక్టీరియా కులం ఆశిస్తుంటే ఈసారి తమకే నాయకత్వ పీఠం దక్కాలని వైరస్‌ కులం కోరుకురటోంది. ఈ కులాలలో గల వివిధ కుటుంబాల మధ్య అంతర్గత కుమ్ములాట కొనసాగుతోంది. అయినప్పటికీ ఈ మధ్య ప్రపంచమంతా వినబడుతున్న పేరు వైరస్‌ కులానికి మరియు సార్స్‌ కుటుంబానికి చెందిన ‘కరోనా’ (కోవిడ్‌-19) పేరే తుమ్ములు, దగ్గులు, రూపంలో అధికంగా వినబడుతోంది.

ఈ ఎన్నిక మనుష్య జాతిపై తాము యుద్ధం నెరిపి విజయం సాధించిన ప్రతిసారి జరుగుతుంది. గతసారి నాయకత్వ స్థానాన్ని గెలుచుకున్నది వైరస్‌ కులానికి చెందిన కుటుంబమే. కావున ఈసారి తమకు నాయకత్వ పీఠాన్ని ఇవ్వండి అని బ్యాక్టీరియా కులం పట్టుపడుతోంది.

”గతసారి మీరే నాయకత్వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈసారి మాకు అవకాశం కల్పించండి” అని ‘క్షయ’ ముని ముని ముని… మనవడు వైరస్‌ కులాన్ని అడిగాడు.

”ఏమి, రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ మరిచిపోయారా? మీకో రూల్‌, మాకో రూలా? గతంలో విజయం సాధించిన ప్రతిసారీ మీరు అధికారాన్ని దక్కించుకున్నారు. ఈసారి మావంతు వచ్చేసరికి మాత్రం… ‘గతంలో మీరు నాయకత్వ స్థానాన్ని అధిష్టించారు ఈసారికి మాకొదిలేయండని’ అంటారా. చరిత్రలో మీ కులానికి చెందిన మశూచి, ప్లేగు, క్షయ, కలరా వంటి కుటుంబాలు చాలా ఏళ్ళు నాయకత్వ స్థానాన్ని అనుభవించాయి గుర్తుకు తెచ్చుకోండి” అంది ‘ఎబోలా’.

”మీకంటూ ఓ దేహమే లేదు మీకెందుకు అధికారంపై అంత ఆరాటం” అని ‘లెప్రసీ’ హేళనగా నవ్వింది.

”మేము అదేహులం (దేహం లేనివారం). మనుషుల కంటే ముందు నుంచి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళం. మేము నచ్చిన ప్రాణులను (మొక్కలు, జంతువులు, పక్షులు, మనుషులు వగైరా) మా దేహాలుగా మలుచుకుంటాము. మా సంతతిని వద్ధి చేసుకుంటాము. మీ అంత తేలికగా మనుషులకు చిక్కే ప్రాణులం కాదు మేము. మీకో దేహం ఉండబట్టే మనుషులు యాంటీబయోటిక్‌తో మిమ్మల్ని అంతమొందిస్తున్నారు. మమ్మల్ని అంతమొందించే శక్తి లేకనే మేము రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా మీ కుటుంబంలో నువ్వే చివరిదానివి అనుకుంటాను. మనుషుల కంట పడకుండా మొండి వేళ్ళ చేతులతో డేక్కుంటూ ఎక్కడికైనా జాగ్రత్తగా పారిపో… లేదంటే నిన్ను అంతమొందించి నీ వంశాన్ని నిర్వీర్యం చేసేయగలరు” అని ‘లెప్రసి’కి బదులిస్తూ ‘క్సు… క్సు’ అంటూ పగలబడి నవ్వింది ‘ఫ్లూ’.

”చరిత్రలో మేము సష్టించిన విధ్వంసం ముందు మీరు సష్టించింది ఏపాటి. మేము మా శక్తిని నిరూపించుకున్న ప్రతిసారి లక్షల్లో మనుషుల ప్రాణాలను తిన్నాం. ఊర్లకు ఊర్లను ఊడ్చి పెట్టేశాము. మా పేరు మీద ఈఫిల్‌ టవర్‌, చార్మినార్‌ లాంటి చారిత్రక కట్టడాలే వివిధ దేశాలలో ఉన్నాయంటేనే మా శక్తి మీకు అర్థమయ్యుంటుంది” అని ‘ప్లేగు’ ‘క్షయ’కి వంత పాడింది.

”తాతల నాడు నేతులు తాగాం – మా మూతులు నాకండి అన్నట్టు ఉంది మీ వాలకం. గతంలో మీరు ఇలాగ విర్రవీగబట్టే మిమ్మల్ని కట్టడి చేశారు మానవులు. అయినా ఎప్పుడో వారికి రవాణా మరియు సమాచార సదుపాయాలు సాంకేతికత సరిగా అభివద్ధి చెందని కాలంలో మీరు చేసిన వీరంగం గూర్చి ఇప్పుడు ఎవడికి కావాలి? వర్తమానంలోకి రండి, మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుస్తుంది.” అంది ‘పోలియో’.

”ఆడికి నోట్లో రెండు చుక్కలు ఎయ్యండిరా నోరు మూసుకొని ఊరుకుంటాడు” అని ‘ఆంత్రాక్స్‌’ గోక్కుంది.

”ఇప్పుడు గొర్రె తోక బెత్తెడులా మారిందిగా మనుషుల చేతిలో నీ బతుకు” అని ‘ఎయిడ్స్‌’ ‘ఆంత్రాక్ష్‌’ను హేళన చేసింది.

”దానికి కండోమ్‌ తొడగండిరా… అదే నోర్మూసుకొని ఊరుకుంటుంది” అని ‘క్షయ’ ‘ఎయిడ్స్‌’ వైపు చూసి కెళ్ళు కెళ్ళుమని దగ్గింది.

రెండు కులాల మధ్య ఈ వాదన ఇలా సాగుతుండగా ఇంతలో అందరికి ఒక్కసారిగా ముక్కు కారడం మొదలయ్యింది. తుమ్ములు దగ్గులతో పాటు ఒళ్ళు వేడెక్కడం మొదలయ్యింది. సమావేశ మందిరంలోకి ప్రవేశించింది ‘కరోనా’.

‘కరోనా’ని చూడగానే తమకు తెలియకుండానే అక్కడున్న చాలామటుకు జీవులన్నీ లేచి నిలబడ్డాయి. హాలులోకి ప్రవేశిస్తూనే నవ్వుతూ అందరికీ నమస్కరించి ఇలా చెప్పడం ప్రారంభించింది. ”సభలోని కురువద్ధులు (మూలపురుషులు, అనుభవజ్ఞులు అన్న అర్థంలో) నాతోటి సహచరులు ముందుగా నా ఆలస్యానికి మన్నించాలి. నా ఆలస్యానికి కారణం మీకు తెలిసినదే. మనం ఇలా ప్రతి శతాబ్దానికి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. మనలో ఒకరిని నాయకునిగా ఎన్నుకుంటున్నాం. గతంలో బ్యాక్టీరియాలు మనుష్య జాతిపై హననం సాగిస్తే ఇప్పుడు వైరస్‌ల వంతయ్యింది.

ఇప్పటికీ నువ్వెంతంటే నువ్వెంత అంటూ మనం కులాల వారీగా కొట్టుకుంటున్నాము. మనుష్య జాతి మనుగడ ప్రారంభానికి ముందు నుంచే మన చరిత్ర మొదలయ్యింది అని మీకు తెలుసు. ఇప్పుడు ఈ సభలో చాలా మంది వద్ధులు ఉన్నారు. వారికి ఈ విషయాన్ని నేను చెప్పేటంతవాన్ని కాను, అంత వయస్సు అనుభవం నాకు లేవనుకుంటున్నాను. అయినా ఇది నేను మాట్లాడాల్సిన సందర్భమని తప్పనిసరై మాట్లాడుతున్నాను” అని కరోనా గౌరవసూచకంగా తలలాంటి తన తొండాన్ని వొంచింది.

అది గమనించిన పెద్దలందరూ కరోనా తమకిచ్చే మర్యాదకి మనస్సులోనే ఉప్పొంగిపోయారు.

ఎవరికి ఏ తుంపర (బిస్కెట్‌) ఎలా వెయ్యాలో తెలిసిన కరోనా తన ప్రసంగాన్ని కొనసాగించింది. ”ఇప్పుడు నన్ను చూసి ఇళ్లల్లో దాక్కుంటున్నారని, కనీసం తుమ్మడానికి దగ్గడానికి భయపడి పోతున్నారని, తమ తోటి మనిషినే అనుమానంగా చూస్తున్నారని మనం మనుషులను చూసి విర్రవీగనక్కర్లేదు. చరిత్రలో ఇలాంటి భయాలను మారణహోమాలను సష్టించిన ప్రతిసారీ వారు మనల్ని… మీ బాక్టీరియా కులాన్ని యాంటీ బయోటిక్‌ రూపంలోనూ, మా వైరస్‌ కులాన్ని వ్యాక్సిన్ల రూపంలోనూ కట్టడి చేశారు. ఈ మందుల తయారీకీ మరలా మనల్నే వాడుకున్నారు. అడవిని నరకడానికి గొడ్డలికి ఆ అడివి కర్రే సాయం చేసినట్టు మనలోనే కొందరు మానవులకు సహకరిస్తున్నారు.

మనుషులలో వచ్చే మశూచి నివారణకు ఆవులలో వచ్చే మశూచిని మందుగా వాడుకున్నారు. రేబిస్‌ వ్యాధిని నివారించడానికి రేబిస్‌ వచ్చి చచ్చిన కుక్కల వెన్నెముకలనే మందు తయారీకి వాడారు. బ్యాక్టీరియాని నాశనం చేయడానికి మరో బ్యాక్టీరియాని మందుగా వాడుకున్నారు. మనుషులు అంత ఖతర్నాకులు. వారినంత తేలికగా తీసుకోవొద్దు. మనుషులు సమూహాలుగా విస్తరించిన కొద్దీ మనం మనల్ని పదే పదే అభివద్ధి చేసుకున్నాం. మనలో వందల, వేలు రకాలున్నాయి. మనందరం చెడ్డవాళ్లమా అంటే కాదు. మనలో మనుషులకు కీడు చేసే వాటి కంటే మేలు చేసేవే ఎక్కువ. ఉదాహరణకు మనుషులు రోజూ వాడే పెరుగు తయారీకి మీ బ్యాక్టీరియా కులంలోని ఓ కుటుంబం అవసరం. వదిలితే మొత్తం సముద్ర జీవులను తినేసే ఆల్గే లాంటి జీవుల నియంత్రణకు మా వైరస్‌ కులంలోని ఓ కుటుంబం అవసరం. కాకపోతే వారెప్పుడూ మనలోని కీడునే చూస్తారు. కతజ్ఞతా హీనులూ” అని కరోనా చెబుతుండగా కలరా లేచి నిలబడి.

”ఈ సోదంతా ఎందుకూ మనం వచ్చిన పని కానిచ్చేస్తే సరి!” అని ఒక వాంతూ ఒక విరేచనం చేసి కూర్చుంది.

”పెద్దయ్యా! ఆ కంగారే ఇప్పుడు మనకు వద్దని నేను అంటున్నది. గతంలో నువ్వలా కంగారుపడి విజంభించబట్టే నీ కుటుంబాన్ని చాలా తెలివిగా మనుషులు కట్టడి చేశారు. ఇప్పుడేది ఇదివరకటి నీ కుటుంబమూ దాని ఘన చరిత్ర.” అని ‘కరోనా’ ఒక నవ్వు నవ్వి మరలా తన మాటలను కొనసాగించింది.

”ఇప్పటివరకు మనలో మనం మేము గొప్పా అంటే మేము గొప్పా అని గొడవపడుతున్నాము. ఇలా గొడవలుపడి మనం విడిపోబట్టే మనుషులు దీనిని ఆసరాగా చేసుకొని మనల్ని కట్టడి చేయడానికై మనలో కొందరిని వాడుకొని మందులు తయారుచేస్తున్నారు. ప్రతిసారీ మనల్ని కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు మనలో ఎవరు నాయకుడుగా ఉండాలన్నది ప్రధానాంశం కాదు. మనందరం కలిసికట్టుగా ఒకే మాటపై నిలబడి మనుషులపై విజయం సాధించాలన్నదే నా ఆకాంక్ష.

నేనిప్పుడు ప్రపంచమంతా విస్తరించానని మనుషులలో భయాందోళనలు కలిగించానని మిడిసిపడి పోనక్కర్లేదు. గతంలో ఇంతకన్నా మనుష్య జాతిపై విజంభించి వీరంగం సష్టించిన మన పూర్వీకులలో కొందరిని వారు నామరూపాలు లేకుండా చేశారు. ముందుచూపు లేకపోతే మనం మందగించిపోతాం” అని ‘కరోనా’ అంటుండగా –

”శభాష్‌ రా మనవడా… నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. ఇన్నాళ్లు మనలో మనం కొట్టుకుంటున్నాం. ఇలా కొట్టుకుంటూ మన అసలు శత్రువెవరో మరిచిపోతున్నాం. ఇక్కడున్న అందరికీ నువ్వు అసలు కర్తవ్యాన్ని బోధించావు. మనవి వేరు వేరు కులాలే కావొచ్చు. మనమంతా ఒకే జాతి అని గుర్తుకొచ్చేలా చేసావు. ఎవరు అవునన్నా… కాదన్నా నిన్ను నాయకుడిగా నేను సమర్థిస్తున్నా. గతాన్ని గుర్తెరిగి భవిష్యత్తును చూడగలిగే వాడే నాయకుడు” అని ‘ప్లేగు’ అనేసరికి అక్కడున్న అందరికీ నోట మాటపడిపోయింది. ఎందుకంటే బ్యాక్టీరియా కులానికి ప్లేగు ఎంత చెబితే అంతే.

ఒక్కసారిగా ఆ సమావేశ మందిరంలో గుస గుసల రూపంలో ఓ చిన్న కలకలం మొదలయ్యింది. తను వేసిన పాచిక పారిందని ‘కరోనా’ మనసులోనే మురిసిపోతుండగా ఇంతలో ఓ ‘క్రిమి’ లేచి నిలబడింది.

”మిత్రులారా! నాకు అవకాశమిస్తే ఓ రెండు నిమిషాలు మీముందు మాట్లాడుతాను” అంది.

”ఇంతకీ ఎవరయ్యా నువ్వు?”

”ఎక్కడ్నుంచి వచ్చావు? ఎలా వచ్చావు?”

”నీ కులమేమిటి?”

”అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చారు?” అని సమావేశ మందిరంలో ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిసింది. ఇన్ని ప్రశ్నల మధ్య ఆ క్రిమి నవ్వుతూ నిలబడింది.

దాదాపుగా నాయకుడిగా తన ఎన్నిక ఖరారయ్యిందన్న సమయంలో ‘ఈడెవడురా బాబు ఇప్పుడు పానకంలో పుడకలాగ..’ అని ‘కరోనా’ లోలోన అనుకుంటూ ఆ క్రిమిని ఆపే ప్రయత్నం చేసేంతలో –

”మాట్లాడు నాయినా… మాట్లాడితే ఏమి పోతుంది, నాలుగు విషయాలు నలుగురికి తెలుస్తాయి కదా!” అని ‘ప్లేగు’ అనేసరికి ‘కరోనా’ తన ప్రయత్నాన్ని విరమించుకుంది. కొద్ది క్షణాల క్రితమే ‘ప్లేగు’ తనకు మద్దతుగా నిలిచింది. తను ఇప్పుడు కాసింత వెనక్కి తగ్గడం ద్వారా తనపై మరింత మంచి అభిప్రాయం ‘ప్లేగు’ లాంటి వద్ధులలో ఏర్పడుతుందని కాసేపు మౌనంగా ఊరుకుంది.

”మిత్రులారా! నేనెవరు? నా పుట్టుకేమిటి? నేనెక్కడ్నుంచి వచ్చాను? ఇక్కడ నాకేమిటి పని? అని చాలా ప్రశ్నలు మీ నుంచి నేను విన్నాను. ముందుగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాను” అని ఆ క్రిమి మాట్లాడటం మొదలు పెట్టింది.

”నేనూ మీలాగే ఓ క్రిమిని, కానీ నాకు మీలా ఓ దేహముండదు, రూపముండదూ. నా పుట్టుక 400 ఏళ్ల క్రితం నాటిది. మీలో ఉన్న కొందరిలా వేల ఏళ్ళ నాటిది కాదు నా చరిత్ర. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. ఏ సమూహాలపైన అయితే మీరు ఇప్పుడు దాడి చేస్తున్నారో, ఆ సమూహాలను నగరాలకు తరలి వెళ్లేలా చేసింది నేనే.

ఇంతకు ముందు మాట్లాడిన వారిలో ఓ మిత్రుడన్నాడు – ప్రపంచంలో కొన్ని చారిత్రిక కట్టడాలను మీ బీభత్సాల జ్ఞాపకార్థమే కట్టారని! కానీ ఆ మిత్రుడికి తెలియని విషయమేమిటంటే ఈ భూ ప్రపంచంపై అన్ని కట్టడాలను నేనే కట్టించాను. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే మిమ్మల్ని మనుషులు అదుపు చేయగలరని మీరనుకుంటున్నారు! అది నిజమే కానీ మిమ్మల్ని మనుషుల చేత అదుపు చేయిస్తున్నదీ నేనే! అభివద్ధి చేయిస్తున్నదీ నేనే!!” అని ఆ క్రిమి కాస్త గ్యాప్‌ ఇచ్చేసరికి –

”అయితే తమ్ముడూ నువ్వు అంత పనోడివన్న మాట. ఇంతకీ ఏటంటావ్‌? నువ్వందరినీ అదుపు చేస్తే మరి నిన్నెవరు అదుపు చేయగలరు?” అని ‘ఎబోలా’ ఎకిలిగా నవ్వింది. అంతవరకూ ఇదంతా ఓపికగా వింటూ ‘ఈడికెందుకు మాట్లాడడానికి అవకాశమిచ్చానురా! నాయినా’ అని తనలో తానే నలిగిపోతున్న ‘కరోనా’కి ‘ఎబోలా’ చేసిన ఈ ఎటకారంతో నవ్వొచ్చింది.

”అక్కడికే వస్తున్నాను అన్నయ్యా! నేను ఈ సమావేశంలో మీరందరూ మాట్లాడిన మాటలను మొదటి నుంచీ విన్నాను. మనుష్య జాతిని నామరూపాలు లేకుండా చేయాలని మీరందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నట్టు ఈ సమావేశం ద్వారా నాకర్థమయ్యింది. అసలు మనుషులే లేకపోతే మీ మనుగడెక్కడ, నా మనుగడెక్కడ అని మీకు గుర్తు చేయడానికే నేను లేచి నిలబడి మాట్లాడుతున్నాను. మరో విషయం నన్నెవరు కంట్రోల్‌ చేయగలరని ఓ అన్నయ్య అడిగాడు. ఎవరి మరణ రహస్యమైన వారి పుట్టుకలోనే దాగి ఉంటుంది. కాకపోతే దానికో సమయం సందర్భం ఉంటుంది. నేనే శాశ్వతం అని నేను చెప్పుకోవట్లేదు” అని చెప్పి కూర్చుంది క్రిమి.

కాసేపు ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం ఆవరించింది. గొట్టం, బంతి, స్ప్రింగ్‌ వంటి రకరకాల ఆకారాలలో వున్న బాక్టీరియాలు మరియు వైరస్‌లు ఒకరి ముఖాలు మరొకటి చూసుకోవడం ప్రారంభించాయి.

అంతలో ”కరోనా తమ్ముడూ! నిన్ను నివారించడానికై ఓ మనిషి మందు కనిపెట్టాడట!” అంటూ ‘హంటా వైరస్‌’ రొప్పుతూ ఆ మందిరంలోకి ఓ వార్తను మోసుకొచ్చింది.

బయట ఎండ తీవ్రంగా ఉంది. కొందరి గొంతులలోని తడారడం మొదలయ్యింది. ఉక్కిరి బిక్కిరి అవుతున్న కొన్ని బ్యాక్టీరియాలు వైరస్‌లు అప్పటికే చీకటిగా ఉన్న తడి ప్రదేశాలను వెతుక్కోవడం మొదలెట్టాయి.

”ఈ రోజుతో ఈ మనుషులను అంతం చేసేస్తాను” అంటూ కోపంగా అంతవరకూ ఓపిక పట్టిన ‘కరోనా’ పైకి లేచింది.

”వెళ్లి ఏమి చేస్తావు…. ఎంత మందినని చంపుతావు. అసలే వాళ్ళు నిన్ను నివారించడానికై మందును కనిపెట్టి కూర్చున్నారు. ఇలాగే తిన్నగా వెళ్ళు నీ తాట తీస్తారు” అని ఆ క్రిమి ‘కరోనా’ భుజంపై అనునయంగా చెయ్యేసింది.

మరిప్పుడు నన్నేమి చేయమంటావన్నట్టు (ఇక చేసేదేమీ లేక) ‘కరోనా’ ముల్లులాంటి తన తొండాన్ని స్నేహపూర్వకంగా ముందుకు సాచింది.

”నువ్వేమీ చెయ్యక్కర్లెద్దు. నేను చెప్పినట్టు నువ్వు విను చాలు. ఇప్పుడు నువ్వు ముందుకెళితే నిన్ను ఆపగలరు. అదే ఆ మందు కనిపెట్టినోడిని నేను కబళించాననుకో… నువ్వూ సేఫ్‌… నేనూ సేఫ్‌” అని ఆ క్రిమి ముందుకు కదిలింది.

ఆ మాట విన్న వెంటనే, ముఖంపై ఉన్న వేయి తొండాలు ఒక్కసారిగా వికసించిన ‘కరోనా’ ”ఇంతకీ నువ్వెవరు అన్నయ్యా!” అని సందేహంగా అడిగింది.

ఆ క్రిమి చెప్పే సమాధానంకై అన్నీ ఆసక్తిగా ఎదురుచూసాయి.

”మీ దష్టిలో మనుషులందరూ సమానమేనని అందరూ అనుకునేలా చేయించిందీ నేనే! అందరూ సమానమనుకున్నది అసమానంగాను… అందరూ అసమానమనుకున్నది సమానంగానూ చేయించిందీ కూడా నేనే!!… ఇక అన్నీ నేనే!!!… ఇక అంతా నేనే!!!!” అని చెప్పి ఆ క్రిమి అలా నవ్వుతూ ముందుకు సాగిపోయింది.

‘ఇక ఈడే మన నాయుకుడులా ఉన్నాడను’కుంటూ ఆ సమావేశ మందిరంలోని మిగిలిన బ్యాక్టీరియాలు, వైరస్‌లు ఆ క్రిమి వెళ్లే వైపు చూస్తూ నోళ్లు (ముల్లు లాంటి తొండాలను) యెళ్ళబెట్టాయి.

(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌ నుండి)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.