నిన్న రాత్రి చుక్కల లాంతరు
తీసుకుని బయలుదేరాను
రాత్రే కదా అని కొట్టి పారేయకు
పగలు వేధించిన ప్రశ్నలన్నీ
నడిరేయిలో
జవాబులు వెతుక్కుంటాయి
అనూహ్యమైన మలుపులెన్నో
జరిగేది ఇప్పుడే
మనకు స్వాతంత్య్రం
వచ్చిన మాటేమో గానీ
నోట్లకు స్వతంత్రం పోయింది అర్థరాత్రే
అన్యాయాలకు అక్రమాలకు
రెక్కలు మొలిచేది అప్పుడే మరి
మనిషిలో మృగత్వం
పంజా విసిరే సమయం కూడా ఇదే
వెలుగు చూడని కోణాలన్నీ
చీకటిలో విసిరివేయబడతాయి
దిగులు తీర్చినా… నిద్ర పుచ్చినా
ఒక్క రేయికే చెల్లింది
శార్వరి కొమ్మకు పూచిన రాతిరిలో
వెన్నెల పువ్వులు వికసిస్తాయి.
గతం తాలూకు అనుభవాలన్నీ
మిణుగురు పురుగులై పలకరిస్తాయి
పేదవాడి గుడిసెలో
కొడిగట్టిన ఆకలిదీపం ముందు
ఆశల వెలుగు
మిణుకు మిణుకు మంటుంది
ఒక మాపటి గెలుస్తుంది
మరో మాపు ఓడిస్తుంది
అబలల ఆర్తనాదాలతో
కటిక చీకటి బండబారిపోయింది
మూసిన కనురెప్పల మీద
తీరని కల
ముల్లులా గుచ్చుకుంటోంది
అందుకే ఈ యామినీ వేళ
నా అక్షరాలను
మారణాస్త్రాలుగా మలిచి
నిశిరేయి రాక్షసులపై సంధిస్తున్నా