ప్రకృతితో స్త్రీ మమేకత బతుకమ్మ! – అనిశెట్టి రజిత

మన ఉనికికి మూలం ప్రకృతి, సకల చరాచర ప్రాణులకు జన్మనిచ్చింది ప్రకృతి. ఆ ప్రకృతి సంపూర్ణ ఆరాధనే బతుకమ్మ పండుగ వేడుక. ఈ పండుగ ఒక ఉత్సాహం, ఉల్లాసమే కాదు సంఘ జీవన తాత్వికతకు నిదర్శనం. మానవ సంబంధాల్లేని స్నేహ మాధుర్యాలకు ప్రతీక. అన్నింటినీ మించి ”బతుకు”ను నిర్వచించే నిలువెత్తు జీవధనం! మానవాళి మనుగడకు దీవెనలతో శాసించే ప్రేమగుణం!

తెలంగాణ పండుగ వేడుకల్లో సంస్కృతి సంప్రదాయాల కలనేతగా విలసిల్లే చైతన్య సంగమం బతుకమ్మ. గత రెండు దశాబ్దాల కాలంలో బతుకమ్మ నూతనత్వం సంతరించుకుంది. కారణం బతుకమ్మ ఉద్యమానికి ప్రత్యామ్యాయ ఇంధనంగా మారింది. ఆటా, పాట, ధూంధాం, ఉద్యమ బతుకమ్మ సృష్టిగీతమై మారుమ్రోగాయి. తెలంగాణ సకలజనుల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచి గెలిచింది బతుకమ్మ. ఇప్పుడు దేశ విదేశాలలో సైతం ఈ పండుగ వైభోగం ఆర్భాటంగా మారింది.

”బతుకమ్మ పాటలలో స్త్రీల మనోభావాలు”-పాటల పరిణామ క్రమం అనే పరిశోధనా గ్రంథాన్ని 2018లో డా||తిరునగరి దేవకీదేవి ప్రచురించారు. ఈ పరిశోధన కన్నా ముందు రెండు పరిశోధనలు జరిగాయి. ప్రజల మన్ననలూ పొందాయి. జనరంజకమైన ప్రకృతి ఆరాధనకు చిహ్నమైన బతుకమ్మను ఆవాహన చేసుకున్నారు జన సమూహాలు. సంబరానికి ఆడుకునే పై పై వేడుక కాదు ఇది అని తెలుసుకున్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనకు పూనుకున్నారు.

మళ్ళీ మళ్ళీ బతుకమ్మపై పరిశోధనలు ఎందుకు? కొత్తదనం ఏముంటుంది? అని అనుకునే ప్రసక్తే లేదు. ఎవరి అనుభూతి, అనుభవం, ఆస్వాదన వారిది. ప్రతిసారీ కొత్త కోణాల్లో కొత్త అంశాలు తెలుసుకోవచ్చు.

పల్లెటూర్లలో వాతావరణం కొంచెం వేరుగా ఉన్నా 33 జిల్లా కేంద్రాలతో స్త్రీలు అరమరికలు, ఆర్థిక కుల అంతరాల తేడాల్లెండు కలిసి నిర్వహించుకునే వేడుక బతుకమ్మ. పరిశోధనలకు తవల శోధనకు పర్యటిస్తూ, ప్రజలతో… ముఖ్యంగా స్త్రీలతో ముచ్చటిస్తూ, వారి పాటలు వింటూ రికార్డు చేసుకునే సేకరణ కార్యక్రమం వారికి ఎన్నో అనుభవాలనూ, అనుభూతులనూ ఇస్తుంది. తరగని పెన్నిధి లాంటి భావాలూ, పాటల నిధులను తమలో నిక్షిప్తం చేసుకునే అవకాశం అమూల్యమైనది.

రచయిత్రి దేవకీదేవి ఈ పరిశోధనలో సంస్కృతీ సంప్రదాయాలకు తోడు పాటలలో స్త్రీల మనోభావాలు హాస్య, సామాజిక, రాజకీయ అంశాలకు ప్రాధాన్యతనిచ్చానని తన ముందు మాటలో చెప్పారు. తన ఈ పరిశోధనా క్రమంలో అనేక విభాగాలుగా విభజించారు.

1) బతుకమ్మ పండుగకు సంబంధించిన గేయాలు

2) కుటుంబ సంబంధ గేయాలు

3) పరిహాస సంబంధ గేయాలు

4) సామాజిక సంబంధ గేయాలు

5) భక్తి విశ్వాస సంబంధ గేయాలు

6) రాజకీయ సంబంధ గేయాలు

7) పాటలతో పరిశీలనాంశాలు

8) సార సంగ్రహం

ఈ క్రమంలో జాతి చిహ్నంగా పరిణమించిన బతుకమ్మను ఉజ్జీవం చేశారు.

బతుకమ్మ తొమ్మిది రోజుల వేడుకతో పాటు మనం గమనించాల్సింది శక్తి స్వరూపిణీ దేవీ నవరాత్రులు జరుపుకోవడం. ఈ తొమ్మిది రోజులకన్నా ముందు మట్టితో గద్దెను కట్టి పూలతో అలంకరించి ఆడుకునే ఆట తొమ్మిది రోజులపాటు ప్రధానంగా ఉంటుంది. మట్టిని, పువ్వులు, ఆకులనూ ఆరాధించడం మానవ జన్మ అస్తిత్వానికి ఆరాధనతో పాటు నీరాజనాలు పట్టడం బొడ్డమ్మ, బతుకమ్మల పేర్చి కూర్చడాలు.

ఈ గ్రంథంలో దీర్ఘ కథాత్మక గేయాలు, పాటలలోని ఛందో లక్షణాలనూ వివరించారు రచయిత్రి. శైలి సహజంగా మనం మాట్లాడుకుంటున్నట్లూ, ముచ్చట్లు పెట్టుకుంటున్నట్లూ ఉంటుంది.

ఈ బతుకమ్మ సంస్కృతీ ధార ఒక స్పృహ, ఎరుకగా కూడా భావించాలి. ప్రతి మనిషినీ కదిలించే సాంస్కృతిక ఉద్యమ చేతనం అనుకోవాలి. అన్ని పండుగల్లోకెల్లా శిఖర సమానమైనది. మానవీయ సంబంధాలకు ఉన్నతమైన, హృద్యమైన, వ్యక్తీకరణ. రంగురంగుల వాగులు వీథుల్లో ప్రవహిస్తూ ఒక చోటుకు చేరుకొన్నట్లు గుంపులుగా స్త్రీలు అన్నీ మరిచి ఆదమరిచి ఆడుకుంటారు. గాఢమైన మానవ సంబంధాల దీపాలను వెలిగిస్తారు. సంవత్సరం పొడుగునా ఇంటా, బయటా పనులు చేస్తూ యాంత్రికంగా బ్రతికే స్త్రీలకు బతుకమ్మ ఆటా పాటా పెద్ద ఊరట.

ఈ కళారూపంలో వాన, చెరువు, బావి, చేను, మోట, పంట, ఆకుపత్రి, చీరసారెలు, ప్రసాదం అన్నీ వ్యవసాయ సంబంధాల చుట్టూ అల్లుకొంటాయి. సేద్యం ప్రధాన జీవనాధారం, ప్రాచీనం జన జీవన స్రవంతికి.

”బతుకమ్మ జానపదుల కళాసృష్టికి పరాకాష్ట. వందల బాణీలు, వేల పాటలు సృష్టించారు. ఆ పాటల్లో వాళ్ళ స్వచ్ఛ హృదయం ప్రతిబింబిస్తుంది. సేకరించడానికి, పరిశోధించడానికి మన సమయం చాలదు. బిరుదురాజు రామరాజు, పాకాల యశోదారెడ్డి వంటి పండితుల నుంచి విష్ణుమూర్తి, యశోదారెడ్డి, సుజాతాశేఖర్‌, దేవకీదేవి పరిశోధకుల దాకా విశేష కృషి చేసినా తరగని పాటల ప్రపంచం” అంటారు నందిని సిధారెడ్డి.

బతుకమ్మ పాటల్లో స్త్రీల స్థితిగతులు, విభిన్న మనోభావాలు వ్యక్తమవుతాయి. రకరకాల పూల పేర్లు ప్రస్తావించబడతాయి. బతుకమ్మ పుట్టిన కథనాలు వినిపిస్తాయి. పూరణ వ్యక్తులతో ఆటలాడిస్తాయి, వివిధ ఉత్పత్తి పనులు చేయిస్తాయి. ఇదంతా రచయిత్రి ఈ గ్రంథంలో వివరించారు. పూలతోనే ఇల్లు నిర్మించడం, దుఃఖమొస్తే వెక్కి వెక్కి ఏడ్వడం అంతా పాటల్లో వ్యక్తమవుతుంది.

స్త్రీల నిత్యజీవన దుఃఖం వెళ్ళబోసుకునే పాట ప్రక్రియ ఒక ఆలంబన. ఆ పాటతో స్త్రీలు తన వెతలతో సహా మమేకం అవుతారు. సమూహంలో ఒక్కరిగా ఊరట చెందుతారు. స్త్రీలకు సంబంధించి పెద్ద ఉప్పస (ఊరట) ఈ తొమ్మిది రోజుల, ఆ తొమ్మిది రోజుల (బొడ్డెమ్మ) ఉత్సవం.

”ఇవేకాదు, రాజకీయ సంబంధ పాటల్లో సమీప చరిత్ర సాక్షాత్కరిస్తుంది. మానవ సంబంధాల రాగ గీతాలు చదివితే మనసులు పరిశుద్ధమవుతాయి. మనం మనుషులం. ప్రకృతిలో పడి పరవశంలో తేలుతాం” నందిని సిధారెడ్డి అన్నట్లుగా.

”జానపద సంస్కృతికి మూలభూతమైనది-జానపదుల మతం. మానవాతీత శక్తులపై ఉన్న నమ్మకం జానపదుల మతం పుట్టుకకు కారణమైంది. జీవితకాలంలో అనేక నిస్పృహలకు, నిరాశలకు లోనవుతున్న జానపదునికి మతం అనేది చైతన్యాన్ని కలిగించింది. అంతేకాదు మానవ సంస్కృతిని వెల్లడి చేసే రకరకాల ఆచరణలకు మతం సమాధానమిస్తుంది” అని విద్యావతి అభిప్రాయపడ్డారు.

దేవకీదేవి కూర్చిన ఈ గ్రంథం ‘బతుకమ్మ మీద శతపత్రం’ అమ్మంగి వేణుగోపాల్‌ అన్నట్లుగా. జానపద పరిశోధన క్షేత్ర పర్యటనతో ముడిబడి నిగ్గుతేలుతుంది.

ఈ పండుగ కాకతీయ రుద్రమదేవి కాలం (క్రీ.శ. 13వ శతాబ్దం)లో ప్రారంభమై ఉంటుందని రచయిత్రి ప్రస్తావించారు. వివిధ ప్రాంతాలలో వివిధ దేశాలలో పూలతో అనుసంధానం చెందిన పండుగలు ఉన్నాయి. మన బతుకమ్మకూ ఆ పండుకలు, వేడుకలకూ పోలికలు కనిపిస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో జరుపుకునే ‘గొబ్బెమ్మ’ పండుగకూ బొడ్డెమ్మకూ, కేరళీయులు జరుపుకునే ‘ఓనమ్‌’ పండుగ, కొలంబియా దేశంలో మెడిలిన్‌ నగరంలో జరిగే పూలపండుగ, బెల్జియం దేశంలో పూల తివాసి ఉత్సవాలను రచయిత్రి ప్రస్తావించారు.

బతుకమ్మ కళాత్మకతకు చెందిన ఆటపాటల పూల పండుగ. ఇది మన తెలుగు ప్రాంతాల సంస్కృతికి భిన్నమైనది. కేవలం తెలంగాణాకే ప్రత్యేకమైనది. ఈ పండుగ ఆవిర్భవించి శతాబ్దాలుగా విలసిల్లుతున్నది తెలంగాణా ప్రాంతంలోనే.

బతుకమ్మను ‘మట్టిపూల కవాతు’ అంటారు కె.విమల. స్త్రీలు ఆదిమ కాలం నుండే పాటను పుట్టించి ప్రాణం పోస్తూ వస్తున్నారు. ”పాట పనిలోంచి పుట్టిందన్నమాట మనం వింటూనే ఉంటాం. అట్లాగే పనిపాటల్లో ‘ఆటవిడుపు’ పాట కొనసాగడం కూడా చూస్తూనే ఉన్నాం. అన్ని సందర్భాలలోనూ ‘పాట’ స్త్రీలకు తమ గాథలను, బాధలను కలబోసుకునే సమిష్టి వ్యక్తీకరణ రూపం తీసుకోవడం అన్ని భారతీయ భాషల మౌఖిక సాహిత్యాల్లోనూ గమనించవచ్చు. అట్లా చూసినప్పుడు ‘పాట’ సామాజిక చరిత్రలో స్త్రీల సంవేదనలను పట్టి చూపే ‘అథెంటిక్‌ రికార్డు’ గా కనిపిస్తుంది” అంటారు కె.విమల.

సందర్భాన్ని అనుసరించి తమ సంవేదనలను, ఊహలను వ్యక్తీకరించేది స్త్రీలే. అందువల్ల జనం నోళ్ళలో ఆడే పాటలకు సృష్టికర్తలు స్త్రీలే అని నిర్ధారిస్తారు విమల.

ఈ గ్రంథం 487 పుటలతో నిండుగా ఆవిష్కృతమైంది. ఈ పరిశోధన రచయిత్రికి ప్రీతిపాత్రమైనది. ఈ పుస్తకంపై చాలా పరిచయం, విశ్లేషణతో రాయవచ్చు. నేను ఎక్కువ దూరం వెళ్ళకుండా కొన్ని విషయాలే ప్రస్తావించాను. ఈ గ్రంథాన్ని పూర్తిగా చదివితే కానీ స్త్రీల లోకానికీ, పూల ప్రపంచానికీ మన యాత్ర సఫలీకృతమవుతుంది.

తొమ్మిది రోజులు తీరొక్క పూలు, తీరొక్క పాటలతో సేద దీరిన తరువాత బతుకమ్మను సాగనంపే పాట పంక్తులతో ఈ పరిచయ వ్యాసాన్ని ముగిస్తాను.

‘తంగేడు పూవుల్ల చందమామ బతుకమ్మ పోతుంది

చందమామ

పోతేపోతివి గాని చందమామ మల్లెప్పుడొస్తావు

చందమామ

యాడాదికోసారి చందమామ నువ్వొచ్చి పోవమ్మ

చందమామ’

ఈ విధంగా పూల పేర్లను మార్చుకుంటూ పాడుతూ ఒకే శిల్పాన్ని కొనసాగిస్తూ మళ్ళీ రమ్మని తమ ఆకాంక్షను ప్రకటిస్తూ తమ దేవత మాత్రమే కాదు తమ శ్రేయోభిలాషి, కుటుంబ సభ్యురాలు, తమ ప్రియ నేస్తం, తమ సమస్తం అయిన ఆత్మీయురాలిని సాగనంపుతారు స్త్రీలు! ప్రకృతితో మమేకమవుతారు స్త్రీలు!

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.