కరోన వైరస్‌ – దాని పరిణామాలు -టి వి ఎస్‌ రామానుజరావ

కరోన వైరస్‌ – ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది. మొదట్లో దీన్ని గురించి అసలు వివరాలకన్నా, అసత్యాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. అవి యువకులలో కొంత నిర్లక్ష్యం, వయసు పైబడిన వారిలో భయాందోళనలు పెంచాయి. ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకుని, కరోనా గురించి విస్తతంగా ప్రచారం మొదలెట్టాక, ప్రజలకు దాని వల్ల వచ్చే ప్రమాదమేమిటో అర్థం అయ్యింది. దీనికి కారణం లేకపోలేదు. మనదేశంలో ఇలాంటి వైరస్‌లు- స్వైన్‌ ఫీవర్‌ లాంటివి, ఇదివరకు వచ్చినప్పటికీ, ప్రజలకు వాటిని అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించదగ్గ పరిస్థితి ఏర్పడలేదు. అందువల్ల మొదట్లో ప్రజలకూ, ప్రభుత్వాలకు కూడా కరోనా వైరస్‌ గురించి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం తెలియలేదు. అత్యంత ఆధునిక దేశాలన్నింటిలోనూ, ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ముందుగా వివిధ దేశాలకు సరైన దిశానిర్దేశం చెయ్యలేకపోయిందనే ట్రంప్‌ గారు తప్పుబట్టారు. మన దేశంలో కాస్త ఆలస్యంగా మొదలైన ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యాలూ తీసుకున్నప్పటికీ, అధిక జనాభా వల్ల పూర్తి నియంత్రణ సాధ్యపడ లేదనుకోవాలి. అయితే సామాజిక వ్యాప్తి నిరోధానికి మన ప్రభుత్వం తీసుకున్న ‘లాక్‌ డౌన్‌’ గొప్ప అసాధారణ చర్య అనే చెప్పాలి. దీని వల్ల మంచి ఫలితాలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అది రుజువైంది కూడా. ఈ చర్యే ప్రభుత్వం తీసుకుని ఉండకపోతే, మనదేశం కూడా మరొక న్యూయార్క్‌ నగరంలా మారి ఉండేది.

అయితే, తర్వాతి కాలంలో (పోస్ట్‌ కరోన పీరియడ్‌) సమాజంలో ఈ ప్రమాదకారి కరోనా ఏ మార్పులు తెచ్చే అవకాశం ఉందో చర్చించడం ఈ వ్యాసం ఉద్దేశం. అంతేకాదు, అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారి అవసరాలను మనం గుర్తిస్తున్నామని ఆలోచింపజేయడం కోసం కూడా ఈ వ్యాసం రాయడం జరిగింది. ఈ కరోనా పెనుముప్పు ఎలాగోలా దాటినా, రాబోయే కాలంలో మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉండవచ్చు. అవి ఆర్థిక, సాంఘిక, మానసికపరమైనవిగా మనం విభజించవచ్చు. ఆర్థిక పరమైన ప్రమాదకర పరిస్థితుల గురించి అనేకమంది నిష్ణాతులు తమ ఆలోచనలు వెల్లడించారు కనుక, వాటిని ఇక్కడ చర్చించడం లేదు.

ముందుగా ఈ కరోనా కాలంలో పాటించిన, లేదా పాటించవల్సి వచ్చిన కొత్త జాగ్రత్తలు ఒకసారి గుర్తుచేసుకుందాం. తరచూ చేతులు కడుక్కోవటం, మనిషికి మనిషికి మధ్య దూరం పాటించడం, దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకోవటం, అనవసరంగా బయటకు వెళ్ళకపోవటం, అవసరమైనప్పుడు మాస్కులు ధరించి మాత్రమే బయటకు వెళ్ళటం… ఇవీ మనం పాటిస్తున్న నియమాలు. అయితే, ఈ కరోనా వైరస్‌ మనలో సష్టించిన భయాలు ఎన్నో ఉన్నాయి. అసలు క్వారంటైన్‌ అంటే జైల్లో పెట్టినట్లు ఏకాంత వాసమనీ, ఎవర్ని చూడనివ్వరనీ, ఫోనులోనైనా మాట్లాడనివ్వరనీ భయం ఒకటైతే, అక్కడ తమ ఇంట్లో ఉండే కనీస సౌకర్యాలైనా ఉంటాయో లేదోనని అనేక మంది అనుమానపడుతున్నారు. కొన్నిచోట్ల, ప్రజలు తమ బాధలను, భయాలను నివత్తి చేసుకోక, వైరస్‌ సోకినా కూడా, దాక్కుని ఉండటం దీనివల్లనే. ఈ భయాలను, అనుమానాలను ప్రభుత్వమే తీర్చాలి. అవసరమైన సౌకర్యాలు ఏర్పరచడమే కాదు, వైద్యం కూడా అందుబాటులో ఉందని ప్రజలకు అర్థమయ్యేలా మరింత ప్రచారం చెయ్యాలి. అంగవికలురు, అంధులు మరొకరి సాయం, చేయూత లేకుండా నిత్య జీవితంలో దైనందిన కార్యక్రమాలు నెరవేర్చుకోవడం దాదాపు అసాధ్యమేనని మనందరికి తెలుసు. అలాంటప్పుడు వీరు సామాజిక దూరం పాటించగలరా? అడుగడుగునా చేతులు కడుక్కోవడం లాంటి పరిశుభ్రతలు పాటించేదెలా? వీరికి కరోనా సోకకుండా ఉండాలంటే వారి కుటుంబంలోని వారు, తోటి పనివారు మరింత ఎక్కువ జాగ్రత్త వహించాల్సిందే.

సాంఘిక సమస్యలు

ప్రధానంగా, నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో, తరచూ చేతులు కడుక్కోవటం కూడా ఒక సమస్యే. పక్క వాళ్ళని అనుమానంగా చూడటం, మా ఇంటికి ఎవరూ రావద్దనీ, లేదా మా ఊరికి రావద్దని నిర్మొహమాటంగా చెప్పటం, కరోన వచ్చిన తల్లి, తండ్రి, భార్య పిల్లలు, వారెవరైనా, తమవారికి కూడా కరోన వస్తుందేమోనని ఆందోళన పడటం, అలాగే బాధితుల కోసం వారి బంధువులు కలవరపడటం మనం చూస్తున్నాం. కొన్నిచోట్ల కరోనాతో చనిపోయిన తల్లిని చూడలేని, లేదా అంతిమ సంస్కారానికి కూడా వెళ్ళలేని పరిస్థితులను మనం వింటున్నాం. ఇటలీలో అయితే, సామూహిక మరణాల వల్ల, ప్రభుత్వమే ఏమి చెయ్యలేని పరిస్థితిలో పడింది. ఈ పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగుతుందో, దీనికి అంతమెప్పుడో ఎవ్వరూ చెప్పలేని పెద్ద సమస్య. మనిషికి తన వాళ్ళ పట్ల ఉన్న అనురాగాన్ని నిర్లిప్తతగా మార్చుకుని, నిస్సహాయంగా వదిలేసే స్థితిలోకి ఇప్పుడు కొంతమంది నెట్టి వేయబడుతున్నారు. మున్ముందు మన సమాజంలో ఈ అనురాగాలూ, అభిమానాలూ నిర్లిప్తతగా మారే ప్రమాదం ఉందా? రాబోయే రోజుల్లో ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళే స్నేహ భావం, లేక బంధుత్వం ఉంటుందా? ఒకరినొకరు అనుమానంగా చూడటం వదిలేయగలమా?

బ్రతకగలిగిన వాళ్ళే బ్రతుకుతారు

గత నెలలో బ్రెజిల్‌ దేశ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో తమ దేశంలో కరోనా పరిస్థితిపై చెప్పిన మాటలు మనం మననం చేసుకోవాలి. ఆయన మాటల్లోనే, ”కొంత మంది కరోనా వైరస్‌ వల్ల చనిపోక తప్పదు. ఇది జీవితం. ఇలా చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను.” ఇప్పటికే, వయసు మళ్ళిన వద్ధులు సమాజానికి భారమనే అభిప్రాయం ప్రబలుతోంది. ఇది ప్రభుత్వాల వైఖరిలో వస్తున్న లేదా, రాబోతున్న మార్పు అనుకోవచ్చా? బ్రెజిల్‌ అధ్యక్షుడు ఎటువంటి పరిస్థితులలో అలా అన్నప్పటికీ, ఈ మాటలు కొన్ని ప్రశ్నార్థకాలను లేవనెత్తుతున్నాయి.

ఈనాటి సమాజంలో వయసు పైబడిన వాళ్ళు, ఆడవారు, సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు, ఫిజికల్లి చాలెంజ్డు పీపుల్‌ అనేక విషయాల్లో నిర్లక్ష్యం చేయబడుతున్నారు. చాలా సందర్భాలలో వీళ్ళకు జరుగుతున్న అన్యాయాలకు సమాజమే కేంద్ర స్థానం అవుతున్నది. అయితే, ఈ కరోనా విపత్తు సమయంలో ఇటలీ దేశంలో ”ఎనభై ఏళ్ళు పైబడిన కరోనా బాధితులు బతికితే బతుకుతారు, యువకులకు వైద్యం చేసి బతికించడమే తమకు ముఖ్యమనే” నిర్ధారణకు వచ్చారు. నిత్యం పెరుగుతున్న రోగుల సంఖ్య మూలంగా వేరే గత్యంతరం లేక అలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. మరొక కారణం వైద్యుల కొరత, మందుల కొరత కావచ్చు. మన దేశంలో తరతరాలుగా పాతుకుపోయిన కుటుంబ విధానాలు కొంత పలచబడినప్పటికీ, ఇంకా మనం ఆ స్థితికి రాలేదనే నా నమ్మకం. అయితే, మానవాళి మొత్తంగా చూసినప్పుడు, సమాజంలో ఈ మార్పు రాబోతోందా అన్న అనుమానం రాకతప్పదు. అసలు వయసుపైబడిన వాళ్ళు ఈ సమాజానికి అవసరంలేదా? శారీరక దారుఢ్యర ఉన్నవాళ్ళు, రోగాలు రానివారే సమాజానికి ముఖ్యమా? ఒక ఫిజికల్లి చాలెంజ్డు వ్యక్తి గాని, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారు కానీ, అంధులకు కానీ, సమాజంలో అందరితో పాటు సాధారణ జీవనం గడిపే హక్కు మనం ఎంత వరకూ ఇవ్వగలుగుతున్నాము? జీవన విధానాల్లో వచ్చిన గణనీయమైన మార్పుల వల్ల, వైద్య విజ్ఞానం వల్ల, ప్రజల ఆయు ప్రమాణం కూడా పెరిగింది. అలాగే, అనేక కారణాల వల్ల, ముఖ్యంగా పట్టణాలలో, నగరాలలో ప్రజల ఆరోగ్య సమస్యలూ పెరిగాయి కదా! అలాంటప్పుడు అసలు ఎంత వయసు వరకూ ప్రజలు ఈ సమాజానికి అవసరంగా, లేదా ఉపయోగకరంగా పరిగణింపబడతారు? మరి ధనవంతులు, అధికార ప్రముఖులు ఎలా వున్నా, ఎంత వయసున్నా ఈలిస్టులోకి రారా? వారికి లభించే వైద్యంగాని, మరే ఇతర విషయాల్లో వారికి లభించే ప్రాముఖ్యత గానీ మనం చూసినట్లయితే, ఈ సమాజంలో ఒకరికి ఒకన్యాయం, మరొకరికి మరొకన్యాయం-ఇది అన్యాయం అనిపించదా? అందరికీ ఆరోగ్యం అంటూనే వివిధ దేశాలు ఇంతవరకూ ప్రజారోగ్యం మీద అవసరమైనంత శ్రద్ధ చూపించలేదని ప్రతిపక్షాలు నిందిస్తూనే ఉన్నాయి. మరి అలాంటప్పుడు, వయసుపైబడిన వాళ్ళు, వ్యాధిగ్రస్తులు, శక్తిలేని వాళ్ళకి వైద్యం చెయ్యకుండా వది లెయ్యడాన్ని ఏమనాలి? ఎక్కడో ఒకచోట మాత్రమే జరిగినదని, ముందస్తు ఆలోచన, విపత్కర పరిస్థితుల నెదుర్కొనే మానసిక సంసిద్ధతలేని ప్రభుత్వాధి నేతలే ఇలా మాట్లాడుతారని, ప్రవర్తిస్తారనీ సరిపుచ్చుకోవచ్చా?

వసుధైక కుటుంబం

ఇంటర్నెట్‌ వచ్చాక, ప్రపంచమంతా ఒకటిగా మారిపోయింది. క్షణాలలో వార్తలు మారుమూలలకు కూడా చేరిపోతున్నాయి. కష్టాలు ఎక్కడ వచ్చినా, సామాన్య ప్రజలు కూడా ”అయ్యో పాపం, వాళ్ళూ మనుషులే, అంతా ఒకటే” అనే వసుధైక కుటుంబ భావనకు వచ్చినప్పటికీ, వివిధ దేశాధినేతలు మాత్రం ‘బలవంతుడిదే రాజ్యం’ అనే ఆటవిక న్యాయానికి ఇంకా దగ్గరలోనే మసలుకుంటున్నారు. వ్యాపార రంగంలో ఎత్తులూ, పైఎత్తులూ, బెదిరింపులు కొన్ని ధనిక దేశాలు అమలుచేస్తూనే ఉన్నాయి. ప్రతి దేశం తమ మనుగడ కోసం, ఆధునిక సాయుధ సంపత్తి సమకూర్చుకోవడం ముఖ్యమైన అవసరంగా భావించాల్సి వస్తోంది. దానికి ఆయుధ వ్యాపారం చేసే దేశాలే కారణమవుతున్నాయి. అభివద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలూ, ఎంత కాలమైనా అక్కడే ఆగిపోవడానికి ఈ దేశాల ఆయుధ వ్యాపారం కారణం కాదా? రేపు కరోనా తిరుగుముఖం పట్టాక, ఈ దేశాలు ఖాళీ అయిన తమ నిత్యావసరాల కోసం, తమ ప్రజల కోసం, ఏ రకంగా ప్రవర్తించబోతున్నాయి? పరస్పర స్నేహాలను, సహాయాలను మరిచిపోతాయా? కేవలం సైనిక బలం, ఆర్థికపరమైన బెదిరింపులే వారు తూటాలుగా ఉపయోగించబోతున్నారా?

మరొక విషయం. ఈ కరోనా కాలంలో వివిధ దేశాలు, తమ దేశాలలో నివసిస్తున్న విదేశీయులను, వాళ్ళ దేశాలకు పంపివేశాయి. ఇప్పటిదాకా ఒక దేశ ప్రజలు మరొక దేశంలో నిశ్చింతగా జీవిస్తున్నారు. పై చదువుల కోసమో, వ్యాపారం కోసమో, ఉద్యోగాల వల్లనో విదేశాల్లో అనేకమంది స్థిరపడిపోయారు. ఇక ముందు ఈ అవకాశం మగ్యం కానున్నదా?

మానసిక సమస్యలు

దేన్నీ లెక్కజేయని ధైర్యస్తులు అన్ని దేశాలలో ఉన్నప్పటికీ, వారిని కూడా ఈ కరోనా చాలావరకు భయభ్రాంతులను చేసింది. ఈనాటి విపత్కర పరిస్థితులు పసివారి మనసులపై చెరగరాని ముద్ర వేస్తాయి. ఇది రాబోయే తరాల జీవనంలో మార్పు తేనుందా? వాళ్ళు ఇలాంటి వ్యాధుల పాలబడినప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలరా? ఆ తర్వాత అందరితో కలిసి మెలిసి జీవించగలరా? ఇప్పటికే కులాలు, మతాలూ, వర్గాలుగా విడిపోయిన మనం ముందు తరానికి ఏ విధమైన మార్గ నిర్దేశం చేయబోతున్నాం? మానసికమైన ఒంటరితనానికి వారిని అలవాటు చేయబోతున్నామా?

సమాజంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, సాధారణ స్థితి ఏర్పడిన కొన్ని సంవత్సరాల వరకు కూడా, జరిగిపోయిన బాధాకరమైన దశ్యాలే వెంటాడుతుంటాయి. కొన్ని దశాబ్దాల వరకూ దాని ఫలితాలు ప్రజలపై పడక మానవు. దీనికి గొప్ప ఉదాహరణ భోపాల్‌ గ్యాస్‌ ప్రమాదం. ఇలాంటివి మానసికంగా మనిషిని కంగదీస్తాయి. జీవితంలో మరే ఉత్సాహాన్ని నింపే సంతోషకరమైన సంఘటనలు లేనప్పుడు, మనిషికి సహజంగానే జీవితంపై విరక్తి పుట్టవచ్చు. అది ఆత్మహత్యకు దారితీయవచ్చు. స్టాన్‌ ఫర్డ్‌ యూనివర్సిటిలో పనిచేసే సైక్రియాటిస్ట్‌ శైలి జైన్‌ ”ఇలా మనల్ని చాలా కాలం వెంటాడే భయాందోళనలను పోస్టు ట్రామాటిక్‌ డిసార్డర్‌ (ూుూణ)” అని అంటారు. ఇంకా అనేక కారణాలు, రేప్‌ జరగడం, కుటుంబ హింస, అణచివేయబడటం, ఒక ప్రమాదకర సంఘటన నుంచీ బయటపడటం లేదా, రాజకీయ పునరావాసం, ఆర్థిక విపత్తు – ఇలాంటివన్నీ దీనికి కారణాలు కావచ్చని అంటారామె. మన భారతదేశంలోనే మానసికపరమైన బాధలు పడేవారి సంఖ్య అత్యధికమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో తెలిపింది. దీనికి రెండు కారణాలు చెబుతున్నారామె. మన సమాజంలో మానసిక రుగ్మతలున్న వారిని చిన్నచూపు చూడటం వల్ల, ఆ లోపాన్ని మనలోనే దాచిపెట్టుకుని, డాక్టరు సహాయం తీసుకోకపోవడం ఒకటైతే, ఇవి పాశ్చాత్య దేశాలలోని రుగ్మతలుగా మనం ఇచ్చుకున్న గుర్తింపు మరో కారణం. ప్రభుత్వాలు మానసిక రుగ్మతలకు, వాటి వైద్యానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె నొక్కి చెబుతున్నారు. ఎందుకంటే, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉన్నట్లే.

ప్రభుత్వ సహాయం, ప్రజల బాధ్యత

అసంఘటిత కార్మికులకు, చిన్న వ్యాపారస్తులకు, తోపుడుబళ్ల వాళ్ళకు, వ్యవసాయదారులకు, కూలీలకు ప్రభుత్వం తలపెట్టిన, చేస్తున్న సహాయం మంచిదే. అది వారికి అందేలా చూడాల్సిన అవసరం కూడా ఉంది. అయితే, ఇది వారికి ఆపత్కాలంలో ప్రభుత్వం ఇచ్చే సహాయం కింద మాత్రమే చూడాలి. సహాయం చేసేందుకు ప్రభుత్వానికి కూడా పరిమితులున్నాయని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కరోనా ఆపద తర్వాత ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరింత పెరగనుంది. ఈ విపత్తులో ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసు వారికి, అట్టడుగు వర్గాల వారికి – కార్పొరేట్‌ కంపెనీలు, దాతలు చేస్తున్న సహాయం మరువలేనిది. అలాగే ఉపాధి కల్పనలోనూ ప్రభుత్వానికి వీరు అండగా నిలబడాలి. కరోన దాడి తగ్గగానే, నిత్యావసరాల నుంచి అన్నీ ధరలు పెరగకుండా ప్రభుత్వానికి చేయూత నివ్వాలి. మరో విషయం. మన ప్రభుత్వాలు సామాజిక బాధ్యతగా, ప్రజలకు కరోన వైరస్‌ వల్లే కాదు, మరే రోగం వల్లనైనా భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం కలిగించాలి. మన వైద్య విధానం పట్ల, వైద్యుల పట్లా కూడా ప్రజలకు నమ్మకం పెరగాలి. ప్రైవేటు వైద్య విధానంలో సామాన్యుడికి అనుభవమవుతున్న అత్యధిక బిల్లుల బరువు తగ్గాలి. ఈ దిశగా ప్రభుత్వాలు కొంతైనా ప్రయత్నం చెయ్యాల్సిన అవసరం ఉంది. మరొక విషయం, ఇలాంటి విపత్తుల సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు కూడా బాధ్యత తీసుకునేలా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే, ఇలాంటి విపత్తులు ఎదుర్కొనేందుకు, ప్రజారోగ్యం కోసం అవసరమైన హాస్పిటళ్ళను నెలకొల్పటం, వైద్య విద్యనూ, ప్రతిభావంతులను ప్రోత్సాహించడం చెయ్యాలి. ఆరోగ్య రంగరలో కొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలూ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సత్వర ప్రయత్నాలు జరగాలి.

ఈ కరోనా ప్రభావం వల్ల, కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని కొంత మంది చెబుతున్నారు. ఐ.టి. ఉద్యోగాల కల్పన లాంటివి మన ప్రభుత్వాలు చెయ్యలేక పోవచ్చేమో కానీ, ఫ్యాక్టరీలు నెలకొల్పడం, మన దేశం అవసరాలకు సరిపడా మరియు విదేశాలకు ఎగుమతి చెయ్యగలిగిన ఉత్పత్తులు పెంచేందుకు కషి చెయ్యడం మన చేతిలో పని. అందువల్ల, అనేక వేల మందికి ఉపాధి ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరుగుతుంది. ఎగుమతుల వల్ల మన దేశ ఆదాయం పెరుగుతుంది. ఈ దిశగా మనం కషిచేయాలి. ఇవన్నీ మనం సాధించగలిగితే, ఈ కరోనా విప్పత్తు సష్టించిన సమస్యలను కొంతవరకైనా అధిగమించినట్టు అనుకోవచ్చు.

(కొలిమి వెబ్‌ మ్యాగజైన్‌ నుండి)

Share
This entry was posted in కరోనా డైరీస్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.