ఇందులోని కథలన్నీ దాదాపు వాస్తవిక సంఘటనల ఆధార ఇతివృత్తాలతో రచింపబడ్డప్పటికీ రచయిత్రి భండారు విజయ గారు ఈ కథనంలో ఎక్కడా వినిపించరు, కనిపించరు. కానీ, ఆ వాస్తవ ఘటనల తాలూకు గాఢతను, ముద్రలను మనపై వేస్తూ భారమైన, ఛిద్రమైన, వేదనాభరితమైన మన హృదయాలపై తాను ఎంచుకొన్న లక్ష్యాలను ఆవిష్కరింపచేస్తూ అప్రతిహతంగా విజయ పథంలో సాగిపోతూ ఉంటారు. వేదనతో భారమైన, జుగుప్సతో నిండిపోయిన, శకలాలుగా విరిగిపడిన హృదయ శిథిలాలపై సాధించిన ఆశావహ భవిష్యత్ చిత్రణ గావిస్తూ పోతుంటారు.
ఈ గణికలకు హృదయాలుంటాయి, ఆశలుంటాయి. శాంతియుతమైన, సమాజ ఆమోద యోగ్యమైన జీవితాల్ని కలగంటారు.
శాంతి వృత్తిలోకి ప్రవేశించినప్పుడు తన మొదటి కస్టమర్ (వినియోగదారుడు) తనను పర్మనెంట్‌గా ఉంచుకొని పెండ్లి, తాళి లేకున్నా ఒక్క వ్యక్తితోనే జీవితం ”పవిత్రంగా” (స్త్రీలకు మాత్రమేనా?) గడపవచ్చని, కులవృత్తిని వదిలివేయవచ్చని ఆశిస్తుంది. తన మొదటి కొడుకు తండ్రి అని. ఆపై అంగడి సరుకుగా మారాక ఆత్మహత్య విఫలమయ్యాక ”మగాళ్ళ నీచ, లైంగిక, పైశాచిక, ఉన్మాద హింసను అనుభవిస్తూ తండ్రెవరో తెలియని ఇద్దరు మగపిల్లలకు తల్లినయ్యాను” అంటుంది.
‘గణిక’లోని కథలన్నింటిలో విభిన్న పార్శ్వాలుంటాయి. ఒకవైపు ప్రపంచంలోని, పురుష జాతి, కుల, మత, సంస్కృతుల దౌష్ట్యాలను, అణచివేతలను, అందులో పాత్రదారులైన స్త్రీలను చూపిస్తూ ఆ సంఘటనల తాలూకు వేదనను మోస్తూ భయంకరమైన, నీచమైన, హింసాపూరితమైన వాస్తవాలను వెలుగులోకి తెస్తూ ‘రిటైర్మెంట్’లోని రాజేశ్వరరావు, వనజాక్షి, ‘బచ్చేపౌచ్’లోని శంకరయ్య, యాదన్నలు లాగా వదినలు, తండ్రులు, బాబాయిలు, భర్తలు, అత్తలు, ఆడబిడ్డలు, సమాజం వారిని ఎలా హింసించిందీ వారి జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేసిందో భయంకర నగ్న వాస్తవాలతో మనసుల్ని కలచి వేస్తూనే…
భండారు విజయగారు ఎంచుకొన్న ఈ కథలన్నీ విభిన్న కోణాలలో, విషయాల్లో మన ముందు కొన్ని ఆదర్శాలను
ఉంచుతాయి. మన అభిప్రాయాలను విస్తృతం చేస్తాయి.
2016-2030లో ప్రపంచం సాధించాల్సిన లక్ష్యాల్లో 2015 న్యూయార్క్ సమావేశ నిర్ణయంలో సుస్థిర అభివృద్ధి- సమానత్వంలో చెప్పుకొన్న అనేక అంశాలలో పర్యావరణం-1983, సహజ వనరులపై చర్చ-నివారణలు అతి ముఖ్యమైనవి.
‘గణిక’లోని ఇతివృత్తాల ప్రాధాన్యత మహిళలపై హింసనే కావచ్చు కానీ పెరిగిపోతున్న, కొత్త పుంతలు తొక్కుతున్న హింస, వారి జీవితాల్లోకి చొచ్చుకు వచ్చే విధానాలు ప్రపంచీకరణ ఫలితాలే.
ఎన్ని అఘాయిత్యాలనైనా తట్టుకొని నిలబడి, జీవితాల్ని నిలబెట్టుకున్న ”గణిక” కథల్లోని ఆడపిల్లలు, మహిళలు, అమ్మల్లాగా మరెందరో తయారవ్వడంలో ఈ భండారు విజయ గారి వాస్తవ ఇతివృత్యాలు సహకరిస్తాయని ఆశిస్తూ, అభినందిస్తూ…
స్త్రీలుగా మన ఆలోచనలు విశాలంగా, మనం ధైర్యంగా, వివేచనతో మనల్ని మనం ప్రాణులుగా, వ్యక్తులుగా పరిగణించుకొంటూ స్వావలంబనతో, ఆత్మవిశ్వాసంతో, సమైక్యంగా మనల్ని మనం మరింత సమర్ధవంతంగా సమీక్షించుకుంటూ, సవరించుకొంటూ, జయించుకుంటూ, పోరాడుతూ పోతుంటే సమస్తం… చరిత్రలు, సంస్కృతులు, మతాలు, ఆచారాలు, వ్యవస్థలు… అన్నీ మారి తీరాల్సిందే… మార్పు జరగాల్సిందే…