శిలాలోలిత
మాధవి కుట్టి ఒక సీతాకోకచిలుక, కమల ఒక మంచుకొండ, కమలాదాస్ ఒక లావా ప్రవాహం. కమలా సురయ్యా ఒక అగ్నికణం. బతుకంతా అన్వేషణలోనే అలసి సొలసిన బాధాగ్ని రేణువు
అమ్మా-నాన్నలు, మేనమామల సాహిత్య సృజనను చిన్నప్పటినుంచీ దగ్గరగా చూస్తుండటంతో, సాహిత్యప్రేమ మొదలైంది. ఆమె తొమ్మిదవ ఏట పిల్లల కథను రాశారు. కవిత్వమంటే పిచ్చి ప్రేమ ఉండేది. కానీ ఫక్తు వ్యాపారవేత్త భర్త దృష్టిలో, కవిత్వం రాయడం వల్ల ఎక్కువడబ్బులు రావు. మార్కెట్ లేదు. సెన్సేషన్ వున్న రచనలు కథ, నవల, వ్యాసం ఆత్మకథల్లాంటివైతే డబ్బులు రాల్తాయనేది అతని వాదన. కమలలో రెండు యుద్ధభూములున్నాయి. రోజూ కత్తులు దూసుకోవడమే. భర్తకున్న ధనకాంక్ష, ఆజ్ఞాపించే ధోరణికి అలవాటు పడిపోయినా, ఏసెన్సారింగు తనకు తాను విధించుకోని తత్వం ఆమెలో వున్నందువల్ల చాలా స్వేచ్ఛగా రాసింది.
15 సం||లకే పెళ్ళయి, 16 ఏళ్ళకే తల్లయినందున బాధ్యతలు, కుటుంబంలో కూరుకుపోయింది. మానసికంగా సంసిద్ధత దశకు చేరుకోని దశలోనే భర్త లైంగిక ప్రవృత్తి, మొరటుదనం ఆమె శరీరాన్నే కాక మనసునూ గాయాలపాలు చేసింది. ‘స్టాక్ వెరిఫికేషన్’ కవితలో భర్త మరణాన్ని అత్యంత దగ్గరగా చూసిన తీవ్రతను రాస్తూనే ‘కాళ్ళ మధ్య ఓ మనిషిని బిగబట్టి ముగ్గురు కొడుకుల్ని బయటికి తెచ్చాను” అని వేదాంతిలా అంటారు.
”పిల్లల్తో పాటూ నేనూ పెరిగాను, ఆడుకున్నాను. నా భర్తకూ నాకు సంవత్స రాల దూరం చాలా ఉన్నందున పిల్లల్లా నేనూ పేచీలు పెట్టాను’ అంటుందొకచోట. మనిషి బతికున్నాడన డానికి నిదర్శనం కోల్పోని చిరునవ్వు, పసితనమే. ఈ రెండూ ఆమెలో చివరి వరకూ ఉన్నాయి. అందుకే ఆమె రచనల్లో ఆ సహజత్వం, నిర్మలత్వం, ధైర్యం, వాదనాపఠిమ నిరంతరం కొనసాగుతూనే వున్నాయి.
కమలాదాస్ ‘మై స్టోరీ’ ఆత్మకథ సాహిత్యరంగంలో తీసుకొచ్చిన సంచలనం మనకు తెలిసిందే. దేశభాషను, ప్రకంపనాలను, విస్ఫోటనాలను ఎంతో నిజాయితీగా భావోద్వేగంగా రచించిన ఆనందాన్వేషి. పిడికెడు ఆనందం కోసం, గుప్పెడు ప్రశాంతత కోసం, చారెడు రసానుభూతికోసం, బారెడు ప్రేమకోసం, పరిశ్రమించిన అన్వేషించిన నిరంతర చలనశీలి ఆమె. కానీ బతుకంతా అన్వేషణే మిగిలింది. ప్రేమగా చూసే వ్యక్తులు తారస పడలేదు. దేహవాంఛే ప్రధానమనుకుంటు న్నారే కానీ, మనస్సూ దేహము ఏకకాలము లో భావోద్వేగ కెరటాన్ని ఒరుసుకుంటూ ప్రవహించే, రాగరంజితం చేసే స్థితికోసం ‘మృగన’ గానే మిగిలిపోయింది. తనలోని మనసుతో, తనకున్న దేహంతో, తనదైన జీవితంలో, తన మేధస్సుతో పెనుగులాడే ఆమె రచనలు. తను అనుకున్న దానిని ఎంతో ధైర్యంగా ప్రకటించే తత్వమామెది. మనం జాగ్రత్తగా గమనిస్తే, సెన్సేషన్ కోసం ఆమె రాయలేదు. కానీ, ఆమె రాసినందా సెన్సేషన్ అయింది.
కమలాదాస్ కవిత్వానికి ఓ మచ్చుతునక మాత్రమే ఈ కవిత. చర్చించడం మొదలుపెడితే ఆ చర్చ అనంతంగా సాగిపోతుంది.
”పురుగులు” – కమలాదాస్
నదీతీరంలో, సూర్యాస్తమయవేళ
ఆమెతో కృష్ణుని చివరి సంగమం…
ఆరాత్రి భర్త కౌగిలిలో రాధ నిర్జీవంగా…
”ఏమయింది”…?
”చెలీ నా ముద్దులు నీకు రుచించడం లేదా?”
”అబ్బే అదేం లేదు?” ఆమె జవాబు
కానీ, ”పురుగులు కొరికితే శవానికి నొప్పి తెలుస్తుందా”?
ఆమెలో సుళ్ళు తిరుగుతుందో ప్రశ్న….
(- అనువాదం : పసుపులేటి గీత)
ఆమె ఎన్నో అవార్డులను గెలుచు కుంది. జాతీయ అంతర్జాతీయ పురస్కారాల నేకం పొందారు. అనేక భాషల్లోకి రచనలు అనువాదమయ్యాయి.
కేరళలోని మలబారు తీరంలో త్రిసూర్ జిల్లాలో వున్న యురుక్కుళంలో 31.03.1932లో జన్మించింది. 31.05.2009లో ఆదివారం నాడు పూణే లోని జహంగీర్ ఆస్పత్రిలో, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడ్తున్న ఆమె తుదిశ్వాసను విడిచారు. 75 ఏళ్ళపాటు జీవించిన ఆమె అంతరంగ చిత్రాలే రచన రూపాన్ని తొడుక్కొని, అక్షరాలుగా మనముందు నిలిచాయి.
‘వంశస్థులు’ కవితలో ఆమె మాటలు – ”నేను మరణించినప్పుడు నా మాంసాన్ని ఎముకల్ని విసిరిపారేయకండి. వాటిని ప్రోదిచేయండి. వాటి వాసనతో వాటిని చెప్పనివ్వండి. ఈ భూమ్మీద జీవితపు విలువేమిటో, అంతిమంగా ప్రేమ విలువేమిటో వాటినే చెప్పనివ్వండి”.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags