దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతున్నది. కేంద్రం ఏకపక్షంగా రైతుల ఆకాంక్షలను, అన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలను పక్కనపెట్టి తనకున్న బండ మెజారిటీతో ఆమోదించిన 3 వ్యవసాయ రంగ చట్టాలు, దేశంలో చర్చకు పెట్టిన విద్యుత్ బిల్లు 2020 గ్రామీణ ప్రజలలో భయాందోళనలను రేకెత్తించాయి. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం, ఇస్తున్న హామీలు వారిలో నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి.
కేంద్రం తెచ్చిన చట్టాలు, విద్యుత్ బిల్లు పూర్తిగా కార్పొరేట్ల కోసమే తప్ప, దేశ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడవని, పైగా ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడతాయని, ప్రజల చేతుల్లో ఉండాల్సిన సహజ వనరులపై కార్పొరేట్ల పెత్తనాన్ని పెంచుతాయని, దేశ పర్యావరణాన్ని మరింత సంక్షోభంలోకి నెడతాయని రైతు సంఘాలు ఉమ్మడిగా ప్రకటించాయి. దేశ రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి చేస్తున్న డిమాండ్లు ప్రజల మద్దతును కూడగట్టుకున్నాయి.
తాజా పరిణామాలను సమీక్షించిన రైతు సంఘాలు భవిష్యత్ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి అంబానీ, అదానీ, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులను, దుకాణాలను బహిష్కరించమని కూడా పిలుపునిచ్చాయి. రైతాంగం నాయకత్వంలో, ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ఉద్యమం, నిజంగా విజయవంతమయితే పాలకులు కొనసాగిస్తున్న దేశ అభివృద్ధి నమూనాకు బ్రేకులు పడతాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆగుతుంది. దేశంలోకి విచ్చలవిడిగా ప్రవహిస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆగుతాయి. కార్పొరేట్లు దేశాన్ని కొల్లగొట్టడం ఆగుతుంది. మరీ ముఖ్యంగా దేశ సహజ వనరులపై హక్కు ఎవరికి ఉండాలనే చర్చ ముందుకు వస్తుంది. విద్య, వైద్య రంగాలను ప్రజలకు ప్రయోజనకరంగా తీర్చిదిద్ది ప్రభుత్వ రంగంలో వాటిని నిర్వహించాల్సిన బాధ్యత గురించి పాలకులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రజల హక్కులను హరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు బ్రేకులు పడతాయి.
ఈ సందర్భంలోనే ప్రజలు కార్పొరేట్లకు ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచించుకోవాలి, నిర్మించుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ ఉత్పత్తిదారులకు, నగరాల వినియోగదారులకు మధ్య అనుసంధానం ఏర్పడాలి. అలాగే నగరాలలోని చిన్న పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తులను, సేవలను పెద్ద ఎత్తున గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరగాలి.
మనుషులు, పశువుల ఆరోగ్యానికి హాని చేసే, పర్యావరణానికి కీడు చేసే ఉత్పత్తులకు, ఉత్పత్తి పద్ధతులకు దూరంగా, ఆరోగ్యకరమైన ఉత్పత్తులకు, ఉత్పత్తి విధానాలకు ప్రోత్సాహం కల్పించే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. నగరాలకు, గ్రామాలకు మధ్య పరస్పరం ఈ ఉత్పత్తుల మార్పిడి జరగాలి. అందుకు అనుగుణంగా ప్రజలు గ్రామీణ ప్రాంతాలలోనూ, నగరాలలోనూ అన్ని స్థాయిలలో సహకార సంఘాలను నిర్మించుకోవాలి. ఈ సంఘాలు ప్రజలకు అవసరమైన ఉత్పత్తులను, సేవలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేయాలి. స్థానిక ఉత్పత్తులకు స్థానిక మార్కెట్ అభివృద్ధి చెందితే, రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఉత్పత్తిదారులకు మంచి ధర లభిస్తుంది. వినియోగదారులకు చవక ధరలకే నాణ్యమైన
ఉత్పత్తులు అందుతాయి.
ఇప్పటివరకు పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు, కేవలం లాభాలే ధ్యేయంగా పనిచేసే వాణిజ్య సంస్థలు ఉత్పత్తిదారులకు తక్కువ ధరలు చెల్లిస్తూ, అవే ఉత్పత్తులను వినియోగదారులకు ఎక్కువ ధరలకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నాయి. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య మానసిక, భౌతిక దూరం పెరిగిపోవడం వల్ల జరుగుతున్న అనర్ధం ఇది. ఈ దూరాన్ని ఇప్పటివరకు కంపెనీలు, దళారులు, వ్యాపారులు పూరించి లాభాలు గడిస్తున్నారు. ఇకపై ఈ బాధ్యతలను రైతు, ఇతర గ్రామీణ ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, నగరాలలో ఉండే వినియోగదారుల సహకార సంఘాలు పూరించగలగాలి.
అయితే ఇందుకోసం క్రమశిక్షణ కలిగిన ప్రజాకార్యకర్తల అవసరం అన్ని చోట్లా ఉంటుంది. వాళ్ళు కొంత సమయాన్ని కేటాయించాలి. ఇది కేవలం భావోద్వేగాలతో నడిచే ప్రక్రియ కాదు. స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవడం, దాని అమలుకు కార్యాచరణ చేపట్టడం, తగిన కాల పరిమితి నిర్ణయించుకోవడం అవసరం. సాధారణంగా ఎప్పుడైనా కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు, ఇటువంటి అంశాల గురించి ఆవేశంగా మాట్లాడడం, రాయడం జరుగుతుంది. కానీ ప్రత్యామ్నాయ సహకార సంఘాల నిర్మాణం, నిర్వహణ మాట్లాడినంత సులభంగా ఉండదు. కొనసాగుతున్న అభివృద్ధి నమూనా పట్ల స్పష్టత, ఆ నమూనా ప్రజలకు, పర్యావరణానికి చేస్తున్న హాని గురించిన అవగాహన, ఇప్పటికే అమలులో ఉన్న ప్రత్యామ్నాయ ప్రయత్నాలను అధ్యయనం చేయడం, వాటిలోని మంచిచెడులను విమర్శనాత్మకంగా పరిశీలించడం, వాటి నిర్వహణలో సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిని అధిగమించడానికి స్వయంగా ఏ వనరులు సమకూర్చుకోవాలో, ప్రభుత్వంపై ఏ సహకారం కోసం ఒత్తిడి తేవాలో – వీటన్నిటిపై స్పష్టత ఉండాలి.
ఈ ప్రత్యామ్నాయ ప్రయత్నాలను అవహేళన చేసేవాళ్ళు, ఇది ఆచరణ సాధ్యం కాదని నిరుత్సాహపరిచే వాళ్ళు, ప్రయత్నాలను ఆటంకపరిచే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కార్పొరేట్లు, కంపెనీల కొమ్ముకాసే ప్రభుత్వాలు, పార్టీలు, రాజకీయ నాయకులు, అవినీతికి అలవాటుపడిన అధికార గణం ఈ ప్రయత్నాలను నిర్వీర్యం చేయడానికి నిరంతరం కాచుకుని ఉంటాయి. వీటిని అధిగమించగలిగితే మాత్రం ముందుకు వెళ్ళగలుగుతాం.
తెలంగాణా రాష్ట్ర గ్రామీణ ప్రాంతాలలో 2020 మార్చి నాటికి 909 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ూూజజూ) ఉన్నాయి. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 71,70,832 మంది రైతులు ఉంటే, ఈ సహకార సంఘాలలో 33,12,719 మంది (46 శాతం) సభ్యులుగా ఉన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (ూజు=ూ) ప్రోత్సాహంతో రాష్ట్రంలో మొత్తం 4,35,364 మహిళా స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. ఈ సంఘాలలో 45,60,518 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందాల ఆధారంగా 1995 పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం కింద రాష్ట్రంలో 18,397 సహకార సంఘాలను గ్రామస్థాయిలో నిర్మించారు. ఇవ్వాళ గ్రామీణ ప్రాంతాలలో ఈ మహిళా బృందాలకు అందుతున్న బ్యాంకు రుణాలు నిజంగా గ్రామీణ వ్యవసాయానికి, ఇతర జీవనోపాధులకు అవసరమైన ప్రధాన పెట్టుబడిని సమకూరుస్తున్నాయి. విషాదం ఏమిటంటే ఈ బృందాలలో ఉన్న మహిళలందరూ వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వీరికి రైతులుగా గుర్తింపు లేకపోవడం వల్ల, వీరి కృషికి, నిధుల సేకరణకు, భాగస్వామ్యానికి తగిన విలువ లభించడం లేదు.
సెర్ప్ సంస్థ ప్రోత్సాహంతోనే తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఈ మహిళా రైతుల భాగస్వామ్యంతో 12 రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పడి పని చేస్తున్నాయి. ఈ కంపెనీల భాగస్వామ్యంతో రాష్ట్ర స్థాయిలో ‘బె నిషాన్’ ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పడింది. గత రెండు సంవత్సరాలుగా ఈ కంపెనీ తన సభ్యుల నుంచి మామిడిపండ్లను నేరుగా సేకరించి మార్కెట్ చేస్తున్నది. గత సంవత్సరం ఉమ్మడిగా సీతాఫలం గుజ్జు ప్రాసెస్ చేసి మార్కెట్ చేసింది. ఒక సంవత్సర కాలంగా సభ్యుల నుండి నేరుగా కూరగాయలు సేకరించి హైదరాబాద్‌లో మార్కెట్ చేస్తున్నది. నాబార్డ్ సహకారంతో రాష్ట్రంలో ఇప్పటికే 330 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడి పని చేస్తున్నాయి. ఈ సంఘాలలో కూడా 200 నుంచి 500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ూఖీూజ లాంటి సంస్థ సహకారంతో మరో 20 రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పడి పని చేస్తున్నాయి. రాష్ట్రంలో అనుభవం గడించిన ములకనూరు, ధర్మరాజుపల్లి లాంటి సహకార సంఘాలు ఉన్నాయి. సుస్థిర వ్యవసాయ కేంద్రం (జూూ) ప్రోత్సాహంతో ఏర్పడిన సహజ ఆహారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలలో సేంద్రీయ రైతులను కూడగట్టి నేరుగా ఉత్పత్తులను హైదరాబాద్, విశాఖ నగరాలలో రిటైల్ దుకాణాల ద్వారా మార్కెట్ చేస్తున్నది.
ఈ గ్రామీణ సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరెప్పుడైనా మాట్లాడుకోవచ్చు గానీ, ఈ సంఘాలకు, నగర వినియోగదారులకు మధ్య అనుసంధానం ఏర్పడితే మాత్రం వినియోగదారులు రైతులకు మంచి ధర ఇచ్చి అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా పొందవచ్చు. ఇందుకోసం కాలనీల స్థాయిలో, బస్తీల స్థాయిలో, పెద్ద అపార్ట్‌మెంట్‌ల స్థాయిలో ఒక సహకార సంఘాల వ్యవస్థ ఏర్పడాలి. ఈ సంఘాలు నేరుగా నగర ప్రజలకు అవసరమైన అన్ని ఉత్పత్తులను గ్రామీణ సహకార సంఘాల నుంచి సేకరించి అందుబాటులో ఉంచవచ్చు. ముంబై నగరంలో ఈ కృషి చాలాకాలంగా కొనసాగుతున్నది. చెన్నై, బెంగళూరు నగరాలలో కూడా ఈ ప్రయత్నాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రేకెత్తిన రైతు ఉద్యమం ప్రజల ఉద్యమంగా మారాలంటే కార్పొరేట్లకు వ్యతిరేకంగా సహకార సంఘాలను నిర్మించే పని తెలంగాణలోనూ మొదలవ్వాలి. మొదలుపెడదామా!