నో మోర్‌ టియర్స్‌

కొండేపూడి నిర్మల
కొత్త ఇంట్లోకి వచ్చాను. లారీలో సామాన్లు దిగాయి. గ్యాస్‌ స్టవ్‌ బర్నర్స్‌కి హటాత్తుగా ఏం జబ్బు చేసిందో గానీ సరిగ్గా మండటం లేదు. ఎర్ర మంట వస్తోంది. మరమ్మత్తు కోసం కంపెనీకి ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఫలితం లేకపోయింది. విసుగొచ్చి నేనే బయల్దేరా. మరీ దగ్గర అవడంతో ఆటో కుదరలేదు. విజయనగర్‌ కాలనీలో నడుస్తున్నాను. ఎండ మిడిసిపడుతోంది. దూరంగా కూరగాయల మండీ కనిపిస్తోంది. హైద్రాబాదు వచ్చిన కొత్తలో కాపురం వున్న పరిసరాలు కదా ఆసక్తిగా ఇప్పుడొచ్చిన మార్పులు గమనిస్తూ అలసట మర్చి పోవాలనుకున్నాను. మండీ కున్న గట్టు మీద చతికిలపడి మోకాళ్ళు నిమురుకుని, మళ్ళీ బరువైన సంచులు మోసుకుంటూ పోతోందోకావిడ.
ఎవరబ్బా – అనుకున్నాను. ఆ… గుర్తొచ్చింది. వెంకటరమణ కదూ. కుడివైపుకి వంగినట్టనిపించే ఆ గూని నడకా… గాలికెగిరే పోనీ టెయిలూ…. మాపుకి తట్టుకునే ముదురు రంగు నైలాను చీరా… ఏం మార్పులేదు. చూసి ఆరేళ్లయింది. ఆ మధ్య ఆఖరు కూతురి పెళ్ళికి రమ్మని కార్డు వేసింది కూడా. రాలేకపోయాను. అయితే అందరూ వెళ్ళిపోయినా ఒక్కత్తీ ఇక్కడుందా..?
”రమణమ్మా..” పిలిచాను. వినిపించనట్టు లేదు. అలాగే నడుస్తూ సందులోకి వెళ్ళిపోయింది. నా అరుపు నాకే అనాగరికంగా అనిపించింది. రెండు మూడు తలకాయలు పైనున్న మేడమీంచి తొంగి చూశాయి. వెంటనే నేను వెళ్ళాల్సిన గ్యాస్‌ కంపెనీలోకి దూరిపోయాను. రిపేరు చేసే మనిషి కోసం కొంతసేపు ఎదురుచూసి అతన్ని తీసుకుని ఇంటికెళ్ళి గ్యాస్‌ స్టవ్‌ బాగుచేయించి, వంటచేసి అదే సాయంత్రం రమణమ్మ కోసం వెళ్ళాను. రమణమ్మ చెప్పిన విషయాలతో మనసు బరువెక్కింది. సమాజంలోని అనేకమంది మోసపోయిన అమ్మతనాలకు రమణమ్మ ఒక ప్రతినిధి. తల్లీ కొడుకుల గురించి మనం చాలా మాట్లాడుకుంటాం. తలకొరివి రాజకీయం తెలుసు. తల్లీ కూతుళ్ల పరాయితనాల మీద ఎప్పుడూ చర్చ జరగలేదు. ఇద్దరినీ విడదీసి మోపిన రెండు కుటుంబాల పరువు వొత్తిడి గురించి, అంతస్థు గురించి వాటిని జీర్ణించుకోవడానికి పెంచుకున్న స్వార్థం గురించి మనం ఎక్కడా బాధపడలేదు. రమణమ్మ మీకు తెలీదు. మా ఇంటికి ఆమడ దూరంలో రెండు గదుల రేకులింట్లో వుండేది.. ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళు చిన్నగా వున్నప్పుడే భర్త మరణించాట్ట.. జరుగుబాటు కోసం చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెప్పేది. మిషను కుట్టేది. పచ్చళ్లు చేసి షాపులకి ఇచ్చేది. ఎప్పుడు చూసినా పని.. పని.. పనిలేకుండా కాస్త మంచి చీరకట్టుకుని రికామీగా కూచుని వున్న రమణమ్మని మాపేటలో ఎవరూ చూసి వుండరు. ”పిల్లలు ముగ్గురినీ పెద్ద ఇంటికి ఇవ్వాలనే” దే ఆమె ధ్యేయం. కాబట్టి వాళ్ళ సరదాలు పట్టించుకునేది కాదు. పుట్టిన్రోజులూ, పండగలూ కూడా జరిపేది కాదు. ఆ సమయంలో ఇంకెవరింట్లోనో వంట చెయ్యడానికి వెళ్ళిపోతుండేది. తండ్రి నుంచి వచ్చిన నాస్తిక నేపథ్యం ఒక కారణమైతే పేదరికంలోంచి వచ్చిన తాపత్రయం ఇంకా పెద్ద కారణం. కొబ్బరినూనె, కుంకుడు కాయల ఖర్చు తగ్గించడం కోసం పిల్లలు ముగ్గురికి క్రాపింగు చేయించినప్పుడు ”అయ్యో పాపం.. ఎంత చక్కటి జడలో కదా. శుక్రవారం పూటా అలాంటి పని ఎవరైనా చేస్తారా చీచీ..” అన్నారంతా. పెద్ద కూతురు తనతో చెప్పకుండా ఫ్రెండ్సుతో కలిసి సినిమాకి వెళ్ళినందుకు రోజంతా అన్నం పెట్టకుండా మాడ్చింది. ఆ పిల్ల కళ్ళు తిరిగి పడిపోవడంతో నువ్వు ఒక తల్లివేనా అని ఆడిపోసుకున్నారు.
హిట్లరు- అని పేరు పెట్టారు. రమణమ్మ సిగ్గుపడింది. పరువు దక్కడం కోసం వాయిదాల మీద ఒక టివి కొని పడేసింది.. సినిమాలు ఇంట్లోకి వచ్చి పడ్డాయి. తను కుట్టినవే కాక బజారులో అమ్మిన రెడీమేడ్‌ చుడీదారు కొనిపెట్టింది. చీట్టీలు మానకుండా ఇన్నీ అమర్చి అందర్నీ సంబర పెట్టడానికి ఎన్ని రాత్రులు నిద్ర కాచి కళ్ళలో సూదులు గుచ్చుకుని పనిచేసిందో మనకి అనవసరం. చీమ గంగా యాత్ర మాదిరి ఒక ప్రస్థానం పూర్తి చేసింది. పచ్చళ్ళతో పాటు ఒక కర్రీ పాయింటు సెంటరుకి సహా యజమానురాలయింది. మొత్తానికి అనుకున్న స్థాయిలో సంబంధాలు కుదిర్చి పెళ్ళిళ్ళు కూడా చేసింది. తనకంటే ఒక మెట్టుపై నున్న అల్లుళ్ళ హంగు కోసం ఇల్లు కూడా మారింది. ఆ మధ్యనే ఆఖరి కూతురు తన రెండో కాన్పుకోసం అమెరికా పిలిపించుకుంటే ఆకాశంకేసి ఎగిరింది.. కుట్టు మిషను మీద కూరుకుపోయిన రమణమ్మకి ఇది కొత్త అనుభవం.. ఇంకేముంది అక్కడే సెటిలవుతుంది అనుకున్నారంతా. అసలు కష్టాలు అక్కడే మొదలయ్యాయి. కూతురింట్లో వాషింగు రూంలో ముడుచుకుని పడుకోవడానికేమీ అనిపించలేదు. చివరికి ఇది కూడా తన ఇంటి కంటే బావుందనుకుంది. కూతురు కస్తూరికి తల్లిని చూడగానే చిన్నప్పటి అసంతృప్తులు గుర్తొచ్చాయి. కొత్తగా పెరిగిన అంతస్థు ముందు తల్లి చాలా అనాగరికంగా అనిపించింది. రమణమ్మ వంటలు, అలవాట్లు, కడుతున్న చీరలు, మాటతీరు, పిసినారితనం, అన్ని అత్తగారి ముందు దిగదుడుపు అనిపించాయి. తల్లి అంటే అత్తగారిలా మెత్తగా నాగరికంగా, పిల్లలు ఏదీ అడిగినా కాదనకుండా అమర్చే నిరంతర ప్రేమికురాలిగా వుండాలనుకుంది.
ఆ అత్తా కోడళ్ళు చేస్తున్న హితబోధల మధ్య రమణమ్మ ఏమీ చాతకానిదయి పోయింది. కనీసం అప్పుడే పుట్టిన పసిగుడ్డు మొహం చూసి అన్నీ మర్చిపోదామన్నా కుదరలేదు. వాళ్ళు అలా మర్చిపోనివ్వలేదు.
నువ్వు ముట్టుకోకు అన్నారు. నీకు పిల్లల్ని పెంచడం రాదన్నారు. నీ పిల్లల్ని పెంచినట్టు కాదన్నారు. నలభై ఏళ్ళుగా రమణమ్మ పడిన శ్రమని గడ్డిపోచలా తీసిపారేసి సంప్రదాయం తెలీదన్నారు. ఒక్క పిల్లకి సమర్త బంతి సరిగా పెట్టలేదన్నారు. నగలు చీరలు కొనలేదన్నారు. పూజలు వ్రతాలు నేర్పలేదన్నారు. డబ్బు మనిషన్నారు. తల్లి ప్రేమ లేదన్నారు… ఈ చివరి మాటలు వింటూంటే నాక్కూడా కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి.
పిల్లల గొప్పలు చెప్పుకోవడానికి అలవాటు పడ్డ తల్లికి వాళ్ళు చేస్తున్న అవమానాలు పైకి చెప్పడం ఎంత ప్రాణం పోయినట్టుగా వుంటుందో అది రమణమ్మ మొహంలో కనిపించింది. కానీ ఇది నిజం. ఒక నలుసు కడుపులో పడింది మొదలు వాళ్ళనే కలవరిస్తూ కళలు, కన్నవాళ్లు, స్నేహాలు పక్కన పడేసి ఒక ప్రపంచంలో కొట్టుకుపోతాం. అంతా అయ్యాక ఎవరో కాదు మన పిల్లలే మనకి ఏమంత ప్రేమ లేదని కనిపెడతారు. ఏ మార్కెట్టు తెచ్చిపెట్టి మాతృత్వం నిరూపించుకోవాలో అర్థం కాదు. అప్పుడింక మనల్ని ఓదార్చేది ఎవరో కాదు మనమే. కన్న సంతానం నుంచి పారిపోయి వచ్చిన రమణమ్మ కుట్టు మిషన్ని కావలించుకుని ఏడ్చినట్టు, మనం కూడా ఎప్పుడో ఒకరోజు అటక మీంచి సంగీతం పెట్టెను కిందికి దింపుకోవాలి. నచ్చిన నవల్లకి అట్టలు వేసుకోవాలి. సంసారం కుడితిలో పడి ఎలకల్లా కొట్టుకుంటున్న నేస్తాల్ని వెతికి పలకరించాలి. మర్చిపోయిన చింత పిక్కల ఆట గుర్తు చేసుకోవాలి. కాదంటారా…? పిల్లల్ని ప్రేమించవద్దని చెప్పను.. అది మన బాధ్యత. వేలాదిగా త్యాగాలు కూడా చేద్దాం… కానీ మనల్ని ఒక్క పిసరు ప్రేమించుకుందాం. తల్లులవు తున్నప్పుడు మన పురిటి నొప్పులు ఎవరూ పంచుకోలేదు. పేగులోంచి బైటికి దూసుకు వస్తున్న బిడ్డ తప్ప. ఇప్పుడు బిడ్డలూ వుండరు. ఒంటరి తనం తప్ప. నో మోర్‌ టియర్స్‌… (ఇది సబ్బుల కంపెనీ ప్రకటన కాదు ఒక తల్లి అవమానాన్ని ఉతికి ఆరేసే సబ్బు ఎవరు కనిపెట్టలేరు)

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.