దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ – అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…)

చింతామణీ – నేనూ

దుర్గాబాయి స్వయంగా రాసుకొన్న తన జీవిత సంక్షిప్త చరిత్రకు ఈ పేరు పెట్టింది. అంటే ఇది ఆమె ఆత్మ కథ. చింతామణి దేశ్‌ముఖ్‌ కూడా స్వీయ చరిత్ర రాసుకున్నారు. దాని పేరు ‘ది కోర్స్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ (నా జీవన స్రవంతి) అని పెట్టుకున్నారు. దుర్గాబాయి రాసిన ఆత్మకథా, చింతామణి రాసిన స్వీయ చరిత్ర పరస్పర పరిపోషకంగా వారి గొప్ప జీవితాలను ప్రతిబింబింపచేస్తున్నాయి. గంగా యమునల కూడలి లాగా నవీన భారత దేశ పుణ్యతీర్థ చారిత్రక ప్రాధాన్యత వారి జీవితాలకు ఉన్నది. తన సంక్షిప్త ఆత్మకథలో ఆమె తన చిన్ననాటి జీవితాన్ని, ఉద్యమ శీలతను, పూర్వగాథలను సంగ్రహంగా వివరించింది. 1953లో చింతామణి దేశ్‌ముఖ్‌ను వివాహమాడిన తర్వాత 28 ఏళ్ళు ఆయన జీవితంతో తన జీవితం ఎలా కలిసిపోయిందో వివరించింది. ప్రాస్తావికంగా దేశ్‌ముఖ్‌ కుటుంబ నేపథ్యమూ, ఆయన మేథాపరిణతి, ఆయన ఇంగ్లండు చదువులూ, ఇంగ్లండులో ఉండగా ఆయన చేసుకొన్న మొదటి వివాహం, వాళ్ళ దాంపత్య జీవిత వైఫల్యం, వాళ్ళకు కలిగిన కూతురితో చింతామణి వియోగ పరితాప వృత్తాంతం సంగ్రహంగా ఆమె ప్రస్తావించింది. తరువాత ఆయన జీవితంలో తాను వెలితిని పూరించిన వృత్తాంతాన్ని వారి సామాజిక సేవ, సంస్థా నిర్మాణం ప్రవక్తం చేసింది.

తాను పాటించిన జీవిత పరమార్థాన్ని, తన ఆదర్శాలను, ఆశయాలను, విలువలను, అంకితభావాన్ని ఆమె ఈ గ్రంథంలో సూక్తీకరించింది. ఆమె అంటుంది ‘లక్షలు, కోట్లు వెచ్చించినా సాధించలేని ఫలితాలను, సదాశయాలను, సత్కార్యాలను, చిత్తశుద్ధి, నిజాయితీ, ఆత్మార్పణం, శ్రద్ధ విశ్వాసాలు గల సాధనపరులు నెరవేర్చగలరని నాకవగతమైంది. సేవాతత్పరులు, అంకితభావంతో పనిచేసేవారూ ఏ సంస్థకైనా, దేశానికైనా వెన్నెముకలాగా పనిచేస్తారు’. ఆమె తన మహత్కార్యాలన్నింటికీ, తనకు విశ్వాసపాత్రులు, తనను విశ్వసించినవారే కారణం అని పదే పదే చెప్పేవారు.

ఆమె ప్రబోధాలలో ముఖ్యమైనది ‘నిరాడంబర జీవితం, ఉదాత్త ఆలోచనలు’ కావాలనడం. భౌతిక సంపదను కాంక్షించి దానికోసం పరుగులెత్తే మానవుడికి తృప్తి, సౌఖ్యమూ ఉండవని ఆమె అనేవారు. ”సౌకర్య లాలస, సుఖ జీవన కాంక్ష మనిషి సంస్కారాన్ని దూషితం చేస్తాయి. నిజమైన ఆనందం సచ్ఛీలం, సత్ప్రవర్తన, నిష్కల్మషమైన మనస్సు వల్లనే సమకూడుతాయి” అని తన అనుభవ పరిశీలనగా ఆత్మకథలో చెప్పారు. చిన్న చిన్న ఉపకారాలు కూడా చేసిన వారికీ, పొందిన వారికీ హాయినీ, సంతోషాన్నీ కలిగిస్తాయి. తృప్తిగా ఉండడమే అన్నింటినీ మించిన సంపద. అది కావాలి, ఇది కావాలి అని వెంపర్లాడడం మానవ జీవితంలో అసంతృప్తికి మూలకారణం. అసూయ, అత్యాశ దుఃఖ కారకాలు. ఇతరుల గురించి పోటీ మనస్తత్వం కానీ, అసూయ కానీ ఉండకూడదు అంటారామె. ఏ విషయంలోనైనా యథార్ధంగా మాట్లాడాలి, ఆత్మసాక్షిగా ప్రవర్తించాలి. చేయదలచుకున్న మంచి పనిని వెంటనే ప్రారంభించాలి. కానీ సమయం, సందర్భం, అదను కోసం వేచి చూడడం ఎందుకు? అనేది ఆమె నమ్మకం. ఒకరికి ఏదైనా ఒక మేలు జరిగేలా మనం నడుచుకోవాలి. అటువంటి అవకాశాన్ని ఎప్పుడూ ఉపేక్షించకూడదు.

ఏదైనా మంచి పనో, ఒకరికి ఏదైనా సహాయమో చేయగలిగితే దాన్ని గురించి త్వరగా మర్చిపోవాలి. ప్రత్యుపకృతిని ఎంత మాత్రం ఆశించవద్దు. వాళ్ళు కృతజ్ఞత చూపాలని కూడా అనుకోకూడదు. మంచి చేసి మరచిపోతే ఆ మంచి ఎప్పుడో ఎక్కడో నీకు ఎదురవుతుంది అనేది ఆమె చెప్పిన మంచి సూక్తి. ఆధునికతను స్వాగతించాలి, ఆదరించాలి. సంప్రదాయాన్ని అభిమానించాలి, గౌరవించాలి. ఆధునికతను ఆచరించాలి, సంస్కృతిని నిలుపుకోవాలి అని దుర్గాబాయి సమన్వయ ఆశయం. భారతదేశ సంస్కృతి, మానవ జీవన ఉదారాశయాలు విస్మరించవద్దని ఆమె ప్రబోధం. విదేశీ నాగరికత వ్యామోహం ఎందుకు? అంటుంది దుర్గాబాయి. నాగరికత కట్టూబొట్టూ, వేషమూ, భాష ఎవరినో అనుకరించిన మాత్రాన అలవడదు, అది ఆధునికతకు సమానార్థకం కాదు. నవీన విజ్ఞానాన్ని నిజ జీవితంలో వినియోగించుకోవాలి. జీవన విధానాలను, ఆలోచనలను, అంధానుకరణంగా అనుసరించకూడదు. చిరకాలానుగతంగా వస్తున్న మంచి విశ్వాసాలను, సాంస్కృతిక సంప్రదాయాలను పాటించాలి.

మానవ ప్రయత్నానికి ఆసాద్యమైనదేదీ లేదు, ఉండకూడదు. అయితే అది సచ్చింతతో, సదాశయంతో కూడి ఉండాలి. ఏ దేశానికైనా, ఏ జాతికైనా ఉత్థాన పతనాలు తప్పవు. మనతోనే మన ఆదర్శాలు, ప్రయత్నాలు ఆగిపోవు. అవి నిరంతరం సాగుతూనే

ఉంటాయి. వ్యక్తిగాదు ప్రధానం, జాతిలోని జీవశక్తి ముఖ్యం. మనుషుల జీవిత కాలం పరిమితం. ఆదర్శాల ఫలసిద్ధి అపరిమితం. ఈ విశ్వాసమే నా సకల ప్రయత్నాలలోనూ నా సహచరులను, చైతన్యవంతులైన కార్యకర్తలను గుర్తించడంలో నాకు తోడ్పడింది అని ఆమె స్వీయ చరిత్రలో చెప్పారు.స్వాతంత్య్రం రాకముందు, స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సమాజహిత చింతకులలో, సేవాపరాయణులలో ఆమె ప్రముఖురాలు. ఈ కాలపు పదిమంది ప్రధాన ఉద్యమ నిర్మాణ సంధాతలలో ఆమె ఒకరు.

‘చింతామణి-నేను’ భారతీయ మహిళ రచించిన స్వీయ చరిత్రలలో అగ్రగణ్యం. దీంతో పోలికకు తేగల ఇంకొక స్వీయ చరిత్ర లేదనే చెప్పాలి. ప్రపంచ మహిళోద్యమ వికాస చరిత్రలోనే ఆమెకు సాటి రాగల సమాజ పునర్నిర్మాణం చేసిన వారు ఇంకొకరు లేరు. భారతదేశానికి సంబంధించినంత వరకు ఆమె పర్యటించినన్ని విదేశాలు పర్యటించిన వారు మహిళల్లో ఇంకొకరు లేరు. సమాజ సంక్షేమం గురించి ఆమె సమర్పించినన్ని నివేదికలు, అధ్యయన పత్రాలు, సమీక్షలు వెలువరించిన వారు కూడా ఇంకొకరు లేరు.

ఆమెను తెలిసినవారు గృహిణీ ధర్మ నిర్వహణలో కూడా ఆమెకు సాటి రాగల వారు లేరని అంటారు. ఆమెది కళాత్మక హృదయం. తోట పనిలో నిపుణురాలు. చింతామణి దేశ్‌ముఖ్‌ జీవితంలో ఆమె శాంతిని, కాంతిని కలుగజేసింది. దేశ్‌ముఖ్‌ తన యవ్వనోద్విగ్న జీవిత దశలలో ఎన్నో ఒడిదుకులను అనుభవించారు. ఆయన కూడా స్వాతంత్య్రోద్యమంలో తీవ్ర అభినివేశంలో పాల్గొనే ఆకాంక్షతో లోకమాన్య తిలక్‌ మహాశయుడి ఆమోదాన్ని కోరినట్లు, తిలక్‌ మహారాజు ఆ ఉద్యమపరత నుంచి ఆయనను శాంతింపచేసినట్లు దేశ్‌ముఖ్‌ స్వీయచరిత్రలో చెప్పారు. ఇంగ్లాండులో ఒక వ్యాజ్యం నడపడానికి తిలక్‌ మహాశయులు ఆ దేశం వచ్చినప్పుడు చింతామణి దేశ్‌ముఖ్‌ ఆయనను కలుసుకున్నారు. తిలక్‌ మహాశయులు ఆయనకు బోధించిన హితవు ఏంటంటే భారతదేశానికి స్వాతంత్య్రం సత్వరమే రాకపోయినా, రేపో మాపో రాక తప్పదు. అప్పుడు ప్రతిభా పరిపూర్ణులైన ప్రభుత్వ నిర్వహణదక్షుల అవసరం ఎంతో ఉంటుంది. అందుకు నీవు సర్వవిధాల తగినవాడవు. ఇక స్వాతంత్య్రోద్యమాన్ని నడిపేవారు భారతదేశంలో ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇంకా ఎంతోమంది వస్తారు. కానీ పరిపాలనా దక్షులైనవారు, ప్రజ్ఞాశీలులైనవారు స్వాతంత్య్ర సిద్ధి తర్వాత భారతదేశానికి ఎంతోమంది కావలసిన అవసరం

ఉంటుంది. కాబట్టి నీవు స్వాతంత్య్రోద్యమంలో పనిచేసే ఊహ పెట్టుకోవద్దు అని లోకమాన్య తిలక్‌ నచ్చచెప్పారట. స్వాతంత్య్రోద్యమ జ్వలితచేతనతో ఆ కర్తవ్యాన్ని, ఆ బాధ్యతను నిర్వహించిందీ, నిర్వర్తించిందీ దుర్గాబాయి. అనంతర కర్తవ్యాన్ని నెరవేర్చినవారు చింతామణి. ‘శివశ్శక్త్యాయుక్త్యా’లాగా వారి దాంపత్యం శోభించింది. ఈ విషయమే దుర్గాబాయి స్వీయచరిత్ర ప్రతిపాదిస్తోంది.

మానవతామూర్తి – స్ఫూర్తి

నదులన్నీ ఎందరో జనుల క్షుత్‌పిపాసల ఆర్తిని తీర్చి ప్రవహించి ప్రవహించి సముద్రంలో లీనమై తమ నామరూపాలను వదిలివేసినట్లే ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు సమాజసేవలో లీనమై తమకేమీ మిగుల్చుకోరు అంటోంది ఉపనిషత్తు. దుర్గాబాయి జీవితానికి ఈ ఉపనిషత్తు కొంతమేర వర్తిస్తుంది. ‘యథానద్యః స్యందమానాః సముద్రః గచ్ఛంతి…’ ఎందరో వదాన్యులు, దుఃఖితులు, దీనులు ఆమె ఆశ్రయం పొంది ఉపశమనం పొందేవారు. తమ ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుని వెనిగళ్ళ సత్యనారాయణ, లక్ష్మీపార్వతి దంపతులు పోలియో వ్యాధి బారిన పడిన వారి కోసం దుర్గాబాయి ద్వారా ఒక చికిత్సా కేంద్రం నెలకొల్పారు. అది ఈశ్వరప్రసాదశల్య చికిత్సా కేంద్రం. తమ కుమారుడికి స్మారక చికిత్సాలయంగా లక్ష రూపాయల విరాళం ఇచ్చి దుర్గాబాయి చేత ఈ చికిత్సా కేంద్రాన్ని (శల్య వ్యాధి చికిత్సాలయం) ఆ దంపతులు నిర్మింపచేశారు. చిన్నతనంలోనే ఈ వ్యాధికి గురయిన వారెందరికో ఈ చికిత్సా కేంద్రం ద్వారా సేవలందింపచేసింది దుర్గాబాయి. మద్రాసు నగరంలో ఎవరింట పని పాటలు లేకుండా బాలికలున్నారని తెలిసినా వారిని ప్రోత్సహించి మహిళా సభలో చేర్పించి వారి జీవితాలు సమాజ ప్రయోజనానికి కళాత్మకంగా తీర్చిదిద్దేది దుర్గాబాయి. జమునా బాయి, కమలా బాయి అనే అక్కచెల్లెళ్ళు ఆమె అండతో అనంతర కాలంలో సమాజ సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. వితంతువులను ఎందరినో చేరదీసి చదువు సంధ్యలు నేర్పి వారి జీవితాలకు స్వావలంబన కలిగించారు దుర్గాబాయి. తోడు నీడ లేని వారికెందరికో ఆటపాటలు నేర్పించి బతుకు తెరువు చూపారు.

దుర్గాబాయిని గురించి రాసిన ఏ జీవిత చరిత్రలోనూ స్పృశించని ఆమె పరోపకారశీలతను తెలియచేసే ఒక

ఉదంతం ఉంది. గోదావరి జిల్లాలో స్వాతంత్య్రోద్యమ కాలంలో ముదిగంటి జగ్గన్నశాస్త్రి ఎన్నో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించి త్యాగజీవనుడిగా పేరు తెచ్చుకున్నారు. స్వాతంత్య్ర యోధుడిగా గుర్తింపు పొందారు. పల్లెటూరి గ్రంథమండలి కొంతకాలం నిర్వహించారు. సార్వజనిక ఎన్నికలప్పుడు ఆయననందరూ విస్మరించారు. ఆయన ఏదైనా ప్రయత్నం చేస్తే ఫలితముంటుందేమోనని ఢిల్లీ వచ్చారు. దుర్గాబాయిని కలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందేమోనని ఆమెను కలుసుకోవటానికి ప్రయత్నించారు. కానీ ఆయన నిరాడంబరుడు. అందుకు కావలసిన దారీతెన్నూ కూడా తెలియనివాడు. అందువల్ల అప్పట్లో ఢిల్లీలో భౌతిక విజ్ఞాన కేంద్రం సంస్థలో (నేషనల్‌ ఫిజికల్‌ లేబరేటరీస్‌) ఉన్నతాధికారి పదవి నిర్వహిస్తున్న స్వామి జ్ఞానానందను కలుసుకున్నారు. స్వామి జ్ఞానానంద బాల్యంలో శాస్త్రి గారి సహాధ్యాయి. అప్పటికే స్వామి విదేశాలలో భౌతిక పరమాణు విజ్ఞానంలో గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. జవహర్‌లాల్‌ నెహ్రు ఆహ్వానంపై ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలి భారతీయ వైజ్ఞానిక రంగాన్ని ఆధునికావసరాలకు పటిష్టంగా రూపొందించడానికి తన విజ్ఞానాన్ని వినియోగించడానికి ముందుకు వచ్చిన గొప్ప దేశభక్తుడాయన. జవహర్‌లాల్‌కు ఆయనంటే గొప్ప గౌరవం.

జగ్గన్న శాస్త్రి గారు స్వామీజీని కలుసుకోగా, ఆయన ఇటువంటి విషయాలలో ఏమీ పరిజ్ఞానం లేనివారు కనుక శాస్త్రిగారిని దుర్గాబాయి నివాసానికి తీసుకువెళ్ళారు. ఆమె స్వామీజీకి భక్తి ప్రపత్తులతో వందనం చేసి తనకు కబురుచేస్తే తానే వచ్చేదాన్ని కదా అని శాస్త్రిగారిని కూడా ఆదర గౌరవాలతో ఉపచరించింది. తర్వాత శాస్త్రిగారిని అందుకు సంబంధీకులైన పార్టీ ప్రముఖుల వద్దకు తీసుకువెళ్ళింది. ఆయనకు ఎన్నికలలో పోటీ చేయడానికి కావలసిన గుర్తింపు కోసం ఎంతో సహకరించింది. కానీ ఆయనకు టికెట్‌ మాత్రం లభించలేదు. ఈ విషయం ముదిగంటి జగ్గన్న శాస్త్రి గారు స్వామి జ్ఞానానంద జీవిత చరిత్రకు పరిచయ వాక్యాలు రాస్తూ స్మరించుకున్నారు.

ఢిల్లీలో 1950వ దశకంలో బొడ్డపాటి వెంకట త్రివిక్రమరావుగారు ఆలిండియా రేడియోలో సాంకేతిక విజ్ఞానాధికారిగా పనిచేసేవారు. లేజర్‌ విజ్ఞాన శాస్త్రంలో ఆయన ఎంతో కృషి చేశారు. ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటీ వారి కార్యక్రమాల కోసం ఆహ్వానించడానికో, ఆయనకేదైనా బాధ్యతనప్పగించడానికో దుర్గాబాయమ్మ స్వయంగా రావుగారింటికి వెళ్ళింది. రావుగారిది అప్పట్లో కొత్త కాపురం. భార్యాభర్తలు సంభ్రమంగా దుర్గాబాయమ్మను ఇంట్లోకి ఆహ్వానించి పరిచయ వాక్యాలు పలికారు. అప్పుడు దుర్గాబాయమ్మ ‘అమ్మాయీ! నీకు గోంగూర పచ్చడి చేయడం తెలుసా?’ అని అడిగింది. ‘అమ్మా! తెలుసుగాని ఢిల్లీలో మంచి గోంగూర లభించడం కష్టం కదా!’ అని ఆమె బదులిచ్చింది. ‘పిచ్చిదానా! మా ఇంట్లో విశాలమైన పెరడులో కావలసినంత గోంగూర ఉంది. ఒకసారి వచ్చి తీసుకొని వెళ్ళమ్మా’ అని చనువుగా చెప్పింది. ఆమె కలుపుగోలుతనానికి, ప్రేమాభిమానాలకు దంపతులిద్దరూ సంతోషించారు. కానీ దుర్గాబాయమ్మ గారింటికి వెళ్ళడానికి మొహమాటపడ్డారో లేక దూరాభారమో, లేక వెంటనే ఆయనకు తీరిక చిక్కకనో వెళ్ళలేకపోయారు. వారం రోజుల తర్వాత ఒక ఆదివారం ఒక పెద్ద గోనె సంచి నిండా గోంగూర నింపుకుని దుర్గాబాయమ్మే వారింటికి వచ్చి ఆ దంపతులను సంభ్రమాశ్చర్యానందాలలో ముంచివేసింది అని రావుగారు దుర్గాబాయమ్మ ప్రసక్తి వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు. రావుగారు ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్‌లో విశ్రాంత జీవనం గడపడానికి వచ్చిన తర్వాత దుర్గాబాయమ్మ, దేశ్‌ముఖ్‌ దంపతుల నివాస గృహమైన ‘రచన’కు దగ్గర్లోనే ఉండేవారు. తరువాత కాలంలో ఆ దంపతులకు వారు ఇష్టాగోష్ఠి సన్నిహితులయ్యారు. ఢిల్లీలో ఆంధ్ర విద్యాసమితికి ఆమె చేసిన సేవ అపారం అంటారు రావుగారు.

”దుర్గాబాయిలో ఉత్సాహపు పాలెక్కువ. ఆవిడ ఒంటరిగా ఎప్పుడూ జీవించలేదు. అనామకంగా గడపలేదు. అడవిలో ఉన్నా పశుపక్ష్యాదులకు మాటలు నేర్పి వాటి సంజ్ఞలు తను నేర్చుకుని రాణించగల నేర్పూ, ఆసక్తీ ఆమెకున్నాయి” అని శివలెంక కామాక్షమ్మగారన్నమాట అక్షరాలా నిజం. 1934లో గోరా ఆమె నివాసానికే వచ్చి ఆమెకు చదువు చెప్పేవారు. ఒకరోజు సాయంత్రం ఎప్పటిలాగా ఆయన వారింటికి వెళ్ళారు. ఆమెకు హిందీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, వారిని అభినందించాల్సిన, ప్రబోధించాల్సిన అత్యవసర సమావేశం ఒకటి అప్పుడే ఎదురయింది. ఇప్పుడంటే ఇప్పుడే వస్తానని ఆయన అనుజ్ఞతో ఆమె ఆ సమావేశానికి వెళ్ళింది. కానీ అనుకోకుండా ఆ సభకు అధ్యక్షస్థానం వహించాల్సి వచ్చింది. గోరాగారు ఆమె వస్తుందని ఎదురుచూసి ఇంటికి వెళ్ళిపోయారు. రేపు వస్తానని చీటీ రాసిపెట్టి వెళ్ళారాయన. రెండు, మూడు గంటల తర్వాత ఏ పది గంటల ప్రాంతంలోనో దుర్గాబాయి మేష్టారింటికి వెళ్ళి క్షమాపణలు అర్థించింది. రేపు మనం కలిసినప్పుడు చెప్పవచ్చు కదా ఈ మాటేదో అని ఆయన అంటే ఆయనను అంతసేపు నిరీక్షింపచేసినందుకు ఆమె ఎంతో నొచ్చుకుంది. 1942లో గోరాగారి సంతానాన్ని మద్రాసుకు పిలిపించుకుని వాళ్ళ చదువు బాధ్యత వహించింది దుర్గాబాయి.

ఆమె గొప్ప దైవభక్తిపరురాలు. ఆత్మచింతనాశీలురాలు. గాంధీజీ ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినప్పుడు రాజమండ్రి దగ్గర సీతానగరం గౌతమీ సత్యాగ్రహాశ్రమంలో ఆదివారం ఆయన వీలైనప్పుడల్లా విశ్రాంతి తీసుకునేవారు. ఆ రోజు ఆయన మౌనవ్రతం పాటించేవారు. అప్పట్లో దుర్గాబాయి ఆయన వెంట ఉండి గాంధీజీకి అన్నపానాలను ప్రత్యేక శ్రద్ధతో సమకూర్చేవారు. ఆయనకు మానసిక విశ్రాంతి కోసం, పని వత్తిడిల నుంచి విరామం కోసం వీణ వాయించడం, త్యాగరాజ స్వామి కీర్తనలు ఆలపించడం చేసేది దుర్గాబాయి అని ఆమె జీవిత చరిత్రకారులు రాశారు. త్యాగరాజస్వామి కీర్తనలంటే గాంధీజీకి చాలా ఇష్టమని కూడా ఆ జీవిత చరిత్ర రచయిత్రి ఉటంకించారు. మధుర జైలులో ఆమె గడిపిన ఏకాంత ప్రవాస దుర్భర శిక్ష కాలంలో హంతకురాండ్రయిన ఇద్దరు స్త్రీల నుంచి పసిబిడ్డను ఆమె కాపాడిన సంఘటన ఆమె మానవత్వానికి పరాకాష్ట. ఆమె ధైర్యసాహసాలు, ఆర్ద్ర హృదయానికి గొప్ప తార్కాణం.

చివరి మూడు దశాబ్దాలు

దుర్గాబాయి జీవితంలో చివరి మూడు దశాబ్దాలు భారత స్వాతంత్య్రోద్యమంలో ఆమె నిర్వహించిన పాత్రను మించి, నవభారత నిర్మాణంలో ఆమె నిర్వహించిన పాత్ర ఉజ్వలమైనది. పది పన్నెండేళ్ళ వయసు నుంచే ఆమె సమాజ జీవనంతో మమేకమైంది. స్వాతంత్య్రోద్యమంతో తాదాత్మ్యం చెందింది. మొదటి మూడు దశాబ్దాలు త్యాగభరిత సాహస చైతన్యం ఆమె జీవితంలో కనబడుతుంది. చివరి మూడు దశాబ్దాలు సాంఘిక సంక్షేమ కృషి, నవభారత నిర్మాణం దృష్ట్యా ఆమె జీవితంలో చారిత్రాత్మకమైన కాలం.

జవహర్‌లాల్‌ నెహ్రుకు ఆమె పట్ల అభిమానం, గౌరవం, ఆదరణ, వాత్సల్యం కూడా ఉండేవి. మొదటిసారి పధ్నాలుగేళ్ళ బాలికగా ఆమెను కాకినాడ కాంగ్రెస్‌ మహాసభలలో నెహ్రు చూశారు. టిక్కెట్టు లేకుండా ఎవరినీ లోనికి పోనివ్వద్దని కొండా వెంకటప్పయ్యగారు ఆమెను ఆదేశించగా అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనశాలలోకి వస్తున్న నెహ్రునే ఆమె ద్వారం దగ్గర అటకాయించింది. ఆమె చొరవకు, నియమ పాలనకు నెహ్రు ఎంతో మెప్పుదల కనబరచారు. కొండా వెంకటప్పయ్యగారు పరిగెత్తుకుని వచ్చి నెహ్రు తరపున ప్రవేశానుమతి టిక్కెట్టు కొనవలసి వచ్చింది.

రెండోసారి ఆమె నెహ్రును కరాచీ కాంగ్రెస్‌లో కలిసింది. అది 1931వ సంవత్సరం. తాను స్వయంగా జైలులో వడికి నేయించిన నూలు ధోవతులను ఆమె నెహ్రుకు కరాచీ కాంగ్రెస్‌లో బహుకరించింది. అప్పుడామెకు 22 సంవత్సరాల వయసు. అప్పటినుంచి జవహర్‌లాల్‌ నెహ్రుకు దుర్గాబాయిపై ఆత్మీయత, వాత్సల్యమూ పెంపొందాయి.

1950వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి సార్వజనిక ఎన్నికలు జరిగాయి. అప్పటికే దుర్గాబాయి రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది. ఆమె దేశసేవకు అకుంఠితమైన దీక్షతో తనను తాను అర్పించుకున్న వ్యక్తిగా ఆయన గ్రహించారు. ఎన్నికలలో ఆంధ్రదేశం నుంచి పార్లమెంటుకు పోటీ చేయవలసిందిగా ఆమెను ప్రోత్సహించారు. ఆమె ఎన్నికల్లో గెలిస్తే బాధ్యతాయుతమైన మంత్రి పదవిని ఇవ్వవచ్చని ఆయన ఆశయమై ఉండవచ్చు. కానీ లోకంలో జరిగే ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలలాగా రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసిన దుర్గాబాయి ఓటమి పాలయింది. తన జీవిత కార్యక్షేత్రంలో ఆమె ఏనాడూ ఓటమిని ఎదుర్కోలేదు. ఆమె స్థితప్రజ్ఞురాలు. అప్పటికే ఆమె ప్రతిభావంతురాలైన లాయరుగా పేరు తెచ్చుకుంది. ఆంధ్ర మహిళా సభను అనేక విధాలుగా తీర్చిదిద్దుతోంది, అభివృద్ధి చేస్తోంది.

రాజ్యాంగ సభ నిర్వహణ సమావేశాలు కూడా ఇంచుమించు 1950 నాటికి ముగింపు దశకు చేరాయి. మద్రాసు వెళ్ళి తన లాయర్‌ వృత్తి, సాంఘిక కార్యకలాపాలను మరింత దీక్షతో కొనసాగించాలని ఆమె ఆశిస్తోంది. ఆ మాటే ఆమె నెహ్రుతో రెండు మూడుసార్లు ప్రస్తావించింది. కానీ నెహ్రుకు ఆమె ఢిల్లీ విడిచి చెన్నపట్నం వెళ్ళి తన వృత్తిలో నిమగ్నం కావడం ఇష్టం లేదు. అయితే ఆమెకు ఎటువంటి పాలనా బాధ్యతను అప్పగించాలో వెంటనే తోచక ఆలోచనలో ఉండిపోయారు. ఇంతలో విజయలక్ష్మీ పండిట్‌ నాయకత్వంలో నవచైనా సుహృద్భావ పర్యాటక బృందం బయలుదేరింది. అందులో దుర్గాబాయిని సభ్యురాలిని చేసి ఆరువారాలు చైనాలో పర్యటించి రావలసిందిగా నెహ్రు ఆమెను కోరారు. అది ఏప్రిల్‌ నెల కాబట్టి జూన్‌లో కానీ కోర్టు పనులు ప్రారంభం కావు కాబట్టి ఆమె ఆనందంతో నెహ్రు ప్రతిపాదనను అంగీకరించింది. ఆమె చైనా పర్యటనలో అనేక విషయాలు, అక్కడి ప్రజా జీవనం, పాలనా పద్ధతులు, గృహ వివాద పరిష్కరణ పద్ధతులు అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించింది. దాన్ని పార్లమెంటు సభ్యులంతా ప్రశంసించారు.

అంతేకాక తరువాత కాలంలో నెహ్రు అప్పచెప్పిన పనిని ఆమె ఎంతో జవాబుదారీ తనంతో నిర్వహించింది. 1952 రాయలసీమ ప్రాంతంలో ఘోరమైన క్షామం సంభవించింది. ఆ కరవుపీడిత ప్రజల సహాయ కార్యక్రమాల నిమిత్తం నెహ్రు ఆమెకు ప్రధాన మంత్రి నిధి నుంచి పాతిక వేల రూపాయల చెక్కు ఇచ్చి కరవు ప్రాంతాలు పర్యటించి వారికి కొంత ఆశ్వాసం కలిగించవలసిందిగా కోరారు. ఆమె ఆరువారాలు క్షామ ప్రాంతాలు పర్యటించి సహాయ చర్యలు వేగవంతంగా జరిగేలా ఆ పనులను పర్యవేక్షించి ఒక నివేదిక తయారుచేసి తనకు అందజేసిన సొమ్ము వినియోగపు లెక్కలను ఆయనకు సమర్పించింది.

భారతదేశాన్ని అన్ని రంగాలలోనూ ప్రణాళికాబద్ధమైన సత్వరాభివృద్ధి సాధించి పటిష్ఠంగా పునర్నిర్మాణం చేయటానికి ప్లానింగ్‌ కమీషన్‌ (ప్రణాళికా సంఘం) రూపొందించింది నెహ్రు ప్రభుత్వం. ఏయే రంగానికి ఎంత నిధి కేటాయించాలి, దశల వారీగా ఆ వినియోగాన్ని ఎట్లా అజమాయిషీ చేయాలి, అభివృద్ధిని ఏ విధంగా మదింపు చేయాలి, అవరోధాలు ఏర్పడితే వాటిని అధిగమించడానికి ఏమి చర్యలు తీసుకోవాలి, అమలు, నిర్వహణ బాధ్యత చూసే యంత్రాంగంపై నియంత్రణ ఎలా ఉండాలి అనే విషయాలను ప్లానింగ్‌ కమిటీ ఎప్పటికప్పుడు నిర్థారిస్తుంది.

పంచవర్ష ప్రణాళికను తొలుత ప్రారంభించినప్పుడు అందులో నలుగురు సభ్యులుండేవారు. ప్రధానమంత్రి, వి.టి.కృష్ణమాచార్యులు, జి.ఎల్‌.నందా, చింతామణి దేశ్‌ముఖ్‌లు. పంచవర్ష ప్రణాళిక పర్యవేక్షణలో సాంఘిక సేవలు అనే అంశం కూడా ఉంది. అంటే సాంఘిక సేవా కార్యక్రమ నిర్వహణ విభాగమన్నమాట. ఈ సాంఘిక సేవా నిర్వహణ దుర్గాబాయికి అప్పగించాలని నెహ్రుకు కోరిక కలిగింది. అలా అమె ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యురాలైంది. ఆమె ప్లానింగ్‌ కమిషన్‌లో చేరేదాకా ‘సోషల్‌ సర్వీసెస్‌’ (సాంఘిక సేవ) అంటే ఏమిటో, దానిని ఏ మంత్రిత్వ శాఖ కింద చేర్చాలో, ఏ పనులు చేపట్టాలో ఎవరూ ఆలోచించలేదు. ప్లానింగ్‌ కమీషన్‌ సభ్యురాలిగా ఆమె జూన్‌ 22, 1952లో నియుక్తురాలైంది.

దేశంలో పేదలు, దీనులు, అసహాయులు, వ్యాధిగ్రస్తులూ, నిరక్షరాస్యులు, సాంఘిక వివక్షకు గురైనవారు ఉంటారు. వారిని ఆదుకోవడమే సాంఘిక సేవా కార్యక్రమం. వెనుకటి కాలంలో ఈ పనిని వదాన్యులు, పుణ్యకార్యతత్పరులు, సంఘసేవాభిమానులు తమ తమ పరిధిలో నిర్వహించేవారు. దానాలు, ధర్మాలు చేయడం, విద్యాలయాలు, పాఠశాలలు నెలకొల్పడం, సత్రాలు ఏర్పాటు చేయడం వంటివి కాస్త కలిగిన కుటుంబాల వాళ్ళు, ఆ మనసు కలిగిన వాళ్ళూ నిర్వర్తించేవారు. ఇప్పుడు ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చింది కనుక ప్రభుత్వమే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపాలి.

మొదటి పంచవర్ష ప్రణాళిక చివరి దశలో దుర్గాబాయి ప్రణాళికా సంఘ సభ్యురాలైంది కాబట్టి, ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏ మంత్రివర్గ విధులలోనూ నిర్దేశం కాలేదు కాబట్టీ, ఈ కార్యక్రమం కింద ఖర్చు పెట్టవలసిన నిధుల గురించి, పద్దులను అంతవరకూ ఎవరూ పట్టించుకోలేదు. అసలు ఆ ఆలోచనే రానీయలేదు తమ మనసులలోకి. దుర్గాబాయమ్మకి ఇది వింతగా తోచింది. బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా సాంఘిక సంక్షేమ కార్యక్రమ నిర్వహణ ఎట్లా? అని ప్రధాన మంత్రి నెహ్రుతోనూ, ఆర్థిక శాఖ మంత్రి సి.డి.దేశ్‌ముఖ్‌తోనూ పర్యాలోచన చేసింది. ఆమె చూపిన సబబుకు అంగీకరించక తప్పింది కాదు వారికి. దాంతో ఆర్థిక మంత్రి దేశ్‌ముఖ్‌ సాంఘిక సంక్షేమ సమితి కార్యకలాపాలకు నాలుగు కోట్ల రూపాయలు సర్దుబాటు కేటాయింపు చేశారు. కేంద్ర సాంఘిక సంక్షేమ వ్యవస్థా సంఘం ఆమె రూపకల్పనయే. దానికి ఆమె 1953లో అధ్యక్షురాలైంది. అది స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా పదేళ్ళు ఆమె ఆలన పాలనలో పనిచేసింది. జాతికి ఎన్నో సత్ఫలితాలను అందించింది.

తన జాతి జనుల సామాజిక సంక్షేమం కోసం ఆమె నిత్యం యోచించింది. ఎన్నో ప్రణాళికలను విరచించింది. వాటి సత్ఫలితాలను జాతికి అందించింది. ముఖ్యంగా నిరాశ్రయులైన మహిళలకు ఆమె స్వావలంబనం, స్వయంకృషి, ఆత్మవిశ్వాసం నేర్పింది. ఆమె చేసిన గొప్ప కృషిలో ఎప్పుడూ ప్రచార ఆర్భాటాన్ని ఆశించలేదు. ఆమెకు అరవై ఏళ్ళన్నా రాకుండానే కామన్‌వెల్త్‌ దేశాల రెండో విద్యా విషయక సదస్సుకు భారతదేశం తరపున హాజరైంది. తర్వాత దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ దంపతులు హైదరాబాద్‌లో స్థిర నివాసం ప్రారంభించారు. ‘భారతదేశంలో రెండు దశాబ్దాల గ్రామీణ జీవిత సంక్షేమ వికాసం’ అనే శీర్షికతో అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌, 71వ సమావేశం ప్రత్యేక సంచికలో ఆమె రాసిన వ్యాసం చాలా విశిష్టమైనది. 385 జిల్లాలుగా అప్పట్లో ఉన్న భారతదేశంలో 285 జిల్లాలలో ఆమె సాంఘిక సంక్షేమ వ్యవస్థ నిర్వాహకురాలిగా పర్యటించింది. చైనా, జపాన్‌, రష్యా, అమెరికా, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌ దేశాలు పర్యటించి అక్కడి మహిళల సాంఘిక స్థితిగతులు, కుటుంబ సమస్యలు, విద్యావకాశాలు అధ్యయనం చేసి నివేదికలు రూపొందించింది.

పది సంవత్సరాలు అఖిల భారత సాంఘిక సంక్షేమ నిర్వహణ మండలి అధ్యక్షురాలిగా ఆమె ఆధునిక మహిళా సమస్యలనెన్నింటినో పరిష్కరించింది. ఆమె ఈ సంఘటన వ్యవస్థ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించేనాటికి సంస్థ 50 వేల రూపాయల లోటుతో సతమతమవుతుండగా ఆమె తన పదవీకాలంలో సంస్థ సర్వ వ్యవహారాలు చక్కదిద్ది, పటిష్ఠంగా రూపొందించిన 5 లక్షల స్థిర చరాస్తుల మిగులు ధనంతో తన తరువాత వారికి అప్పజెప్పింది.

భారతదేశ విభజన సందర్భంగా చెలరేగిన అల్లకల్లోలాలతో కాందిశీకులు, స్థానభ్రంశ నివాసితుల కోసం శరణార్థి శిబిరాలను ఆమె దక్షతతో నిర్వహించగలిగింది. ఇందుకుగాను ఎన్నో కార్యక్రమాలను రూపొందించింది.

1959 నాటికే అంటే ఆమె 50 సంవత్సరాల వయసులోనే ఆమెను ప్రభుత్వం ఏర్పరచిన జాతీయ విద్యా విచారణ సంఘానికి అధ్యక్షురాలిగా నియమించింది. ఆ తరువాత జాతీయ మహిళా విద్యా సంఘానికి ఆమె రెండు సంవత్సరాలు 1960 నుంచి 62 వరకు అధ్యక్షురాలిగా పనిచేసింది. జాతీయ విద్యావికాసానికి ఆమె 180 సూచనలు ప్రతిపాదించింది. మహిళా విద్యా వికాస సత్వరీకరణకు ఎన్నో ప్రణాళికలు రూపొందించింది. 1978లో ఆంధ్ర మహిళా సంస్థ రజతోత్సవాలు జరుపుకున్నప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 700 మంది మహిళాభ్యుదయ సేవా కార్యకర్తలు ఆ ఉత్సవాలలో ప్రతినిధులుగా పాల్గొన్నారు. గ్రామీణ మహిళలకు నిర్దేశించిన అక్షరాస్యత, స్వయం ఉపాధి సముపార్జన రంగాలలో అనేక పథకాలను పరికల్పన చేసి నిర్వహింపచేసింది. నియత విద్యార్జన కాలంలో విద్యాబోధకు కావలసిన కాలవ్యవధిని తగ్గించే విద్యా ప్రణాళికలను ఆమె రూపొందింపజేసింది. సంక్షిప్త విద్యాబోధన ప్రణాళికగా అది మన దేశంలో విజయవంతమైంది. నియత విద్యా పాఠశాలల్లో ఏడేళ్ళు పట్టే విద్యాబోధన స్వరూప స్వభావాలను నాలుగేళ్ళకు సంగ్రహపరచింది. సమీకృతం చేసింది. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు, పేదవారూ, వృత్తి నైపుణ్య జీవనాధారులైన మహిళలకు వృత్తి విద్యాశిక్షణ, ఉపాధి కల్పన సామర్థ్యమూ గల శిక్షణ తరగతులను నిర్దిష్ట కాల పరిమితిలోనే పూర్తి చేసుకోగల సదుపాయాలు, సౌకర్యాలు సృష్టించింది దుర్గాబాయి తన సాంఘిక సంక్షేమ మండలి నిర్వహణ ప్రణాళికల ద్వారా. ఈ సంక్షిప్త విద్యార్జన తరగతులకు హాజరయ్యేవారికి, పోషక భృతి (స్టైఫండ్‌) లభించేట్లు చూసిందామె. స్వచ్ఛంద సేవా సంస్థలకు ఉదారంగా, కట్టుదిట్టంగా సంక్షేమ కార్యనిర్వహణ నిమిత్తం ఆర్థికమైన చేయూత లభించే పథకాలు, ప్రణాళికలు సమర్ధంగా అమలు చేయగల పరిపాలన వ్యవస్థనామె సృష్టించింది. ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలను పదివేలదాకా దేశంలో వ్యవస్థీకరించి సత్ఫలితాలను సాధించిందామె.

జైలు జీవితాన్ని స్వయంగా అనుభవించింది కనుక, ముఖ్యంగా మహిళా ఖైదీల కారాగార నిబంధనలను సంస్కరించే పాలనాపరమైన చర్యలను అమలు చేయగలిగింది. చిన్న మొత్తాల జాతీయ పొదుపు పథకాలను ప్రోత్సహించే నూతనమైన పథకాలను ప్రభుత్వం ద్వారా రూపకల్పన చేసింది దుర్గాబాయి. స్త్రీలకు స్వయం పోషక ఆర్జన పద్ధతులలో శిక్షణ తరగతులు నిర్వహింపచేసింది. బాల్వాడీలు, చేతివృత్తుల శిక్షణ కేంద్రాలు, ప్రసూతి సౌకర్య నిలయాలు, దేశవ్యాప్తంగా మహిళలను ఆదుకొనేలా సాంఘిక సంక్షేమ మండలి వివిధ కార్యక్రమాలను నిర్వహింపజేసింది. అగతిక శిశు సంరక్షణ, పోషణ సంస్థలు, వాళ్ళ కోసం శిశు విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పింది. పదేళ్ళ వయసున 1920లోనే కాకినాడలో జాతీయ హిందీ పాఠశాల నెలకొల్పి నిర్వహించిన దుర్గాబాయి ఆ తర్వాత ఆరు దశాబ్దాల కాలం విద్యాసంస్థలు నెలకొల్పుతూనే ఉంది. స్త్రీ, శిశు, సమాజ సంక్షేమానికి పాటుపడుతూనే ఉంది. ఆంధ్రదేశంలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ఆమె చేతి చలవతో నూరుకు పైగా విద్యాసంస్థలు ఇప్పడు మహిళా, శిశు వికాసానికి పనిచేస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌ నగరంలోనే కాక ఇతర తెలంగాణ జిల్లాలకు కూడా అవి విస్తరించాయి.

ఇటువంటి గొప్ప సంస్థల నిర్వహణలో కాలక్రమాన స్వప్రయోజనపరత్వం, ఆర్థికపరమైన అవకతవకలు, పేరు ప్రతిష్టల వ్యామోహం, స్వచ్ఛంద చారిత అంటూ విమర్శలు సాధారణంగా వినబడే అవకాశం లేకపోలేదు. కానీ దుర్గాబాయి హయాంలో కానీ, ఆ తర్వాత కానీ సంస్థ పాలనా వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా ఆమె జాగ్రత్త తీసుకుంది. ఆమె ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా లేకపోతే ఆమె విరాళాలను స్వీకరించేది కాదు. జమునాలాల్‌ బజాజ్‌ వంటి గొప్ప స్వాతంత్య్రోద్యమాభిమాని ఆమె బాలికా పాఠశాలకు నిల్వ సొమ్ముగా గొప్ప విరాళంగా ఇస్తానన్నా ఆమ ఎటువంటి ప్రలోభం చూపలేదు. సేవా స్వచ్ఛంద సంస్థలకు పెద్ద మొత్తాలలో నిల్వ సొమ్ము ఉండకూడదనేది ఆమె నమ్మిన సిద్ధాంతం. దానివల్ల సదాశయ రహితులైన వారి దృష్టి ఆకర్షితం కావచ్చు. అందువల్ల చిక్కులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. నిలువ నీరు నాచుకు, పాచికి కారణమైనట్లు సేవా సంస్థలకు నిలువ సొమ్ము అత్యధికంగా ఉన్నప్పుడు కొన్ని అసంగతమూ, అవాంఛనీయమూ అయిన పరిణామాలకు దారితీయవచ్చునని ఆమె అభిప్రాయం.

ఆమె సంస్థా నిర్వహణ జీవనదిని, నిరంతర ప్రవాహ సదృశమైన చలనగతిని పోలి ఉంది. గతిశీలత ఆమె జీవన ధ్యేయం. ఒక్క క్షణం ఆమె వృధాగా గడపలేదు. ప్రణాళికా సంఘం వారి అభ్యర్థనపై భారతదేశంలో సాంఘిక సేవా ప్రగతి అనే విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలలో ఆమె సంపూర్ణాధ్వర్యంలో వెలువరించింది. దాని ప్రధాన సంపాదకురాలుగా దుర్గాబాయి వ్యవహరించింది. భారతదేశంలో సాంఘిక సంక్షేమం, వర్థమాన దేశాలలో సాంఘిక సంక్షేమం, సాంఘిక ఆర్థిక పురోభివృద్ధి (సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌) అనే రెండు సంపుటాలకు కూడా ఆమె సంపాదకత్వం నిర్వహించింది.

భారతదేశంలో సమాజ జీవన పరివర్తన తన సాంఘిక సేవా రంగ కృషి ద్వారా సాధించినందుకు, ఇది భారతదేశపు ఆర్థిక ప్రగతిని సత్వరం చేసినందుకు ఆమెకు పాల్‌ జి.హాఫ్‌మన్‌ పురస్కారం లభించింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం. 46 దేశాల నుంచి సాంఘిక సేవా రంగ ప్రముఖుల పరిగణనలో ఈ గొప్ప పురస్కారం దుర్గాబాయికి లభించింది.

బహుళ సంఖ్యా సాంఘిక సేవా రంగానికి, సమాజ సంక్షేమానికి, ఆధునిక కాలపు ప్రజల విద్యావసరాల పథకాలు, ప్రణాళికల రూపకల్పనలో ఆమె విజ్ఞత, ప్రజ్ఞ, అనుభవమూ రాణించాయి.

ఆమె శేష జీవితం తన భర్త చింతామణి దేశ్‌ముఖ్‌ పరిచర్యలతో హైదరాబాద్‌లో గడిచింది. చివరి రోజులలో ఆమెకు కంటిచూపు సమస్య ఏర్పడింది. అయినా ఆమె జ్ఞాపకశక్తి క్షీణించలేదు. అత్యంత సన్నిహితురాండ్రను ఆమె కరస్పర్శతోనే పోల్చుకొనేది వారు పెదవి విప్పకపోయినా. ఒక సమాజ సేవా రంగ ప్రముఖ వ్యక్తిని గురించి తెలుగులో ఇప్పటికి వచ్చిన జీవిత చరిత్రలలో ఆమె గురించి రాసినవే ఎక్కువ. తెలుగు ప్రముఖులలో మరెవ్వరి గురించీ ఇన్ని జీవిత చరిత్రలు వెలువడలేదు.

1909 జులై 9వ తేదీన జన్మించిన దుర్గాబాయి 1981లో కీర్తిశేషురాలైంది. (సమాప్తం)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.