వ్యవసాయ చట్టాలు ఎవరికి చుట్టాలు – అబ్దుల్‌ వాహెద్‌

భారతీయ జనతా పార్టీపై రైతులు మండిపడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తున్న వాస్తవం. రైతుల ఆగ్రహం ఇప్పుడు బీజేపీకి, ఎన్డీయేలో మిత్రపక్షాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లోని రైతులే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగవలసి ఉంది. రానున్న ఏడాదిన్నర కాలంలో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. రైతుల ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. ఎన్డీయేలో మిత్రపక్షాలు కూడా ఇప్పుడు రైతులకు మద్దతుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.

మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురైన పెద్ద సవాలు ఇది. పైగా ఎన్నికలు జరగవలసిన రాష్ట్రాలు కూడా బీజేపీకి చాలా ముఖ్యమైన రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, అస్సాంలలో అధికారాన్ని కాపాడుకోవాలి. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడుల్లో మిత్రపక్షాల సహాయంతో అధికారాన్ని అందుకోవాలనే పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న పార్టీకి రైతుల నిరసనల సెగ తగులుతోంది. రైతు నిరసనలకు అనేకమంది మద్దతు పలుకుతూ ముందుకు వచ్చారు. గతంలో దేశంలో పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా అనేకమంది తమ అవార్డులను వెనక్కిచ్చేసినప్పుడు బీజేపీ పెద్దలు వారందరినీ అవార్డ్‌ వాపసీ గ్యాంగ్‌ అని పరిహసించారు. దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ తమ దేశభక్తి ప్రదర్శించారు. ఇప్పుడు కూడా అవార్డులను వాపసిచ్చిన వారిని ఫలానా పార్టీకి చెందినవారంటూ తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. తేడా ఏమిటంటే, అప్పట్లో అంటే పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా అవార్డులను తిరిగి ఇచ్చేసిన వారి దేశభక్తినే ప్రశ్నిస్తూ పరిహసించిన వాళ్ళు ఇప్పుడు అవార్డు వాపసీల దేశభక్తిపై మాత్రం నోరు విప్పడం లేదు. అవార్డు వాపసిస్తున్న వారు ఫలానా పార్టీకి చెందిన వారు కాబట్టి వాపసిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

అకాలీదళ్‌కు చెందిన ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌, సుఖ్‌దేవ్‌ సింగ్‌ బింద్రా తమ ‘పద్మ’ అవార్డులను వాపసిచ్చేశారు. భారతదేశానికి మొట్టమొదటి ఒలింపిక్స్‌ పతకం సాధించిన విజేందర్‌ సింగ్‌ కూడా తన రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డును వాపసిస్తానన్నాడు. జాతీయ బాక్సింగ్‌ మాజీ కోచ్‌ గురుభక్ష్‌ సింగ్‌ ద్రోణాచార్య అవార్డును వాపసిస్తానన్నాడు. భారతీయ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా.మోహన్‌ జీ, ప్రముఖ మేధావి డా.జస్విందర్‌ సింగ్‌… ఇలా అనేకమంది తమ అవార్డులను వాపసివ్వడానికి సిద్ధపడుతున్నారు. బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ గతంలో కాంగ్రెస్‌ టిక్కెట్టుపై ఎన్నికల్లో పోటీ చేశాడు తెలుసా అంటూ బీజేపీ నాయకులు ఇప్పుడు అంటున్నారు. ఒక్క విజేందర్‌ మాత్రమే కాదు, అర్జున అవార్డు గ్రహీతలు రాజ్‌బీర్‌ కౌర్‌, గుర్మేయిల్‌ సింగ్‌, కర్తార్‌ సింగ్‌, ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీత అజిత్‌సింగ్‌ ఇలా చాలామంది ఉన్నారు.

మరోవైపు ప్రతిపక్షాలు రైతు నిరసనలకు మద్దతుగా ఏకమవుతున్నాయి. కుల, మత, వివక్ష లేకుండా ప్రజలంతా ఒక్కటవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలో ఉన్న విద్య, వ్యవసాయం, శాంతిభద్రతలు మొదలైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే, పంజాబ్‌కు చెందిన అకాలీదళ్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో దెబ్బతిన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధిపతి కె.చంద్రశేఖరరావు ఇప్పుడు రైతు నిరసనలు ప్రధాన ఆయుధంగా ఢిల్లీ వీథుల్లో బీజేపీతో తలపడడానికి నడుంకట్టారు.

రైతు నిరసనలు మొదలై నెల రోజులు దాటిపోయాయి. ప్రభుత్వానికి, రైతులకు మధ్య ప్రతిష్ఠంబన తొలగలేదు. భారత్‌ బంద్‌ నిర్వహించారు. చర్చలు ఫలితాలు ఇవ్వలేదు. ఎన్డీయే నుంచి వైదొలగిన పాత మిత్రులు కూడా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారు. భారత్‌ బంద్‌కు అనేక పార్టీలు మద్దతిచ్చాయి. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి వెనుకడుగు వేసిన ఉదాహరణలు గతంలో కూడా ఉన్నాయి. 2015లో భూ సేకరణ చట్టంలో మార్పులు చేయడానికి పూనుకుంది. కానీ తీవ్రస్థాయిలో నిరసనలు జరిగాయి. మధ్యప్రదేశ్‌ మాందసార్‌లో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోక తప్పలేదు. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యంగా బెంగాల్‌లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి రైతు నిరసనలు ఎదురుదెబ్బ తీస్తాయా?

రైతులకు ఈ చట్టాల వల్ల ఎంతో ప్రయోజనం ఉందని చెబుతోంది, కానీ ఆ ప్రయోజనాలేవీ రైతులకు కనబడడం లేదు. రైతులు వెనక్కు తగ్గడం లేదు. పంజాబ్‌లో అకాలీదళ్‌ బీజేపీకి దూరమైంది. హర్యానాలో జననాయక్‌ పార్టీ, రాజస్థాన్‌లో రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్‌ పార్టీలు రైతులకు మద్దతు ప్రకటించాయి. ఈ రెండు పార్టీలూ బీజేపీకి మిత్రపక్షాలు. ప్రతిపక్షాలు వ్వవసాయ చట్టాలను వ్యతిరేకించడానకి ఒక్కటవుతున్నాయి. బీజేపీపై ఒత్తిడి పెరుగుతోంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అక్కడి రైతులు ఇప్పుడు నిరసనలో ముందంజలో ఉన్నారు. నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీకి రైతుల ఆగ్రహం శాపమవుతుందా?

ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టించడం వల్లనే ఈ నిరసనలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ‘ది వైర్‌’లో పి.సాయినాథ్‌ రాసిన వ్యాసం ఈ చట్టాలు ఎలాంటివో తెలియజేసింది. ఈ చట్టం ప్రకారం సదుద్దేశ్యంతో తీసుకున్న ఏ చర్య విషయంలో అయినా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, లేదా ఇతరులకు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదని చట్టంలో స్పష్టంగా పేర్కొన్న విషయాలను సాయినాథ్‌ రాశారు. ప్రభుత్వోద్యోగులు సదుద్దేశ్యంతో తమ విధి బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో తీసుకునే చర్యలపై న్యాయపరమైన కేసులు నమోదు కాకుండా రక్షణ కల్పించడం అనేది కొన్ని ఇతర చట్టాల్లో కూడా ఉంది, కానీ ఇక్కడ ఈ రక్షణ మునుపెన్నడూ లేని స్థాయిలో ఉందని ఆయన రాశారు. ”సదుద్దేశ్యం”తో చేసే ఏ పనయినా, లేదా చేయబోయే ఏ పనయినా ఇక కోర్టులో సవాలు చేసే అవకాశం లేదు. ఏ కోర్టుకూ జూరిస్‌డిక్షన్‌ ఉండదు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు, ”అదర్‌ పర్సన్స్‌” లేదా ”ఇతరులు” అనే పదం కూడా ఉంది. ఈ అదర్‌ పర్సన్స్‌ లేదా ఇతరులు ఎవరు? ”సదుద్దేశ్యం”తో చర్యలు తీసుకునే ఈ ఇతరులు ఎవరు? రైతులు నిరసన ప్రదర్శనల్లో వినిపిస్తున్న బడా కార్పొరేట్‌ పేర్లు వింటే ఏమన్నా అర్థం కావచ్చు. అంటే ఎవరిపైనా ఎలాంటి న్యాయపరమైన పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం లేదు. రైతులే కాదు, ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేదు. జోక్యం చేసుకునే అవకాశం లేదు. పౌరహక్కులను ఇంతగా కట్టడి చేసిన చట్టాలివి. చట్టాల్లో

ఉన్న భాషకు సరళంగా అర్థం చెప్పుకుంటే, ఈ చట్టం ప్రకారం నిర్ణయాలు తీసుకునే ప్రతి చిన్న ఉద్యోగి కూడా తనకు తానే న్యాయమూర్తి అయిపోతాడు. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం ఉండదు. ఈ విషయమై ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ కూడా ప్రధానికి లేఖ రాసింది. ఇది ఒకరకంగా జ్యుడిషియల్‌ అధికారాలను అడ్మినిస్ట్రేషన్‌కు అప్పగించడం. ఇది ప్రమాదకరమని, దీనివల్ల జిల్లా కోర్టులపై ప్రభావం పడుతుందని, న్యాయవాదుల పాత్ర లేకుండా చేస్తుందని బార్‌ కౌన్సిల్‌ అభిప్రాయపడింది.

కాబట్టి ఈ చట్టాల వల్ల ప్రభావితమయ్యేది కేవలం రైతులు మాత్రమే కాదు. కానీ ప్రధాన స్రవంతి మీడియాలో ఈ విషయాలేవీ చర్చకు రావడం లేదు. ఎందుకంటే ప్రధాన స్రవంతి మీడియాను కూడా నడుపుతున్నది కార్పొరేట్‌ దిగ్గజాలే. భారతదేశంలోని అతి పెద్ద కార్పొరేట్‌ యజమాని అంబానీ స్వయంగా ఒక పెద్ద మీడియా హౌస్‌కు యజమాని. నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఫోర్త్‌ ఎస్టేట్‌, రియల్‌ ఎస్టేట్‌ రెండూ ఒక్కటైపోయాయి. ఫలితం ఇప్పుడు రైతు నిరసనలను అప్రతిష్టపాలు చేయడానికి, వారిపై బురద జల్లడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంపన్న రైతులు మాత్రమే చేస్తున్న నిరసనలని, ప్రతిపక్షాలు తప్పుదారి పట్టించిన నిరసనలని, ఖలిస్తానీ ఉగ్రవాదుల కుట్ర అని, కాంగ్రెస్‌ మద్దతుదారులు చేస్తున్న నిరసనలని ఇలా నానారకాలుగా వర్ణించడం జరుగుతోంది. పెద్ద పెద్ద పత్రికలు, మీడియా సంస్థల్లో పేరు ప్రతిష్టలున్న జర్నలిస్టులు, సంపాదకులు ఈ చట్టాలను అమలు చేసిన తీరు సరిగ్గా లేదని నసుగుతున్నారే తప్ప చట్టాల్లో తప్పేమీ లేదన్నట్లు మాట్లాడుతున్నారు. భారతదేశాన్ని ఆకాశం ఎత్తుకు చేర్చే గొప్ప చట్టాలే ఇవన్నీ, కానీ సరిగ్గా అమలు చేయలేదంటున్నారు. ఇదే పాత నోట్ల రద్దు జరిగినప్పుడు, జీయస్టీ అమలు చేసినప్పుడు కూడా పాడారన్నది గుర్తుంచుకోవాలి.

ఈ చట్టాలు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారనే ప్రశ్న కూడా మీడియా అడగలేకపోయింది. అలాగే కార్మిక చట్టాలను కూడా అంత హడావిడిగా ఎందుకు చేశారనే ప్రశ్న కూడా ప్రధాన స్రవంతి మీడియా అడగలేదు. మోడీ ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచింది. అలాంటప్పుడు కరోనా మహమ్మారితో జనం సతమతమవుతున్న కాలంలోనే ఈ చట్టాలను ఎందుకు హడావిడిగా చేశారు. కరోనా నేపథ్యంలో, పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి తీసుకోవలసిన అనేక చర్యలు ఉంటే ఈ చట్టాలకు తొందర ఏమొచ్చింది? ఎందుకంటే, ఈ చట్టాలపై వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వానికి తెలుసు. కరోనా కష్టకాలంలో, మహమ్మారి భయాలున్న వాతావరణంలో చట్టాలను చేస్తే నిరసనలు, ఆందోళనలు ఎక్కువగా ఉండవన్నది అసలు ఆలోచన. రైతు సంక్షేమం కోసం నిజంగా అంత ప్రేమ ఉంటే రైతులు ఎప్పటినుంచో కోరుతున్న స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయవచ్చు కదా. 2018లో దాదాపు లక్షమంది రైతులు ఢిల్లీలో పార్లమెంటు వద్ద నిరసన చేశారు. స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేయాలని కోరారు. వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా స్పందించలేదు. రైతులు ఎక్కడైనా, ఎవరికైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని, ఎవరైనా కొనుక్కోవచ్చని, అంతా స్వేచ్ఛగా రైతు తన ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం ఉందని చెబుతున్న మాటల వెనుక ఉన్న మర్మం రైతులకు తెలియనిది కాదు. చిన్నకారు, సన్నకారు రైతులు తమ పంటలను రాష్ట్రాలు దాటించి అమ్ముకోలేరు. స్థానిక మార్కెట్‌లోనే అమ్ముకోవాలి. కార్పొరేట్లు రంగప్రవేశం చేస్తే వారికి తప్ప మరెవ్వరికీ అమ్ముకోలేని దౌర్భాగ్యం దాపురిస్తుంది. మార్కెట్‌ను కార్పొరేట్లు శాసించడం మొదలవుతుంది.

చివరిగా ఈ రైతు నిరసనల్లో గమనించవలసిన మరో వాస్తవం ఏమిటంటే, గత సంవత్సరం కూడా ఢిల్లీలో తీవ్రమైన నిరసనలు జరిగాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు. ఇప్పుడు రైతులు నిరసనలు చేస్తున్నారు. అప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారిని దేశద్రోహులన్నారు. గోలీమారో అన్న నినాదాలను బీజేపీ మంత్రులే చేయించారు. ఇప్పుడు కూడా ప్రారంభంలో రైతు నిరసనల వెనుక ఖలిస్తానీ టెర్రరిస్టులు ఉన్నారన్నారు. రైతు నిరసనల్లో ప్రముఖంగా కనిపిస్తోంది పంజాబ్‌ సిక్కు రైతులు. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల్లో ప్రముఖంగా కనిపించింది ముస్లింలు. ఇప్పుడు రైతు నిరసనల్లోను ముస్లింలే వేషాలు మార్చుకుని, సిక్కుల్లా నటిస్తూ రెచ్చగొడుతున్నారంటూ పుకార్లు లేవదీశారు. ‘ఫేక్‌’ వార్తలను ప్రచారంలో పెట్టారు. ఈ ఫేక్‌ వార్తల బండారం కూడా బట్టబయలయ్యింది. బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవ్య స్వయంగా ఈ ఫేక్‌ వీడియోను ప్రచారంలో పెట్టాడు.

ఈ రెండు నిరసనలకు మధ్య ఒక తేడా ఉంది. రైతు నిరసనల విషయంలో రైతులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమయింది. కానీ పౌరసత్వ సవరణ చట్టం విషయంలో మాట్లాడడానికి కూడా సిద్ధపడలేదు. రైతు నిరసనల్లో సిక్కులు తమ సాంప్రదాయిక దుస్తులు ధరించి వచ్చారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తున్నవారిని వారి దుస్తులతో గుర్తించవద్దని మోడీ అప్పట్లో అన్నారు. అలాంటి వ్యాఖ్య ఇప్పుడు చేయలేదు. మరో తేడా ఏమిటంటే, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన వారిపై తీవ్రమైన దేశద్రోహం కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకో తేడా ఏమిటంటే, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారికి మద్దతివ్వడానికి రాజకీయ పార్టీలు వెనక్కు తగ్గాయి. కానీ ఇప్పుడు రైతు నిరసనలకు మద్దతివ్వడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నాయి. ఈ తేడాలను గమనిస్తే ఏమర్థమవుతుంది? దేశంలో మారుతున్న పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి. మనం ఎటు ప్రయాణిస్తున్నామన్నది ఆలోచించవలసిన సమయం వచ్చింది.

(‘గీటురాయి’ పత్రిక నుండి)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.